Previous Page Next Page 
అంకితం పేజి 20


    "ఈ వూళ్ళో వుండటం లేదన్నారు."

    నేను కదిలాను. "ఇఫ్ యూ డోంట్ మైండ్. నేను కూర్చోవచ్చా?" అంటూనే కూర్చున్నాను. ఆమె ఏమనుకుందో ఏమో లోపలికి వెళ్ళి మూడు గ్లాసుల్లో లెమన్ జ్యూస్ కలిపి తెచ్చింది.

    ఇస్తూ, "మీరు వారి బంధువులా?" అనడిగింది.

    నేను మాట్లాడలేదు. జాన్ చెప్పాడు. "అవును. మొన్ననే అమెరికానుండి వచ్చాం. మాకీ విషయాలేవీ తెలీదు. దయచేసి సుమద్యుతి అడ్రస్ ఇవ్వగలరా?" సహజంగా కనిపించే అబద్ధం అందంగా చెప్పాడు.

    "అరె. అడ్రస్ తెలీదే!" అని, ఒక్కక్షణం ఆలోచించి, "ఉండండి మా హజ్బెండ్ కి ఫోన్ చేసి కనుక్కుంటాను" అంటూ మూలగా నున్న ఫోన్ దగ్గరికి నడిచి ఎక్కడికో ఫోన్ చేసింది.

    రెండు నిమిషాల్లో తిరిగివస్తూ, "ఆవిడ హైదరాబాదులో వుంటోందిట" అంది.

    "హైద్రాబాద్!"

    "అవును. భర్త పేరు కృపానంద్ ట. ఎయిర్ పోర్ట్ లో ఏదో జాబు చేస్తున్నాడని......ఇంతవరకే తెల్సని చెప్పారాయన."

    "చాలు....... చాలు....... చాలు.....

    "థాంక్స్ ఫర్ యువర్ కైండ్ ఇన్ ఫర్ మేషన్!" లేచి చేతులు జోడించి బయటికి నడిచాను. నాతోపాటు జాన్ కూడా ఆమెకి 'థాంక్స్' చెప్పి బయటికి వచ్చాడు. అరుంధతి మమ్మల్ని అనుసరించింది.

    భూమి గుండ్రంగా వుంటుందో లేదోగానీ, సమస్య మాత్రం గుండ్రంగానే వుంటుందని మాత్రం బుజువయింది. లేకపోతే ఏమిటి? నెలలో రోజులు నేను గడిపే హైదరాబాదులోనే అంకిత్ తల్లిని పెట్టుకుని ఎంత వెదకాల్సిన అవసరం వచ్చింది?!

    ముగ్గురం స్టేషన్ కి వచ్చాం. ఇంకా ట్రెయిన్స్ రాలేదు.

    "కాలేజీ రికార్డ్స్ లో సుమద్యుతి తన ఇంటి అడ్రస్ ఇవ్వకుండా, మావయ్య అడ్రస్ ఇవ్వటం శుభసూచకం. ఇదంతా మనమంచికే జరుగుతున్నట్టు అని పిస్తుంది" అంది అరుంధతి.

    "ఈ విషయంలో నిన్ను అభినందించాలి" అన్నాడు జాన్.

    నేనూ కళ్ళతోనే ఆమెకి అభినందనలు తెలిపాను.

    అంతలో రైళ్ళు వస్తున్నట్లు ప్రకటన వినబడింది. ముగ్గురం ప్లాట్ ఫాం మీదకు వెళ్ళాం.

    రెండు రైళ్ళూ....... ఒకేసారి వచ్చాయి. వారిద్దరూ విశాఖపట్టణం వెళ్ళే రైలు ఎక్కారు. నేను  హైద్రాబాదు ట్రెయిన్ వేపు నడిచాను వాళ్ళు అంకిత్ దగ్గరికి!

    నేను కృపానంద్ ని పట్టుకోవటానికి!!


                        *    *    *

    హైద్రాబాద్ విమానాశ్రయం.

    పార్కింగ్ ప్లేస్ లో జాన్ తాలూకు కారు ఆపి, లోపలికి ప్రేవేశించాను.

    డ్యూటీ ఆఫీసర్ ని కలుసుకుని నాక్కావలసిన  వివరాలు  అడిగాను.

    "మిస్టర్ కృపానంద్?" అన్నాడాయన.

    "అవున్ సర్......." అన్నాను ఆతృత ధ్వనించే స్వరంలో.

    "ఏ డిపార్ట్ మెంట్?"

    "తెలీదు".

    ఆయన మంచివాడిలా వున్నాడు. రెండు మూడు డిపార్ట్ మెంట్ లకి ఫోన్ చేసి కనుక్కున్నాడు. తరువాత నా వైపు తిరిగి....... "సారీ, ఆ పేరు కలవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు" అన్నాడు. ఒక్కక్షణం నా వళ్ళు తూలినట్టు అనిపించింది. కష్టంమీద  నిభాయించుకున్నాను.

    "ప్లీజ్...... మరోసారి చెక్ చేయగలరా" అని అభ్యర్థించాను.

    అతనేమనుకున్నాడో ఏమో....... వాళ్ళ ఎవరికో ఫోన్ చేశాడు. అవతలి వారితో మాట్లాడుతూ నావైపు తిరిగి, "మీరు అడిగింది కృపానందా? కృష్ణానందా?" అన్నాడు.

    నా కళ్ళలోకి ఒక్కసారిగా వెలుగు వచ్చింది. నేను సరీగ్గా వినివుండకపోయి వుండవచ్చు.

    నాలో చిన్న ఆశ మొలకెత్తింది. "అవుననుకుంటాను" అన్నాడు.

    "కృష్ణానంద్ లీగల్ సెల్ లో పనిచేస్తున్నారు."

    లీగల్ సెల్.....

    లాయర్....!!!

    నాకు ఎగిరి గెంతులు వేయాలనిపించింది. గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది. "లీగల్ సెల్ ఎక్కడ?" ఉద్వేగంతో కంఠం వణుకుతూంటే..... దాదాపు అరిచాను.

    ".......బేగంపేటలో....." అంటూ అడ్రసు చెప్పాడు. అతడి మాటలు పూర్తి కాకముందే బయటికి గెంతాను.

    నిముషం తర్వాత ఇండియన్ ఎయిర్ లైన్స్ లీగల్ సెల్ ఆఫీసు వైపు నా కారు వేగంగా దూసుకుపోవటం ప్రారంభించింది.



                         *    *    *

    నా కారు లీగల్ సెల్ ఆఫీసులోకి ప్రవేశించింది.

    మెట్లు ఎక్కుతూంటే నా కాళ్ళు తడబడ్డాయి.

    జాన్ డేవిడ్ రచనల్లో లాగానే అందమైన రిసెప్షనిస్ట్ ముందుగదిలో కూర్చుని వుంది. దగ్గిరగా వెళ్ళి "కృష్ణానంద్ గారూ ఎక్కడుంటారు?" అని అడిగాను. ఆమె హాల్ వైపు చూపించింది.

    హాల్లోకి వడివడిగా నడిచాను. ఒక పక్క వరుసగా క్యాబిన్ లూ...... వాటిమీద పేర్లూ వున్నాయి. ఒకదాని మీద వ్రాసివుంది.

    'కృష్ణానంద్'

    పరుగెత్తుకు వెళ్ళకుండా వుండటానికి చాలా కష్టపడుతూ నెమ్మదిగా నడిచి తలుపు తీసాను.

    అలికిడికి ఆయన తలెత్తాడు.

    మనిషి హుందాగా.......సౌమ్యంగా వున్నాడు.

    దగ్గిరగా వెళ్ళి 'గుడ్ మార్నింగ్' అంటూ నన్ను నేను పరిచయం చేసుకున్నాను. అతడు స్నేహపూరితంగా నవ్వి, "నేను మీకు ఏం చేయగలను?" అన్నాడు.

    "నేనూ....... మీ భార్యా క్లాస్ మేట్స్ మి" అన్నాను. విషయాన్ని ఎలా ప్రారంభించాలో తెలియని ఇబ్బంది పరిస్థితి!! అయితే, ఇందులో ఒక సంతోషకరమైన విషయం...... అతడు నన్ను గుర్తుపట్టలేదన్నది.

    మొత్తం విషయమంతా అతడికి చెప్పాలా వద్దా అన్నది నన్ను సందిగ్ధంలో పడేస్తోంది. అతడు పైకి ఎంత సౌమ్యుడుగా కనిపించినా......."మీ ఆవిడ మీ అనుమానం భరించలేక మీ పిల్లాడ్ని నా ఇంటి మెట్లముందు పడేసిందని" చెప్తే ఏ మొగాడు మాత్రం తన సౌమ్యపు ముసుగుని విదిలించడు? అందుకే అలా అబద్ధం చెప్పాను.

    "విజయవాడలో మీ మిసెస్, మావయ్యగారింటికి వెళ్ళాం. ఆయన అల్లుడిగారి భార్య మీ అడ్రసు ఇచ్చారు."

    "అవునా? మా మిసెస్ మావయ్యగారు విజయవాడలో వుంటున్నారని నాకు తెలీదు."

    "అదికూడా ఆమె చెప్పింది. తన భర్తగారికి ఫోన్ చేసి మీ వివరాలు కనుక్కుంది. భార్తగారంటే.... సుమద్యుతి మావయ్య కొడుకు అన్నమాట!"

    "సుమద్యుతి ఎవరు?"

    యథాలాపంగా మాట్లాడుతున్నట్టు కనపడే ప్రయత్నం చేస్తూన్న నేను ఆ ప్రశ్నకి ఉలిక్కిపడి, "మీ భార్య......?" అన్నాను.

    "సరోజా కృష్ణానంద్."

    మిన్ను విరిగి మీదపడినట్టు అయింది. ఎలాగో నోరు పెగల్చుకుని..... "మీ భార్యగారు విజయవాడలో చదువుకోలేదా?" అన్నాడు తడారుతున్న గొంతుతో.

    "లేదు. ఢిల్లీలో చదువుకుంది!" కృష్ణానంద్ ని నేను సరిగ్గా గుర్తుపట్టలేదన్న విషయం అర్థమైంది.

    "ఐయామ్ సారీ" అంటూ లేచి నిలబడ్డాను.

    "నా దగ్గరికి అసలు మీరెందుకు వచ్చారో, ఆ అమ్మాయితో మీకేంపనో అర్థం కావటం లేదు."

    సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడ్డాను. కానీ వెంటనే సర్దుకుని "ఆమె నా పాత క్లాస్ మేట్. విజయవాడ వెళ్ళినప్పుడు ఆ పాత ఇంటికి వెళ్ళాను. వాళ్ళు  ఇల్లు అమ్మేశారంట. మావయ్యగారింటికి వెళితే ఎయిర్ లైన్స్ లో ఆమె భర్త  కృపానంద్ పనిచేస్తున్నారని చెప్పారు. పొరపాటు చెప్పారేమో అని మీ దగ్గరికి వచ్చాను. ఐయామ్ సారీ' అన్నాను.

    అతడేదో చెప్పబోయి వూరుకుని, షేక్ హాండ్ ఇచ్చాడు. బయటకు వచ్చాను.

    అతను ఏం చెప్పబోయి, సభ్యత అడ్డురాగా వూరుకున్నాడో నాకు తెలుసు......'తన భార్యకోసం ఒక మనిషి ఇంతగా వెతుకుతున్నాడంటే ఏ భర్తా ఆరోగ్యవంతంగా ఆ విషయాన్ని జీర్ణించుకోలేడు' అని.

   
                             9
   
  ఒక   పనిలో కొనసాగటం కష్టమై ఆగిపోతే...... కష్టమే కొనసాగుతుంది.


                      *    *    *

    హొటల్ రూమ్ లో పైకప్పుకేసి చూస్తూ పడుకున్నాను. నాకిక ఏ పని చేయటానికి సత్తువ మిగల్లేదు. అంకిత్ మరణించనీ, నేనుకూడా మరణిస్తాను. అంతే, ఆ వూహ ఒక్కటే సంతృప్తి నిస్తోంది.

    నిద్రపట్టలేదు. ఈరోజు అరుంధతితోగానీ, జాన్ తోగానీ మాట్లాడలేదన్న విషయం గుర్తొచ్చింది. ఏం మాట్లాడను? కథ మళ్ళీ మొదటికొచ్చిందని చెప్పనా? కృపానంద్ కి బదులు కృష్ణానంద్ ని వెంటాడనని చెప్పనా?

    అన్య మనస్కంగానే ఇంటికి ఫోన్ చేసాను. ఎంతసేపు మ్రోగినా ఎవరూ ఎత్తలేదు. నా మనసు కీడు శంకించింది. హాస్పిటల్ కి ఫోన్ చేశాను. అట్నుంచి 'హలో' అని వినిపించింది.

    అది అరుంధతి గొంతు. నేను ఆశ్చర్యంగా "అదేమిటి నువ్వు అక్కడున్నావ్?" అని అడిగాను.

    "మీ కోసమే ప్రయత్నిస్తున్నాను. అంకిత్ కి సాయంత్రం బాగా జ్వరం వచ్చింది. హాస్పిటల్ కి తీసుకొచ్చాము..." ఆమె మాటలు పూర్తికాకుండానే, ఆందోళనగా, "ఇప్పుడెలా వుంది" అని అడిగాను.

    "బాగానే వుంది. మెలకువగానే వున్నాడు రాత్రంతా అబ్జర్వేషన్ లో వుంచుతారట" అరుంధతి స్వరంలో ఆదుర్ధా లేకపోవటంతో నా మనసు కాస్త తేరుకుంది.

    "డాక్టర్ గారు మీతో మాట్లాడతారట" అంటూ ఫోన్ మృణాళిని కిచ్చింది.

    "అంకిత్ కి ఫర్వాలేదుగా డాక్టర్?" ప్రశ్నించాను.

    "టెంపరేచర్ వచ్చింది. ఇప్పుడు ఫర్వాలేదు. ఇంట్లో వుంటే మీ భార్య కంగారుపడతారని ఇక్కడే వుంచాం. జాన్ కూడా ఇక్కడే వున్నారు. మాట్లాడతారా?"

 Previous Page Next Page