10
అనాధ శరణాలయాలను గురించి పరిపరి విధాలుగా ఆలోచిస్తూ చంద్రం మెయిన్ రోడ్డు ప్రక్కనే నడుస్తున్నాడు. గుంటూరు పొగాకు వ్యాపారానికి ఘనత వహించింది. ఎన్నో కొత్త పొగాకు బేరన్లూ, గోడౌన్లూ, కంపెనీలూ ఏర్పడ్డాయి. వాటిని గమనిస్తూ హుషారుగా ముందుకుసాగాడు చంద్రం.
గోడదూకి పారిపోతున్న స్త్రీ తన వెనక ఎవరో పరిగెత్తుతున్నట్లు గమనించి సందు గొందులు తిరిగి మెయిన్ రోడ్డు పక్కగా వున్న ఒక పొగాకు బేరన్ లోకి జొరబడి ఒక మూలగా నక్కి నిలబడిన ఆమెను ఎవరిదో బలమైన మొరటుచెయ్యి పట్టుకుంది. ఆమె భయంతో బిగుసుకొని పోయింది. నోట మాట పెగలటంలేదు. ఆమెను ఆ బలమైన చెయ్యి వెలుతురు ముందుకు లాక్కొచ్చింది.
భయంతో వణుకుతూ మొగ్గలా తనలో తానే ముడుచుకుపోతున్న ఆమెను "ఎవరు నువ్వు?" అని గర్జించింది మొగవాడి గొంతు.
ఆ గొంతు విని ఆ అమ్మాయి ఆశ్చర్యంగా అతడి ముఖంలోకి చూసింది - అంతవరకూ భయంతో పాలిపోయిన ముఖంలోకి జీవం వచ్చినట్టయింది.
"నాగూ! నాగేంద్రం! నువ్వా నన్ను గుర్తుపట్టలా! నేనే - నేనే! గౌరిని! గౌరినే!" అంది ఆ అమ్మాయి ఉబికివస్తున్న సంతోషంతో.
"అరె గౌరీ, నువ్వా! ఇంతకాలం ఎక్కడున్నావు? ఆ ఆదెమ్మ ముండ నిన్ను నా నుంచి దూరం చెయ్యటానికే నిన్ను తీసుకెళ్ళి ఎక్కడో దాచేసింది. చివరకు నేను నీరుపోస్తే కాసిన పండు నాకే దక్కిందిలే!" అన్నాడు నాగేంద్రం గౌరిని బలంగా దగ్గిరకు లాక్కుంటూ.
"నాకు ఆకలేస్తోంది; నిన్నంతా పస్తు, ఏమన్నా ఉంటే పెట్టు," అంది గౌరి అమాయకంగా, నాగేంద్రం మాటల్లో అంతరార్థం తెలుసుకోలేక. అతని చేతులనుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించింది.
"మరి నా ఆకలి సంగతో?" అంటూ గౌరిని నాగేంద్రం బలాత్కారంగా దగ్గిరకు లాక్కున్నాడు.
గౌరి బలంగా నాగేంద్రాన్ని వెనక్కు తోస్తూ "నువ్వు మంచోడివి కాదు. నన్ను వదులు," అంటూ పెనుగులాడింది. నాగేంద్రం కౌగిలినుంచి విడిపించుకొని పరుగెత్తబోయిన గౌరిని జడపట్టుకొని వెనక్కు లాగాడు నాగేంద్రం.
"ఎక్కడికి పోతావే? నా మాట విను. నన్ను పెళ్ళి చేసుకో. నీ కోసమే ఇంతకాలంగా ఎదురు చూస్తున్నాను," అంటూ మళ్ళీ గౌరిని గట్టినా రెండు చేతులలో బిగించాడు.
"ఛీ! నన్ను వదులు" అంటూ చెయ్యి కొరికింది.
నాగేంద్రం కోపం బుసలుకొట్టింది. గౌరిని బలంకొద్దీ పట్టుకున్నాడు. గౌరి పెనుగులాడలేక గట్టిగా అరవటం మొదలు పెట్టింది.
"నోరు ముయ్! అరిచావంటే పీక నొక్కుతాను. పైగా నీ అరుపులు విని వచ్చే మగాడు ఎవడూ లేడు ఇక్కడ; జాగ్రత్త!"
గౌరి ఆర్తనాదం ఆ రోడ్డునే ఆలోచిస్తూ నడుస్తున్న చంద్రానికి వినిపించింది. వెంటనే చంద్రం అరుపులు వినిపిస్తున్నవైపు నడిచి బేరన్ లోకి జొరబడ్డాడు.
కళ్ళముందున్న అమానుషకృత్యం చూచిన చంద్రంలో పౌరుషం ప్రజ్వరిల్లింది. ఒక్క దూకులో వెళ్ళి నాగేంద్రం జుట్టు లంకించుకొని దూరంగా లాగాడు. గౌరిని విడిచి నాగేంద్రం చంద్రంతో కలియబడ్డాడు.
నాగేంద్రం దాదాపు నలభయ్యో వడిలో పడ్డాడు. చంద్రం యువకుడు. చంద్రం నాగేంద్రాన్ని గోడకు నొక్కిపట్టి ముఖంలోకి చూశాడు. నాగేంద్రాన్ని వదిలేశాడు.
"ఎవరు నువ్వు?" గర్జించాడు నాగేంద్రం.
"నన్ను గుర్తుపట్టలేదా? చంద్రాన్ని - కృష్ణారావు తమ్ముడ్ని."
నాగేంద్రం ముఖంలో కోపం స్థానాన్ని భయం ఆక్రమించుకున్నది. ఆశ్చర్యంకూడా కలిగింది.
"చిన్నబాబుగారూ! మీరా? ఎప్పుడొచ్చారు? ఇది నా వుప్పు తిని పెరిగినపిల్ల. ఈ విషయంలో కలుగజేసుకోకండి" అన్నాడు నాగేంద్రం, మాటలలో మృదుత్వాన్ని తెచ్చిపెట్టుకుంటూ.
"అహఁ - నువు పెంచిన పిల్లా! ఆ పిల్ల ఎక్కడ పెరుగుతున్నదో నాకంతా తెలుసు. ఇకముందు ఇలాంటి పనులు చెయ్యకు, జాగ్రత్త!" అంటూ గౌరికోసం చూశాడు చంద్రం. ఆమె ఎక్కడా కనిపించలేదు. అవకాశం చూసుకొని పారిపోయిందని తెలుసుకున్నాడు. రోడ్డు ఎక్కిన చంద్రం, రోడ్డు మలుపులో నిల్చొని ఎవరికోసమో ఎదురు చూస్తున్న గౌరిని చూశాడు. చంద్రాన్ని చూడగానే ఆమె ముఖం విప్పారింది. గబగబా చంద్రం దగ్గరకు వచ్చి నిల్చింది.
గౌరిని పరీక్షగా చూశాడు చంద్రం ఆమె అంత ఎత్తూ కాదు, పొట్టీ కాదు, కాయకష్టంతో బొద్దుగా బలంగావున్న శరీరం, నీలం తెల్ల నేత చీరలోంచి కూడా ఆమె శరీర సౌందర్యాన్ని విరజిమ్ముతోంది. చామనఛాయ అయినా ముఖం ఎంతో కళకళలాడుతూ అమాయకంగా కనిపిస్తోంది. పొందికయిన అవయవాలతో తయారుచేసి తిరునాళ్ళలో అమ్మే రంగులు వేసిన మట్టి బొమ్మలా ఉంది అనుకున్నాడు చంద్రం. ఆమెను చూస్తుంటే జాలీ, పారిపోయి ఇలా వచ్చినందుకు అయిష్టం రెండూ కలుగుతున్నాయి చంద్రంలో. వీధిలైటుకింద నిలబడివున్న ఆమె చంద్రం ముఖంలోకి రెప్పవాల్చకుండా చూడటం గమనించాడు. ఆ పెద్ద పెద్ద గుండ్రటి కళ్ళలో ఏదో ఆశ... అమాయకత్వం.... మొండితనం చూస్తున్న చంద్రానికి ఆమెను ఇంతకుముందు ఎక్కడో చూసినట్లనిపించింది.
ఆమె చేతిలో పాతకాలపు చిన్న ట్రంకుపెట్టె ఒకటి ఉంది.
"శరణాలయానికి వెళ్ళు. లేకపోతే చూశావుగా అర్ధగంటన్నా కాలేదు బయటకు వచ్చి ఎంత ప్రమాదం జరిగిందో. నీలా వయస్సులో వున్న ఆడపిల్లలు వున్నచోటు వదలి, బయటకు వంటరిగా వెళ్ళిపోకూడదు."
గౌరి జవాబివ్వలేదు. మౌనంగా తల దించేసుకుంది. ఆమెకు తిరిగి ఆ శరణాలయానికి వెళ్ళటం ఇష్టంలేదని గ్రహించాడు చంద్రం. ఎన్నో విధాలుగా ఆమెకు నచ్చచెప్పటానికి ప్రయత్నించాడు. కానీ ఆమె ఉలకలేదు. పలకలేదు. వెళ్ళనని తలమాత్రం ఒకటి రెండుసార్లు ఆడించింది.
చెప్పి చెప్పి విసుగు పుట్టింది చంద్రానికి. "ఎలాగన్నా చావు - నాకెందుకు?" అంటూ గత్యంతరంలేక ముందుకు సాగాడు చంద్రం.
ఏడు సంవత్సరాలక్రితం తనవాళ్ళంతా చంద్రానికి దొంగతనం అంటగట్టి స్తంభానికి కట్టివేశారు ఆ కట్లు విప్పింది ఓ అపరిచిత బీద బాలిక. అలా ఆమె కట్లు విప్పకపోతే చంద్రం భవిష్యత్తు ఏమయివుండేదో ఊహించటం కష్టమే. 'ఎలాగన్నా చావు నాకెందుకు' అన్న చంద్రానికి ఆ బాలికే ఆ అనాధ అని తెలియదు.
దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి. వస్తున్నాయి. స్వాతంత్ర్యం వచ్చింది. దేశం సర్వతోముఖాభివృద్ధికి వివిధ ప్రణాళికలద్వారా కృషి జరుగుతూంది. కాని సంఘంలో స్త్రీ అంటే దృక్పథంలో ఎలాంటిమార్పూ రాలేదు. వయస్సులోవున్న ఆడపిల్ల తనచుట్టూ తనకోసం ఇతరులు ఏర్పాటుచేసి పెట్టిన అవధులనూ, గోడలనూ దాటి బయటపడి తన అభిరుచికి అనుకూలంగా స్వతంత్రించి బ్రతకాలంటే, గౌరవంగా, క్షేమంగా రెండు గంటలయినా బతకలేదు - ఎందువల్ల? తను ఇల్లు విడిచి పారిపోయాడు. ఆనాటికి తన వయస్సు ఈ అమ్మాయికంటె రెండు సంవత్సరాలు ఎక్కువ ఉండవచ్చు. అదే తను ఆడపిల్ల అయివుండి, ఇంటినుంచి పారిపోయి ఉంటే....
ఆలోచిస్తూ నడుస్తున్న చంద్రానికి ఎవరో తనను వెంబడిస్తున్నట్లు తోచి ఆగి వెనక్కు తిరిగాడు.
ఆ అమ్మాయి ఇంకా తనను వెంబడించడం చూసి ఆశ్చర్యపోయాడు చంద్రం. తను ఆగటంతోనే ఆ అమ్మాయికూడా ఆగి, తలవంచుకొని నిల్చుంది.
"నా వెంబడి ఎందుకొచ్చావ్?" అడిగాడు చంద్రం. జవాబు రాలేదు. వెంటనే ఏదో తోచి పాంటుజేబులో చెయ్యి పెట్టి పదిరూపాయల నోటు తీసి ఆమెకు అందిస్తూ "ఊఁ తీసుకో" అన్నాడు.
ఆ పిల్ల ఒక్కసారి చంద్రం చేతిలోని నోటువైపూ, మరోసారి చంద్రం ముఖంలోకి చూసింది. చేతిలో పెట్టె కింద జారి పడింది. చటుక్కున రెండు చేతుల్తో ముఖం దాచుకొని వెక్కివెక్కి ఏడవసాగింది.
చంద్రం తెల్లబోయాడు. ఆ వయస్సులోవున్న ఆడపిల్ల, ముఖ్యంగా అపరిచిత, పైగా నడిరోడ్డులో ఏడుస్తుంటే, ఏం చెయ్యాలో తోచక తికమకలో పడ్డాడు చంద్రం.
తెల్లగా తెల్లవారింది. ఫ్యాక్టరీల కూతలు వినిపిస్తున్నాయి. కూలీలు గుంపులు గుంపులుగా నడుస్తున్నారు. చంద్రాన్నీ గౌరినీ ఆ విధంగా చూసి అప్పటికే కొందరు వాళ్ళను చుట్టేశారు. ఇది చూసి చంద్రానికి మతిపోయినట్లనిపించింది. పైనించి వస్తున్న టాక్సీని ఆపాడు చంద్రం. చంద్రం వెనకే గబగబా వెళ్ళి టాక్సీ ఎక్కింది గౌరి. చంద్రం ఏమీ అనలేక చూస్తూ ఊరుకున్నాడు. టాక్సీ ముందుకు సాగింది. వెనకనుంచి కూలీల నవ్వులు వినిపించాయి. చంద్రానికి ఏదోగా అనిపించింది.