Previous Page Next Page 
ఆనందం పరమానందం పేజి 19

హాల్లోంచి వాళ్లు వెళ్లిపోగానే గోవిందం గబగబా స్టోరు గది వైపు నడిచేడు. ఆ గదికి తాళం వేసి వుంది జేబు లోంచి తాళం చెవి తీసి తాళం తెరిచేడు. గదిలో కెళ్లి మళ్లీ తలుపులు మూసేడు.
ఆ గదిలోసామాన్లు చిందర వందరగా  పడి వున్నాయి. గది గోడ మీద ఒక ఫోటో వుంది.
అది సాక్షాత్తు గోవిందం ఫోటో! నిక్కరు తొడుక్కుని, నోట్లో చుట్ట పెట్టుకుని, రోడ్లు ఊడ్చే చీపురు చేత్తో పట్టుకుని ఒక చెత్త  కుండీ పక్కన  నిలబడి  వున్నాడు.
ఆ ఫోటో వైపు చూస్తూ కోపంగా అడిగేడు గోవిందం -
"పెద్ద మనుషులతో  మాట్లాడుతున్నప్పుడు డబ్బా శబ్దాలు చేయొద్దని నీ కేన్నిసార్లు చెప్పేను?"
ఫోటో లోని చీపురు గోవిందం చిద్విలాసంగా నవ్వేడు.
"నవ్వొద్దు!" అరిచేడు గోవిందం.
"నవ్వక, ఏం చేయమంటావు? నీ అసలు ఫోటో ఈ గదిలో పెట్టి డాబుసరి బొమ్మ గీయించి హల్లో తగిలించావ్? తగిలించి ఊరుకున్నావా? ఆ బొమ్మ నీ బాబుదని, వాడు పెద నందిపాడు జమీందారని ఇంటి కొచ్చిన పెద్ద మనుషులతో గొప్పలు చెబుతుంటే నా ఒళ్లు మండింది" అన్నాడు ఫోటో లోని చీపురు గోవిందం.
"అందుకని డబ్బా  సౌండ్లు చేస్తావా?"
"అదంతా నీ మంచి కోసమేరా! తప్పురా, గోవిందం! గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదు, నిజం బయట పడి, నువ్వేవిడివో, నీ కథేమిటో తెలుస్తే నీ మొహామ్మీద ఉమ్మేస్తారు!"
"ఎట్లా తెలుస్తుంది? నా గతం నాకే గుర్తు లేదు."
"అట్లాగా! అటు చూడు!"
"ఎటు?"
"ఆ తెల్లగోడ మీద చూడు, గబగబా బొమ్మలు పడతాయి. నీ గత చరిత్ర చక చకా నడుస్తుంది."
గోవిందం గోడవైపు చూసేడు. అక్కడ అతని గతం కనిపిస్తోంది?
                            *        *        *
అదొక చెత్తకుండీ!
గోవిందం  రోడ్డు ఊడుస్తూ ఆ కుండీ దగ్గిర ఆగేడు. అటూ ఇటూ చూసేడు. తన క్కావాల్సిన వాళ్లెవరూ కనిపించలేదు!
ఆ కుండీని అనుకుని కూచున్నాడు. ఆ తర్వాత తీరుబడిగా కునికిపాట్లు పడుతున్నాడు.
ఆ నిద్ర సీను అయిదంటే అయిదు నిమిషాలు గడవకుండానే ఒక చెప్పు వచ్చి అతని ఒళ్లో పడింది! గోవిందం ఉలికి పడి కళ్లు  తెరిచేడు.
తన ఎదురుగా శానిటరీ ఇన్ స్పెక్టరు నిప్పులు కక్కుతూ నిలబడ్డాడు.
"గాడిద కొడకా! పని మానేసి కునికిపాట్లు పడతావుంటే, నీ  పని ఎవడు చేస్తాడ్రా? నీ బాబు చేస్తాడా? లే! లేచి  నించో!"
గోవిందం లేచి నించుని వినయంగా అన్నాడు.
"తూర్పు వీథి ఊడ్చేసేనండి!"
"పడమర వీథి ఎవడు ఊడుస్తాడు? నీ  బాబా?"
"నడుం నొప్పిగా  వుంటే కొంచెం కునుకు తీద్దామని ఇక్కడ కూచున్నానండి! ఇదుగో ... ఇప్పుడే వెళ్లి బరాబరా ఊడ్చేస్తానండి!" అని చీపురు తీసుకుని పరుగేత్తేడు.
కొంతదూరం పరుగెత్తేక వెనక్కి తిరిగి చూసేడు. శానిటరీ ఇన్ స్పెక్టరు తన నింకా గమనిస్తూనే వున్నాడు. అతన్ని ప్రసన్నం చేసుకోవాలనే తలంపుతో రోడ్డుమీద చీపురు ఆడిస్తున్నాడు.
కొంచెం దూరంలో వంద నోటు  కనిపించింది. దానిమీద గబిక్కున దూకి, ఎవరూ చూడకుండా ఆ నోటు తీసుకున్నాడు!
అయితే అది వంద కాగితం కాదు. లాటరీ టిక్కట్టు!
ఛీ! ఏదో పాత టిక్కట్టని విసిరి అవతల పారేయబోయేడు.కానీ, క్షణంలోనే మనసు మార్చుకుని టిక్కట్టుని పరీక్షగా చూసేడు, డ్రా  తేదీ నిన్న!
అదృష్టం బావుంటే వందో, వెయ్యో తగలోచ్చని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటో అక్కడికి దగ్గిర్లో ఉన్న లాటరీ షాపుకి వెళ్లేడు. బోర్డు మీద ఫలితాలు రాసి వున్నాయి. మొదటి బహుమతి పాతిక లక్షలు!
బోర్డుమీద రాసిన మొదటి బహుమతి నెంబర్ని తన చేతిలో వున్న నెంబర్తో పోల్చి చూచుకున్నాడు!
అంతే!
చీపురు అవతల పారేసేడు. గాల్లో తేలిపోతూ "పాతిక లక్షలు!" అని గావు కేక పెట్టేడు!
                             *        *        *
గోడ మీద బొమ్మలు మాయమైపోయేయి.
ఫోటోలోని చీపురు గోవిందం పకపకా నవ్వుతూ అంటున్నాడు -
"ఏరా చీపురు గోవిందం!"
"చీపురు గోవిందానివి నువ్వు! నేను కోట్ల  గోవిందాన్ని! బిరుదులు మార్చేవంటే చెప్పుతో కొడతా!"
"బిరుదు! హుఁ! ఎలా బతికేవో, ఏ విధంగా  గొప్పవాడి వయ్యేవో గుర్తు చేసినా - బిరుదులు పట్టుకు వెళ్ళాడే నిన్ను చెప్పుతో కొట్టాలి! చూసింది చాలా?  మరికొన్ని వివరాలు చూపించమంటావా?"
"వద్దు అఖ్ఖర్లేదు. ఫోటోలో వున్నవాడివి  చచ్చినట్టు పడుండాలి. అది రూలు. అది పట్టించుకోకుండా చప్పుళ్లు చేస్తున్నావ్! చరిత్రలు చెబుతున్నావ్!"
"అవున్రా నువ్వు ఫలానా అని చెప్పుకోడానికి నువ్వు  సిగ్గు పడుతున్నంత కాలం చప్పుళ్లు చేస్తూనే  వుంటా! చరిత్రలు చెబుతూనే  వుంటా! చూసింది చాలా? మళ్లీ  మొదట్నుంచీ చూపించమంటావా?"
"వద్దు. నాకు పాతకథ గుర్తు రాకూడదు. నేనిప్పుడు చీపురు గోవిందాన్ని కాదు. కోటీశ్వరుడ్ని! కోట్ల గోవిందాన్ని! మళ్లీ ఎప్పుడైనా ఇల్లాంటి చిత్రాలు చేస్తే ఊరుకొను!"
"ఏం చేస్తావ్?"
"చెప్పుచ్చుక్కోడతా!"
"అప్పుడు చీపురుతో నీ వీపు వాయిస్తా! అంచేత ఒరేయ్! గొప్పలు చెప్పకుండా నిజం చెప్పడం నేర్చుకో! అప్పుడు డబ్బాల శబ్దం వినిపించదు, గోడ మీద నీ పాత చరిత్రా  కనిపించదు. సరేనా  చీపురు గోవిందం?"
"వద్దు, నీకు దణ్ణం పెడతా! నాకు చీపురు గుర్తు చెయ్యద్దు. రోతగా వుంటుంది. నే నది భరించలేను."
అని గొణుక్కుంటూ గది నుంచి బయటపడ్డాడు. ఆ గది తలుపులు మూసి తాళం వేసేడు. తాళం చెవి జేబులో దాచుకుని, మొహం తుడుచుకుని మళ్లా ధైర్యంగా హాల్లోకి వచ్చేడు.
సోఫాలో ఠీవిగా   కూచుని పైపు వెలిగించుకుంతూండగాజెమా జెట్టీల్లాంటి కుక్కలు రెండు వచ్చేయి!
అవి గోవిందానికి చెరో వైపు నించున్నాయి. గోవిందం ఆ రెండు కుక్కల్నీ చెరో చేత్తో పసిపిల్లాల్ని లాలిస్తున్నాట్లు లాలిస్తూ, వాటి తల నిమురుతూ, ప్రేమగా అడిగేడు-
"ఎండలో తిరగొద్దని చెప్పేనా? ఎక్కడ్నించి రావడం?"
కుక్కలు గబగబా మొరిగేయి. ఆ శబ్దాలు శ్రద్దగా విని అన్నాడు-
"ఆ సెంటర్లో మీకేం పని?"
ఒక కుక్క దీర్గాలు తీస్తూ మొరిగింది. అంతా విని అన్నాడు-
"నాకు తెలుసు, టైగర్! మీకున్న  విశ్వాసం ఆ కైలాసానికి లేదు. ఎంచేతనంటే మీరు కుక్కలు. వాడు మనిషి! అందుకే డ్యూటీ మాని, షికార్లు కొట్టడం వాడికి బాగా అలవాటైంది. ఇంటికి రానీ చెప్తా!"
ఇప్పుడు రెండో కుక్క కూడా గబగబా మొరిగింది. ఆ కూడా శ్రద్దగా విని అన్నాడు-
"నువ్వు చెప్పింది కరెక్టే, జాకీ! అమ్మాయి పెళ్లికి ఎదిగింది కదా! ఎక్కడికి వెడుతుందో, ఏం చేస్తుందో - అమ్మాయికి తెలీకుండా గమనించి డైరీ రాయమన్నాను. ఊరికే రాయమనులేదు కదా! అందుకు జీతం కూడా ఇస్తున్నాను. ఇందులో నా తప్పేముంది?"
ఇప్పుడు రెండు కుక్కలు మొరిగేయి. వాటి మొరుగుల్లు విని అన్నాడు-
"నిజమే, ఈ పనికి మీరు చాలు! కానీ అమ్మాయి కారెక్కినా, బస్సెక్కిననా, చివరికి ఆటో ఎక్కినా మీరేం వెంబడించ పనికి కైలాసాన్ని పెట్టుకున్నా!"
జాకీ సుతారంగా మూతి తిప్పుకుంటూ మొరిగింది. అది విని అన్నాడు-
"నేను మందలిస్తా! ఇక ముందు ఒళ్లు దగ్గిరెట్టుకుని డ్యూటీ చేయమని గట్టిగా వార్నింగిస్తా! సరేనా?"
ఇప్పుడు రెండు కుక్కలూ మొరగడం మానేసి తల లూపుతున్నాయి.
సరిగ్గా అప్పుడే కైలాసం హాల్లోకి అడుగు పెడుతున్నాడు. అతడ్ని చూడగానే, కుక్కలు గోవిందాన్ని గోకుతున్నాయి.
గోవిందం కైలాసాన్ని చూస్తూ గాండ్రించేడు-
"ఎక్కడ్నించి వస్తున్నావ్?"
"డ్యూటీ చేసి వస్తున్నానండి."
"అమ్మాయి ఏది?"
"ఇంకో అయిదు నిమిషాల్లో ఇంట్లో అడుగుపెడతారండి!"
"అంటే, ఇంతసేపూ అమ్మాయిని వెయ్యి కళ్లతో వెంబడిస్తూనే వున్నావా?" 

 Previous Page Next Page