Previous Page Next Page 
వివాహం పేజి 18

   
    ఏం జవాబు చెప్పాలో రవణకేం తెలీదుగాని, ఆ మాటతో ఆమె మనసులో సందేహాలూ, ఆలోచనలూ మొదలుపెట్టాయి. ఆ నిర్మలాంతః కరణలోంచి "యెన్నో విషయాలు" ఆమెకి తెలీనివీ, తెలీవనుకున్నవీ, పైకి కొంచెంగా తలెత్తాయి. తన చూపుల్లో అర్ధమున్నదనీ భేదాలున్నాయనీ ఆమె గ్రహించింది. పెద్ద సిగ్గొకటి ఆమె నాకర్షించింది. సుబ్బారావువంక తేరిపార చూసేపిల్ల, యిప్పుడు కలవర పడడమూ, రెప్పల్ని సిగ్గుతో వాల్చడమూ, అతను చూడనప్పుడు కనుచివరల్లోంచి అతన్ని చూడడమూ మొదలుపెట్టింది. సుబ్బారావు కివి యింకా శుభసూచకాలుగా కనపడి, నూత్న యవ్వనంమీద, వాలుచూపుల మీద నాలుగైదు గీతాలు రాసి పత్రికకి పంపాడు - స్నేహితులకి అతని అదృష్టం ప్రకటిత మయ్యేందుకు.

    మర్నాడు సుబ్బారావు వెళ్ళిపోతున్నాడు. సాయంత్రం కాయితమూ, కలమూ తీసుకొని కాలవ వొడ్డున చింత చెట్టుకింద పద్యాలు రాయాలని కూచున్నాడు; గాని రవణ తలంపు మనసుని కలవరపెట్టి విరహావస్తని హెచ్చు చేసింది. కొత్తగా నిండే ఆమె వక్షమూ, కళ్ళువిప్పని యౌవన భావమూ అతన్ని చాలా ఆకర్షించాయి. యిప్పుడు తను వొదిలి వెళ్ళిపోయినాడా యింకా మళ్ళీ ఆ భర్త వొస్తాడు. ఇంక రవణ శరీరాన్ని, హృదయాన్ని కూడా అతనే స్వాధీనం చేసుకుంటాడు. ఏమీ యెరక్క మిణుగురు పురుగు కాంతివలె అప్పుడప్పుడు తోచి ఆకర్షించే ఆ కళ్ళలోని కాంతి మాయమౌతుంది. తన చేతి కందిపప్పుడు, కొత్త అనుభవంతో ఆమె ముఖంలో వచ్చే మార్పులూ, ఆమె శరీరం భయంతో వణకడం, లజ్జతో ముడుచుకోడం, తలుచుకుని, ఆ స్వర్గానుభవంలో పరవశుడై, తన్మయుడై, ఆ కవి యెంచుకొన్న ఆనందంలోనూ, తనది కాదనుకునే తియ్యని బాధతోనూ, తన యవ్వనశోభలో తనే మైమరచి కూచున్నాడు.

    రాత్రిపడ్డది. తెల్లారి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఏం చెయ్యాలనుకున్నా యేమీ చేతకాదని తెలుసు గనక కవిత్వంలో పడ్డాడు. రవణ సైరంధ్రి, అక్క సుధేష్ణ బాగానే వుంది. కానీ యీ అక్కతో తన బాధ సంగతి యెత్తితే చెప్పు తీసుకుంటుంది. కొంచెం ప్రణయం విస్తరించే గీతం ఆమె ముందు చదవడమే భయంగా వుంటుంది. కాని పాండవుల భయం లేదిక్కడ. విషాదాంత కావ్యం కాదు. కాని యీ అందాన్ని అనుభవించకుండానా? యింటివేపు నడిచాడు. ఒకవేళ రవణ తనకోసమై యెదురు రాదుకద! వొస్తే యీ రోడ్డుమీది దీపాలొకటీ! మర్నాడు వెళ్ళిపోతున్నానని తెలీదా ఆమెకి? యింక ఇప్పట్లో రానని చెప్పాడుగా తను? తన బాధ ఆమెకి తెలీదా! కాని యీ కవికి-పురుషుడు నేర్పితేగాని, కన్య హృదయం వికసించదనీ, ఆమెకి యా భావాలూ, విరహాలూ, సహజం కావనీ తెలీదు. రవణ రాలేదు. దొడ్లోపచ్చడి రుబ్బుతోంది. ఎక్కడ చూసినా, యీ అప్పమ్మ రవణని కాపాడుతోంది. ఈ ముసలిదెక్కడ పోగయిందో! తన సంగతంతా కనిపెట్టి వెయ్యికళ్ళతో వెతుకుతున్నట్టుంది. ఈ ముసలివాళ్ళమీద ఒక పద్యం రాసెయ్యాలి..........

 Previous Page Next Page