ప్రహిసిత్ దగ్గరగా వచ్చి మైకుకి అవతలివైపు నిలబడ్డాడు. ఇద్దరి మధ్యా బల్లవుంది. బల్లమీద పూలదండలున్నాయి.
మంత్రి నవ్వుతూ విషయం ఏమిటన్నట్టు చూసాడు.
అప్పుడు కొట్టాడు ప్రహిసిత్.
మొహం పచ్చడయ్యేలా ......పిడికిలి బిగించి .....ఒకే ఒక దెబ్బ. దీని పరిణామాలు భయంకరంగా వుంటాయనిగానీ, తను భారతదేశాన్ని రిప్రజెంట్ చేసే ఒక క్రీడాకారుడని గానీ అతడికా సమయంలో గుర్తులేదు. స్వంత చెల్లెల్నో, భార్యనో, తల్లినో అవతలి వ్యక్తి అవమానపరిస్తే రవ్వంత ఉప్పు, కారం రక్తంలో వున్న ఏ యువకుడైనా ఆవేశపడటం సహజం. కానీ ఈ ఆవేశం వేరు. ఇది వెయ్యిరెట్లు ఎక్కువ. తన ప్రాణాన్నే ఎవరో అవమానపర్చినట్టు.....
"నీ కోసం నేనున్నాను. నీకు ఎక్కడ ఏం జరిగినా ఇక్కడ నేను స్పందిస్తాను. నేనుండగా పంచభూతాల్లో ఏవీ కూడా నిన్ను చెడు దృష్టితో చూడనివ్వను....." అన్నట్టు అతను ఆ మంత్రిని కొట్టాడు.
అప్పటివరకూ ప్రతిమలా నిలబడిన బాడీగార్డు చప్పున ఈ లోకంలోకి వచ్చాడు. అప్పటికే తాపీగా ప్రహసిత్ వేదిక మెట్లు దిగుతున్నాడు. సభ మొత్తం నిర్వీణ్ణమై చూస్తోంది. సూదిపడితే వినపడేటంత నిశ్శబ్దంగా వుంది. సభలో అందరూ నిశ్చేష్టులై పోయారు. మధూహ కూడా చేష్టలుడిగినట్టు వుండిపోయింది. విధి, నిర్వహణ గుర్తొచ్చి బాడీగార్డు ముందుకు కదిలాడు.
వేదిక మెట్లు దిగుతూన్న ప్రహసిత్ ని వెనుకనుంచి తుపాకీ బోనెట్ తో పొడిచాడు.
ప్రహసిత్ అలానే మెట్లమీద కూలిపోయాడు. రక్తం జివ్వున చిమ్మింది. సభలో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఈలోపులో దూరంగావున్న ఇనస్పెక్టర్ పరుగెత్తుకుంటూ వచ్చాడు. ప్రహసిత్ కస్టడీలో తీసుకోబడ్డాడు. ఆ తరువాత అతడిని ఆస్పత్రికి పంపించారు.
4
ఆ మరుసటి రోజు అన్ని పేపర్లలో ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. ఒక ఆగంతకుడు మంత్రిమీద దాడి చేసినట్టు, బాడీగార్డు అతడికి అడ్డుపడి గాయపర్చినట్టు పోలీసులు ఆ ఆగంతకుడిని ఆరెస్టుచేసినట్టు వివిధ పత్రికల్లో వచ్చింది.
ఆ రోజు జరిగింది చిన్న సాహితీ సమావేశం అవటంవల్లనూ, దానికి అధ్యక్షత వహించింది ఏ మాత్రం ప్రాముఖ్యం లేని మంత్రి అవటంవల్లనూ, ఆ సభకు పత్రికా విలేకర్లు ఎవరూ రాలేదు. కేవలం మధూహ ఒక్కతే వెళ్లింది.
అక్కడ నిజంగా జరిగిందేమిటో వివరంగా వ్రాసిచ్చింది. ఎడిటర్ శాస్త్రి దానిని ప్రముఖంగా బాక్సుకట్టి పెద్ద అక్షరాల్తో మొదటి పేజీలో వేసాడు.
దాంతో మళ్ళీ సంచలనం రేగింది.
ఈ కేసులో ఇన్ వాల్వ్ అయింది ప్రముఖ టెన్నీస్ ఆటగాడు ప్రహసిత్ అన్నవార్త ఎప్పుడైతే బయటకొచ్చిందో అది నేషనల్ న్యూస్ అయింది. మంత్రి ఆంజనేయులి కన్నా ప్రహసిత్ కే ఎక్కువ పేరుంది. ఇతడు రాష్ట్రానికి సంబంధించిన వాడు. అతడు దేశానికి సంబంధించిన వాడు. "డేవిస్ కప్ ప్లేయర్ .....ఇన్ .... హాస్పిటల్" అని మాగజైన్స్ ప్రచురించాయి.
ఆస్పత్రిలో ప్రహసిత్ ని పత్రికా విలేకర్లు చుట్టుముట్టారు. అందరూ ఒకటే ప్రశ్న.... "నిండు వేదిక మీద మంత్రిని ఎందుకు కొట్టారు?"
అందరికీ అతను ఒకటే సమాధానం చెప్పాడు.".....ఆయన బాధ్యతాయుతమైన మంత్రి. బాధ్యత లేకుండా మాట్లాడాడు. "అడవి బాపిరాజు" ....అనే నవల గోనగన్నారెడ్డి వ్రాసాడో, 'గోనగన్నారెడ్డి, అన్న నవల 'అడవి బాపిరాజు' వ్రాసాడో కూడా తెలియని వ్యక్తి సాహిత్యం గురించి మాట్లాడటం హస్తాస్పదం. పక్క వ్యక్తులు ఏదో చెప్తే దానికి వంతపాడాడు. ఆధునిక సాహిత్యం పాడయింది. అన్నాడు. అంతవరకూ ఊరుకున్నాను. ఒక రచయిత్రిని పట్టుకుని వ్యక్తిగతంగా దూషించాడు. అందువల్ల ఊరుకున్నాను. ఒక రచయిత్రిని పట్టుకుని వ్యక్తిగతంగా దూషించాడు. అందువల్ల ఒక క్షమించలేకపోయాను."
"మీరు క్రీడాకారుడు కదా. మీకు సాహిత్యం గురించి తెలుసా?"
"ఆ మంత్రిగారి కన్నా ఎక్కువే తెలుసు."
విలేకర్లలో నవ్వులు.
"ఒకప్పటికన్నా సాహితీరంగం ఇప్పుడు పాడవలేదని మీ వుద్దేశ్యమా?"
"ఒక్కప్పటితో పోల్చుకుంటే....." ఆగి పూర్తి చేసాడు. "ఇప్పటి అసెంబ్లీలంత పాడవలేదనినా వుద్దేశ్యం."
ఈసారి మరింత పెద్దపెట్టున నవ్వులు.
ఆ కలకలం మధ్యలో డాక్టరు గదిలో ప్రవేశించాడు. "మిస్టర్ ప్రహసిత్ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి" అన్నాడు విలేకర్లు సమావేశం తొందరగా ముగించమన్నట్టుగా.
"విషయం ఏమిటి డాక్టర్?" ప్రహసిత్ అడిగాడు.
"కొంచెం మాట్లాడాలి. లేదంటే తరువాతొచ్చి మాట్లాడతాను"
ప్రహసిత్ నవ్వేడు. "అంత రహస్యం ఏముంటుంది డాక్టర్? ఈ ట్రీట్ మెంట్ పుణ్యమా అని.... నా రక్తంలో ఎయిడ్స్ వున్నట్టు బయటపడిందా ఏమిటి?"
"అది చాలా గొప్ప సెన్సేషనల్ న్యూస్ అవుతుంది" ఎవరో వెనుకనుంచి అన్నారు. అందరూ నవ్వేరు. డాక్టరు నవ్వలేదు. ఎక్స్ రే ముందుకు తోస్తూ "ఐయామ్ సారీ ప్రహసిత్....." అన్నాడు "......బోనెట్ తాలూకు కత్తిపోటుకి మీ రొమ్ము ఎముకతోపాటు నరమూ దెబ్బతిన్నది. ఇక మీరు టెన్నీస్ కి పనికిరారు......"
ఒక స్టిల్ ఫోటోగ్రాఫ్ లా నిశ్చేతనంగా ప్రహసిత్ మొహంమీద నవ్వు ఆగిపోయింది. అతడి చేతివేళ్ళు దిండు చుట్టూ అప్రయత్నంగా బిగుసుకున్నాయి. సగం తెరచుకున్న పెదవుల మధ్య బాధ, ఉచ్చాస నిశ్వాసాల మధ్య సందిగ్ధమై ఆగిపోయింది. ఎన్నో వార్తలకి ప్రత్యక్ష సాక్షులైన విలేకర్లు కూడా ఈ న్యూస్ కి స్థబ్దులయ్యారు.
"మీరు బలంగా బంతిని సర్వ్ చేయటానికి వీలులేదు. మీ ఛేస్ట్ బోన్స్ మీరు అంత వత్తిడి అభిలషణీయం కాదు."
"మీరు బలంగా బంతిని సర్వే చేయటానికి వీలులేదు. మీ ఛేస్ట్ బోన్స్ మీద అంత వత్తిడి అభిలషణీయం కాదు."
ప్రహసిత్ వినటం లేదు. అతడికి 'మోనికాసెలెస్' అనే చిన్నపిల్ల గుర్తొచ్చింది. ప్రపంచ నెంబర్ వన్ టెన్నీస్ క్రీడాకారిణి అయిన 'స్టెఫీగ్రాఫ్' ని ఆ చిన్నపిల్ల ఓడించి అగ్రపథానికి దూసుకుపోతున్న తరుణంలో, స్టెఫీగ్రాఫ్ అభిమాని అయిన ఒక యువకుడు తన ప్రియతమ క్రీడాకారిణి ఒక చిన్నపిల్ల ముందు ఓడిపోవటం సహించలేక ఆటస్థలంలోకి వురికి మోనికా సెలెస్ ని ఈ విధంగానే అందరిముందు కత్తితో పొడిచి ఆమెని ఆటకు దూరం చేసినప్పుడు..... ఆమె ఇలాగే బాధపడి వుంటుందా? ఒక చిన్న గాయం వలన మిలియన్ల డబ్బు నష్టం! అయినా అక్కడ డబ్బు కాదు. తను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన దాన్నుంచి శాశ్వంతంగా దూరమై పోవాల్సి రావటం.....
హృదయంనిండా కన్నీళ్ళు నింపుకుని......అవి బయటకు రాకుండా.....తన మీద నిశ్శబ్దం ఒంపుకుని.....అతడు కర్మయోగి అయ్యాడు..... శతసహస్రవర్షాలుగా పచ్చదనాన్ని నింపుకున్న భూమాతని ఒక విధి వైపరీత్యం లావా రూపంలో కబళించి వేస్తే మౌనంగా రోదించే ప్రకృతిలా విచలితుడయ్యాడు.
క్షణం సేపే. క్షణంలో మామూలు మనిషై..... అదే చిరునవ్వుతో. "పోనీ లెండి డాక్టర్, కుడిచేత్తో 'సర్వ్' చేయలేకపోతే ఎడమచేత్తో నేర్చుకుంటాను" అన్నాడు. అది సాధ్యం కాదనీ, సాధ్యమయినా దేశస్థాయిలో తిరిగి స్థానం సంపాదించటం అసాధ్యమనీ అక్కడ అందరికీ తెలుసు.
తమ వ్యధకి నిశ్శబ్దాన్ని భాగస్వామిని చేసి, అందరూ స్థబ్దులై వున్న తరుణంలో ..... ఆ మౌనాన్ని భగ్నం చేస్తూ మధూహ అక్కడికి ప్రవేశించింది. వస్తూనే విప్పారిన మొహంతో, "గుడ్ న్యూస్ ప్రహసిత్, మీమీద మంత్రిగారు కేసు ఉపసంహరించుకున్నారు" అంది ఆనందంగా.
అక్కడ ఎవరూ మాట్లాడలేదు.
"ఏమిటందరూ ఇంత మౌనంగా వున్నారు? ఇంతకన్నా సంతోషకరమైన వార్తా వుంటుందా? అఫ్కోర్స్ బాడీగార్డ్ చేసిన తప్పుని మనం ఎత్తి చూపాము కదా. అదీగాక తనని కొట్టింది నేషనల్ చాంపియన్ అని కూడా ఆయనకి తెలిసింది. అందువల్ల కేసు విత్ డ్రా చేసుకుని వుంటారు" అంది.
దానికీ ఎవరూ సమాధానం చెప్పలేదు.
"ఏమిటీ? ఈ వార్త మీకు ముందే తెలుసా? తెలిసీ నన్ను పూల్ ని చేస్తున్నారా?"
"ప్రహసిత్ గారు ఇక టెన్నీస్ కి పనికిరారు......" ఒక జర్నలిస్ట్ నెమ్మదిగా అన్నాడు. ఆమెకు మొదట అర్థం కాలేదు. అతడివైపు అయోమయంగా చూసింది. జరిగినదంతా ఎవరో చెప్పారు. ఆమె కట్రాట అయింది. ప్రహసిత్ వైపు బ్లాంక్ గా చూసింది.
ఒక్కొక్కసారి మనం చేసిన చిన్నపని..... మన జీవితం మీద ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. మన భవిష్యత్ ని సమూలంగా నాశనం చేస్తుంది. పేకమేడల్లా కూల్చేస్తుంది. ఆ పని ఎందుకు చేసామా అని జీవితాంతం కుమిలిపోయేలా చేస్తుంది. అయితే అతను అలా లేడు. పరిపూర్ణమైన ప్రేమకు పరాకాష్ఠలా వున్నాడు. నాది తొలిచూపు ప్రేమ కాదన్నట్టు సగర్వంగా రెపరెపలాడుతున్న కేతనంలా వున్నాడు. ప్రేమ పరివేస్ఠాడై ఎవరో కవి అన్నట్టు.....
"నీ రాజసానికవి......నీరాజనాలు" అన్నట్టున్నాడు.
5
లక్ష్మికి ఆ రోజు చాలా డల్ గా అనిపించింది. ఇంటికి రాగానే అలాగే పక్కమీద నిస్త్రాణగా చాలాసేపు పడుకుని వుండిపోయింది. బాగా బలహీనంగా తోచింది. అది శారీరకమైన అలసటే కాకుండా మానసికమైన అలసట కూడా!
ఆ రోజు డాక్టర్ విశాల్ క్లినిక్ లో ఆమెకి డి అండ్ సి ఆపరేషన్ జరిగింది. అంతక్రితం కలసినప్పుడు 13... 14... 15రోజుల్లో రమ్మన్నారు. ఆ తేదీ లెక్కపెట్టుకుని వెళ్ళింది. ఆపరేషన్ అనేసరికి భయపడింది. కానీ ఆమె భయపడినంతగా ఏమీ అనలేదు. అంతా నిముషాల్లో జరిగిపోయింది.
లోకల్ అనెస్తీషియా కూడా ఇవ్వలేదు. వజీనా దగ్గర ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ పూర్తి చేసారు.
ఆమె ఇంటికొచ్చిన అరగంటకి బయట కాలింగ్ బెల్ మ్రోగింది. తలుపుతీస్తే ఎదురుగా మధూహ! ఆమెని చూడగానే లక్ష్మి మొహం విప్పారింది. "రా...." సాదరంగా ఆహ్వానించింది.
"అలా వున్నావేం?"
"ప్రొద్దున్నే డి అండ్ సీ అయింది"
"అలాగా" అంది మధూహ సోఫాలో కూర్చుంటూ. "విష్ణురాలేదా?"
"ఆయన కాంప్ కి వెళ్ళాడు" అబద్ధం చెప్పింది. చాలామంది ఆడవాళ్ళలాగే లక్ష్మికూడా భర్త నిరాసక్తని బయటకు చెప్పుకోదు. తమిది ఆదర్శదాంపత్యంలాగే ప్రాజెక్ట్ చేస్తుంది. మధూహ దృష్టిలో విష్ణు.... లక్ష్మిలది అన్యోన్య దాంపత్యం.
"ఆపరేషన్ ఎక్కడ చేసారు?"
"డాక్టర్ విశాల్ క్లినిక్ లో"
మధూహ భృకుటి ముడిపడింది. ఎందుకో ఆమెకి ఆ పేరు వినగానే ఏదో అపశృతిలా తోస్తుంది. దానికి తర్కంలేదు. రాజు ఆ క్లినిక్ తో అసోసియేట్ అయ్యాడు కాబట్టి.... రాజు హిప్నాటిజం పేరుమీద చేస్తున్నా మోసం తెలుసు కాబట్టి..... ఆ అనుమానం తనకి వచ్చి వుంటుంది..... అనుకుంది. నిజానికి డాక్టర్ విశాల్ క్లినిక్ లో ఏ మోసమూ లేకపోయి వుండవచ్చు. అతడు ఎం.బి.బి. ఎస్ డాక్టర్ కదా!