"అదే గదండీ నా డ్యూటీ!"
కుక్కలు మొరిగాయి. వాటిని సముదాయించి, కైలాసాన్ని అడిగేడు గోవిందం-
"ఈ రోజు అమ్మాయి ఎక్కడికి వెళ్లింది?"
"కుక్కలు తమ కేదో విన్నవించినట్టున్నాయి!"
"వాటి సంగతి నీకు అనవసరం! అమ్మాయి గురించి చెప్పు!"
"అయ్యా! తమరు కుక్కలు చెప్పే చాడీలు విని నా డ్యూటీ మీద డవుటు పెట్టుకున్నట్టుంది. కుక్కల్ని నమ్మకండి!" అన్నాడు కైలాసం.
ఆ మాట వినగానే కుక్కలు రోషంగా మొరిగేయి. వాటిని సముదాయిస్తూ గోవిందం లేచి నిలబడి సీరియస్ గా అంటున్నాడు-
"కుక్క లేమంటున్నాయో తెలుసా?"
"చిత్తం, నాకు కుక్కల భాష అర్థం కాదండి!"
"కుక్కల్ని నమ్మద్దన్నావు చూడు-"
"చిత్తం, అన్నానండి!"
"ఆ మాటకి రెండు కుక్కలూ రోషం తెచ్చుకున్నాయి. నిన్ను కైమా చేసేందుకు పర్మిషను ఇవ్వమని అడిగేయి! అంత కోరిక వద్దని వారించేను."
\కైలాసం తలొంచుకున్నాడు.
గోవిందం అంటున్నాడు-
"కైలాసం! నీకు నెలకి నాలుగు వేలు జీతమిచ్చి పెట్టుకున్నది- రాజుగారి సెంటర్లో పోచికోలు ఖబుర్లు చెప్పడాని క్కాదు!"
"సార్! నేను అక్కడికి వెళ్లింది....."
"మాట్లాడకు! నీ గురించి కుక్కలు సమస్తం చెప్పేయి!"
"అనుకున్నానండీ! మీ భాష కుక్కలకీ, కుక్కల భాష మీకూ తీలీడం నా దురదృష్టం!"
"ఇంకో తడవ చేస్తున్న డ్యూటీ విడిచిపెట్టి నీకు నచ్చిన చోట మీటింగు పెట్టేవని తెలుస్తే నిన్ను గొంతు పిసికి చంపుతా! నేను కోటీశ్వరుణ్ని. నా కూతురు కోటీశ్వరురాలు!"
"చిత్తం!"
"కోటీశ్వరుల ఆడపిల్లల మీద అడ్రస్సు లేని కుర్రాళ్ల కళ్లు పడతాయి. పళ్లికిలిస్తారు. ప్రేమిస్తున్నామని చెబుతారు. పెళ్లివరకు తీసుకొస్తారు."
"చిత్తం!"
"అమ్మాయి అమాయకురాలు.వాళ్ల బూటకపు ప్రేమకి అమ్మాయి మనసు పారేసుకుంటే, మా పరువేంగాను? మా ఆస్తీ, ఐశ్వర్యలేంగాను? అల్లాంటి ఆపదలు రాకూడదనే ఉద్దేశంతో అమ్మాయిని వెయ్యి కళ్లతో కనిపెట్టమని నీకు నాలుగు వేల జీత మిస్తున్నాను. ఖబడ్దార్! ఇంకోసారి నా కుక్కల నుంచి ఫేర్యాదులోస్తే నిన్ను ఉరితీస్తాను."
"ఇందాక గొంతు పిసికి చంపుతా నాన్నారండి!"
"నా ఇష్టం! ఏమైనా చేస్తాను!"
కుక్కలు మొరిగి ఏదో చెప్పాయి.
"కుక్కలు తమ కేదో మనవి చేసుకుంటున్నాయండి!" అన్నాడు కైలాసం.
"అమ్మాయి వస్తోందిట మాటలాపమని చెప్పేయి."
"అనుకున్నాన్లేండి!" అని నోరు మూసుకున్నాడు కైలాసం.
చాలా నీరసంగా హాల్లోకి అడుగుపెట్టింది శారద. తండ్రిని పలకరించలేదు. కుక్కల్ని ముద్దు చేయలేదు. మౌనంగా మేడ ఎక్కుతోంది!
గోవిందం కైలాసం వేపు మిర్రున చూసేడు. కైలాసం ఆ చూపుని తట్టుకోలేక, తన చూపు కుక్కల వేపు మరల్చేడు.
కుక్కలు తోక లూపుకుంటో హాల్లోంచి పెరట్లోకి నడుస్తున్నాయి వాటితోపాటు తాను కూడా నిష్ర్కమించడం శ్రేయస్కరమని తలచి కైలాసం ఆ ప్రయత్నం చేయబోగా గోవిందం అన్నాడు-
"నువ్వాగు!"
కైలాసం ఆగిపోయాడు.
"చూసేవా?"
"ఏం చూసేవు?"
"అమ్మాయి గార్నండి!"
"మర బొమ్మలాగా ఇంటికి వచ్చింది. కీ ఇచ్చినట్టు మేడెక్కింది. నన్ను పలకరించలేదు. కుక్కల్ని కన్నెత్తి చూడలేదు. ఏమిటిదంతా?"
"చిత్తం! ఏదో అయ్యిందండి!"
"అదేదో నువ్వు తెలుసుకోవాలి!"
"చిత్తం!"
"రేపట్నించి ఆ పని మీదుండు!"
"చిత్తం!"
"అవసరమైతే వేషం మార్చు. భాష మార్చు. ఏదైనా చెయ్యి! అమ్మాయి గురించి కరెక్టు రిపోర్టు నాకు కావాలి!"
"నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానండి!"
సరిగా అప్పుడే స్టోరు గదిలోంచి డబ్బాల శబ్దం పెద్ద ఎత్తున వినిపించింది. గోవిందం కైలాసాన్ని అడిగేడు-
"నీకు ఏవైనా శబ్దాలు వినిపించేయా?"
"చిత్తం! ఏమీ వినిపించలేదండి."
"బతికి పోయావ్! ఇంక నువ్వు వెళ్లచ్చు! నాకు అర్జంటు పనుంది. నేవెళ్లాలి!" అంటూ గోవిందం స్టోరు గది వైపు వేగంగా నడుస్తున్నాడు.
కైలాసం దిగులుగా ఆ హాలు నుంచి బయట పడుతున్నాడు.
23
అదొక ఆఫీసు. సిమెంటు కంపెనీ తాలూకు ఆఫీసు!
చేతిలో ఫైలు పుచ్చుకుని సత్యమూర్తి ఆ ఆఫీసులోకి అడుగు పెడుతున్నాడు.
అతని గాయాలుపూర్తిగా నయమయ్యేయి. అంచేత అతను నీటుగా వున్నాడు. కానీ, అతను భోంచేసి రెండ్రోజులైంది. అంచేత అతను నీరసంగా వున్నాడు.
మేనేజరు గది ముందు సత్యమూర్తి తచ్చాడుతుంటే, అక్కడే ఉన్న బంట్రోతు సత్యమూర్తిని ఎగాదిగా చూస్తో అడిగేడు-
"ఏం కావాలి?"
"ఉద్యోగం."
"బంట్రోతు నవ్వేడు. సత్యమూర్తి గాబరా పడుతూ అడిగేడు-
"ఎందుకు నవ్వుతావ్?"
"చాక్ లెట్ కావాలనే టైపులో ఉద్యోగం కావాలని చాలా సింపుల్ గా అడుగుతుంటే నవ్వు రాదా?"
"ఆఫీసులో కలుసుకోమంటే వచ్చేను."
"ఎవరన్నారు?"
"రామారావుగారు."
"ఉద్యోగాలు వెతికి పెట్టె ఏజెంటు. నా దగ్గిర అయిదొందలు పుచ్చుకున్నారు."
"ఎందుకు"
"ఈ ఆఫీసులో ఒక ఉద్యోగం వుందని చెప్పినందుకు. రామారావుగారికి మీ మేనేజరు గారు బాగా తెలుసు. నా గురించి మీ మేనేజరు గార్తో చెప్పేరట. వెళ్లచ్చా?"
"వెళ్ళచ్చు! నాకో ఫిప్టీ కొట్టి వెళ్లచ్చు!"
"ఫిఫ్టీనా?"
"నువ్వు రామారావు గారి కిచ్చిన ఫీజులో ఫిప్టీ పర్సెంటు కాదు. ఓన్లీ ఫిప్టీ రుపీస్! అంతే!"
"నా దగ్గిరంత డబ్బు లేదు."
"ఎంత వుంది?"
"టెన్ రుపీస్ నోటుంది. చివరి నోటు! ఎందుకైనా మంచిదని ఖర్చు చెయ్యకుండా దాచుకున్నాను."
"నా కిస్తే నీకు మంచే జరుగుతుంది" అని సత్యమూర్తి జేబులోంచి చొరవగా పది కాగితం లాక్కున్నాడు బంట్రోతు.
"ఉద్యోగమొచ్చేక బెలెన్సు ఇచ్చెయ్!" అని సత్యమూర్తిని మేనేజరు గదిలోకి పంపించేడు బంట్రోతు.
అడుగులు తడబడుతుండగా సత్యమూర్తి మేనేజరు గదిలోకి అడుగు పెట్టేడు.
మేనేజరు ఏదో రాసుకుంటున్నాడు. మధ్య మధ్య మీసాలు దువ్వుకుంటున్నాడు మేనేజరు వస్తాదులా వున్నాడు. కాదనుకుంటే మాలీషు చేసే మనిషిలాగున్నాడు!
"గుడ్ మార్నింగ్ సర్!" అన్నాడు సత్యమూర్తి.
మేనేజరు తలెత్తి చూసేడు. ఎవర్నువ్వు అని కళ్లతో అడిగేడు.
"నా పేరు సత్యమూర్తండి. రామారావుగారు పంపించేరు!"
"అయ్ సీ! అతను చెప్పిన కేండిడేట్ నువ్వే నన్నమాట!"
"యస్సర్!"
"కూచో!"
సత్యమూర్తి వినయంగా కూచున్నాడు.
"ఏం చదివేవ్?"
"డిగ్రీ పూర్తి చేసేను. ఫస్ట్ క్లాస్!"
"మాకు క్లాసు అఖ్ఖర్లేదు"
"ఇవి నా సర్టిఫికెట్లు."