ఆలోచన్లని పక్కకి పెడుతూ "మా పత్రిక చదువుతున్నావా?" అని అడిగింది.
"చదువుతున్నాను ఏం?"
"అందులో లక్ష్మి అనే రచయిత్రి వ్రాస్తున్న సీరియల్ మీద పెద్ద సంచలనం రేగుతోంది. పేపర్లు చదవటం లేదూ?"
"నాకు డైలీలు చదివే అలవాటు లేదు. ఏమైంది?" అనుమానంగా అడిగింది.
"ప్రహసిత్ అని ఒక టెన్నీస్ ప్లేయర్ గురించి నీకు చెప్పాను గుర్తుందా. ఏదో ఒక ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వచ్చి, నీ నెంబర్ ఇచ్చానని కూడా చెప్పాను"
లక్ష్మి గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. మనసులో సంచలనాన్ని అతి కష్టమీద అణుచుకుంటూ"....ఏం జరిగింది?" అని అడిగింది.
"ఆ ప్రహసిత్ చాలా గాఢమైన ప్రేమికుడిలా వున్నాడు. అతడిని చూస్తే నాకు ఈర్ష్యగా వుంది కూడా....."
"ఏ.....మైం.....ది?" లక్ష్మి కంఠం కీచుగా ధ్వనించింది. మధూహ పట్టించుకోలేదు. తన ధోరణిలో చెప్పుకుపోసాగింది.
"మొన్న ఒక సభకి వెళ్ళాన్లే. అక్కడో మంత్రి మా సీరియల్ గురించి అవాకులూ చవాకులూ పేలాడు. ఆ రచయిత్రి లక్ష్మి గురించి కూడా ఏదో అవాకులూ చవాకులూ పేలాడు. ఆ రచయిత్రి లక్ష్మి గురించి కూడా ఏదో అసభ్యంగా మాట్లాడేసరికి ప్రహసిత్ వేదిక ఎక్కిఅందరిముందూ ఆ మంత్రి మూతి పగలగొట్టాడు. ప్రేమంటే అలాగే వుండాలనుకో. కానీ ఈ మగాళ్ళలో ఎంతమందికి అంత ధైర్యం వుంటుంది చెప్పు. తన గర్ల్ ఫ్రెండ్ గురించి ఎవరైనా జోకు వేసినా , తామూ అందులో కలిసిపోయి జోకు వెయ్యటమేగా వారికి తెలిసిన విద్య! ప్రహిసిత్ అలాకాదు. ఆ క్షణం అతన్ని చూడాలి. నాకు భలే ముచ్చటేసిందిలే. ఆ లక్ష్మి ఎవరోగానీ చాలా అదృష్టవంతురాలు. జీవితంలో అలాటి ఫ్రెండ్ ఒక్కడుంటే చాలు. ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదూ. పాపం ప్రహసిత్ ఆ మంత్రిని కొట్టి వేదిక దిగుతుంటే వెనుకనుంచి బాడీగార్డు బోయినెట్ తో పొడిచాడు. ఇక అతడు జీతాంతం టెన్నీస్ కి పనికిరాడట. చాలా దురదృష్టం కదూ. నిన్న ఆస్పత్రికి వెళ్ళాను. ఆ ప్రహసిత్ మొహంలో అసలు దిగుల్లేదు. అదే ఆశ్చర్యం. మైగాడ్. అసలు ప్రేమంటే ఇలా వుంటుందా అనిపించింది. ఎక్కడో కథల్లో చదవటమే కానీ ప్రత్యక్షంగా చూడలేదు. ఆ లక్ష్మి ఎవరోగాని ఆజ్ఞాతం నుంచి బయటబడితే బావుణ్ణు. తనని ఇంతగా ప్రేమించే వ్యక్తి......"
ఏడుపు వినపడటంతో మధూహ ఆగింది.
లక్ష్మి వెక్కి వెక్కి ఏడుస్తోంది.
మధూహ ఆశ్చర్యంగా 'లక్ష్మీ' అంది.
ఒక ఆగలేనట్టు లక్ష్మి బరస్ట్ అవుతూ, "నేనే.....నేనే" అంది. మొదట మధూహకి అర్థం కాలేదు. క్రమక్రమంగా మబ్బులు విడిపోతున్నట్టు...... 'నువ్వు.....?' అంది.
"అవును. ఆ నవల వ్రాస్తోంది నేనే. అతన్ని కలిసాను కూడా. మళ్ళీ కలవొద్దని చెప్పాను నువ్విచ్చిన నా ఫోన్ నెంబర్ కరెక్టే. కానీ.....కానీ ఎలా? నువ్వే చెప్పు, నేను వివాహితురాల్ని, నైతిక విలువలంటూ కొన్ని వుంటాయి కదా. నన్నింతగా ప్రేమించే భర్తని కాదని అతన్ని ఎలా స్వీకరించను? నా మనస్సు అందుకు ఎలా అంగీకరిస్తుంది? అంతా అతనికి చెప్పేసేను. అతను వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ ఇలా జరిగిందంటే..... అయ్యో.....నేనేం చెయ్యను. నేను చచ్చిపోవాలి. ఇక అదొక్కటే పరిష్కారం. "వాక్యానికి వాక్యానికీ పొంతనలేకుండానే చెప్పుకుపోతోంది.
మధూహ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు.
నాలుగో అధ్యాయం
"నడుస్తూ, నిలబడుతూ, పనిచేస్తూ, మౌనాన్ని అస్వాదిస్తూ....
కదిలినప్పుడు, కదలనప్పుడు, కదలాలనిపించినప్పుడు...
నిద్రపోయేముందు, లేవబోయేముందు....
ప్రతి ఆలోచన ముందూ, వెనకా,....లోనూ
ఎప్పుడూ నువ్వు నాకు తల్లిలా తండ్రిలా
నీ కౌగిలిలో నేను పొత్తిళ్ళలో పాపలా
.....ఇద్దరం ఒకటై.... ముగ్గురుగా విడిపోయి
కలసి కుటుంబమై...."
చదువుతూన్న మధూహ పుస్తకం అలాగే వళ్లో వుంచుకుని వెనక్కివాలి కళ్ళు మూసుకుంది. లక్ష్మివ్రాసిన సీరియల్ అది.
తెలియనప్పుడు చదవటం వేరు. రచయిత్రి ఎవరో తెలిసిన తరువాత చదవటం వేరు. అందులోనూ తన స్నేహితురాలు వ్రాసిందని తెలిసాక మరీ ఎగ్జయిటింగ్ గా వుంది.
పై వాక్యాలు మళ్ళీ చదివింది. మనసు ఆర్ద్రమయింది. 'ఎప్పుడూ నువ్వు నాకు తల్లిలా తండ్రిలా.....నేను నీ పొత్తిళ్ళలో పాపలా.....' అట! విష్ణు ఎంత అదృష్టవంతుడు అనుకుంది. లక్ష్మిలాటి భార్యని పొందే అదృష్టం ఎందరికి లభిస్తుంది? ఎంత అన్యోన్య దాంపత్యం అది! కానీ ఒకటే లోటు....పిల్లలు లేకపోవటం. 'ఇద్దరం కలిసి.....ముగ్గురుగా విడిపోయి...కలిసి.....కుటుంబమై.....'ఎంత మంచి భావం!
'భగవంతుడా!' ఆమె మనస్ఫూర్తిగా అనుకుంది. 'ఏదైనా చేసి, నా స్నేహితురాలి కడుపు పండేలా చూడు'
ఆలోచనల నుంచి తెప్పరిల్లి ఆమె తిరిగి చదవటం ప్రారంభించింది.
"వర్షం కురవకుండానే మేఘం వెళ్ళిపోతుందేమోనని,
స్వప్నం రాకుండానే నిదుర చెదిరి పోతుందేమోనని
మాటమాత్రం చెప్పకుండా నువ్వు మాయమైపోతావని....."
మధూహకి ప్రహసిత్ గుర్తొచ్చాడు. అంతలోనే మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. లక్ష్మీ ఈ నవల.....ప్రహసిత్ తో పరిచయం కాకముందు వ్రాసిందని.....తిరిగి ఆమె చూపు అక్షరాల వెంట పరుగెత్తింది.
"నువ్వు లేనప్పుడు
నేనూ, దిగులు మబ్బూ, రెల్లుగడ్డి
స్నేహితులమవుతాం.
నువ్వులేనప్పుడు రాత్రిళ్ళు
నీ జ్ఞాపకాల వడగళ్ళు.
పగళ్ళు గ్రీ.....ష్మంలో చలినెగళ్ళు.
ఆర్కమిడిస్ కేం తెలుసు? నీటిలో వస్తువు బరువెంత కోల్పోతుందో.
నన్నడుగుతే చెప్పేదాన్ని.....ప్రేమిస్తే పెరిగే హృదయం బరువు గురించి.
ఐన్ స్టీన్ కేం తెలుసు సాపేక్ష సిద్ధాంతం?
మనల్ని చూస్తే అతడికి తెలిసేది కాలమసలు పయనించదని.
ఆకర్షణ. శక్తి గురించి తెలియాలంటే ఆపిల్ పండే కావాలా?
న్యూటన్ ఒకసారి మనకేసి చూసుంటే తెలిసేది.
భూమికి లేని ఆకర్షణ.....మనిద్దరి మధ్యా వుందని.
ఏమిటింత వెల్తిగావుంది? ఆకాశం నిర్మలంగానే వుందే. నక్షత్రాలూ మేఘాలు కూడా మామూలే. కిటికీ అవతల మాలతీ తీవె కూడా అలానే వుంది. గదిలో మూల అగరొత్తి మామూలుగా వెలుగుతూనే వుంది. ఇక వెలితి ఎక్కడ చెప్మా?
అవును కదూ!
నువ్వు ప్రొద్దున్నించీ ఫోన్ చేయలేదు.
ఒరె ఇడియెట్! నేను నీ మనసు ముంగిట్లో ఓ మంచు ముత్యాన్ని! నీ గుండెగది పుస్తకాల రాక్ లో ఒద్దికైన పుస్తకాన్ని. నువ్వు తాకినంతనే ప్రాణం పోసుకున్న ఓ ప్రేమాక్షరాన్ని.
నీ స్ఫూర్తితో నన్ను నేను మలచుకుంటూన్న నా జీవితపు శ్రీకారన్ని! అనుక్షణం నీ పరిమళంతో రవళిస్తోన్న నిశ్శబ్ద ఓంకారాన్ని.
నా శబ్దాన్ని నీకిచ్చి, నీ నిశ్శబ్దాన్ని నేను తీసుకోనా? నా ఆనందాన్ని నీకిచ్చి నీ విషాదాన్ని నే తీసుకోనా?
చెప్పు
ఇంతకంటే ఆర్థ్రంగా నా ప్రేమనెలా బహిర్గతం చేయగలను?
ఒకే కొమ్మకు విచ్చుకున్నట్టు రెండుగా-
ఒకే దారానికి గుచ్చినట్టు ఒకటిగా-
ఒకే పిడికిలిలో పాచికలుగా, పడేటప్పుడు కూడా జంటగా.
సాయంత్రం కంటికి - చీకటి కాటుకపెట్టి, రాత్రి చీకటికి- ఉషాన్సు చీరె కట్టి సూర్యోదయానికి అహరాహ్నబొట్టెట్టి.....ఎన్ని సంధ్యలు ఎన్ని రాత్రులు.....
సమయం కాళ్ళు నా ముందు నుంచి నిర్దాక్షిణలూ ఈ డిస్సపాయింట్ మెంట్లూ ప్రేమించటం....ఎదురుచూడటం....ఇక నా వల్ల కాదు. అలా చూడకు. ఇంకా నే చెప్పాలనుకున్నది పూర్తవలేదు. అరె.....దగ్గరకు రాకు. దగ్గిరకురాకంటే వినవేం. సర్లె.....సర్లె. ఇదేం కొత్త? ఇలా ఎన్నిసార్లనుకోలేదు. సర్లేకానీ.....లైటార్పెయ్యకూడదూ.
నువ్వెళ్ళిపోయాక.....
బాత్ రూమ్ బోల్టేసి.....బకెట్ నిండా నీళ్ళుపోసి....
గోరువెచ్చగా వున్నాయా అని వేలుకాస్త పెట్టి చూసి.....
గోరుక్కాస్త వెచ్చగా..... అది నీ స్పర్శలా తోచి
నన్ను నేను చూసుకుని, ఒక్కసారిగా సిగ్గేసి....."
......మధూహ పెదవుల మీద నవ్వు కదలాడింది. లక్ష్మేనా ఇది వ్రాసింది? తన స్నేహితురాలు లక్ష్మేనా?
ఆమె ఇక ఆపుకోలేకపోయింది. వెంటనే అభినందించాలనుకుంది. ఫోన్ చేసింది.
అట్నుంచి ఎంగేజ్డ్ వచ్చింది. పావుగంట ఆగి మళ్ళీ చేసింది. అప్పుడు కూడా ఎంగేజ్డే!
ఇంతసేపు ఎవరితో మాట్లాడుతూందో అర్థం కాలేదు.
ప్రహసిత్ తోనా?
ప్రహసిత్ కి ఫోన్ చేసి, ఆ ఫోన్ కూడా 'ఎంగేజ్డ్' లో వుందేమో చూద్దామనుకుంది. సభ్యత కాదని వూరుకుంది.
నిజానికి లక్ష్మి ఆ టైమ్ లో ఫోన్ లో మాట్లాడటం లేదు. డిస్టర్బెన్స్ లేకుండా రిసీవర్ తీసి పక్కనపెట్టి వ్రాసుకుంటోంది. నవల కాదు. ఉత్తరం.
తన భర్తకి.
2
ప్రియమైన మీకు,
ఈ రాత్రి నేను గోడల్ని బ్రద్ధలు కొట్టదల్చుకున్నాను.
నడకలేని బాటలో పిచ్చి చెట్లు మొలిచి క్రమంగా అదొక అడవిలా మారినట్టు, మనిద్దరి మధ్యా పెరిగిన ఈ నిశ్శబ్దారణ్యం కాకులు దూరని అడవిగా మారి ఒకర్కొకరు చేరుకోకుండా చేస్తోంది!
మిమ్మల్ని తెలుసుకునే ప్రయత్నంలో నన్ను నేను పోగొట్టుకొన్నాను కొన్నాళ్ళు. నన్ను నేను తెలుసుకునే ప్రయత్నంలో మిమ్మల్ని పోగొట్టుకొన్నాననుకున్నాను మరి కొన్నాళ్ళు. నా తప్పులేమిటో నేను మిమ్మల్ని చేరుకోవాలంటే ఏం చేయాలో చెప్తే నా వంతు కృషి నేను చేస్తాను. విష్ణూ, ఐ స్టిల్ లవ్యూ.