"సార్ ఏమైంది....." అడిగాడు మధు.
"ఒప్పుకోనన్నాడు, ఆ పొరపాటు తనది కాదన్నాడు."
పక్కలో బాంబు పడ్డట్టుగా అదిరిపడ్డాడు మధు. సందేహిస్తున్నట్లు గానే అయిందన్నమాట.
"మనకి తెలియకుండా ఆ పొరపాటు జరిగిందని ఒప్పుకోలేదా సార్?"
"ఆ ఫైల్ తన దగ్గరికి వచ్చినప్పుడు అందులో తరంగిణి పోటోలే వున్నాయన్నాడు. పైపెచ్చు అప్పుడే రెండు రోజులయింది. ఇంకా 28 రోజులే వుందన్నాడు. ఈ పిరీడ్ లో ఒప్పుకున్న వర్క్ పూర్తి చేసివ్వాలన్నాడు. అదీ తరంగిణితోనే, అది జరగకపోతే కోర్టుకి వెళతానన్నాడు. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్టు అతిక్రమించినందుకు" కోపంలో మనోహర్ కంఠం వణుకుతోంది.
మధుకంతా అయోమయంగా వుంది.
"ఇదెలా జరిగింది సార్? మీ చేతిలోంచి ఫైల్ నేను తీసుకున్నాను సరాసరి తీసుకెళ్ళి వాళ్ళ పి.ఏ.కిచ్చాను. అది ఆయన సైన్ చేసి తిరిగి ఇవ్వగానే తీసుకొచ్చాను."
"మధ్యలో ఎక్కడన్నా ఆగావా?"
"లేదు సార్."
"బాగా గుర్తుకు తెచ్చుకో."
"లేదు సార్, నాకు బాగా గుర్తు. నిన్న ఉదయం ఇచ్చాను. మరలా నిన్న సాయంత్రం వెళ్ళి తెచ్చాను."
"మనం ప్రత్యర్థి తెలివితేటల్ని తక్కువ అంచనావేశాం. పైల్ తీసుకొని సరాసరి వ్యాస్ దగ్గరకు వెళ్ళి మాట్లాడివుంటే వారికీ అవకాశం దొరికేదికాదు."
"ఈ రకం మోసాలు మన ప్రొఫెషన్ లో ఎప్పుడూ చూడలేదు గదా సార్."
"అన్నీ సవ్యంగావున్న పొజిషన్ లో మనం ఈ వర్క్ టేకప్ చేయలేదు. చాలెంజ్ చేసి ఓ భయంకరమైన వ్యక్తితో తలపడేప్పుడు అన్ని విషయాల్లో జాగ్రత్త వహించి వుండాల్సింది."
"ఇంతకి అదెలా జరిగింది సార్!"
"వ్యాస్ మార్చి వుంటాడు."
"వ్యాస్ కేం ప్రయోజనం?"
"ప్రయోజనం వ్యాస్ కికాదు, ప్రదీప్ కి. ప్రదీప్ ఒత్తిడికి లొంగో, భయపడో ఆ పని చేయాలి" మాట్లాడుతూనే ముందు చేయబోయే పనుల గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు మనోహర్.
"వ్యాసే ఆ పని చేశాడని ఎలా చెప్పగలరు?"
"వ్యాస్ మొహంలో కనిపించిన తొట్రుపాటు, ఆందోళన, భయాన్నిబట్టి. తొంభైశాతం మనుష్యుల్లో వారి మదిలో చెలరేగే భావాలకు రియాక్షన్ తమ మొహంలో కనబడకుండా కంట్రోల్ చేసుకోలేరు. వ్యాస్ తొంభైశాతంలోని వాడే. కాపీలో రైటర్ రాసిన భావాల్ని మోడల్స్ మొఖాల్లో నూటికి నూరుశాతం చూపించగల వృత్తిలో వున్నామన్న విషయాన్ని మార్చిపోయాడు వ్యాస్. అతను ఎందుకో భయపడుతున్నాడు."
"మల్టీనేషనల్ కంపెనీకి మార్కెటింగ్ డైరెక్టర్ అయిన వ్యాస్ తను వర్క్ ఇస్తేనే బ్రతికి బట్టకట్టగల ప్రదీప్ కి భయపడతాడా? తన ఉద్యోగ ధర్మాన్ని విస్మరిస్తాడా?"
"అంతకంటే పెద్దవాళ్ళనైనా భయపెట్టగల సమర్ధుడు ప్రదీప్. వ్యాస్ వీక్ నెప్ ఏదో కనిపెట్టి అక్కడే నొక్కి వుంటాడు."
"సార్ మనం ఈ విషయాన్ని కోరమాండల్ మేనేజింగ్ డైరెక్టర్ నోటీసుకి తీసుకెళితే....."
"నో యూజ్ సాధారణంగా వాళ్ళు వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ మాటేవింటారు. పైగా ఆ కంపెనీ ఉత్పత్తిచేసే ప్రతి ప్రోడక్టు వ్యాస్ ప్రతిభవలెనే మార్కెట్ అవుతున్నాయి కానుక అతనిమాటే వింటారు."
కారు ఇంటిముందు ఆగింది. చెంగున కారునుండి బయటకు దూకివడివడిగా ఇంటిలోకి నడిచాడు మనోహర్.
మనోహర్ కి పిచ్చెక్కినట్లుగా వుంది.
ఎలా పట్టుకోవాలి? ఎక్కడుందని వెతకాలి? పేరుతప్ప మరేంలేదు వూరు తెలియదు. కనీసం జిల్లా తెలియదు. పేపర్లో వేయిస్తే......ప్రయోజనం వుండవచ్చు. వుండకపోవచ్చు. ఆ పేపర్ ఆమె చూడాలి. చూసినా ఆమెకి రావాల్సిన అవసరంలేదు.
పరధ్యానంగా వున్న మనోహర్ ని చూసి మంగళ భ్రుకుడి ముడిపడింది. "మనూ....." పిలిచింది మంగళ.
మనోహర్ కి ఆ పిలుపు వినపడలేదు.
ప్రక్కనున్న మధుని అడగాలనుకున్నది జరిగిందేమిటని. ఈలోపు మనోహర్ ఆలోచనల్నుంచి తేరుకున్నాడు.
"వాట్ డియర్?" అడిగాడు మంగళవైపు ప్రేమగా చూస్తూ.
"డియర్ అట డియర్! ప్రొద్దుటినుంచి ఏం తినకుండా వున్నావ్. డియర్ చెప్పినట్లు వినేవాల్లె డియార్ అనాలి" అంది కోపంగా.
"నీ గురించి తనూ ఏం తినలేదు. లే! మనోహర్. నువ్వు మధు టిఫెన్ చేయండి" అంది కమలిని మనోహర్ వైపు ఆప్యాయంగా చూస్తూ.
డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాక జరిగిన విషయం చెప్పి, తరంగిణిని ఎలా పట్టుకోవాలని అక్కడున్న అందర్నీ అడిగాడు మనోహర్.
పేరు, ఫోటోలు తప్ప మరేం వివరాలు లేకుండా ఎలా ఆమెను కనుక్కోవాలో ఆ ముగ్గురికి కూడా అంతుబట్టలేదు.
"ఇది అయ్యేపని కాదేమో మనోహర్?" అంది కమలిని.
"అవ్వాలి. అయితీరాలి. మరో మార్గంలేదు. ఈ వర్క్ పూర్తి చేయకపోతే ఛాలెంజ్ లో ఓడిపోవడంతోపాటు నా పరువు పోతుంది. పైగా కోరమాండల్ కంపెనీకి నష్టపరిహారంగా నాకున్న ఆస్తులన్నీ ఊడ్చివ్వాల్సి వస్తుంది. అది చావుతో సమానం. లాభంలేదు. ఈ అమ్మాయిని పట్టుకుతీరాల్సిందే......" దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు మనోహర్ నలుగురూ మౌనంగా ఎవరికీ తోచిన విధంగా వారు ఆలోచిస్తున్నారు.
అప్పటివరకూ పచార్లు చేస్తున్న మనోహర్ ఠక్కున ఆగిపోయాడు. "మధూ! తరంగిణి పోటోలు ఇలా యివ్వు" అన్నాడు హఠాత్తుగా.
అదెందుకో అర్ధంకాకపోయినా మధు పైల్లోంచి తరంగిణి రెండు ఫోటోలు తెచ్చిచ్చాడు.
ఆ రెండు ఫోటోల్ని చేతిలోకి తీసుకొని పరిశీలనగా చూశాడు. ఫోటోలు ఎక్కడ తీసారో, ఏ స్టూడియోలో ప్రింటు చేశారో తెలుసుకోగలిగితే కొంత ప్రయోజనం వుండవచ్చనిపించింది. ఫోటోల్ని. వెనక్కు త్రిప్పి చూశాడు. స్టూడియో స్టాంపు ఏం లేదు. మరల చూశాడు ఫోటోల్ని. ఒక ఫోటోలో ఆమె నిర్లక్ష్యంగా నిలబడి నడుంమీద చేతులు పెట్టుకొని..... తల కొద్దిగా ఎగుర వేసినట్టుగా ఎలిగెంట్ గా చూస్తోంది. ఆమె వెనుక ఈఫిల్ టవర్ కనిపిస్తోంది. మనోహర్ ముఖంలో కొద్దిపాటి వెలుగు పోడ చూపింది. చాలు ఈ చిన్న ఆధారం అనుకున్నాడు, హుషారుగా మరో ఫోటో చూశాడు. ఆమె సైడ్ ఫోజులో నడుస్తుండగా తీసిన ఫోటో. ఫోటోలో ఆమెకి కెమేరా కాన్షస్ కనిపించటంలేదు. బ్యాగ్రౌండ్ కూడా స్పష్టంగా లేదు. అంటే ఇది ఆమెకు తెలియకుండా మరెవరో తీసిన ఫోటో అయ్యుండాలి. మొదటి ఫోటోకి స్టయిల్ గా పోజిచ్చినదాన్ని బట్టి అది ఆమె కావాలని దిగిన ఫోటో అయ్యుండాలి. సాధారణంగా తాజ్ మహల్, చార్మినార్. ఎఫిల్ టవర్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టి, పీసాటవర్. బిగ్ బెన్ గడియారం లాంటి ప్రపంచ చారిత్రాత్మక కట్టడాలముందు టూరిస్టులుగా వెళ్ళిన సందర్భంలో గుర్తుగా ఫోటో దిగుతారు. అంటే ఆమె ప్యారిస్ లో ఉన్నట్లుగా భావించాలా? అక్కడి వున్నట్లా? టూరిస్టుగా వెళ్ళి తిరిగి తన స్వస్థలానికి వెళ్ళినట్లా? ఫోటోకి వాడిన కొడక్ బ్రోమైడ్ పేపర్ ని బట్టి అది ఈ మధ్యకాలంలో ప్రింటు వేసినట్లుగా తోస్తోంది. ఒక ఆధారం దొరికింది. అది సరయిన ఆధారం కాకపోయినా మరో ఆధారం దొరికేవరకూ ఆమె ప్యారిస్ లో వున్నట్లు భావించడం తప్ప చేయగలిగిందిలేదు ఆమె ప్యారిస్ లో సెటిల్ అయితే అక్కడున్న ఇండియాన్ ఎంబసీలో ప్రయత్నిస్తే కొంతయినా ఆమె గురించి సమాచారం దొరకవచ్చు.
రెండో ఫోటోని ఆమెకు తెలియకుండా ఎవరు తీసినట్లు? ఆమెకు తెలియకుండా తీయటం__దాన్ని ఫైల్లోకి వచ్చేలా చేయటాన్నిబట్టి ఆలోచిస్తే దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న ఆమెని పట్టుకునే ప్రయత్నం ఎవరో చేస్తుండాలి. ఎవరికి ఆ అవసరం వుంది? ప్రదీప్ కి ఆమెతో అవసరము ఎలాంటిది? ఈ ఆలోచనే నిజమైతే నానా కష్టాలుపడి ఆమెను వెతికి పట్టుకున్న మరుక్షణం ఆమెను తననుంచి గ్రద్దలా తన్నుకుపోతాడు ప్రదీప్. ఒక దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టే ప్రదీప్ తత్వానికి ఈ ఆలోచనలకు పొంతన కుదురుతోంది. అంటే దీన్నిబట్టి ఆమె దొరికే అవకాశం నాకుందని ప్రదీప్ ఊహ అయివుండాలి. అసలీమె ఎవరు? ప్రదీప్ కి ఈమెకు సంబంధం? ఏది ఏమైనప్పటికి ఆమెను వెదికిపట్టుకోవటం ఒక ఎత్తయితే, ఆమె ప్రదీప్ చేతిలో పడకుండా వర్క్ పూర్తి చేయటం ఒక ఎత్తు రెండో ఫోటో ఎక్కడ నడుస్తుండగా తీసిందీ తెలియాలంటే ఫోటో పెద్దదిచేసి బ్యాగ్రవుండ్ పర్ణిక్యులర్స్ చెక్ చేయాలి. మనోహర్ ఆలోచనలు మెరుపు వేగంతో, హేతుబద్దతతో ఒక నిర్ణయానికి వస్తున్నాయి.
ఫోటోని అదేకంగా చూస్తూ, దీర్ఘాలోచనలో పడిన మనోహర్ ని డిస్ట్రబ్ చేయటం యిష్టం లేకపోయింది. ఇది ఇలా జరిగితే, అది అలా జరిగే అవకాశం వుందనే లాజికల్ థింకింగ్ ని తన గురువు సింఘానియా వద్ద బాగా నేర్చుకున్నాడు మనోహర్.
తన ఆలోచనలు ఒక కొలిక్కి రాగానే తల విదిలించి హడావుడి పడిపోతూ "చూడు మధు.....ఇకనుంచి ప్రతి నిమిషం చాలా విలువైంది మనకు. ఈ అమ్మాయిని ఎంత త్వరగా వెతికి పట్టుకోగలిగితే అంత మంచిది. ఒక ఫోటోనిబట్టి ఈమె ఫ్రాన్స్ లో వుందని మనం భావించాలి. ఫ్రాన్స్ లో ఉందంటే సోఫిస్టికేటెడ్ లైఫ్ కి అలవాటుపడే వుంటుంది. కనుక కెమేరా ఫోబియా వుండదు. ఒకవేళ ప్రాన్స్ లో లేకపోయినా, టూరిస్టుగా వెళ్ళిందంటే రిచ్ ఫ్యామిలీకి చెందినలేడీ అయివుండాలి సో......సిగ్గు, బిడియం లాంటివి ఉండే అవకాశంలేదు. ఫోటోలో అమిచ్చిన ఫోజు సీనియర్ మోడల్ ఫోజులా వుంది. కానుక పెద్దగా ట్రయినింగ్ అవసరంలేదు" ఓ క్షణం ఆగి ముగ్గురివైపు చూసాడు. వాళ్ళు తెల్లమొఖాలు వేసి వింటున్నారు మనోహర్.
"మనం తీయవలసిన నాలుగు ఫిల్మ్స్ కి అయిదురోజులు చాలు. స్టిల్స్ కి మరో రోజు. ఆ తరువాత లేబ్, స్టూడియో, డార్క్ రూమ్ వర్క్ వర్క్స్ లో మరో రెండు రోజులు చాలు. అంటే మొత్తం ఎనిమిది రోజులు వర్క్ చేయాలి. ఆమెతో ఆరురోజులు. మనమే చేసుకోవాల్సిన వర్క్ రెండురోజులు" ఓ క్షణం ఆగాడు మనోహర్.
"ఫోటోని బట్టి ఆమె ప్యారిస్ లో వుందని వేట ప్రారంభించటం సిల్లీగా వుంది మను" అంది మంగళ.
"ఆ మాటకు మనోహర్ కు కోపం వచ్చింది. ఆమెవేపు తీవ్రంగా చూస్తూ "చూడు మంగళ.....ఒక్కోసారి సిల్లీగా ప్రారంభమైన విషయాలే సీరియస్ నెస్ ని సంతరించుకుంటుంటాయి. మొదట్లో అది సిల్లీ గానే కనపడవచ్చు. అంతమాత్రం చేత దాన్ని నిర్లక్ష్యంగా వదిలేయగూడదు. ఇది నా వృత్తి నాకు నేర్పిన పాఠం. ప్లీజ్ కీప్ సైలెన్స్" అని మధువైపు తిరిగాడు మరలా మనోహర్ కోపానికి నవ్వుకుంది మంగళ.
"మనకు ఒక ఫోటోలోని బ్యాగ్రౌండ్ తెలియటంలేదు. కానుక వెంటనే నీవు దాన్ని ట్రాన్స్పరెంట్ ఫిల్మ్ తో రీకాపి తీసి ప్లెయిడ్ తయారుచేయి. పనిలోపని రెండో ఫోటోని కూడా."
మనోహర్ విషయ పరిజ్ఞానానికి కమలిని, మధు నివ్వెరపోయారు.
"కమాన్ క్విక్......." అంటూ ఫోటోలతో, ఆఫీసుకీస్ తో బయటికి పరుగెత్తాడు మనోహర్ మధు అదే వేగంతో అనుసరించాడు.
"వర్క్ లో అంత అలర్ట్ గా వుంటాడో అంత షార్ప్ గా, అంత సిన్సియర్ గా వుంటాడు. వన్ ఇన్ మిలియన్" అంది వెళుతున్న మనోహర్ వైపు చూస్తూ కమలిని.
ఈ వేట ఎక్కడకు వెళుతుందో, ఏమవుతుందో?
మనోహర్ ఏమవుతాడో? ఎలాంటి ప్రమాదాల్ని కొనితెచ్చుకుంటాడో అని భయపడిపోయింది మంగళ దిగాలుగా చూస్తూ.
కారు అరవై కిలోమీటర్ల స్పీడ్ తో మాలాసౌద్ వైపు వెళుతోంది.
* * *
"అప్పుడే రెండు రోజులయింది. అంటే ఇంకా 28 రోజులుంది మనకు టైమ్. అందులో ఎనిమిది రోజులు తీసివేయాలి. ఇక మిగిలేది 20 రోజులు. ఈ 20 రోజుల్లోపు మనం ఆమెను పట్టుకోగలగాలి. డబ్బు ఎంతయినా ఖర్చు పెడదాం. ఎంత రిస్క్ అయినా తీసుకొందాం.....జెట్ స్పీడ్ లో వేట ప్రారంభిద్దాం. ఆమెను ఎలాగయినా పట్టుకుతీరాలి. ఆకలయితే ఆగి హొటల్ లో టిఫెన్ చేసే బదులు రెడీ ఈటబుల్ పుడ్ స్టవ్స్ కొనుక్కుని పోతూ పోతూనే ఆవి తింటూ ఆకలి తీర్చుకోవాలి. అర్ధమైందా?"
అంత రాత్రిపూట రేస్ కారులా సర్రున దూసుకుపోతున్న మనోహర్ కారుని చూసి ఉలిక్కిపడి పుట్ పాత్ మీదకు ఎగిరి దూకారు రోడ్డు ప్రక్కన నడుస్తున్న పాదచారులు. కారు సముద్రా యాడ్ ఫిల్మ్. ఆఫీసు ముందు ఒక్క జెర్కు తో ఆగిపోతుండగానే దడేలున తలుపులు తీసేసుకొని మూడో అంతస్థులో వున్న మనోహర్ ఆఫీస్ రూం వైపు పరుగెత్తారు.
"మధూ! ఆ రెండు ఫోటోలు స్లెయిడ్స్ తయారుచెయ్ క్విక్" మధు రెండు ఫోటోల్ని తీసుకొని డార్క్ రూమ్ లో కెళ్ళిపోయాడు వడిగా.
మనోహర్ తన సీట్ లో కూర్చుని ఫోన్ ఎత్తి ఎక్సేంజ్ కి నెంబర్ త్రిప్పి "హలో ఇంటర్నేషనల్ బుకింగ్?"
"ఎస్"
"బుక్ ఏ కాల్ తో మిష్టర్ సెయింట్ లారెంట్. ప్యారిస్,ఫోన్ నెంబర్ 033022"
"మీ నెంబర్ సార్?"
ఇంటి నెంబరుచెప్పి "అర్జెంట్ కాల్ కావాలి" అన్నాడు .
"రెండు గంటలు పట్టవచ్చు సార్" అంది ఆపరేటర్.
"నో.....నో.....ఇంకా త్వరగా కావాలి. లైట్ నింగ్ కాల్ బుక్ చేయండి" ఫోన్ తనిచ్చిన ప్రకటన రెస్పాన్స్ గా వచ్చిన అమ్మాయిల ఫోటోల్ని చేతిలోకి తీసుకున్నాడు. అవి చూస్తున్నా మనసంతా ఎంత త్వరగా ప్యారిస్ వెళ్ళి వాల్దామా, తరంగిణి జాడ కనుక్కుందామని అమిత వేగంతో ఆలోచిస్తుంది.
గంటలో డార్క్ రూమ్ లోంచి బయటకు వచ్చాడు మధు సైయిడ్స్ తీసుకొని.
"కమాన్ లెట్స్ గో. టేబుల్ పై వున్న ఫోటోల్ని కూడా తీసుకో" అంటూ ఇంటర్నేషనల్ ఎయిర్ వేస్ డైరెక్టరీతో క్రిందకు పరిగెత్తాడు మనోహర్.
మధు ఆఫీసుకి తాళంవేసి పరిగెత్తుకొచ్చి కారెక్కాడు. కారు మరలా బాణంలా ఇంటివైపు దూసుకుపోతోంది. డార్క్ రూం. స్టూడియో ఆఫీసులో ఉండటం, ప్రోజెక్టింగ్ రూమ్ ఇంట్లో వుండటంతో అటూ-ఇటూ పరిగెత్తాల్సి వస్తోంది ఆ ఇద్దరూ.
"మధూ.....ఈ రోజు షూటింగ్ జరుగుతుండగా దురదృష్టకరమైన సంఘటన జరిగింది" బాధగా అన్నాడు మనోహర్.
మధు ఊహకి అందలేదు అది, ఇదిగాక మరింకేం జరిగింది."
ఎగిరిపడ్డాడు సీటులో మధు. భయంకరమైన శీతల పనం ఒకటి అతన్ని చుట్టుముట్టినట్లుగా ఒణికిపోయాడు ఓ క్షణం.
"మన అదృష్టం, ఆమె అదృష్టం బావుంది. చందూ రిస్క్ తీసుకోవటంతో, చావును వెంట్రుక వాసిలో తప్పించుకోగలిగింది.
"ఎలా జరిగింది సార్?"
మనోహర్ చెప్పాడు.
మధు వూపిరి పీల్చటం కూడా మర్చిపోయి విన్నాడు.
సార్......ప్రదీప్ పై కంప్లెయింట్ ఇస్తే?"
"నో యూజ్ ఆధారం లేదు. రూపాను నీళ్ళలో ముంచి చంపాలనుకున్న వ్యక్తిని గుర్తించలేకపోయాడు చందూ. పైపెచ్చు ఈ విషయం చందూ ఒక్కడే గ్రహించగలిగాడు. మరెవరికి ప్రమాదం అలా సంభవించిందని తెలియదు. పక్కా ఎవిడెన్స్.....లేకుండా కేసుపెట్టి మనం టైం వృధా చేసుకోవటమే."