ఎంతో మామూలుగా కనిపించే స్త్రీలలో సైతం, అద్భుతమైన తెలివితేటలు బాగుంటాయి. మసి పూసుకున్న వజ్రాల్లా అవి మరుగునపడి ఉంటాయి. ఆ మసి తుడిచి, మెరుగుపెట్టే మహానుభావులు ఎంతమందికి దొరుకుతారూ? చాలామంది కళ్ళల్లో లెఖ్ఖలు నోటితో, నిమిషాల్లో కట్టి చెప్పే అమ్మమ్మలూ, చదరంగం లాంటి మెదడుకి పదునుపెట్టే ఆటలు బ్రహ్మాండంగా ఆడే అత్తయ్యలూ, బామ్మలూ, అటకమీదికి విసిరేసిన పాత సామాన్లులా, వంటింట్లో ఓ మూలగా పెట్టిన ఊరగాయ జాడీల్లా, అవి మామూలుగా అణిగిమణిగి ఉంటారు. వీరు నలుగురిలోకీ వచ్చి, తమ తెలివిని ప్రదర్శించుకోవాలని ఏనాడూ అనుకోరు! అనుకుంటే నాగమ్మలూ, ఇందిరాగాంధీలూ, లక్ష్మిబాయిలూ దొరకవచ్చునేమో!
అరుంధతి కూడా అలాగే, గుర్తింపు లేకుండా అతి నిస్సారంగా బ్రతుకు బండి ఈడ్చేసేదే!
కానీ, ఆ బండికి బ్రేకులు వేసి, స్టీరింగ్ తన కంట్రోల్ లోకి తీసుకుని, జీవన ప్రయాణం అందమైన మలుపులతో కూడుకున్నది కావాలని తెలియచెప్పడానికే 'లూ' వచ్చినట్లు ఉన్నాడు.
'లూ' లో అరుంధతికి ఒక గురువూ, తండ్రీ, అన్నా, స్నేహితుడు, భావుకుడూ, ప్రేమికుడూ అందరూ కలిసిన విశ్వరూపం గోచరమవుతోంది. "ఇది నువ్వు చెయ్యాల్సిందే" అంటూ అధికారికంగా చెప్పి చేయించకుండా, ఆప్యాయంగా కాదనలేని విధంగా చెప్పడం బహుశా, భగవంతుడు అతనికి ఇచ్చిన వరం!
ఆ కళ్ళ వెనక అంతర్గతంగా, ఈ సమాజం పట్ల ఏదో తెలియని 'కసి' కూడా అరుంధతి గమనించకలదు. అతని మాటల్లోని వాడికీ, వేడికీ, ఆమె ఒక్కొక్కసారి చిగురుటాకులా కంపించిపోతుంది. అంతలోనే సర్దుకుని, అవును! ఈ విధి మమ్మల్ని ఎంత కౄరంగా విడదీసిందీ? ఈ సమాజం ఇన్నాళ్ళుగా నన్ను ఎంతగా ఉపేక్షించిందీ? ఎన్ని ఆనందాలు, ఎన్ని అనుభవాలు ఆవిరైపోయాయి. ఇంత నిస్సారంగా ఇన్ని సంవత్సరాలు ఈ వెధవ బ్రతుకు ఎలా గడిపానూ? అనిపించసాగింది.
* * * *
ఇక్కడ ఏ సాగర మధనం జరుగుతోందనీ, జగన్మోహిని ఇలా నడిచి వస్తోందీ? మను చరిత్రని మరిచి వరూధిని ఇటు వచ్చేస్తోందా? లేక వసు చరిత్రని వదిలి గిరికే ఇలా తన వైపు... అని అభినవ్ ఒక్క నిమిషం అనిమిషుడై, రెప్ప వేయకుండా ఆ సుందరి వైపు చూడసాగాడు.
మామిడిపండు రంగు జరీ చీరకి, కెంపురంగు అంచు, పచ్చని ముఖం మీద దోసగింజంత బొట్టుతో, జడ నిండా కనకాంబరాలు తురుముకుని, తనవైపే వస్తున్న ఆమెని మంజీరగా గుర్తించాక అభినవ్ మరీ ఆశ్చర్యపోయాడు.
"హలో! ఏమిటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నారూ?" అంది కొంగు భుజాల నిండుగా కప్పుకుంటూ.
అతను నవ్వు బిగబడ్తూ, "ఈ రోజు ఏమీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లేదే!" అన్నాడు.
అతని మాటలకి క్షణంలో వెయ్యోవంతు సేపు ఆమె ముఖం అరుణిమా దాల్చింది. అంతలోనే సర్దుకుని "ఇవాళ నా బర్త్ డే" అంది.
"ఔనా!" అని కళ్ళతోటే అడిగి, "మెనీ హాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే" అన్నాడు అభినవ్ సిన్సియర్ గా.
"స్వీట్ తీసుకోండి" అంది చేతిలోని బాక్స్ ఓపెన్ చేసి.
అతను సందేహంగా చూసాడు ఆమె వైపు.
"నోట్లో పెట్టుకోగానే, 'ఢాం' అని పేలే బాంబులు ఏమీ ఇందులో పెట్టలేదు. కావాలంటే నేను సగం మీ ముందే తిని చూపిస్తాను" అంటూ, స్వీట్ ని రెండుగా చేసి, ఓ ముక్క తనే ముందుగా నోట్లో పెట్టుకుంది మంజీర.
అభినవ్ నవ్వి, మిగతా సగం తీసుకుని 'థాంక్స్' అన్నాడు.
ఆమె ఆహ్లాదంగా నవ్వుతూ, "మీ వల్ల నాకు ఈ రోజు ఓ సహాయం జరగాలి" అంది.
అతను అనుమానంగా చూసాడు.
"నాకు తెలుసు! నేను ఏమి అడిగినా, దీని వెనకాల ఏం పధకముందో అని ఆలోచిస్తారని. కానీ ఈ రోజు నా పుట్టినరోజు. అందుకే పాత కోపాలన్నీ మరిచిపోయి, అందరితో స్నేహంగా ఉందామనీ..." అంటూ చెప్తుంటే,
"చెప్పండి ఏం కావాలి?" అన్నాడు అభినవ్.
"గ్రానీ మీ ఇంటి వెనకాల కోవెలలో అభిషేకం చేయించమంది. అది ఎక్కడో నాకు తెలియదు. ఎటూ అదే దార్లో వెళ్తారు కాబట్టి నన్ను కాస్త తీసుకెళ్ళకూడదూ!" అంది ప్రాధేయపూర్వకంగా.
ఆ అమ్మాయి అంత ఒద్దికగా, పొందికగా మాట్లాడకలదని అభినవ్ కి అప్పుడే తెలిసింది. చీర కట్టగానే, ఆరిందాతనం వచ్చేసినట్లుంది అనుకున్నాడు.
"పదండి" అన్నాడు నడుస్తూ.
"చాలా థాంక్స్ అండీ, మీరసలు ఒప్పుకుంటారనుకోలేదు" అంది కృతజ్ఞతగా.
ఇద్దరూ ఇక్కడ గుడిని సమీపిస్తుండగా,
అక్కడ అభినవ్ ఇంటి ముందు నిలబడి, 'జానకిగారు కావాలి" అంటున్నాడో అబ్బాయి.
* * * *
"శ్రీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు" అంటూ దీవించాడు పూజారి.
అభినవ్ ఆమెకి కనిపించకుండా నవ్వాడు.
మంజీరకి అర్థంకానట్లుంది. "ఆ దేవుడు ఎవరు?" అంది రావిచెట్టు క్రిందనున్న చిన్న విగ్రహాన్ని చేత్తో చూపిస్తూ.
"ఆయన సంతాన గోపాలస్వామి, వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చెయ్యండమ్మా, మంచి జరుగుతుంది" అన్నాడు పూజారి.
మంజీర అమిత శ్రద్ధతో కళ్ళు మూసుకుని దాని చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యసాగింది.
అభినవ్ స్తంభానికి ఆనుకుని నిలబడి చూస్తున్నాడు.
* * * *
"ఎవరూ? అరుంధతమ్మగారా? నన్ను గుడికి వెంటనే రమ్మన్నారా? ఎందుకూ?" ఆదుర్దాగా అడిగింది జానకి.
"నాకు తెలియదు. త్వరగా రండి" అన్నాడు ఆ పన్నెండేళ్ళ కుర్రాడు.
"ఉండు వస్తా" అంటూ, ఆమె గూట్లోంచి తాళం కప్పతెచ్చి, తలుపుకి వేస్తూ, "మళ్ళీ కాలేజీలో ఏమీ గొడవ జరగలేదు కదా!" అనుకుంది మనసులో. అంతలోనే, ఆవిడ ఈ మధ్య గుడికి రావడం లేదు. బహుశా సుస్తీ చేసిందేమో. ఆ విషయాలు చెప్పడానికే రమ్మని ఉంటుంది అనుకుంది.
ఆ కుర్రాడితో సమానంగా నడిచేసరికి ఆమెకి గుడి చేరేసరికి ఆయాసం వచ్చేసింది.
ఆమెకంటే ముందే గుడిలోకి వెళ్ళిన కుర్రవాడు, "రెండుసార్లు" గంట మోగించాడు.
ప్రదక్షిణాలు చేస్తున్న మంజీర తిరిగి చూసింది.
అభినవ్ ఆనుకుని నిలబడి ఉన్న స్తంభం వెనకాల వేపు, జానకి వడివడిగా నడిచి రావడం గమనించింది.
జానకి ఆతృతగా నడిచి స్తంభం దగ్గరకి వచ్చేసింది.
మంజీర ప్రదక్షిణాలు చేస్తున్నదల్లా, ఒక్క అంగలో అభినవ్ ని చేరి, గట్టిగా వాటేసుకుని, "మీరు అన్నట్లు రోజూ ఇలా సంతాన గోపాలస్వామికి ప్రదక్షిణాలు చేస్తే మగపిల్లాడే పుడ్తాడంటారా?" అని గట్టిగా అడిగింది.
అభినవ్ కి జరుగుతున్నదేమిటో అర్థం అయ్యేలోపల, జానకి అటు చూసింది. అంతే! ఆమె వారిని ఆ స్థితిలో చూసి, అచేతనమయిపోయి నిలబడింది.
"ఏమిటీ?" కంగారుగా అడిగాడు అభినవ్.
"అబ్బా! మీరే చెప్పారు కదండీ. ఇలా పదకొండు ప్రదక్షిణాలు చెయ్యాలనీ, తప్పా? ఇంకా ఎక్కువ చెయ్యాలా? అసలే వేవిళ్ళ నీరసం, నేను చెయ్యలేను బాబూ! కావాలంటే ఆ మిగతావి మీరే చేసుకోండి!" అంది అతని చెవి మెలిబెడ్తూ.