ఇం : చాలాకాలం అయింది.
రచ : ఇంతకాలం ఎక్కడున్నావ్ ?
ఇం : కలకత్తాలో -
రచ : ఏం చేస్తున్నావ్ ?
ఇం : ఉద్యోగం.
రచ : వివాహం చేసుకున్నావా?
ఇం : చేసుకున్నాను.
రచ : అంటే చివరకు, మానసి ఈ వివాహానికి ఒప్పుకుందన్న మాట.
ఇం : లేదు.
రచ : ఆఁ.
ఇం : మరొక అమ్మాయిని చేసుకున్నాను.
రచ : మరొక అమ్మాయినా ?
ఇం : అవును.
రచ : ఆమె ఎవరు ?
ఇం : ఒక స్త్రీ.
రచ : పేరు ?
ఇం : మానసి.
రచ : అదెలా సంభవం ?
ఇం : ఈ ప్రపంచంలో సంవంకానిది ఏదీ లేదు. ఎంత మంది మానసీలు వస్తున్నారో వెళుతున్నారో. అందులో ఒక మానసితో వివాహం జరుగుతుంది.
మానసి. సోదరి మానసి - మానసి స్నేహితురాలు
మానసి- మానసి కూతురు మానసి.
రచ : అమల్, విమల్ , కమల్ లాగా!
ఇం : అవును. అమల్ , విమల్, కమల్, ఏవం ఇంద్రజిత్.
(మానసి ప్రవేశిస్తుంది. తలమీద ముసుగు వుంటుంది)
రా ! రా పరిచయం చేస్తాను. ఈమె నా భార్య. మానసి. (మానసితో) ఇతను నా స్నేహితుడు రచయిత.
రచ : నమస్కారం.
మా : నమస్కారం. మీరు ఏం రాస్తుంటారు?
రచ : ఎప్పుడు ఏం రాయాలనిపిస్తే అది.
మా : ప్రస్తుతం ఏం రాస్తున్నారు?
రచ : ఒక నాటకం. రాయటానికి ప్రయత్నం చేస్తున్నాను.
మా : నాకు వినిపిస్తారా?
రచ : తప్పకుండా ముందు కానివ్వండి.
మా : ఇంకా ఎంత రాయాలి?
రచ : ఎంతో లేదు. ఇవ్వాళో, రేపో ప్రారంభిస్తాను.
మా : ఇంకా ప్రారంభించలేదా?
రచ : ఎక్కడా ? కుదరటం లేదు.
మా : ఇప్పుడేగా అన్నారు. పూర్తి గావటానికి ఎంతో లేదని?
రచ : ఈ నాటకం ప్రారంభానికీ, ముగింపుకు అట్టే తేడా వుండదు. వృత్తాకారంగా వుంటుంది.
మా : మీ మాటలు నాకు అర్ధం కావటంలేదు.
ఇం : ఎలా అర్ధం అవుతాయి మానసీ - మాట్లాడేది అర్ధం కావాలని కాదుగా?
మా : బలే ! ఇతర్లకు అర్ధం కావలెననేగా మాట్లాడేది.
ఇంద్ర : అది ఒక్కప్పటి సంగతి. ఇప్పుడు మాట్లాట్టం అలవాటయింది కనుక మాట్లాడుతున్నాం.
మానసి : ఇక ఆపండి. అర్ధంలేని మాటలు.
ఇంద్ర : నేనంటూందీ - అదేగా ?
(అమల్ , విమల్ , కమల్ , ప్రవేశిస్తారు. స్టేజీకి రెండో వైపుగా నిలుచుని మాట్లాడుతూ వుంటారు)
మానసి : వాళ్ళంతా ఎవరూ?
రచ : అమల్ - విమల్ - కమల్ .
అమల్ : ధనతంత్రం -రాజతంత్రం-గణతంత్రం.
విమల్ : సామాజ్య్రవాదం -నాజీవాదం- మార్క్సువాదం.
కమల్ : ఆర్ధికశాస్త్రం - టెండర్ -స్టేట్ మెంటు.
విమల్ :రిపోర్టు-మినిట్సు-బడ్జటు.
కమల్ : మీటింగ్ - కమిటీ - కాన్పరెన్సు.
అమల్ : సభ్యత - విద్య - సంస్కృతి.
విమల్ : సాహిత్యం - వేదాంతం- చరిత్ర.
కమల్ : బహ్మ - నిర్మాణం - భూమి.
అమల్ : రాజ్ కపూర్ - మాలాసిన్హా - బిస్వజిత్.
విమల్ : ఉమ్రీగర్ - కృష్టన్ - మిల్కాసింగ్.
కమల్ : హేమంతకుకుమార్ - S.D బర్మన్ - లతామంగేష్కర్.
అమల్ : డాక్టర్ - హొమియోపథి - కవికుమారు.
విమల్ : ట్రాం - బస్ - ట్రైన్.
కమల్ : సున్నితం - చెత్తా - దోమలు.
అమల్ : కూతురు -కొడుకు - భార్య.
విమల్ : మాస్టరు - డ్రైవరు - నంటవాడు.
కమల్ : మరదలు - మేనల్లుడు - మామ.
మానసి : వాళ్ళంతా ఏమిటి అంటున్నారు?
ఇంద్ర : మాట్లాడుతున్నారు.
(అమల్ , విమల్ , కమల్ చేతులు వూపుతూ మాటలు వినిపించకుండా మాట్లాడుతూవుంటారు.)
మానసి : ఏమాటలు ?
ఇంద్ర : నాకూ తెలియలేదు. కవిగార్ని అడిగిచూడు.
మానసి : (రచయితతో ) ఇంతకంటే మాట్లాట్టానికి వేరే మాటలే లేవా?
రచ : ఉండే వుండాలి. తప్పకవుండాలి.
(ముందుకొచ్చి ప్రేక్షకులను ఉద్దేశించి ప్రశ్నిస్తాడు.)
ఇంతకంటే మాట్లాట్టానికి ఏమీలేదా?
(ప్రేక్షకులు మౌనం) లేదా? (మళ్ళీ మౌనం)
నేను ఎవర్ని గురించి నాటకం రాయాలి?
ఈ మాటల్ని తీసుకొనా? ఇలాంటి నాటకంలో వేషం ఎవరేస్తారు?
(ఇంద్ర , మానసి వెళ్ళబోతారు.)
ఇంద్రజిత్ ! వెళ్ళవద్దు.
(మానసి వెళ్ళిపోతుంది. ఇంద్రజిత్ తిరిగోస్తాడు.)
రచ : ముందు చెప్పివెళ్ళు !
ఇంద్ర : ఏం చెప్పాలి ?
రచ : మానసి ఎక్కడవుంది ?
ఇంద్ర : ఇప్పుడేగా ఇక్కడనుంచి వెళ్ళింది ?
రచ : ఈ మానసికాదు. నిజామాబాద్ లో వుంటూవుండేది ఆ మనసి. ఆమె ఎక్కడుంది?
ఇంద్ర : నిజామాబాద్ లో వుంది.
రచ : ఆమెకు ఉత్తరాలు రాయటంలేదా?
ఇంద్ర : రాస్తూనే వుంటా !
రచ : ఆమెను కలుస్తూ వుంటావా?
ఇంద్ర : అప్పడప్పుడు.
రచ : ఎక్కడ?
ఇంద్ర : ఆ మైదానంలోనే - ఆ చెట్టుక్రిందే !
రచ : మాట్లాడుతూవుంటావా ?
ఇంద్ర : మాట్లాడతాను.
రచ : ఏం మాట్లాడతావు ?
ఇంద్ర : ఇంతకాలం ఏం మాట్లాడేవాణ్ణో అవే మాటలు. ఆమె గురించి....నా గురించి...
రచ : ఆ మాటలు కూడా అమల్ , విమల్ , కమల్ మాట్లాడుకొనే మాటల్లాగే వుంటాయా?
(ఇంద్ర జావాబివ్వడు.)