తలుపు అవతల నుంచి వినిపించింది. "టెలిగ్రాం -- పి. రామసుబ్బారావుగారు."
"ఈ వీధి చివరి ఇల్లు" తలుపు తీస్తూ చెప్పింది జాస్మిన్.
తలుపులు సగం తీస్తూ వుండగానే భళ్ళున తలుపులు తీసి ఇద్దరు దృఢ కాయులైన ఆగంతకులు యింట్లో జొరపడ్డారు.
ఒకడి చేతిలో రివాల్వర్ వుంది. అది సూటిగా జాస్మిన్ కి గురిపెట్టబడి వుంది. ఏ నిమిషానికైనా పేలటానికి రెడీగాను వుంది.
"ఏమిటి దౌర్జన్యం?"
"నోరు మెదపకు చెప్పింది విను. నువ్వు చాలా తెలివిగలదానివి. కన్నుమూసి తెరిచేలోగా అలోచించి ఎదుటి వాళ్ళని చిత్తు చేయగలవు. ఆ అవకాశం నీకు ఇవ్వం. కుందన్ మా వాడు. కుందన్ ని పట్టించావు. కుందనేగాక వాడు తెచ్చే నాలుగు లక్షల వజ్రాలు మాకు దక్కలేదు. దీనికంతా కారణం నువ్వని తెలుసుకునేసరికి పదిరోజులు పట్టింది. మా సిద్ధాంతం గుద్దుకు గుద్దు. అంతే...
అతని మాట పూర్తిగాక ముందే జాస్మిన్ ఎగిరి అతని మీదకి దూకింది. దూకుతూనే రివాల్వర్ ఎగరగొట్టింది.
రెండో అతను చాలా క్విక్ గా జేబులోంచి కత్తి తీశాడు. అంతకన్నా క్విక్ గా జాస్మిన్ ని పొడిచాడు. జాస్మిన్ ని మొదటి అతను పట్టుకున్నాడు. మరోపోటు.... మరోపోటు.
జాస్మిన్ మొదలు నరికిన చెట్టులా కూలిపోయింది. విరుచుకుని నేలమీద దబ్ మంటూ పడిపోయింది.
"చచ్చింది" మొదటివాడు అన్నాడు.
"దీని శవాన్ని కూడా నమ్మటానికి వీలులేదు" అంటూ రెండోవాడు జాస్మిన్ ని యీడ్చి తన్నాడు. జాస్మిన్ లో చలనం లేక పోయేసరికి వంగి పరీక్ష చేశాడు. "సందేహం లేకుండా చచ్చింది" పైకి లేస్తూ చెప్పాడు.
"రూములన్నీ సోదా చేద్దామా!"
"బాస్ ఏమి చెప్పాడు! చెప్పినంతవరకే చేయమన్నాడు. పద వెళ్ళిపోదాం" కిందపడ్డ రివాల్వర్ తీసుకుని జేబులో వేసుకుంటూ అన్నాడు.
చేతికి గ్లౌస్ ఉండటం వలన వేలిముద్రలు పడతాయి అనే భయంలేదు. అందుకే జాస్మిన్ వంటి మీదే కత్తిని వుంచేసి బయటికి వెళుతూ "జాస్మిన్ నీ చావు లోకానికి కూడా తెలియకూడదు. నీ శవం కుళ్ళి కుళ్ళి కృశించి పోవాలి. అందుకే వీధి తలుపులకి బయట తాళం వేసి మరీ పోతున్నాం మైండిట్!" అన్నాడు మొదటివాడు.
"ఇడియట్! శవంతో మాటలేమిటిరా! ఈ గదిలో లైటు. ఆ గదిలో బెడ్ లైటు ఆర్పి కిటికీలు లోపల వేసిరా." అని చెప్పి రెండోవాడు బయటికి వెళ్ళాడు.
మొదటివాడు బెడ్ రూమ్ లోకి వెళ్ళి చిన్న లైటు ఆర్పాడు.
బాత్ రూమ్ లో వున్న నందితాదేవికి బయట జరుగుతున్నది లీలగా అర్ధమవుతూనే వుంది. గజ గజ వణుకుతూ నేల కతుక్కుపోయి అలానే నుంచుండిపోయింది.
బెడ్ రూం కిటికీ తలుపులు లోపలి బోల్టులు బిగించాడు. సరిగా అప్పుడే అతనికి పాస్ కెళ్ళే అవసరం కలిగింది.
ముందు గదిలోని పెద్దలైటు వెలుతురు బెడ్ రూం లోకి ప్రవర్తిస్తున్నది. ఆ వెలుతురులో బెడ్ రూం కున్న ఎటాచ్డ్ బాత్ రూం కనిపించింది.
అవసరం తీర్చుకోటానికి బాత్ రూమ్ వైపు నడిచాడు.
బాత్ రూంలోంచి బూట్ల అడుగుల శబ్దం వింటున్నది నందితాదేవి.
అడుగుల చప్పుడు సరిగా బాత్ రూం దగ్గరకొచ్చి ఆగింది.
లోపల నందితాదేవి ఫై ప్రాణాలు పైనే పోయాయి.
ఆగంతకుడి చెయ్యి బాత్రూం తలుపు పిడిపై పడింది.
అడుగుల చప్పుడు బాత్రూం దగ్గర ఆగిపోయాయి. తను లోపల వున్నట్లు వచ్చిన వాడికి తెలిస్తే తన ప్రాణం తీయవచ్చు మరేదయినా చేయవచ్చు. బయట బోల్ట్ బిగించి పోతే తనీ రూంలో సజీవ సమాధి అవుతుంది. వాడెవడో వెళ్ళలేదు. వెళితే దూరంగా వెళుతున్న అడుగుల చప్పుడు అయేది. తలుపు అవతల వున్నాడు. ఏం చేయపోతున్నాడు?