సావిత్రమ్మగారి స్వర్గయాత్ర
చిరంజీవి....
మీ అమ్మ మీ అందరినీ ఆశీర్వదించి వ్రాయునది.
నా పరిస్థితి 'ఊరు పొమ్మంటోంది - కాడు రమ్మంటోంది!' అన్నవిధంగా వున్న విషయం మీ అందరికీ తెలుసు. దైవానుగ్రహం వల్ల ఇప్పటివరకూ పడుతూ లేస్తూనే ఎలాగో లాగు నావంట నేను చేసుకుని తింటూ, నా పనులు నేనే చేసుకుంటూ ఎవరికీ భారంగా లేకుండా నెట్టుకొస్తున్నారు.
ఏ క్షణాన ఎలా వుంటుందో! ఆ చావు ఎవరికీ చెప్పిరాదు. అయితే అదృష్టవశాత్తూ నే వెళ్ళిపోయే సమయం ముందుగానే తెలిసింది.
ఆమధ్య కపిలేశ్వరపురం సిద్దాంతిగారు కలిశారు. మీ నాన్నగారికి జ్యోతిషం నేర్పింది ఆయనే. ఆయన చెప్పినదానికి తిరుగుండదు. చెప్పినవన్నీ తు. చ. తప్పకుండా క్షణం తేడా లేకుండా జరుగుతాయి. మీ నాన్నగారు ఏ రోజున, ఎన్ని గంటలకు, ఏ వ్యాధి వల్ల పోతారో నాలుగేళ్ళు ముందుగా చెప్పారు. ఆయన సరిగ్గా అలాగే పోయారు.
ఇదొక్కటే కాదు..., ఆయన చెప్పినవన్నీ అక్షరాలా జరిగాయి.
ఆయన చెప్పారు - నేను ఈ మకర సంక్రాంతి పర్వదినాన. .. సరిగ్గా మధ్యాహ్నం 12:35 కి చివరి శ్వాస విడుస్తానని, ముహూర్తం కూడా పెట్టారు. ఆరోజు ప్రొద్దుటినుండి కొంచెం నలతగా వుంటుందనీ, తెలివి కూడా తప్పవచ్చుననీ, మళ్లీ కళ్ళు తెరవకుండానే కన్ను మూసేస్తాననీ చెప్పారు.
ఆయన జ్యోతిషం మీద నాకు పూర్తి నమ్మకం వుంది. అలాగని - చనిపోతానని భయం లేదు. బతికినన్నాళ్ళూ బాగానే బ్రతికాను. ఏదో - ఆ మారాజు ఇచ్చిన పొలం, డబ్బూ వున్నాయి, తరతరాలుగా వస్తూన్న నగలూ వున్నాయి. వీటితో కాలక్షేపం చేస్తూ ఎవరికీ బరువుకాకుండా వీలునామా రాస్తున్నాను.
ఇంతకీ - నేను చెప్పేదేమిటంటే.... నేను ఎలాగూ సంక్రాంతినాడు పోతాను కనుక, మీరందరూ నాలుగురోజులు ముందే వస్తే - కొడుకులూ, కోడళ్ళు, కూతుళ్లూ, అల్లుళ్ళు, మనవళ్ళు.... అందరితో నాలుగు రోజులైనా సంతోషంగా గడిపానన్న తృప్తి వుంటుంది.
అందుకే.... మీ అందరికీ బాగా ముందుగా రాస్తున్నాను. అందరూ తప్పక రావలసింది. ఇక్కడ మీకు దేనికీ ఇబ్బందీ వుండదు. పప్పులు, బియ్యం, అన్నీ తెప్పించి వుంచుతాను. పాలు, పెరుగులకు కొరత వుండదు. వంట మనిషిని కూడా పెట్టొచ్చు కాని, నా కోడళ్ళ, కూతుళ్ల చేతివంట తినాలని కోరికగా వుంది.
అందువల్ల మీకు ఏది కావలసినా చేసుకుంటూ నాకింత పెట్తేచాలు. నా పొట్ట కెంత కావాలి! ఏదో నా వాళ్ళ చేతివంట తినాలని కోరిక తప్ప?!
వెళ్లేముందు నా దగ్గరున్నదేదో నాకు తోచినట్లు ఇచ్చి పోతాను. నా తర్వాత అనుభవించవలసిన వాళ్ళు మీరేగా!
మళ్లీ మళ్లీ రాస్తున్నాను. మీరంతా తప్పక రావాలి.
'చిరంజీవి' అన్న సంబోధన తర్వాత పేరు, వరస మారినా అదే ఉత్తరం నకళ్ళు సావిత్రమ్మగారి సంతానం అందరికీ - అంటే.... ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు కొడుకులకు వెళ్లాయి.
ఆవిడ కోరుకున్నట్లు - సంక్రాంతికి నాలుగు రోజులు ముందుగానే అందరూ బిలబిలలాడుతూ వచ్చారు. పల్లెటూళ్ళో పాతకాలం నాటి కొంపాయే - పాతిక మందొచ్చినా ఇరకాటం అనిపించలేదు. పిల్లలైతే వానర మూకలాగా దొడ్లో వున్న జామచెట్టు, రాచ ఉసిరి చెట్ల మీద పడ్డారు.
* * * * *
ఆదివారం, మకర సంక్రాంతి పుణ్యదినం రానే వచ్చింది.
ఆరోజు ఉదయం నుంచే సావిత్రమ్మగారు మగత మగతగా వున్నారు.
వీధి వాకిట్లో ఇంటికి అటూ ఇటూ పెద్ద పెద్ద అరుగులు వున్నాయి. భజన బృందాన్నీ సన్నాయి మేళం వాళ్లనీ పిలిపించారు. వాళ్లలో భజన బృందం ఒక అరుగు మీద, సన్నాయి మేళగాళ్లు రెండవ అరుగు మీదా కూర్చొని వున్నారు. ఇంట్లోని వారికీ, బయటివారికీ అందరికీ కాఫీ, ఫలహారాలు అందాయి.
ఉదయం తొమ్మిది గంటలు అవుతోంది. సావిత్రమ్మగారి గదికి ఇవతల కూర్చొని బ్రాహ్మణులు వేదపారాయణం, గీతాగానం చేస్తున్నారు.
బయటి అరుగు మీద సన్నాయివాళ్ళు సన్నాయిల్లోంచి పీకలు బయటకు తీసి ఉమ్మిని వంచేసి, గుడ్డతో తుడిచి మళ్లీ పెట్టి 'పిపీప్....' అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
"మీరు కాసేపు వుండండయ్యా... మేము కొంచెంసేపు భజన చేస్తాం!" అని వెంటనే భజన బృందం వాళ్ళు రామదాసు కీర్తనలు అందుకున్నారు .ఇంకొకాయన ఊడి పడిపోతుందా... అన్నట్లు తలని ఆడించి మద్దెలను బాదడం మొదలుపెట్టాడు. మిగిలిన వాళ్లందరూ తాళాలను ఎడాపెడా బాదేస్తూ భజన చేయసాగారు.
ఓ అరగంట అయ్యేసరికి వాళ్లకి అలసట వచ్చింది. అందరూ తలోగ్లాసుడి మంచినీళ్ళు త్రాగి విశ్రాంతి తీసుకోసాగారు.
వాళ్ళు ఆపగానే - సన్నాయి వాళ్ళు జోరందుకున్నారు. అక్కడ జరగబోయేది చావన్న విషం మరిచిపోయి, పెళ్ళికి వాయించినట్లు పోటీలు పడి వాయించసాగారు. డోలువాళ్ళు 'నీడొక్క చీలుస్తా' మన్నట్లు బాదడం మొదలుపెట్టారు. ఇలా కొంతసేపు సన్నాయివాళ్లు మరికొంతసేపు భజన బృందం పోటీలు పడి హోరెత్తించసాగారు.
సమయం పదకొండు గంటలు కావస్తోంది.
పురోహితుడు పేరయ్యశాస్త్రి వచ్చాడు. వస్తూనే సావిత్రమ్మగారి పెద్దకొడుకు ప్రభాకరం దగ్గరికి వెళ్లి -
"ఏమండీ ..ఇంక గట్టిగా గంటన్నర కూడా లేదు - రాగిపాత్ర, ఉద్దరిణి, తులసితీర్దం సిద్దం చేశారా?" అని అడిగాడు.
"అన్నీ సిద్దంగానే వున్నాయండి!' అన్నాడు ప్రభాకరం.
"మరి..., కొత్త సైనుగుడ్డ, పాడె సామానులు అన్నీ ఏర్పాటుచేశారా?దహనానికి ఏర్పాట్లు జరిగాయా?" అని మళ్లీ అడిగాడు శాస్త్రిగారు.
"అన్నీ చెప్పేవుంచాను. ఆవిడ ఇలా పోవడమేవిటి, అవన్నీ అలా రాయడమేమిటి - అన్నీ వెంటవెంటనే జరుగుతాయి" అన్నాడు ప్రభాకరం.
"అలాగైతే అంతా చకచకా జరిగిపోతుంది. ఆవిడ తిన్నగా స్వర్గానికే వెళ్తుంది" అన్నాడు పేరయ్యశాస్త్రి.
ఇంట్లో ఆడవాళ్ల హడావుడి ఎక్కువగా వుంది.
ఇంట్లో శవం వుంటే అది కదిలేదాకా వంట చేయరు. కాని, ఆరోజున ఇంట్లోకి శవం రాబోతోంది. సావిత్రమ్మగారు పోవాలి. ఆ తర్వాత కర్మకాండకు మరో రెండు గంటలు...! ఎంతలేదన్న నాలుగు దాటుతుంది. అంతవరకూ పిల్లలు వుండలేరు. అందువల్ల వాళ్లకి వంటలు చేయించి భోజనాలు పెట్టించారు. పెద్దవాళ్లకి మాత్రం ఆకలి వేయదా! కళ్లు తిరిగి పడిపోయేటట్లుంటే!!కాని, ఆ సమయంలో భోజనం చేయడం బాగుండదు కనుక ముఖానికి ఇంత విషాదం పులుముకోవాలి. ఎవరైనా పలకరిస్తే కళ్ళనీళ్లు తెచ్చుకోవాలి. అందుచేత ఉప్మా చేయించి కొంచెం హెవీ డోసే లాగించేశారు.