అరుంధతి గుండెని ఎవరో నొక్కేసినట్లయింది. ఇల్లు కొంటాడా? అంటే తననించి దూరంగా వెళ్ళిపోతాడన్నమాట! ఆమె మౌనంగా అయిపోయింది.
"ఏవిటలా అయిపోయావ్?"
"ఇల్లు కొంటూ, శుభమా అని నన్ను వెంట పెట్టుకుని వెళ్ళడమేమిటీ?"
"అరూ!" అంత కోపంగా పిలవడం, అదే మొదటిసారి. "నిన్ను కాకపోతే ఎవర్ని తీసుకెళ్తాను? ఆ ఇంటికి యజమానురాలివి నువ్వేగా!"
అరుంధతికి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి అయ్యాయి. ఆమెకి ఆ నిమిషంలో, తనని చూసి, వెనక్కి వెళ్ళిపోయే ఎదురింటి ఆయనా, శుక్రవాటం పూట కావాలనే తన ముఖం తప్పించుకుని తిరిగే సుమిత్రా గుర్తొచ్చారు. కళ్ళల్లో నీటి ఊట మొదలయింది.
మెత్తటి కర్చీఫ్ తో 'లూ' దానిని తుడిచేవరకూ ఆమెకి తెలియదు! అతను ఆమెకి మంద్రంగా చెప్తున్నాడు. "పాత జీవితాన్ని వదిలిద్పెట్టు, మనదైన కొత్త జీవితాన్ని వెదుక్కుందాం" అభం శుభం తెలీని వయసులో మనని ఈ సమాజం అనబడే పెద్దలు తమ మూర్ఖత్వంతో విడదీసారు. బాల్యం, యవ్వనం పూర్తిగా మన చేతిలో లేకుండా పోయాయి. ఆ విధంగా మనం వేరయిపోవడం కూడా మన మంచికే జరిగిందేమో! ఆనాడు అనుకున్న విధంగానే మన పెళ్ళయిపోయి ఉంటే, అందరు భార్యభర్తలు లాగే, మనమూ పోట్లాడుకుంటూ, కలిసిపోతూ, పిల్లల్ని కనీ, పెంచీ, ఈపాటికి జీవితంలో విసిగిపోయేవాళ్ళమేమో. నువ్వంటే నాకూ, నేనంటే నీకూ వెగటు పుట్టేసేదేమో కూడా! కానీ, మనకు ఎవరికీ దొరకని అద్భుత అవకాశం లభించింది. ఏ బాధ్యతలూ లేని వయసులో మనం తిరిగి చేరువయి, మనం పోగొట్టుకున్న జీవితాన్ని వెదుక్కుంటున్నాం. తప్పకుండా మన యవ్వనం మనకు దొరకొచ్చు. ఏం? మాట్లాడవేం?"
అరుంధతికి అంతా అర్థమయినట్లుగానే ఉంది. కానీ అర్థం కావడంలేదు. "మనిషికో స్నేహం! మనసుకో దాహం!" అది తాకే సమయానికి, ఏవిటీ పాడు మనసు! ఇంకా ఆలోచిస్తుందేం?
"అరూ! నీకు నా చనువు బాగాలేదా చెప్పు! నీకు బాగా లేకపోతే, నేను వెళ్ళిపోతాను. నేను కేవలం నీకోసం హైద్రాబాద్ లో స్థిరపడదామనుకుంటున్నాను."
బాగాలేదని ఎలా చెప్తుందీ? "నిజంగా ఇదంతా బాగా లేకపోతే ఎంత బావుండ్ను బావా?" అనుకుంది.
"నా ప్రశ్నకి జవాబు కావాలి" రెట్టించాడు.
"ఏం చెప్పను? ఎవరూ పట్టించుకోకుండా, ఓ మూల వదిలేసిన తీగ మోడువారిపోతుంటే, నీరుపోసి, ఆలంబన సమకూరుస్తానంటే ఏమంటాను?"
"అంటే నీకు బావుంది అన్నమాటేగా!"
"బావుంది!" ధైర్యంగా చెప్పింది.
"మరి నీకూ నాకూ బావున్నప్పుడు, ఈ లోకం ఏమంటుందోననే భయం మనకి ఎందుకు? మనం బాధపడుతున్నప్పుడు ఓదార్చి దగ్గరికి తీసుకోని ఈ లోకం, సుఖపడ్తున్నప్పుడు అడ్డుపడ్తే మనం ఎందుకు సహించాలి?"
అతని ప్రశ్నలు ఆమెలో ఆలోచనలు రేపాయి. ఎన్ని ఒంటరి పగళ్ళు, ఎన్ని ఒంటరి రాత్రులు పలకరించే దిక్కులేక, తన వ్యధలూ, దిగుళ్ళూ పంచుకునే మనిషి లేక తనలో తనే కుమిలిపోతూ గడిపిందీ? చివరికి తను ప్రాణప్రదంగా పెంచుకున్న మేనల్లుడు కూడా, ఎంత స్వార్థంగా భార్యని తీసుకుని తనని విడిచి వెళ్ళిపోయాడూ? గతాన్ని తవ్వితే ఒక తియ్యని అనుభూతి లేదే? ఒక మధురమైన జ్ఞాపకం రాదే!
"పిచ్చి అరూ! ఇంక నేను వచ్చేసాగా, నీ బాధలూ, సమస్యలూ నామీద పెట్టి, నువ్వు నిశ్చింతగా ఉండు!" ఆమె భుజం మీద చెయ్యి వేసి, ఆమెని ఈ లోకంలోకి తెస్తూ చెప్పాడు లూ.
అరుంధతి చేత 'ఎడ్వాన్స్' ఇప్పించి, ఇల్లు ఖాయం చేసుకున్నాడు 'లూ'.
* * * *
"నువ్వు ఏమైనా అను! అలా కొట్టడం మాత్రం బాగాలేదు" అన్నాడు రాంబాబు అభినవ్ తో.
మిత్రులిద్దరూ కేంటిన్ లో కూర్చుని 'టీ' తాగుతున్నారు.
"నేను కోపం ఆపుకోలేకపోయాను" చెప్పాడు అభినవ్.
"అది నీ తప్పు! ఆమెని నమ్మి వెళ్ళడమేనా? అదీ, రెండుసార్లు ఆమె చేతిలో మోసపోయి తప్పించుకున్నాక కూడా!" అన్నాడు.
అభినవ్ చిన్నగా నవ్వి, "ఏదో చేస్తుందనే అనుకున్నాను కానీ, అమ్మని ఇందులో ఇరికిస్తుందనుకోలేదు!" అన్నాడు.
"ఏమైనా మంచి ఛాన్సు కొట్టేసావులే" అన్నాడు రాంబాబు.
అభినవ్ కి తనను కౌగలించుకుని మంజీర అన్న మాటలు గుర్తొచ్చాయి. ఎంత సహజంగా, భార్య భర్తతో మాట్లాడినట్లే మాట్లాడిందీ? ఒక మంచి నటి కూడా ఆమెలో దాగుంది" అనుకున్నాడు.
"పాపం కాలేజ్ కి రావడం లేదు" అన్నాడు రాంబాబు.
ఇంతలో కల్చరల్ సెక్రెటరీ వాసు హడావుడిగా వచ్చి, "నువ్వు ఎక్కడ తిరుగుతున్నావ్" నీకోసం ప్రొద్దుటి నుంచీ వెతకలేక చస్తున్నాను" అన్నాడు.
"ఎందుకూ?" అడిగాడు అభినవ్.
"వరద బాధితుల నిధికోసం కాలేజీ తరఫున ఓ మంచి డ్రామా వేయించాలనుకుంటున్నాను గురూ!" అన్నాడు.
"వేయించుకో!" అన్నాడు అభినవ్ నిరాసక్తంగా.
"అదేంటి గురూ! అలా పట్టనట్లు మాట్లాడ్తావు? పోయినసారి శ్రీకృష్ణదేవరాయలు వేషంలో అదరగొట్టెయ్యలేదూ! నువ్వు కాకపోతే ఇంకెవరు వేస్తారు హీరో వేషం?" అన్నాడు.
అభినవ్ కి అది తల్చుకోగానే చాలా నవ్వొచ్చింది. "భువన విజయం" ప్రదర్శించి, హాస్యం వరదలై ప్రవహించేటట్లు చేసారు.
అల్లసాని పెద్దన వేషం వేసినవాడు, పచ్చి తెలంగాణా భాషలో, "ఘంటము పట్టి మస్తు దినాలైంది, తర్కం చేసి శానా దినాలుగాలె" అని ఏదేదో మాట్లాడాడు.
తెనాలి రామలింగడు బహు సీరియస్సయిపోయి, పద్మం మరిచిపోయి, దేవదాసులోని "కుడి ఎడమయితే పొరపాటు లేదోయీ" అని పాట అందుకున్నాడు. ఎవరో నవ్వారని కోపం తెచ్చుకుని, స్టేజీ దిగి వెళ్ళిపోయాడు.
తిమ్మరుసు గొప్ప హాస్యం పండించి, "మేక తోక....తోక మేక" పద్యం అప్పచెప్పేశాడు. రిహార్సల్స్ లో ఒకరి డైలాగ్స్ వొకరికి చాలా బాగా వచ్చెయ్యడంతో, ఎవరివి వారు మరిచిపోయారు.
ఆడియన్స్ 'టమాటాలూ, చెప్పులూ' విజృంభించి విసురుతుంటే, 'కంట్రోల్' చెయ్యడానికి అభినవ్ తన చక్కని గళంతో, "శివశంకరా" నుండి "శిలలపై శిల్పాలు చెక్కినారూ" వరకూ పాడి రక్తి కట్టించాడు.
రాజనర్తకి వేషం కట్టి, స్టేజ్ మీదకి వచ్చినవాడు, మంచి భరతనాట్యం చెయ్యగల సమర్థుడు. 'తిల్లానా' చేద్దామని 'ప్రిపేర్' అయి వచ్చినవాడు, 'టేప్' లో 'గుడివాడ వెళ్ళానూ...గుంటూరు వెళ్ళానూ" అనే పాట రావడంతో తెల్లబోయి, చివరకు దానికే చేసి విగ్గూ, చీర ఊడిపోయి పడిపోవడంతో 'గ్రీన్ రూం' లోకి పరిగెత్తేసాడు.
అభినవ్ కూడా "ఇదిగో రత్నాలహారం గైకొనుము" అంటూ అది బహూకరించడానికి అతని వెనకాలే పరిగెత్తి, తనని తాను రక్షించుకున్నాడు.