Previous Page Next Page 
సంపూర్ణ గోలాయణం పేజి 3



    ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. ఉద్యోగం సద్యోగం లేకుండా ఊరిమీద బలాదూర్ తిరుగుతూ ఉంటే ఇంకా ప్రేమలూ దోమాలూ గురించి ఆలోచించే అవకాశం ఏది?" అన్నాడు శ్యామ్. పోనీ ఇప్పుడు ఉద్యోగం  వచ్చేసిందిగా ఇక ట్రై చేయండి" సలహా ఇచ్చాడు చిట్టిబాబు.

    ఇద్దరూ నవ్వేసారు "అంత తేలికా అమ్మాయిలతో స్నేహం అంటే? మనకు వచ్చిన అమ్మాయి ఎదురవ్వాలి. ఆవిడకి మనం నచ్చాలి.  పరిస్థితులు అనుకూలించాలి. అప్పుడుకదా ప్రేమ ఫలించి పెళ్ళికి దారితీసేది" నవ్వుతూనే చెప్పాడు మోహన్.

    "నిజమే అంగీకరిస్తున్నాను అదుగో అందమయిన అమ్మాయి. ఎదురుగా కనిపిస్తోంది. వెళ్ళి పలకరించి పరిచయం చేసుకోండి" అన్నాడు చిట్టిబాబు.

    అదిరిపడ్డారు ఇద్దరూ! "ఏమిటండీ ఇది? మీకేమైన మతిపోయిందా?" ఎదురుగా ఉన్నది బాస్  అని మర్చి పోయి నోరు జారి నాలిక కొరుక్కున్నాడు మోహన్.

     అదేం పట్టించుకోలేదు చిట్టిబాబు.  స్పోర్టివ్ గా తీసుకున్నాడు. "నా మతి సలక్షణంగా  వుంది. కాకపోతే మీ దైర్యం ఉత్సాహం ఉంటే మీలో ఎవరయినా ఒకరు వెళ్ళి ఆ అమ్మాయిని పలకరించి రండి చూద్దాం" చాలెంజ్ చేసాడు.

    "ధైర్యం ప్రసక్తి ఏముంది ఇందులో. రోడ్డుమీద బస్ కోసం నిలబడిన అమ్మాయిని పలకరించడం మర్యాద కాదేమో!" చిరాగ్గా అడిగాడు శ్యామ్.

    "అవ్వపెరే ముసలమ్మా  ధైర్యంలేక మర్యాద అని సరివుచ్చుకుంటున్నారు" హేళనగా అన్నాడు  చిట్టిబాబు.

    శ్యామ్ కి పౌరుషం  ముంచుకొచ్చింది. "ఏదో మొహమాటంగా ఊరుకుంటున్నాం అంతమాత్రాన మమ్మల్ని అంత చవటలుగా జమకట్టకండి. పలకరించిరావడం అంత కష్టంకాదు. ఇదిగో వెళ్తున్నా!" అంటూ ధీమాగా లేచాడు.

    "వెళ్ళిరండి!" కొంటెగా నవ్వాడు చిట్టిబాబు.

    ఒక్కక్షణం తడబడిపోయి వెంటనే బయటికి నడిచాడు. కిందికి వెళ్ళి రోడ్ క్రాస్ చేసి బస్టాప్ కి వెళ్ళాడు. ఆ అమ్మాయికి కాస్త దూరంలో ఆగిపోయాడు. అటూ ఇటూ చూసి గొంతు సవరించుకొని "ఏమండీ! టైమెంత?" అని అడిగాడు.

    వాచీ చూసుకుని టైమ్ చెప్పేసింది ఆ అమ్మాయి.  బుద్దిగా తలవంచుకుని హొటల్ కి వచ్చేశాడు శ్యామ్. "పలకరించాడు ఆ అమ్మాయిని పలకరించేశాను." అన్నాడు చెమటతుడుచుకుని కూర్చుంటూ.

    అదేదో పెద్ద జోక్ అయినట్లూ కడుపు పట్టుకుని  నవ్వాడు చిట్టిబాబు. "శభాష్ నిజంగా ధైర్యం అంటే  మీదేనండి" అన్నాడు ఎగతాళిగా.

    అతడి ఎగతాళి  అంటే ఒళ్ళు మండింది శ్యామ్ కి. "ఏం?" ఎందుకండి అంత ఎగతాళి" ఉక్రోషంగా అడిగాడు.

    కాకపోతే ఏమిటండి! అంతా వెళ్ళి టైము అడిగి వచ్చారా ఈ భాగ్యానికి  మీ హీరోయిజం ఎందుకట? వళ్ళూ డిపోయిన  తాతగారిని పంపించినా ఆ మాత్రం  పలకరించి వస్తారు ఛ, కుర్రాళ్ళు పరువు తీనేశారుకదా శ్యామ్ గారూ!" అన్నాడు మరింత నవ్వుతూ.

    మోహన్ కూడా నవ్వొచ్చింది. చిన్నగా నవ్వాడు.

    శ్యామ్ కి పౌరుషం వచ్చింది. "సరే అయితే చూస్తూ ఉండండి, ఇప్పుడే మళ్ళి వెళ్ళి ఆవిడ పేరు అడ్రస్ చదువు సంధ్యా అన్నీ కనుక్కోస్తాను. అంటూ లేచి నిలబడ్డాడు.

    "నిజంగా? పందెం, మీరలా కనుక్కొస్తే యాభై రూపాయలు యిస్తాను అన్నాడు చిట్టిబాబు యింకా  నవ్వుతూ.

    వినవిస బడుస్తూ మళ్ళీ బస్టాప్ లోకి వెళ్ళాడు. ఆ అమ్మాయి అక్కడే ఉంది. "హలో! మంజులగారూ! నమస్కారం!" అన్నాడు.

    తలతిప్పి వింతగా చూసింది ఆవిడ.

    "నేనేనండీ! సుజాతా వాళ్ళ అన్నయ్యని, ఆ రోజు సినిమాలో కలుసుకున్నాం కదూ. గుర్తుపట్టలేదా నన్ను!" అన్నాడు గబగబా.

    ఎగాదిగా అతని వంక చూసింది ఆ అమ్మాయి. "మీరు పొరబాటు పడుతున్నారు ఎవర్ని చూసి ఎవరను కుంటున్నారు. నా పేరు మంజుల కాదు" మర్యాదగా అనేసింది. పరీక్ష గా ఆవిడ వంక చూశాడు చేతిలోని పుస్తకం మీద దీపిక కనిపించింది.

    "అదీ సంగతీ, మంజుల కారు మీరు. నిజమే నేనే పొరపాటు పడ్డాను. మీరు సీతారామయ్యగారి అమ్మాయి కదూ! మీరు మా సుబ్బలు  పిన్నీ వాళ్ళింట్లో అద్దెకి ఉండేవారు. ఈసారి సరిగ్గా గుర్తుపట్టాను చూశారా" అన్నాడు అమిత సంతోషంగా.

    నవ్వొంచ్చింది దీపికకి. ఇది ఏదో  పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వచ్చిన కేసు అనుకుంది. అయినా నవ్వావుకుని "కాదు, మే మసలు  ఎక్కాడా అద్దెకుండలేదు. మాకు డాబా గార్డెన్సులో స్వంత ఇల్లే వుంది" అంది.

    "అరెరే ఏమిటో ఇలా పొరపాటు పడిపోతున్నాను ఇవ్వాళ, అని బోలెడంత బాధపడిపోయాడు. "మొత్తానికి మిమ్మల్ని మాత్రం ఎక్కడో  చూశాను. ఉండండి గుర్తు తెచ్చుకుని చెప్తాను" అని కాసేపు ఆలోచించి "ఆఁ! గుర్తొచ్చింది మీ నాన్నగారు ఎ.వియస్ కాలేజీలో ఫిజిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంటుగా ఉండే వారు. మాధవ రావుగారు. మీ యింటికి ట్యూషన్ కి వచ్చేవాడిని నేను అన్నాడు.

    అర్ధం  పర్ధం లేకుండా వాగుతున్న అతన్ని చూస్తే భయం వేసింది దీపికకి. "కాదు మా నాన్నగారి పేరు నారాయణమూర్తిగారు. ఆయన కలెక్ట రాఫీసులో పనిచేసి  రిటైర్ అయ్యారు" అనేసింది ఎలాగైనా అతడిని వదిలించుకుందామని.

    బస్ వస్తుందేమో అని చూసింది. కానీ ఎక్కడా జాడలేదు. ఖాళీ ఆటో పోతుంటే "ఆటో" అని పిల్చింది "ఏయ్ ఆటో" అంటూ తను కూడా అరిచాడు శ్యామ్ కానీ ఆటో ఆగలేదు.

    "ప్చ్ వెధవ ఆటోలు ఇంతేనండీ ఆగరు. మా కాకి నాడలో కూడా అంతే బైదిబై మీ స్వంత వూరు కూడా కాకినాదేనా అండీ?" అని అమ్దిగాడు.

    భయంపోయి దాని స్ధానాన విసుగు కోపం చోటు చేసుకోగా చర్రున అతనివంక తిరిగింది దీపిక. కాదు, కంకిపాడు. చూడు మిస్టర్, ఇందాకటి నించి చూస్తున్నాను నీ వ్యవహారం ఏమీ బాగాలేదు. మర్యాదగా మీ దోవన మీరు వెళ్ళండి. లేకపోతే! యింకా ఆవిడ మాట పూర్తి కాకుండానే" ఐయాం సారీ" అనేసి ఇంచుమించుగా  పరిగెడుతూ హొటల్లోకి వచ్చేశాడు శ్యామ్.

    కుతూహలంగా అతని వంక చూశారు చిట్టిబాబు మోహన్. కూర్చుని కంఠం సవరించుకున్నాడు శ్యామ్.

    "ఆ అమ్మాయి పేరు దీపిక, వాళ్ళుండేది డాబా గార్డెన్స్ లో స్వంత యిల్లు వుంది వాళ్ళకి. ఆవిడ పాదర్ పేరు నారాయాణమూర్తిగారు. కలెక్టర్ ఆఫీసులో అని  చేసే వారు, రిటైరైపోయారు, వాళ్ళ స్వంత ఊరు కంకిపాడు" గర్వంగా చెప్పేశాడు శ్యామ్.

    "మేము ఇక్కడి నించి గమనిస్తూనే ఉన్నాం. బాగానే మేనేజ్ చేశారు. మరికాసేవుంటే లెంపకాయ కొట్టేదేమో ఆ అమ్మాయి. అయినా ఫర్వాలేదు, వెల్ డన్. పందెం గెలిచారు ఇదిగో" అంటూ పర్స్ తీసి ఫిఫ్టీ నోటు తీసి ఇచ్చేశాడు చిట్టిబాబు.

    సర్వర్ కాఫీలు తెచ్చి బల్లమీద పెట్టాడు. చిట్టిబాబుకి మళ్ళీ చిలిపి ఆలోచన వచ్చింది. "మోహన్  గారూ! శ్యామ్ తన ప్రతిభని నిరూపించుకున్నారు. మరి మీరో! ఆవిడ అక్కడే ఉంది వెళ్ళి పలకరించి పందెం గెల్చుకోండి!" అన్నాడు.

    అప్పటివరకూ తలవంచుకుని దీర్ఘాలోచనలో ఉన్న మోహన్ ఉలిక్కిపడ్డాడు. "ఏమిటి? ఏమన్నారు?" అన్నాడు.

    తను అన్నది ఏమిటో మరోసారి చెప్పాడు చిట్టిబాబు. తలతిప్పి దూరంగా కనిపిస్తున్న దీపికని పరీక్షగా చూశాడు మోహన్. తల తిప్పి కాఫీ కప్పు అందుకుని చిట్టిబాబు వంక చూశాడు.

    చూడండి చిట్టిబాబుగారూ! యిలా చిన్న చిన్న  పనులు చేసి మిమ్మల్ని సంతోష పెట్టడం నా కిష్టం లేదు. ఇలాటి పనులు చిన్నపిల్లల ఆటల్లాగా అనిపిస్తాయి. అంతగా మీరు నన్ను పరీక్షించాలనుకుంటే! గంభీరంగా ఆపేసాడు.

 Previous Page Next Page