Previous Page Next Page 
అనుభవాల అలలలో పేజి 18

    చందుతో పాటు గుల్జార్ నవ్వి "సీతా బహిన్! పోనీ ఓ పని చెయ్యరాదూ, ఈ భయ్యాచేత జాబ్ మానిపించి ఏదైనా బిజినెస్ చేయించరాదా?" అన్నాడు.
   
    "ఇంకా నయం వంట చేయిస్తూ కొంగున ముడేసుకుని కాలం హాయిగా గడిపెయ్యమని చెప్పలేదు" చందు అన్నదానికి "అంత అదృష్టం కూడానా?" నవ్వుతూ మాట విసిరి లోపలికి వెళ్ళిపోయింది సీత.
   
    గుల్జార్ కొద్దిసేపు వుండి వెళ్ళిపోయాడు.
   
    చందు ముందు గది తలుపువేసి వంట గదిలోకి వచ్చాడు.
   
    సీత వంట పూర్తి చేసి డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు సర్దుతున్నది.
   
    "తొందరగా వంట అయినంతవరకే వడ్డించు సీతా!" కుర్చీలో కూర్చుంటూ చందు అన్నాడు.
   
    "అయినంతవరకేం ఖర్మ పూర్తివంటే అయింది. గుల్జార్ రాకకి అర్ధం తెలిసిందాన్ని కాబట్టి చక చక కానిచ్చాను. ఇదేం ఉద్యోగం ఓ వేళాపాళా లేదు...వారంవర్జం లేదు. ఆదివారంకూడా ఇంటిపట్టున వుండరాయె" సీత వడ్డిస్తూ నెమ్మదిగా సాధించింది.
   
    సీతా! నీ కెన్ని సార్లు చెప్పినా అర్ధంకాదు. నెలకి నాలుగు ఆదివారాలు వస్తాయి....మిగతా రోజులన్నీ పనిచేయాలి...ఈ జాబ్ అలాకాదు, క్యాంప్ కెళ్ళి రాంగానే మిగిలిన రోజులు నీ సమక్షంలో యుగాలు క్షణాల్లా...

    "కబుర్లతో నా కడుపు, నింపుతూ ఆ తినడం ఏమిటండీ. తొందరలో నాలుగు మెతుకులు ముక్కూ నోటా కుక్కుకుంటున్నారు...సరీగా తినండి. అవతలింకేం కొంపలు మునగవు__ఓ పదినిముషాలు ఆలస్యంగా వెళితే. అయినా నాకు తెలియక అడుగుతాను మరో ఉద్యోగం అయితే నాలుగు ఆదివారాలు తప్ప మిగతా రోజులన్నీ పనిచేయాలన్నారు కదా. ఆదివారం రాత్రిళ్ళు ఇంట్లో ఉంటారు కదా?"
   
    "అదా నీ బాధ."
   
    "నా కెందుకు బాధ. అదేదో మీకు. ఈ వెధవ క్యాంపులు వారం ఉండేను పదిహేను రోజులుండేను... కాకపోతే రెండు రోజులే వుండేను__ఎన్ని రోజులున్నది ముఖ్యంకాదు...డ్యూటీలో వున్న ఆ రోజులన్నీ రాత్రింబవళ్ళు వుండరు కదా."
   
    "మిగతా రోజులుంటాం కదా దేవీ!"
   
    "కమ్మగా కబుర్లు చెప్పి నా నోరు మూయించడం బాగా వచ్చు"
   
    "పిచ్చి సీతా! నాకుమాత్రం బాధగా లేదా. ఒక్క క్షణం నిన్ను విడిచి వుండాలంటే నాకు నరకం గుర్తుకు వస్తుంది. నా జాబ్ అలాంటిది కొన్ని బాధలు ఆడవాళ్ళకి తప్పవు" అంటూ చందు భోజనం కానిచ్చి లేచాడు.
   
    "పాపం? వారుమటుకు ఏం చేస్తారు?" అనుకుని "ఈ తఫా క్యాంప్ ఎన్నాళ్ళట. ఏ ఊరు?" నెమ్మదిగా అడిగింది సీత.
   
    "ఎంత వారంరోజులు. రానూ పోనూ ప్రయాణం రెండున్నర రోజులు తీసేస్తే నా డ్యూటీ మిగతా రోజులు... నే వెళ్ళాల్సింది బొంబాయి" అంటూ చందు ముందుగదిలోకి వెళ్ళాడు.
   
    సీత చేయి కడుక్కుని వచ్చింది.
   
    ఆ గదిలో ట్రంకు పెట్టెవుంది. దానికి తాళం వుంది. అది చందూది. ఆ పెట్టెని అతను తప్ప సీత తెరవదు. తన జాబ్ ని సంబంధించిన సీక్రెట్స్ మాత్రమే అందులో దాయడం జరిగిందని సీతకి చెప్పాడు. అప్పుడే మరికొన్ని విషయాలు కూడా చెప్పాడు. సీత దాని జోలికిపోదు.
   
    చందు పెట్టె తెరిచాడు డైరీలాంటి చిన్న బుక్కు తెరిచి ఏదో నాలుగు లైన్లు గిలికాడు.
   
    "గూఢచారి నెం. 00007 సి.ఐ.డి. సినిమాలలో వలెనె మీ పనులు కూడా వుంటాయా?" సీత అడిగింది.

 Previous Page Next Page