Previous Page Next Page 
ఆనందం పరమానందం పేజి 18

"అబ్బ! భాష మాట్లాడకే తల్లీ! అర్థమైంది. శారద మీద ఎంత ఇది లేకపోతే షూటింగని తెలిసి కూడా తప్పుడు రేట్లతో నిన్ను మోసం చేస్తున్నారనే ఆందోళనతో  అసలు రేటు చెప్పి అభాసు పాలవుతాడు?" అన్నది వనజ.
శారద మాట్లాడలేదు. లక్ష్మి శారదతో అన్నది -
"అదంతా అతనికి నీమీదున్న ప్రేమకి తార్కాణం. గుప్త ప్రేమ!"
శారద ఆలోచిస్తూనే నడుస్తోంది.

                            *         *        *
సత్యమూర్తి చెప్పే కథకి అడ్డం పడ్డాడు సింహాచలం.
"చెప్పే వాడికి వినేవాడు లోకువ అని ఊరికే అన్నారా? చెవిలో పూలు పెట్టుకుని కూర్చున్నాం కదా అని నీ  ఇష్టమొచ్చినట్టు కథని నడిపిస్తున్నావు కదూ?"
"మధ్యలో అడ్డం పడవద్దని మిమ్మల్ని అభ్యర్థించేను మరిచిపోయేరా?" అన్నాడు సత్యమూర్తి.
"అభ్యర్థన వరకు కరెక్టే! రూలు పాటించకుండా కథ చెబుతుంటే ఎలా సహించగలం? ప్లాష్ బాక్ కథ కాబట్టి నువ్వున్న  సీన్లు చెబుతుంటే కాబోలు అనుకుంటాం, ఒప్పుకుంటాం. అంతేకాని, నువ్వు లేనిసీన్లో నీ గురించి ఎవరెవరో ఏదో అనుకోవడం, ఆ అనుకున్నది అక్షరం పొల్లు పోకుండా నువ్వు మాకు చెప్పడం ఎలా వీలవుతుంది?" అడిగేడు  సింహాచలం.
"అంటే ?" అని అమాయకంగా  అడిగేడు సత్యమూర్తి.
"అంటేనా....ఆ ముగ్గురాడపిల్లలు మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వక్కడ లేవు."
"లేను"
"అందుచేత వాళ్లేం మాట్లాడుకున్నారో నీకు  తెలియదు."
"అఫ్ కోర్స్!"
"కానీ, సమస్తం తెలిసనట్టు తు.చ. తప్పకుండా మాకు ఎట్లా చెబుతున్నావు?" నిగ్గదీసి అడిగేడు సింహాచలం.
"ఓర్ని! ఇదా నీ బోడి డౌటు! తెలుగు సినిమాల్లో ఇది చాలా మామూలైన విషయం. ప్లాష్ బాక్ లో తాను లేకపోయినా, ఆ కథంతా పూర్తి వివరాలతో చెబుతుంటారు. దానికే మంటావు?" అన్నాడు భద్రాచలం.
"అది తెలుగు సినిమా అంటాను. అందుకే జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకి రావలసిన గుర్తింపు రావడంలేదంటాను. మనం వినేది తెలుగు సినిమా కథ కాదే? జీవితం. పచ్చి జీవితం. అది మరిచిపోతే ఎట్లా?" అన్నాడు సింహాచలం.
"క్షమించాలి. నేను చెప్పే కథలో ముందు ముందు ఇలాంటి సన్నివేశాలు అనేకంవుంటాయి. ఆ సన్నివేశాల్లో నేనుండకపోవచ్చు. అంత మాత్రాన అంత వివరంగా ఆ సన్నివేశం ఎలా చెప్పగలిగేవని ప్రశ్నించడం సబబు కాదు. సినిమా సంప్రదాయాన్ని పాటించకపోతే నా కథ నాకు మల్లె నీరసపడిపోతుంది. నిన్నటి వరకు నా సమక్షంలో జరిగిన వివరాలను, నా పరోక్షంలో జరిగిన ఉదంతాలను సేకరించి, రెంటినీ జతచేసి - కథా రూపంలో చెబుతున్నాను. అందుకు మీరు నన్ను క్షమించాలి" అన్నాడు సత్యమూర్తి.
క్షమించేం. తర్వాత కథ  కానివ్వు" అన్నాడు ఆనందం.
సత్యమూర్తి చెబుతున్నాడు.   
                                        22
గోవిందం గారి మేడ.
గొప్ప హొదాగా వుంది. ఎంతో ఖరీదుగా వుంది. కోటి రూపాయలకు పైగా విలువ చేసే అందమైన భవనం.
ఆ మేడ తాలూకు హాలులో-
ఆ ఊళ్లో నిలువెత్తు తైలవర్ణ చిత్రముంది.
ఆ చిత్రంలోని పెద్దమనిషి తళ తళ మెరిసిపోతున్నాడు. ఆ పెద్దమనిషి  ఒంటి మీద రెండు మూడు మణుగుల బంగారం తాపడం చేసినట్టు కనిపిస్తోంది.
ఆ తైల వర్ణ చిత్రాన్ని  తదేకంగా చూస్తున్నాడు గోవిందం.
చిత్రంలోని పెద్దమనిషి పోలికలే అచ్చు గుద్దినట్టు గోవిందులోనూ తాండవిస్తున్నాయి. గోవిందం కళ్లు చెమ్మగిల్లేయి కాబోలు తుడుచుకుంటున్నాడు.
"అంతే మరి. గతం గుర్తు చేసుకుంటే ఎవరికైనా అంతే!" అన్నాడు గెస్టులో ఒకడు.
గోవిందు గంభీరంగా అన్నాడు-
"ఇవాళ మా తండ్రి గారి పుట్టిన రోజు."
"అయితే? సోర్గలోకంలో తమ తండ్రి గారికి సోయంగా దేవేద్రుంలవారే పుట్టిన రోజు పండగ జరిపిస్తార్లెండి! మీరేం దిగు లెట్టుకోమాకండి!" అన్నాడు రెండో పెద్ద మనిషి.
"అచ్చు గుద్దినట్టు తమరంతా తండ్రి గారి పోలికే!" అన్నాడు  మూడో పెద్ద మనిషి.
గోవిందం నిట్టూర్చాడు. తైలవర్ణ చిత్రం నుంచి కదులుతూ అన్నాడు-
"హుఁ, పోలిక లోస్తే సరిపోతుందా రాయుడుగారూ! వారి వైభవంరావద్దూ! సిరిసంపదల్లో వారు పెట్రోమాక్స్ లైటు, నేను కిరసనాయిలు దీపం."
"తమకి మాత్రం తక్కువేంటి? కోటీశ్వరులు."
"హుఁ, కోట్లు ! కోటీశ్వరుడు! కోట్లున్నంత మాత్రాన సరిపోతుందా సత్యంగారూ! ఇంకా ఏదో కావాలండి! అదేదో మా తండ్రిగారికి వుండి మాకు లేదని దిగులు" అన్నాడు గోవిందం.
"తమ తండ్రిగారి పేరేమిటన్నారు?"
"రావు బహద్దూర్ రాంచంద్ర ప్రసాద్ పెదనందిపాడు జమీందారులు. మీకు తెలిసే వుండాలి"  అన్నాడు గోవిందం.
"అప్పుడెప్పుడో అడిగితే తమ తండ్రి గారి పేరు ధన శేఖర ప్రసాదని చెప్పినట్టు గుర్తు" అని గుర్తు చేసేడు గెస్టు.
ఆ హెచ్చరికకు గోవిందం గొప్ప తికమక పడిపోయేడు. అయినా అతి చాకచక్యంగా కంట్రోలు చేసుకుంటూ, చిరునవ్వు మొహాన పులుముకుని అన్నాడు -
"దేవుడికి వెయ్యి పేర్లుంటాయి. మా తండ్రిగారు దేవుడి లాంటివారు. ఏ పేరుతో ఎవరు పిలిచినా పలికే వారు. ఎవరేమి అడిగినా   కుదనకుండా ఇచ్చేవారు."
"అవునవును! మీ జమీ గురించి మా మేనమామ కథలు కతలుగా బోలెడు కతలు చెప్పేవోడు. ఇప్పుడు లేడు లెండి! నా చిన్నప్పుడే పోయేడు" అన్నాడు రాయడు గారు.
కతలు అనేమాట వినపడగానే ఉలికి పడ్డాడు. క్షణంలోనే సర్దుకుని అడిగేడు-
"కథలు కథలుగానా?"
"అదేనండీ, మీ చిన్నతనంలో మీకు బంగారు పళ్లెంలో వడ్డించి పెట్టెవారంట!"
"దందేముందిలెండి! అవన్నీ ఆనాటి ముచ్చట్లు."
"అతనంత మాట అంత ధీమాగా చెప్పగానే, స్టోరు గది నుంచి డబ్బాలు దోర్లించిన శబ్దాలు గోవిందానికి వినిపించేయి. ఆ శబ్దాలు మిగతావారి క్కూడా వినిపించి వుంటాయనే డౌట్ తో అడిగేడు-
"ఇప్పుడు మీకు కొన్ని శబ్దాలు వినిపించి వుంటాయి"
"వినపడలేదే!" అన్నారు అతిథులు.
"అవున్లెండి.,మీకు వినిపించవు. అవి నాకే వినిపిస్తాయి."
"అంతే మరి! సాక్షాత్తూ లక్ష్మీదేవి పుత్రులు. ఆ తల్లి గజ్జెల మోతమీకే వినిపిస్తుంది కానీ మా కెందుకు వినిపిస్తుంది.? దేనికైనా పెట్టి పుట్టాలి!" అన్నాడు రాయుడు.
మళ్లీ వినిపించింది డబ్బాల శబ్దం గోవిందానికి.
ఇప్పుడు  ఇంతటితో సభ చాలించకపోతే డబ్బాల శబ్దాల మెదడ్ని పాడుచేస్తాయని గత అనుభవమ్మీద తెలుసుకున్న గోవిందం -
"ఇంతకీ మీ రాకకు కారణం" అని  అడిగేడు.
రాయుడు  గారు సర్దుక్కూర్చుని చెబుతున్నాడు-
"మీకు తెలీందేముంది? ఎన్నిక లొస్తున్నాయి. మన పార్టీకి మీ మద్దతు కావాలి."
"అంతే కదా! నాకు  రాజకీయాలంటే చెడ్డ చిరాకు. మా తండ్రి గారి క్కూడా అంతే! ఆ రోజుల్లో పండిత నెహ్రూ మా తండ్రి గారిని  మఖ్యమంత్రిగావుండమని కబురంపితే, ఎంతో వినయంగా మా తండ్రిగారు నెహ్రూగారి కోరికను తిరస్కరించేరట!" అని  గోవిందం ఇంకా ఏదో  చెబుతుండగా -
స్టోరు గదిలోంచి డబ్బాలమోత గోవిందం చెవులు చిల్లులు పడే స్థాయిలో వినిపిస్తున్నాయి. ఆ బాధ భరించలేక గబగబా  అనేసేడు గోవిందం-
"గతం ఎందుగ్గాని, అడిగారు కనుక నా మద్దతు మీకే వుంటుంది సెలవు!" అని చేతులు జోడించేడు.
అతిథులు ప్రతి నమస్కారం చేసి హాలు విడిచిపెట్టేరు.

 Previous Page Next Page