Previous Page Next Page 
13... 14.... 15 పేజి 18

    ఆమె స్థబ్దురాలైంది. తను అనుకున్నట్టు అతడు నిత్యశంకితుడు కాదు. అవతల వారికోసం వారి కోణం లోంచి ఆలోచించే వాడు! అభిప్రాయాలు ఎంత చిత్రమైనవి. క్షణాల్లో మారుతూ వుంటాయి. వాటికి సహేతుకమైన విలువలేదు.

    అతడు మాటమీద నిలబడతాడని తెలుసు. ముగింపు చెప్పలేని కథలకి మలుపులుండవు. అందుకే అది కథ అయింది. జీవితంలో అలా కాదు. కథకన్నా జీవితంలోనే ఎక్కువ డ్రామా వుంటుంది. అందుకే రచయిత తిప్పలేని మలుపుల్ని 'విధి' మరింత అద్భుతంగా తిప్పుతుంది.


                                        3


    "హల్లో"

    కారు పక్కగా వచ్చి ఆగి అందులో యువకుడు పలకరించగానే ముందు ఉలిక్కిపడి తలతిప్పి చూసింది మధూహ.

    "మీరా" అంది.

    "ఎటువెళ్తున్నారు?"

    "పరిషత్ హాల్ కి ఏదో సభ వుంది అయిందింటికి. ఇప్పుడు నాలుగే కదా అయింది. ;లైబ్రరీకి వెళ్ళి ఓ అరగంట గడిపి, అట్నుంచి సభకి వెళ్దామను కుంటున్నాను" మరో నాలుగు ప్రశ్నలకి అవకాశం ఇవ్వకుండా చెప్పింది.

    "పదండి. నేనూ వస్తాను నాకు పనేం లేదు."

    మామూలు వ్యక్తి ఎవరయినా అలా అడిగివుంటే అమ్మాయితో పరిచయం పెంచుకోవటానికి అది మగవాడి మొదటి అస్త్రం అని నిర్ద్వందంగా తిరస్కరించేదే. కానీ  అడుగుతున్నది ప్రహసిత్ కాబట్టి అతని నిజాయితీ తెలుసు కాబట్టి ఏమీ ఆలోచించకుండా వచ్చి కారెక్కింది.

    "మీరిలాటి సాహితీ సమావేశాలకు వెళ్తారా! ఏమిటి టాపిక్" అడిగాడు.

    "నా మొహం! టాపిక్ - ఆధునిక సాహిత్యం. వక్త టాపిక్" అడిగాడు.

    "నా మొహం! టాపిక్ -ఆధునిక సాహిత్యం. వక్త పాడిపరిశ్రమ మంత్రి ఆంజనేయులు. ఆయన చెప్పింది విని ఏవో నాలుగు లైన్లు వార్తగా వ్రాస్తే పత్రికవాళ్ళు డబ్బులిస్తారు. అంతే తప్ప ఆ ఆంజనేయులికీ, ఆధునిక సాహిత్యానికీ ఏం సంబంధం వుందో దానికి మాలాటి జర్నలిస్టులు ఎందుకు వెళ్ళాలో అర్థంకాదు మాకెవరికీ చెప్పాగా నాలుగు లైన్లు వ్రాస్తే పత్రికవాళ్ళు డబ్బులిస్తారని....." 

    కారు లైబ్రరీ బయట  కాంపౌండ్ లో ఆపుచేసి ఇద్దరూ లోపలి వెళ్తుండగా "మీరిలా తిరిగితే ఎవరూ గుర్తుపట్టరా" అని అడిగింది. ప్రహిసిత్ నవ్వాడు.

    "భారతదేశంలో టెన్నీస్ కి అంత ప్రాముఖ్యత లేదు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అస్సల్లేదు."

    పైకి అలా సంభాషిస్తోందేకానీ ఆమె మనసులో అనుమానం కొట్టుకుంటూనే వుంది. అడగాలంటే మొహమాటం వేస్తోంది. ఈ లోపులో అతడు లైబ్రరీలో అడవి బాపిరాజు పుస్తకం తీయటం చూసి "మీకు ఇలాటి ఇంటరెస్టు కూడా వుందా....."అని అడిగింది. "సాధారణంగా ఆటగాళ్ళకీ సాహిత్యానికీ చుక్కెదురు"

    "కొద్దిగా ప్రవేశం వుంది. తెలుగువాడిని కదా" నవ్వేడు. "...... మా తండ్రిగారు చిన్న సైజు రచయిత."

    ఆమె అరగంట క్రితం తనకొచ్చిన అనుమానానికి సిగ్గుపడింది. తలవొంచుకుని తనలో తనే చిన్నగా నవ్వుకోవడం చూసి, "ఎందుకు మీలో మీరు నవ్వుకుంటున్నారు?" అడిగాడు.

    "ఏమీ లేదు"

    "నేనేమైనా తప్పు మాట్లాడానా?"

    ఆమె కంగారుపడి "అబ్బెబ్బె అలాటిదేమీ లేదు" అంది.

    "బాయ్ ప్రెండ్ జికు ఏదైనా గుర్తొచ్చిందా?"

    "ప్రస్తుతం నాకు ఎవరూ అలాటి ఫ్రెండ్స్ లేరు"

    "మరి?" అతడు  ఆ టాపిక్ వదిలేలా కనపడకపోవడంతో ఆమె ఇబ్బందిగా "ఏం చెప్పమంటారు? మనం మనసులో అనుకునే ప్రతీదీ అవతలి వారికి చెప్తే అది వినటానికి బావోదు" అంది.

    "నిజమే. బావోదు. కానీ పక్కవారు ఏదో  మాట్లాడుతూండగా మనలో మనమే నువ్వుకుంటే.....అదీ బావోదు. కొంతమంది మాట్లాడుతూ.....మాట్లాడుతూ "అన్నట్టూ ఓ విషయం...." అంటూ ఏదో చెప్పబోయి మళ్ళీ మనసు మార్చుకున్నట్టు. "వద్దులే" అని ఆగిపోతారు. అవతలివారికి అది ఎంత బాధకలిగిస్తుందో ఆలోచించరు. దానికన్నా చెప్పెయ్యటమే మంచిది కదా!"

    "సరే చెప్తాలెండి. తరువాత నన్ను బ్లేమ్ చేయకండి" అని చెప్పసాగింది. "నేను లైబ్రరీకి వెళ్తున్నాననగానే మీరూ వస్తానన్నారు కదా! అప్పటికి మీకు సాహిత్యంతో పరిచయం వుందని తెలీదు. కేవలం నాతో పరిచయం పెంచుకోవటం కోసం అలా అన్నారేమో అనుకున్నాను. ఇప్పుడు మీరు మీ విషయం చెప్పేసరికి.....మనం ఎంత తొందరగా అవతలి వారిని అపార్థం చేసుకుంటామా అని సిగ్గుపడ్డాను."

    పూర్తిగా చెప్పి అతడివైపు చూసింది. పళ్ళు రెండూ బిగించి పట్టుకున్నట్టు ఎంతో ఆవేశాన్ని ఆపుకుంటున్నట్టు అతడి మోహంలో తీవ్రత కనపడేసరికి ఆమె భయపడింది. నొచ్చుకుంటున్నట్టు "సారీ అందుకే చెప్పనన్నాను" అంది.

    "దానిక్కాదు....." ఆవేశంగా ఇరిటేటింగ్ అన్నాడు. "దానిక్కాదు....." మళ్ళీ తనలో తానే గొణుక్కున్నాడు.

    ఆమె ఆశ్చర్యంగా "మరి?" అంది. అప్పటికి అతడి ఉద్విగ్నత తగ్గింది. ".....నేను లక్ష్మిగారి నా ప్రేమ గురించి చాలా వివరంగా మీకు చెప్పాను. అయినా నా పట్ల మీకు అనుమానం కలిగిందంటే..... నా ప్రేమలోనే ఏదో లోటు వున్నదన్నమాట."

    ఆమె బాధపడి, "అబ్బే నా వుద్దేశ్యం అది కాదు" అంటూ ఏదో చెప్పబోయింది.

    "నేను మీ వుద్దేశ్యం గురించి అనటం లేదు. నాలో నేనే తర్కించుకుంటున్నాను. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు అసలు మరోమనిషి ఊహల్లోకి కూడా  రాదే. చూపులో కూడా వెంట్రుక వాసి తేడా వుండదే. మరి మీకా అనుమానం ఎలా వచ్చిందీ? అందులోనూ నేను 'ఆమె' గురించి అంతా చెప్పాక కూడా ఆ  అనుమానం వచ్చిందంటే నా ప్రేమలోనే సిన్సియారిటీ లేదన్నమాట. అలా జరగక్కూడదే...... ఎక్కడో ఏదో....ఏదో" అతడి కంఠం క్రమంగా చిన్నదైపోయింది. తనలో తనే మాట్లాడుకుంటున్నాడు.

    మదూహకి ఒకటి మాత్రం అర్థమైంది. తనో గొప్ప ప్రేమికుడినైనా చూస్తూ వుండి వుండాలి. లేదా....వయసు పెరిగినా ఇన్ ఫాక్చుయేషన్ వదలని పిచ్చివాడినైనా చూస్తూ వుండి వుండాలి. ఆమెకెందుకో మొదటిదే నిజమనిపించింది. అదొక అద్భుతం..... ఈ కాలంలో అంత సిన్సియర్ గా ప్రేమించగల్గడం.... అందులోనూ ఆమెకి తన ప్రేమికుడి వాళ్ళ కలిగిన చేదు అనుభవం ఇంకా ఫ్రెష్ గానే  వుండటంతో, ప్రహసిత్ వ్యక్తిత్వం వేయిరెట్లు పెరిగిపోయినట్లు అనిపించింది. ఈ మెకానికల్ ప్రపంచంలో, ఒకరిమీద ఒకరికి నమ్మకం తగ్గిపోతున్న ఈ రోజుల్లో.... ప్రేమపట్ల ఇంత నమ్మకాన్ని పెంచుకున్న వ్యక్తులు ఇంకా ఉండటం అబ్బురమే అనుకుంది. మామూలు నమ్మకం కాదు. అవతలి వాళ్ళకి 'పిచ్చి' అనిపించేటంత నమ్మకం.

    అతడింకా మూడీగా వుండటం చూసి, సంభాషణ మార్చవలసిన అవసరం తనమీదే వున్నట్టు గ్రహించింది. అంతలో అంతక్రితం వరకూ తనని వేధించిన అనుమానం గుర్తొచ్చింది. రెండుకార్యాలూ ఒకే ప్రశ్న ద్వారా నెరవేరేట్టూ ఆ ప్రశ్న అడిగింది.

    "అన్నట్టు....మీరు ఇంతగా ప్రేమిస్తున్న ఆ లక్ష్మీ -నేను ఫోన్ నేమబార్  ఇచ్చిన రచయిత్రి లక్ష్మీ ఒకరేనా?"

    కాదని ఆమెకు తెలుసు. తనిచ్చిన నెంబరు తన స్నేహితురాలిదనీ రచయిత్రిది కాదనీ తెలుసు.

    "అవును" అనబోయాడు అతను. చివరి నిముషంలో......నాలుక చివరి వరకూ వచ్చిన మాటని ఆపుచేశాడు. తన ప్రియురాలు వివాహిత. పైగా రచయిత్రి. తమ మధ్య జరిగిన విషయం బయటకు రావడం అనవసరం. తను ఆమెను ప్రేమించాడే తప్ప ఆమె ప్రేమించలేదు. అటువంటప్పుడు ఇక ఈ విషయాలన్నీ బయటకి రావడం ఎందుకు? ఆ వుద్దేశ్యంతో అతడు "కాదు" అన్నాడు.

    ఆమె అంది. "సారీ అండీ. అనవసరంగా ఆ రచయిత్రి ఫోన్ నెంబర్ ఇచ్చాను. మీరడగ్గానే ఏమన్నది ఏమిటి?" తెలియనట్టు అడిగింది. తన స్నేహితురాలికి తను ఫోన్ చేసి చెప్పిన విషయం గుర్తు తెచ్చుకుంటూ.

    "ఇక వదిలేసెయ్యండి ఆ విషయం" అన్నాడు.

    కారు పరిషత్ హాల్ ముందు ఆగింది. అప్పటికే సభ ప్రారంభమయ్యింది. అధ్యక్షులు మంత్రివర్యులు! ప్రధాన వక్త.... ఒక విప్లవ మాజీ రచయిత్రి, సాహిత్య అకాడమీ ఆవార్డు విజేత, విమర్శకురాలు. ఆమె మాట్లాడుతోంది.

    "ప్రస్తుతం సాహిత్యం పెడద్రోవ పడుతోంది. మేము వ్రాసే రోజుల్లో ఈ  విశృంఖలత్వం లేదు. సెక్సు వయొలెన్సు. సస్పెన్సు మాత్రమే చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజుల్లో యువత పెడత్రోవ పడుతూందంటే దానికి కారణం ఈ సాహిత్యమే. అంతగా డబ్బే కావాలనుకుంటే ఈ రచయితలూ, ప్రస్తుత రచయిత్రులూ రచనలు మానేసి వ్యభిచార వ్యాపారం పెట్టుకోవచ్చు...."

    సభలో ఈలలూ,చప్పట్లు, దాంతో ఆమె మరి కొంచెం విజృంభించింది.

    'ఇటీవల ఓ పత్రికలో వస్తూన్న సీరియల్ ఒక వారం చదవడం తటస్థంచింది. సీరియల్ మొత్తం చదవలేదు. ఒక వారం చదివాను. అదీ సీరియల్ కాదు జరిగిన కథ చదవటానికే చాలా ఓపిక తెచ్చుకోవాల్సి వచ్చింది.'

    మళ్ళీ సభలో చప్పట్లు గోల.

    "ఒక రచయిత్రి వ్రాసిన నవల ఇది. భర్త ఆమెనసలు పట్టించుకోకపోతే వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకున్నా ఫరవాలేదని వ్రాసింది. ఇదీ మన దౌర్భాగ్యం."

    వింటూన్న మధూహ ఉలిక్కిపడింది. ప్రహసిత్ మొహం కందగడ్డలా మారింది. మారుతూన్న అతడి ముఖకవళికల్ని ఆమె గమనించలేదు. ఈ లోపులో ఉపన్యాసకురాలు కొనసాగించింది. "ఆడవాళ్ళని పెడత్రోవ పట్టిస్తున్న ఈ రచయిత్రికి వివాహం జరిగిందో లేక ఏదైనా చింతపండు వ్యాపారం చేస్తోందో...."?

    సభ మార్మోగేలా చప్పట్లు.

    ఆ తరువాత మంత్రి ఆంజనేయులుగారి ఉపన్యాసం మొదలైంది. "పూర్వం తక్కువ కులమోల్లని వూరి బయట వుంచేవోరు. గాంధీగారి పున్నెమా అని అందరం కలిసిపోయాం. ఇప్పుడు ఒక కులమాల్లని ఊరిబయటకు తోసేయ్యల్సిన రోజొచ్చింది. 'రచయితల' కులాన్ని..."

    అందరూ నవ్వేరు.

    ".....మొగుడు బాధపెడితే బైటకెళ్ళి తిరగమని ఓ రచయిత్రి సలహా ఇస్తోందట. ఆడాల్లందరూ సిగ్గుపడాల్సిన ఇసయం ఇది. మరి ఆవిడ మొగుడు ఎట్లా వూరుకున్నాడో దీనికి....'

    సభలో కేరింతలు. ఆ ప్రజావెల్లువ (?)ని చూసి మంత్రి మరింత ఉత్సాహపడ్డాడు. ".....మేం చదువుకునే రోజుల్లో పుస్తకాలు ఇట్ల వచ్చేవి కాదు. దాచుకుని దాచుకుని సదవాల్సి వస్తుంది......నీలిచిత్రాల క్యాసెట్లు దాచుకున్నట్టు....."

    ప్రహసిత్ కుర్చీలోంచి లేచాడు. మధూహ గమనించలేదు.

    "అడాళ్లు కూడా ఇట్ట రాసేస్తున్నారంటే అల్ల మనసులో కోరికల్ని బయట పెట్టేసుకుంటున్నారన్నమాట. ఆ లక్ష్మి ఎవరో ఈ వయసులో నాకే సూడాలనిపిస్తుంటే ఇక యువకుల మాటేమిటి?" సభలో విజిల్స్.

    ప్రహసిత్ స్టేజి మెట్లేక్కాడు.

    ముందు చూసింది మంత్రి ఆంజనేయులు. ఎవరో యువకుడు తన ఉపన్యాసానికి ఉత్తేజం చెంది షేక్ హాండ్ ఇవ్వటం కోసం వస్తున్నాడనుకున్నాడు.

 Previous Page Next Page