Previous Page Next Page 
కె. ఆర్. కె మోహన్ కథలు పేజి 21

   
    మగవాళ్లు మాత్రం మాటిమాటికీ కాఫీని చప్పరించేస్తున్నారు.


    అక్కడి వాతావరణమంతా పండగని  లేదా పెళ్లి సందడిని తలపిస్తోంది. కాకపోతే - పట్టుచీరెల రెపరెపలు, బంగారు నగల తళతళలూ కనిపించడంలేదు. సూట్లూ,  బూట్ల హడావిడీ లేదు. ఇటువంటివి చూసేనేమో - పెద్దవాళ్ల చావు పెళ్ళితో సమానం! అన్న సామెత  వచ్చింది.


    "ఏమండీ... తులసి తీర్దం ఇలా పట్టండి! ఇంక ఇరవై నిమిషాలే వుంది. బాబూ - ప్రభాకరంగారూ.. ముందుగా మీరు ఉద్దరిణితో మూడుసార్లు నోటిలో నెమ్మదిగా తులసితీర్దం పోయండి" అన్నాడు పేరయ్యశాస్త్రి.


    ప్రభాకర్ అలాగే చేశాడు.

 
    "మీరు ఇంక ఆపండి. తర్వాత మీ తమ్ముళ్ళు ఇద్దర్నీ కూడా పోయమనండి. అమ్మా.... అందరూ ఇక్కడే కూర్చోండి. భజన చేసుకుంటుండండి!" అని సూచనలిచ్చాడు శాస్త్రి మళ్లీ.

 
    సమయం... సరిగ్గా 12 గంటల 32 నిమిషాలు అయింది.

 
    పెళ్లిలో మంగళసూత్రం కట్టేటప్పుడు మ్రోగినట్లుగా సన్నాయి మేళం జోరుగా మోగసాగింది.  భక్త బృందం గరిష్ట శ్రుతిలో భజనలు మొదలుపెట్టింది. ఇంటి జనం గట్టిగా భజనలు చేయసాగారు.


    "అయ్యా .. ఇంక ఒక్క నిమిషమే వుంది. ప్రభాకరం గారూ... చివరిసారిగా తులసితీర్దం పోయండి. అదవగానే  సాయం పట్టి బయట పడుకోబెడ్తురుగాని!  ఇంట్లో ప్రాణం పోతే - నక్షత్రం మంచిది కాకపోతే ఇల్లు ఆర్నెల్లు పాడు పెట్టాల్సివస్తుంది" అన్నాడు పేరయ్యశాస్త్రి.

 
    ప్రభాకరం చివరిసారిగా తల్లి నోట్లో తులసితీర్దం పోశాడు.


    సమయం.... సరిగ్గా 12:34 అయింది.


    "ఇంక పరుగున వెళ్లి బయట ఒక చింకిచాప పరిచారు.


    "నారాయణ, నారాయణ....!" అంటూ నలుగురు సాయంపట్టి సావిత్రమ్మగారిని బయట చాప మీద పడుకోబెట్టేశారు.

 
    సన్నాయి మేళం మరో జోరుగా మోగింది. డోలు దెబ్బలు  అదరకొట్తున్నాయి. భజన బృందాలవారు గొంతు చించుకుని మరీ పాడుతున్నారు.

 
    "అమ్మా....!" అంటూ కూతుళ్లూ, " అత్తయ్యా...!" అంటూ కోడళ్లూ, "మామ్మా, అమ్మమ్మా...!"అంటూ మనవలు శోకనాలు మొదలుపెట్టారు. మగవాళ్లు ఉత్తరీయంతో కళ్లు తుడుచుకోసాగారు.

 
    "శాస్త్రిగారూ..... అంతా అయిపోయిందంటారా?" అని అడిగాడు ప్రభాకరం.

 
    శాస్త్రిగారు సావిత్రమ్మగారి ముక్కు దగ్గర  చెయ్యిపెట్టి  చూసి,  "జీవుడు ఇంకా కొట్టుమిట్టాడుతున్నట్లు శ్వాస ఆడుతోంది' అన్నాడు.


    "అదేమిటండీ.... 12:45 కావస్తూంటే ఇంకా ప్రాణాలు పోకపోవడం12:35 కేగా ముహూర్తం?!" అన్నాడు ప్రభాకరం అసహనంగా.


    "మీ గడియారాలు తప్పుగా ఉన్నాయో...., ఏమో! అసలు ముహూర్తం సరిగ్గా చెప్పారా?" అనడిగారు శాస్త్రిగారు.


    "అన్నీ సరిగ్గానే వున్నాయి. మీరే సరిగ్గా చూసినట్టు లేదు. ఉండండి.... నేను చూస్తాను" అంటూ తల్లి  గుండెల మీద చెయ్యివేసీ, ముక్కు దగ్గర వేలుపెట్టీ చూశాడు ప్రభాకరం.

 
    "ఇదేమిటీ... బ్రతికే వుందే! వారి జ్యోతిషం తప్పినట్లా?!" అని చిరాకుపడ్డాడు.

 
    ఈ మాటలు వినబడగానే భజన బృందం పాటలు ఆపేశారు. మేళగాళ్లు సన్నాయిలనూ దింపేశారు. ఆడవాళ్లూ, పిల్లలూ ఏడుపులు ఆపేశారు.


    అకస్మాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది. మేళగాళ్లు వచ్చి, "అయ్యా.. .మిగిలిన డబ్బులిచ్చి పంపించేయండి మమ్మల్ని!" అన్నారు.


    "మమ్మల్ని కూడా పంపించేయండి!" అన్నారు భజన బృందం.

 
    "ఉండండి - తొందర పడితే ఎలా? ఆవిడ పోనీండి...!"అన్నాడు ప్రభాకరం చిరాకుగా.

 
    "మీరు చెప్పింది 12:35 కి! ఆ తర్వాత వెళ్లిపోవచ్చన్నారు. ఇప్పుడు ఒంటిగంట దాటింది. ఇంకెంతసేపు వుండమంటారు?మాకు రెండు గంటలకి మరో బేరం వుంది" అన్నారు వాళ్లు.

 
    "అయితే... మీకిచ్చిన అడ్వాన్సులతో సరిపెట్టుకొని వెళ్లిపోండి!" అన్నాడు ప్రభాకరం.

 
    "అదెలా కుదురుతుందండీ? ఆవిడ పోవడం, మానడం మాకు అనవసరం.  మాట్లాడినదల్లా ఇచ్చేయండి. లేదూ... .ఆవిడని చచ్చిపోమనండి - వాయించి మరీ వెళ్తాం."


    "ఆవిడ చచ్చిపోలేదుగా... సగం తీసుకుని వెళ్లిపోండి!"


    "అదేం కుదరదు.  కావాలంటే ఈసారి మీ ఇంట్లో ఇంకెవరైనా చచ్పిపోయినప్పుడు  తగ్గిస్తాం!"


    "అయితే.... మీ అందరూ ఆవిడకి తెలివి వచ్చాక ఆవిడ దగ్గర తీసుకోండి. ఇవన్నీ ఆవిడకోసమేగా!"


    "అవన్నీ మాకు అనవసరం. మాట్లాడింది మీరు - మిమ్మల్నే అడుగుతాం!"


    ఇంక లాభం లేదనుకుని ఇద్దరికీ డబ్బులిచ్చి పంపించేశాడు ప్రభాకరం.

 
    " అయ్యా ..మరి, నన్నూ...' అంటూ నీళ్లు నమిలాడు పేరయ్య శాస్త్రి.


    మారు మాట్లాడకుండా ఆయనకీ ఇచ్చి పంపించివేశాడు.


    "అయ్యా.. .పాడె, చావు సామాను ఏంచేయమంటారు?" అన్నాడు వెట్టివాడు.


    "ఓ మూల తగలేయ్! అందరూ దొరికారు - నా ప్రాణానికి!" అంటూ అరిచాడు ప్రభాకరం.


    సావిత్రమ్మ గారు అటూఇటూ కదిలింది. ఉన్నట్లుండి అమాంతం లేచి కూర్చుంది.

 
    అందరూ ఉలిక్కిపడ్డారు.


    "ఏమిట్రా - పుష్పకవిమానంలో స్వర్గానికి వెళుతుంటే భూమ్మీదకు లాక్కొచ్చారా?" అంది.

 
    "అఘోరించినట్టుందిలే... నీ స్వర్గయాత్ర!" అని గయ్యిమన్నాడు ప్రభాకరం.

 
    "ఒరేయ్.. నా కొడుకులకీ, కోడళ్ళకీ, కూతుళ్ళకీ, అల్లుళ్ళకీ నా మీద ఎంత ప్రేముందో నాకు తెలుసు. మీ అందరూ చూపిన ప్రేమను భరించలేకనే  కదా... ఒక్కతినీ కాలక్షేపం  చేస్తోంది! ఇప్పటికైనా మీలో ఏ ఒక్కరిలోనైనా  మార్పు వచ్చిందేమో...., వస్తే - వాళ్ళకి నా ఆస్తి కట్టబెట్టి చివర రోజులు వాళ్ల దగ్గర గడపాలనుకున్నా. కాని, ఈ నాలుగు రోజులు మీ  చర్చలూ, మాటలూ గమనించాక నాపట్ల ప్రేమ సరే... బాధ్యత కూడా  ఎవరికీ లేదు.  మీ అందరి సంగతి స్వయంగా  తెలుసుకోవాలనే ఈ స్వర్గయాత్ర నాటకం ఆడాను.  నాకు  ఓపిక తగ్గిపోయింది.  ఈ ఊళ్ళో వృద్దాశ్రమం వుంది.  అందులో దిక్కులేని ముసలివాళ్లకు  నిస్వార్దంగా సేవలు చేస్తున్నారు.  ఈ ఇల్లూ,  నా ఆస్తీ వాళ్లకే రాసేస్తాను. ఇప్పుడు  వాళ్లు అద్దె ఇంట్లో వుంటున్నారు.  ఈ ఇల్లు  బాగుచేయించి వాళ్లకి ఇచ్చేస్తాను. అప్పుడు వాళ్లు  ఇక్కడికే వస్తారు.  ఈ ఇంట్లోనే నేను కడతేరిపోతాను. ఈరోజు నేను స్వర్గంలాంటి ఆశ్రమంలోకి వెళ్లిపోతున్నాను. అదే నా నిజమైన స్వర్గయాత్ర!" అంటూ సామాను సర్దుకోవడానికి లోనికి వెళ్ళింది సావిత్రమ్మ.

 
                          -జాగృతి... దీపావళి ప్రత్యేక సంచిక' 2000


                                          లౌక్యం


    "హలో ... సిస్టర్! 406 బెడ్ మీదున్న  వీరభద్రయ్యగారి పరిస్థితి ఎలావుందో చెప్తారా! ఆయనకి వారం క్రితం ఆపరేషన్ చేశారు." "ఒక్క నిమిషం - కేస్ షీట్ చూసి చెప్తాను....  ఆ ...ఆయన  బాగా కోలుకుంటున్నారు.  ఇంతకీ, మీరు ఆయనకేమవుతాడు?""406 బెడ్ మీదున్న ఆ వీరభద్రయ్యను నేనేనమ్మా!నా పరిస్థితి గురించి అడిగితే డాక్టర్ గారు చెప్పడం  లేదు. అందుకనే బయటనుంచి మీకు ఫోన్ చేస్తున్నాను."

 Previous Page Next Page