Previous Page Next Page 
సంపూర్ణ గోలాయణం పేజి 2

 
    అందులోని భాగమే ఈ ఇంటర్వ్యూ . ఇంటర్వ్యూ మొదలయ్యింది. ఒక్కొక్కరే లోపలికి వస్తున్నారు.

    మీ  ముత్తాతకి ఉబ్బసం ఉండేదా? చర్చిల్ కి మొదలు ఆ ముందు పళ్ళూడాయా? దంతాలే?

    ఎండ మండిపోతుంటే ఎం చేయాలి? ఇందిరాగాంధీ గారి వంటవాడి పేరేమిటి లాంటి చెత్త ప్రశ్నలు వేయడం లేదు.

    అవసరమయిన వివరాలు అడిగి పంపేస్తున్నారు. కాబట్టి సినిమాహాలు దగ్గర  టికెట్లలా చకచకా జరిగిపోతుంది ఇంటర్వ్యూ.

    మోహన్ టర్న్  వచ్చింది. లోనికి వెళ్ళాడు రొటిన్ ప్రశ్నలు అయ్యాక చిట్టిబాబు ఓ ప్రశ్న వేశాడు.

    "చూడండి మిష్టర్ రామ్మోహన్ నేను టి.వి లు చేసే పని మొదలుపెట్టానని తెలిసి చాలా మంది హేళన చేశారు. ఇప్పుడున్నవి చాలవా? కొత్తగా మరోటి మొదలు పెట్టాలా అన్నారు ఎవరయినా ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగేరనుకోండి, నా తరపున మీరేం సమాధానం చెప్పుతారు?" అన్నాడు.

     "నన్నేవరయినా అలా అడిగారనుకోండి నవ్వుతాను. అదేం మాట అండీ దేశంలో కొన్ని కోట్లమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా అని మనం పెళ్ళి చేసుకోడం మానేస్తామా? అని అడుగుతాను." వినయంగా చెప్పాడు మోహన్.

    ఫకాల్న నవ్వేశాడు చిట్టిబాబు. "యు కెన్ గో" అనేసాడు నవ్వుతూనే.

    నమస్కారంపెట్టి బయటికి వచ్చేశాడు మోహన్. వచ్చీ రాగానే "ఎలా అయింది? ఏం అడిగారు?" అంటూ పీక్కుతినేసారు మిగిలిన కేండిడేట్స్.

    "ఏం లేదు మామూలే?" అనేసి ఏదో చెప్పేసి వాళ్ళని తప్పించుకుని వచ్చేసాడు. అమ్మయ్య అనుకుని ఓసారి హాలంతా కలయజూశాడు. ఇంకా చాలామంది ఉన్నారు. చాలా టైం తీసుకుంటుందది. ఈలోగా కాస్త కాఫీ తాగివస్తే  బాగుండు అనిపించింది.

    నాలుగడుగులు వేసేసరికి ఎవరో పిలిచినట్లు అనిపించి వెనక్కి తిరిగిచూసాడు. దూరంగా నిలబడి వున్నాడా యువకుడు. తనను అటు చూడగానే  రమ్మని సైగ చేసాడు "మిమ్మల్నే ఓసారి ఇటు వస్తారా?" అన్నాడతను  దూరం నుంచే. ఆశ్చర్యాన్ని  అనుచుకుంటూ అటు వెళ్ళాడు మోహన్. గోడ కానుకుని నిలబడి వున్నాడు. మోహన్ దగ్గరకు రాగానే "ఐ యామ్ శ్యామ్ సుందర్" అని పరిచయం చేసుకున్నాడు.

    "ఇంటర్వ్యూ బాగా చేశారా అన్నాడు అతని ముఖంలోని చిరాకు గమనించాడు శ్యామ్.

    "మన్నించాలి మిమ్మల్ని శ్రమ పెడుతున్నాను. నాకో చిన్న సాయం కావాలి. మీ చెప్పు నాకో సారి ఇస్తారా?" అన్నాడు సూటిగా పాయింట్ లోకి వస్తూ.

    "చెప్పా?" అన్నాడు అమిత ఆశ్చర్యంతో.

    "అవునండీ చెప్పే. నా చెప్పు ముహుర్తం చూసుకుని ఇప్పుడే  తెగిపోయింది. వెళ్ళి రిపేర్ చేయించుకొద్దాం అంటే టైం లేదు. పోనీ  ఇలాగే లోపలికెళదాం అంటే బొత్తిగా కుంటి నడక నడవాల్సి వస్తుంది. ఏం చేయాలా అని బుర్ర బద్దలుకొట్టుకుంటూ వుంటే దేవుడిలా మీరు  కనిపించారు ప్రాణం లేచివచ్చిందంటే  నమ్మండి. మీరు నా హైటె వున్నారు నాలాటి చెప్పులేసుకున్నారు. అన్నిటినీ మించి మంచివారిలా కనిపిస్తున్నారు!" గడగడ చెప్పేసాడు.

    మోహన్ ఇంకా  ఆశ్చర్యంనుండి తేరుకోలేదు.

    "నా పొజిషన్ కొంచెం ఆలోచించండి. నాకీ జాబ్  చాలా అవసరం. కొండంత ఆశతో ఇంటర్వ్యూకి వస్తే ఇలా జరిగింది. ఇప్పుడు నా భవిష్యత్తు మీ చేతుల్లో వుంది. ఇంక మీ ఇష్టం!"  అనేసాడు శ్యాం.

    చిన్నగా నవ్వాడు మోహన్. "సర్లెండి కష్టం ఎవరిదయినా ఒకటే ఉండండి ఇస్తాను" అంటూ  షూ విప్పబోయాడు.

    "వద్దు. నాకు ఎడం కాలి చెప్పు చాలు" వారించాడు శ్యాం. సరే అని ఎడంకాలి బాటా  బెల్ట్  షూ విప్పి ఇచ్చేసాడు మోహన్.

    "థాంక్స్, థాంక్స్ వెరీమచ్. మీరు నిజంగా చాలా మంచివారు. మీరు ఇంటర్వ్యూకి వచ్చి తోటి కాండిడేట్ ఇలా హెల్ప్ చేస్తున్నారంటే మీది చాలా విశాలహృదయం" పొగిడాడు శ్యామ్.

    నవ్వేసి ఊరుకున్నాడు మోహన్. అంతలోనే శ్యామ్ పేరు పిలిచారు వెళ్ళొస్తాను. అనేసి చకచకా నడిచి వెళ్ళిపోయాడు శ్యామ్.

    "వాషింగ్ పౌడర్ తయారుచేయిద్దామని చూస్తున్నాను. మీరు అవసరం అయితే ఆ వాషింగ్ పౌడర్ అమ్మగలరా?" అని అడిగాడు చిట్టిబాబు.

    "మీరు  ఉద్యోగం అంటూ ఇవ్వాలేగానీ వాషింగ్ పౌడరే కాదు ఉగ్గుగిన్నెల దగ్గర్నుంచి ఉరితాళ్ళదాకా ఏది అమ్మమన్నా అమ్మేస్తాను" ధీమాగా చెప్పాడు శ్యామ్.

    ఫక్కున నవ్వేసాడు చిట్టిబాబు "థాంక్స్ యు కెన్ గో" అన్నాడు.

    థాంక్స్ చెప్పి బయటికి వచ్చేశాడు శ్యామ్  రాగానే మోహన్ కి మరోసారి కృతజ్ఞతలు చెప్పి చెప్పు ఇచ్చేశాడు అప్పటిదాకా అతని కోసమే చూస్తున్న  మోహన్ కాఫీ కోసం వెళ్ళబోయాడు. "ఎక్కడికి వెళ్తున్నారు" వెనకనించి అడిగాడు శ్యామ్. విసుగుని అణుచుకుని సమాధానం చెప్పడు మోహన్.

    "నేనూ వస్తానుపదండి" అంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ తనూ బయలుదేరాడు శ్యామ్. అదృష్టవశాత్తు దగ్గర్లోనే కనిపించాడు చెప్పులు కుట్టేవాడు చెప్పు రిపేరు చేయించుకుని "ఇకపదండి. నా వల్ల మీకు ట్రబుల్ అయింది. దానికి బదులుగా కాఫీ ఇప్పిస్తాను" అన్నాడు చకచక నడిచేస్తూ.

    ఇద్దరూ దగ్గరున్న హొటల్ కి వెళ్ళారు. మేడ మీదికి వెళ్ళి అలసటగా కూర్చున్నారు. సర్వర్ రాగానే టిఫిన్ కాఫీ ఆర్డర్ ఇచ్చారు.

    "రిజల్ట్స్ ఇవ్వాలే చెప్పేస్తారుట కదూ!" అన్నాడు శ్యామ్. అవునుట, డిగ్రీ వచ్చి ఇన్నా ళ్లైనా  ఉద్యోగమే దొరకడం లేదు. ఇది ఆరోప్రయత్నం, ఏమౌతుందో?" దిగులుగా అన్నాడు మోహన్.

    "నేనూ అంతే, కాకపోతే మీ కంటే మరో రెండు ఇంటర్వ్యూల అనుభవం ఎక్కువ.

    "ఏమిటో నాన్నగారి మీద డిపెండ్ అవడం సిగ్గుగా  ఉంది. పల్లెటూరో కూర్చుని ప్రయత్నం చేస్తుంటే లాభం ఉండడం లేదని ఇలా వచ్చాను అన్నాడు మోహన్.

    "నా పరిస్థితీ అంతేలెండి. సవితి తల్లి ప్రతిరోజు చేసే మంగళీక్షితలు భరించలేక ఉత్తరం రాసిపెట్టి ఇంట్లో చెప్పకుండా వచ్చేశాను. మళ్ళీ  ఉద్యోగం  దొరికి నా కాళ్ళ మీద నేను నిలబడితేనె ఆ గడప తోక్కేది" తన పరిస్థితి వివరించాడు శ్యామ్.

    సర్వర్ బిల్ తీసుకొచ్చాడు. మోహన్ అందుకోబోతుండగా వారించి బలవంతాన లాగేసుకున్నాడు శ్యామ్. "ఇప్పటికి నన్నివ్వనివ్వండి. ఉద్యోగం రాగానే మీరు పార్టీ ఇద్దురుగాని!" అన్నాడు స్నేహపూర్వకంగా.

    "మీ నోటి వాక్యాన రావాలే గానీ తప్పకుండా ఇస్తాను!" అనేశాడు మోహన్.

    బిల్ చెల్లించి బయటపడ్డారు నెమ్మదిగా నడుస్తూ మళ్ళీ అక్కడికి వెళ్ళారు ఇంటర్వ్యూ అర్థగానే ఫలితాలు చెప్తాం అని ప్రకటించడం వల్ల జనం అంతా అక్కడే ఉన్నారు గంటన్నర సుదీర్ఘ నీరీక్షణానంతరం ఫలితాలు ప్రకటించారు.

    అప్పుడప్పుడు కొన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. వెళ్తామానుకున్న రైలు రైట్ టైంకి రావడం, సిటీ బస్ లో ఎక్కగానే కిటికీ దగ్గర సీట్ దొరకడం, మధ్యలో ఎగరకుండా టి.విలో ప్రోగ్రాం రావడం ఇలాంటివి. అలాటి విచిత్రమే మరోటి జరిగింది.

    ఉత్తీర్ణులైన వారు ఇద్దరు. కె. రామ్మోహన్ రావు, ఆర్ శ్యామ్ సుందర్ తమ చెవులను తామే నమ్మలేక పోయారు ఉత్తీర్ణులు నిరాశగా నిట్టూర్పారు మిగిలిన వారు ఒకరినొకరు కావలించుకున్నంత పనిచేశారు శ్యామ్, మోహన్.

    ఫార్మాలిటీ స్ అన్ని పూర్తయ్యేసరికి మరో గంట పైనే పట్టింది.

    పదండి భోచేద్దాం అన్నాడు శ్యామ్ ఇద్దరూ హొటల్ వైపు నడిచారు. భలే ఉత్సాహంగా ఉంది ఇద్దరికి.

     గలగల కబుర్లు చెప్పుకుంటూ హొటల్ కి చేరారు.   

    ఇందాక మనం ఈ హొటల్ కె వచ్చాం. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా! అప్పుడు నిరుద్యోగులం, ఇప్పుడు చిరుద్యోగులం" అన్నాడు శ్యామ్.

    సమాధానం చెప్పబోయిన మోహన్ తనకు  అతి చేరువలో మోటార్  సైకిల్  హరన్ వినిపించడంతో ఆగిపోయి వెనక్కి తిరిగి  చూశాడు.

    "హల్లో ఏమిటిలా వచ్చారు? లంచ్ కోసమా?" స్నేహ పూర్వకంగా నవ్వుతూ పలకరించాడు ఫారిన్ బైక్ మీద కూర్చున్న చిట్టిబాబు.

    బాస్ హఠాత్తుగా ఎదురయ్యేసరికి తడబడిపోయారు ఇద్దరూ! "ఏమిటలా చూస్తున్నారు? గుర్తుపట్టలేదా! నేను  చిట్టిబాబుని!" అన్నాడు మళ్ళీ నవ్వుతూ.

    "గుర్తుపట్టక పోవడం కాదు సార్ . సడన్ గా చూశాం కదా! అందుకే!" సమాధానం చెప్పాడు మోహన్.

    "లంచ్ కి వచ్చారా?"

    "అవును సార్!" వినటంగా చెప్పాడు శ్యామ్

    మీ ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చేశాయి  కదా  నాకు పార్టీ  ఇవ్వరా మరి?" సరదాగా అడిగాడు చిట్టిబాబు.

    మొహమ్మొహాలు చూసుకున్నారు ఇద్దరూ. వాళ్ళవని ఇర కాటంలో పడింది. ఈ యనగారికి పార్టీ ఇవ్వడం అంటే మాటలా? ఎక్కడికి తీసుకు పొమ్మంటాడో, ఏం తాగి ఏం తింటాడో ఎవరికీ తెలుసు. జేబులో డబ్బులు చూడబోతే  రేషన్ గానే ఉన్నాయి. కాసేపు నీళ్ళునమిలేసి చివరికి  ధైర్యం తెచ్చుకుని.

    "ఓ  తప్పకుండా ఇస్తాంసార్, మొదటి జీతాలు రాగానే గ్రాండ్ గా పార్టీ ఇస్తాం!" అన్నాడు శ్యామ్.

    "ఉహు, అలా  ఎప్పుడు ఇచ్చే గ్రాండ్ పార్టీ నాకొద్దు, ఇవ్వాళేకావాలి. మీతో పాటు మీరు ఏం తింటే అదే నాకూ పెట్టించండి" చిన్న పిల్లాడిలా పేచిపెట్టాడు చిట్టిబాబు.

    మరోసారి మొహాలు చూసుకుని ఇక తప్పదు అనుకుని "ఓకే రండి సార్!" అని ఆహ్వానించారు.

    ముగ్గురూ మేడమీదికి వెళ్ళారు కిటికీ దగ్గర ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు.

    "ఏం తీసుకుంటారు సార్?" వినయంగా అడిగాడు మోహన్

    "మీ ఇష్టం ఏమైనా సరే!"

    సర్వర్ని పిలిచి గులాబ్ జాం, మసాలాదోసె ఆర్డర్  ఇచ్చాడు మోహన్. "సర్!" అంటూ మొదలెట్టిన శ్యామ్ ని వారించాడు చిట్టిబాబు.

    "ఏమిటీ అన్యాయం శ్యామ్ సుందర్ గారూ! నేనేదో ఫ్రెండ్ షిప్ చేద్దామని చూస్తూంటే సార్ సార్ అంటూ నన్ను దూరం చేస్తున్నారు" అన్నాడు నిష్టూరంగా.

     తెల్లబోయారు శ్రోతలు "ఇదేమిటి సార్  మాతో మీకు స్నేహమా? మీ రెక్కడ? మేమెక్కడ ?" ఆశ్చర్యం నుండి తేరుకొని అడిగాడు శ్యామ్.

    "ఏం ఎందుకంత ఆశ్చర్యం? అలా  ఆశ్చర్యపోతే ణా కోపం వచ్చేస్తుంది మరి. అసలు నాకు తెలియక అడుగుతాను మన మధ్య అంత డిఫరెన్సు  ఉందా? అందరం ఒకే చదువు చదువుకున్న వాళ్ళం పోతే డబ్బు. మా నాన్నదగ్గర బోలెడుందికాబట్టి నేనుబిజినెస్ చేస్తున్నాను. మీ ఫాదర్ దగ్గర లేదు కాబట్టి మీరు ఉద్యోగం చేస్తున్నారు. అంతేకదూ?

    ఈ భాగ్యానికి మన మధ్య గిరిగీసి మాట్లాడితే నేనూరుకోను. ఉద్యోగం దారి ఉద్యోగంది. స్నేహం దారి స్నేహానిదే  ఏమంటారు?" అన్నాడు.

    మరింత ఆశ్చర్యపోయారు ఇద్దరూ. ఏమాత్రం కల్మషం లేని అతడిని చూస్తే మనసు నిండిపోయింది వాళ్ళకీ సంతోషంతో తల మునకలు అయిపోయారు హఠాత్తుగా ఇంత మంచి ఫ్రెండ్ లభించినందుకు కలిగిన సంతోషం అది.

    "చిట్టిబాబుగారూ! డబ్బున్న ఇంట్లో తప్పబుట్టారండీ మీరు!" అనేసాడు శ్యామ్ "నిజమే మీ వంటివారు  ఇంత సింపుల్ గా వుండడం చాలా అరుదు" అంటూ పొగిడాడు మొహన్.

    నవ్వేసి మాట మార్చాడు చిట్టిబాబు. ముగ్గురు కబుర్లలో పడిపోయారు. సడన్ గా మాటాలాపేసి " అటు చూడండి" అన్నాడు చిట్టిబాబు. మిగిలిన ఇద్దరూ అటువైపు చూసారు.

    ఆ హొటల్ కి ఎదురుగా రోడ్. రోడ్ కి అవతలివైపు బస్టాపు. ఆ బస్ స్టాప్ లో నిలబడి వుంది ఓ అందమయిన అమ్మాయి. వయసు ఇరవై ఉంటుంది." కన్నార్పకుండా కుతూహలంగా చూసారు కుర్రాళ్ళు ముగ్గురూ.

    "చాలా అందంగా ఉందికదూ!" అన్నాడు చిట్టిబాబు. "నిజమే" వెంటనే ఏకగ్రీవంగా అంగీకరించారు మిగిలిన ఇద్దరూ మరికాసేపు తమ దృష్టిని సార్ధకం చేసుకున్నారు ముగ్గురూ!

    "మీ  కెవరయినా గర్లఫ్రెండ్ ఉన్నారా? ప్రశ్నించాడు చిట్టిబాబు.

    ఇద్దరిదగ్గరనుండీ  నెగిటివ్ ఆన్సరే వచ్చింది.

    "ప్చ్  ఏమిటో దేనికయినా పెట్టిపుట్టాలి. ణా మాటకు నాకు ప్రేమా పెళ్ళీ అంటే బోలెడంత ఇష్టం. కానీ ఏం లాభం. నాకా అదృష్టం లేదు. మా వాళ్ళంతా కలసి ణా మరదలు మాణిక్యాన్ని నాకు స్థిరం చేసేసారు ఆవిడకి నేనంటే ఎంత  ప్రేమ అంటే నిశ్చితార్ధం అయిన మర్నాడే తట్టా బుట్టా  కట్టుకుని వాళ్ళ మేనత్తగారింటికి అంటే మా ఇంటికి వచ్చేసింది. కాబోయే ఇల్లాలిని ఇంట్లో పెట్టుకుని గర్లఫ్రెండ్ ని, సింగినాదం అంటూ తిరిగడం సబబుగా  అనిపించక మానేసాను" తన  హిస్టరీ చెప్పేసాడు చిట్టిబాబు.

    "ప్రేమా పెళ్ళీ అంటే ఏ కుర్రాడికి ఇష్టం వుండదు  చెప్పండి? కానీ కాలం కలిసిరావొద్దూ?

 Previous Page Next Page