Previous Page Next Page 
ఇంటింటి కధ పేజి 18


    తరువాత కూతుర్ని చాటుగా సౌమ్యంగా , బతిమాలుతున్నట్టుగా మెత్తమెత్తగా మందలించారు. భర్తని అవమానిస్తే యింటా బయట అంతా ఆమె గురించి చెడ్డగా చెప్పుకుంటారని, అవమానించిన వాడితో కాపురం చెయ్యడం ఇంకా లోకువవుతుందని, ప్రసాద్ కి కోపం వచ్చి వెళ్ళిపోతే అంతకంటే అవమానం యింకోటి వుండదని ఆమెకి చెప్పి చెప్పి బోధపరిచాడు. కాని కుక్కతోక తిన్నగా ఎంత సేపుంటుంది! ఒక్కవారం పదిరోజులు మూతి ముడుచుకుని కాస్త నోటి జోరు తగ్గించి ముభావంగా వుంది తరువాత యధాప్రకారం తయారైంది. ఆమె ధోరణి అలవాటయ్యాక ప్రసాద్ చెవిటివాడిలా మూగివాడిలా తయారై యింట్లో వున్న కాసేపు యాంత్రికంగా తన పనులు చేసుకొని ఆమె ఉనికి పట్టించుకోడం మానేశాడు.

                                            *    *    *    *
    నెలరోజులుగా వెంకట్రావు గారు పక్క మీదనుంచి లేవడం లేదు. ఆయనకి నెలక్రితం హార్టు ఎటాక్ వచ్చింది. దాంతో మనిషి చాలా నీరస పడిపోయారు. డాక్టరు నెలరోజులు బెడ్ రెస్టు తీసుకోమనడంతో శలవు పెట్టి ఇంటిపట్టున వుండక తప్పలేదు ఆయనకి. ఈ నెలలో డాక్టర్లు, మందులు, ఆస్పత్రి చుట్టూ తిరగడాని కైతేనేం చాలా ఖర్చయి చేతిలో దమ్మిడి లేకుండా అయింది. అయన పని. వసంత ఉద్యోగంలో చేరాక కాస్త వడ్డున పడ్డట్టయింది ఆయనకి. వసంత ఉద్యోగంలో కాస్త ఊపిరి పీల్చుకునే వేళకి ప్రసాద్ పెళ్ళి అవడం ఆ పెళ్ళితో తమ అందరి దశ తిరిగిపోతుందన్న అందరి ఆశ అడియాస అయిపొయింది.
    ప్రసాద్ బంగారు పంజరంలో బంది అయిన పక్షి అని, దాన్లో పెట్టె ఖరీదయిన తినుబండారాలు కావాలిస్తే తినడం లేకపోతే మానేయడం తప్ప యింకొకరికి ఏమీ యివ్వలేని స్థితిలో అతనున్నాడని రెండు మూడు నెలలకి గాని వారు గుర్తించలేక పోవడంతో ప్రసాద్ ఎన్నో అపార్ధాలకి గురి అయ్యాడు. తనో బంగారు పంజరంలో బందీ అయిన చిలక అని అతను నోరు విప్పి చెప్పుకోలేక పోవడంతో --- రాణి వాసం దారికాక స్వజనాన్ని మరిచిపోయాడని కన్న తల్లిదండ్రులు సయితం కృతఘ్నుడని తిట్టుకున్నారు.
    వెంకట్రావు గారికి వంట్లో బాగులేక మంచాన పడి , యింట్లో యిబ్బంది అయ్యాక కాంతమ్మ ఇంక సహించలేక పోయింది. "మీరూరుకొమన్నా వూరుకొను. కన్నవాళ్ళు, చచ్చారో, బతికారో పట్టించుకోని కొడుకున్నా లేకపోయినా ఒకటే, అంత కళ్ళు మూసుకు పోయాయా వాడికి పెళ్ళితో పెళ్ళాం తప్ప అంతా చచ్చామను కున్నాడా. ఆ పట్టం కట్టుకున్నాక పట్టుమని నాలుగు సార్లన్న వచ్చాడా యింటికి ఏదో అందలం ఎక్కిస్తారని కాస్త ఆదుకుంటాడని, మన పిల్లలు పైకి వస్తారని, వాడు బాగుపడి సుఖ పడ్తాడని అనుకుని యీ పెళ్ళికి వప్పుకున్నాం..... కాని వీడిలా మారిపోయి ఇల్లరికం ఆల్లుడయి కన్నవారి మొహం చూడడని అనుకోలేదు..... వాడిని నాలుగు మొహం మీద దులిపేసి వస్తా, ఏం యింటికి పెద్ద కొడుకు వాడికా మాత్రం బాధ్యత లేదా, అడిగే హక్కు మనకి లేదా." కాంతమ్మ ఆవేశంగా అంది.
    పెళ్ళిలో వారి భోగభాగ్యాలు చూసి అంతా సంతోషించారు. అంతే, ఆ సంతోషం పట్టుమని పదిరోజులు నిలవలేదు. కోడలు తమని అసలు మనుష్యుల్లా చూడలేదు. ఎంతో సంబరంగా పెద్దకొడుకు పెళ్ళి అని గృహప్రవేశం వేడుక చేసి నలుగురిని పిలుచుకోవాలంటే అదంతా అమ్మాయి వల్ల కాదని కొట్టి పారేశారు. ముచ్చటకి ఒకసారి తీసికెళ్ళాలన్న అమ్మాయి కిబ్బంది అన్నారు. ఆడపిల్లలు సరదాగా వదినగారితో మాట్లాడాలని మేడమీదికి వెడితే అంటి ముట్టనట్టు మాట్లాడింది. యింటి వైభోగం చూసి సంతోషించారు తప్ప , కొడుకు , కోడలు ముచ్చట ఏమీ తీరలేదు వారికి. లత మాటతీరు, ఆమెకి తమ పట్ల చిన్న చూపన్న సంగతి ఒకరితో ఒకరు చెప్పుకోకపోయినా యింట్లో అందరికి అర్ధం అయింది. పోనీ వాడన్నా సుఖంగా వుంటే చాలు, పెద్దింట్లో పెరిగిన పిల్ల తమ యింటికి వస్తే యిబ్బంది అని రాలేదు అని సరిపెట్టుకున్నారు. పెళ్ళయ్యాక ప్రసాద్ వేసే సూట్లూ, బూట్లూ చూసి కాంతమ్మ తల్లి హృదయం ఎంతో సంతోషపడి కొడుకుని చూసుకుందుకు కళ్ళు చాలవని గర్వపడింది. రెండు మూడు సార్లు ఆఫీసు నించి అంత పెద్ద కారులో యింటికి వస్తే ఎవరో పైవాడు, గొప్పవాడు వచ్చినట్లు హడావుడి పడ్డారంతా. తండ్రి కూడా కొడుకుతో పూర్వంలా చనువుగా మాట్లాడలేక పోయారు. చెల్లెళ్ళు, తమ్ముడు, తల్లి అంతా వూర్లో వాడితో మాట్లాడినట్లు మాట్లాడారు. అతని వైభోగం ఆఫీసులో అతని దర్జా, వూర్లో పలుకుబడి అంతా బాగున్నా ముఖ్యమైంది, తమందరూ ఎదురు చూసింది ఏది జరగలేదని అందరికీ నిరాశగానే వుంది. తమ బ్రతుకుల్లో ప్రసాద్ పెళ్ళి వల్ల మార్పులేదని దాని వల్ల తమకి వరిగిందేమి లేదని అర్ధం అయిపొయింది.
    'అడగందే అమ్మన్నా పెట్టదు . వాడి సుఖం వాడు చూసుకున్నాడు. నెలకింత పంపమని చెప్పండి అంతా కల్సి వుంటాం, యిల్లన్నాడు, కారన్నాడు, నిజం అని నమ్మాం కనీసం నెలకింత అని అన్నా పంపమని అడగండి" అంది కాంతమ్మ ఒకసారి ఉక్రోషంగా.
    'అడగందే యింటి పరిస్థితి వాడికి తెలియదా, వాడి యిబ్బందేమిటో? యిల్లరికపు అల్లుడయ్యాడు. వాడి చేతులో వుందో లేదో పంపడం. ఏ సంగతి తెలియకుండా వాడి ననుకోడం ఎందుకు?" వెంకట్రావు గారు అన్నారు.
    "మీరుండండి. నేను అడుగుతాను. ఈసారి వచ్చినపుడు" అంది కాంతమ్మ.
    అన్నట్టుగానే ప్రసాద్ ఓసారి చూడడానికి వచ్చినపుడు "ఏమిరా ఎన్నాళ్ళక్కడ వుంటావు. మీ మామగారు యిల్లదీ ఏర్పాటు చెయ్యలేదా యింకా. ఏదో అంతా కల్సి వుండవచ్చనుకుంటే నీవక్కడే వుండిపోయావు , పెళ్ళయిందన్న మాటేగాని కొడుకు కోడలు ని చూసుకునే అదృష్టం లేకుండా, యిల్లరికం వెళ్ళినట్టు అక్కడే వున్నావు" అంది ఆవిడ సగం నిష్టూరం , సగం బాధ ధ్వనిస్తుండగా.
    ప్రసాద్ మొహం నల్లబడింది. అప్పటివరకు తల్లిదండ్రులకి ఆ మాట ఎలా చెప్పడమా అని దిగులు పడిన అతనికి తల్లే ఆ ప్రసక్తి తీసుకు రావడంతో సగం భారం తగ్గి, అంతా చెప్పుకొచ్చాడు. యిల్లరికం వుండడం తప్ప గత్యంతరం లేదన్నాడు. ముందు సరిగా వివరాలు అడగక పోవడం తనదే తప్పని వప్పుకుంటూ తన అశక్తత వెల్లడించాడు. అందరి ఆశలు అడియాసలయ్యాయి. ఆ జావాబు విని, కొడుకు మాటల్లో వ్యధ ఆమెకి అర్ధం అయింది.
    "ఆ....అదో పోజు. మనందరం ఎక్కడ తినిపోతామో అని వాడే అలా అన్నాడు. అక్కడయితే తానొక్కడే అనుభావించచ్చు. వేరే యిల్లు తీసుకుంటే మనందరినీ పోషించాలని యీ ఎత్తేశాడు" ఉక్రోషంగా అంది వసంత ప్రసాద్ వెళ్ళాక. ఆమె ఎన్నెన్నో ఊహించుకుంది అన్న గారి పెళ్ళి  వల్ల వచ్చే లాభాలని, అవి అన్నీ తల్లకిందులు చేశాడని ఆమెకి మంటగా వుంది.
    "యిల్లరికం వెళ్ళాలని వాడికి సరదా వుంటుందా --- ఏమిటో వాళ్ళ ఆస్థి పాస్తులు చూసి మనం మోసపోయాం. ముందు అడగకపోవడం మన తప్పు. ఇంతకీ యిస్తామన్న ఆ ఏబై వేలన్నా యిస్తారో లేదో ...." ఆ డబ్బుతో కూతుర్ల పెళ్ళిళ్ళు చెయ్యొచ్చని యిన్నాళ్ళు నిబ్బరంగా వున్న వెంకట్రావుగారు యిప్పుడు మళ్ళీ బెంగలో పడ్డారు.
    "అయ్యో, అడగకపోయారు.... నాకు గుర్తు లేకపోయింది. యీ సారి అడుగుతాను" అంది కాంతమ్మ.
    తల్లి అడగక పూర్వమే ....ప్రసాద్ ఆ విషయం ఆలోచించాడు. తను తన సుఖాలు చూసుకున్నాడని తనవాళ్ళు అనుకోడం ఎలా వున్నా, యింటి పరిస్థితి తెల్సి తను సహాయపడాలని యీ పెళ్ళి చేసుకున్నాడు యింత డబ్బు ఆస్థి వుంది.....అన్ని దర్జాలు, సుఖాలు జరుగుతున్నాయి. కాని తనది అని చెప్పి , తన యిష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోడానికి పది రూపాయలు అతని దగ్గర వుండడం లేదు. ఆఫీసులో అంత పెద్ద ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. యింటల్లుడు , ఆస్తికి కాబోయే అధికారి.....జీతం ఏమిటి, అంతా తనదే అనుకుంటారు గానీ తన అవస్థ ఎవరితో చెప్పుకోవాలో అర్ధం కాలేదు. ప్రసాద్ కి. స్వయంగా మామగారిని అడగలేక కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి అలోచించి ఆఫీసులో క్యాషియర్ తో అందరికి జీతాలు యిచ్చే రోజున తనకీ జీతం నారాయణమూర్తి గారిని అడిగి తెచ్చిమ్మని చెప్పాడు.
    క్యాషియర్ నోరెళ్ళ బెట్టాడు." 'సార్' అన్నాడు.
    ఆ వార్త నారాయణమూర్తి గారి చెవిన పడగానే అయన అల్లుడిని గదిలోకి పిలిచి చాలా అవమానం జరిగినట్టు మొహం మాడ్చుకుని.... "నీకు ఏం లోటు చేశాం అని అందరి ముందు యిలా అవమానించావు. అల్లుడివి, ఉత్తరోత్రా ఈ ఆస్తికి యజమానివి, నీకు మా కింది పనిచేసే వారితో జీతం యివ్వమని కబురు పెడతావా. పోనీ నీవే అడగకపోయావు. ఈ డబ్బంతా నీది, నీవు వాడుకోవద్దని ఎవరన్నారు. నీకు జీతం యిచ్చి మమ్మల్ని మేం అవమానించుకోమంటావు" అంటూ మాట్లాడాడు.
    అంతా తన డబ్బుంటారు. డబ్బు కావలిస్తే పదివ్వండి, వందివ్వండి అని ఎవరిని అడగాలి. మామగారినా, భార్యనా, ఆఫీసు లో వాళ్లనా.... సినిమాకి వెళ్ళాలన్నా, స్నేహితులతో ఏ హోటలు కెళ్ళాలన్నా జేబులో డబ్బు లేక ఎవరిని అడగాలో తెలియక అతను పడే అవస్థ దేముడి కెరుక. అందుచేత మామగారు అలా నిష్టూరంగా మాట్లాడినా తగ్గిపోకుండా, "లేదండి, ప్రతి సారి ఎవరిని అడగమంటారు, నా ఖర్చులు కొన్ని నాకుంటాయి. నా వాళ్ళకి కొంత పంపాలి.... అందుచేత నేను చేస్తున్న ఈ ఆఫీసు పనికి జీతం యింత అని నిర్ణయిస్తే అందులో నా ఖర్చులు జరుపుకుంటాను."

 Previous Page Next Page