అజయ్ ఆవేశం చల్లారిపోయింది. తెల్లబోయాడు. "కోమల్ ఏడుస్తున్నావా? ఏమైంది కోమల్! ఎవరైనా ఏమన్నా అన్నారా? ఒంట్లో బాగుండలేదా? అందరి ఆడపిల్లల్లాగా తొలి రాత్రి అనంగానే ఏదో అని భయపడుతున్నావా?" ఆతృతగా అడిగాడు.
కోమల్ దేనికీ జవాబు చెప్పలేదు. రెండు చేతులూ ముఖానికి కప్పుకుని నెమ్మదిగా ఎక్కిళ్ళు పెడుతూ ఏడవటం మొదలుపెట్టింది.
ఏం చేయాలో తెలియలేదు అజయ్ కి. కన్నీళ్ళు బయటికిపోతే మనసు తేలికై విషయం చెపుతుందని అలా నుంచుండి పోయాడు.
కొద్దిసేపు తర్వాత కోమల్ ఎక్కిళ్ళు ఆగాయి.
"కోమల్!" అంటూ మళ్ళీ దగ్గరకు రాబోయాడు అజయ్.
మామూలే కోమల ఈ తఫా రెండడుగులు వెనక్కి వేసింది. చేతులు చాచి వారిస్తూ ఉన్మాదిలా "రావద్దు నా దగ్గరకు రావద్దు...నన్ను ముట్టుకోవద్దు" గట్టిగానే చెప్పింది.
అజయ్ నిర్ఘాంత పోయాడు. కోమల్ స్వరంలోని స్థిరత్వం దీనికి తిరుగులేదు అని తెలియకనే తెలిసి పోతుంది. నిన్నటి దాకా సరదాగా వుండి చూపులతో వేయి మాటలు తెలియచేసిన తన కోమల్ ఉదయం సరదాగా డేరింగ్ తో తనకి లెటర్ రాసిన తన కోమల్ ఇప్పుడు ఏడ్చింది. అంతే కాదు. దగ్గరకు రావద్దు ముట్టుకోవద్దు అని చెప్పేసింది. ఇది తమాషా కాదు లవ్ గేమ్ కాదు సరదాగా ఏడిపించటం కాదు. చిరుకోపం వెల్లడించటం కాదు. కోమల్ స్నేహితురాళ్ళు మాట్లాడుకుంటుంటే తాను సాయంత్రం విన్నాడు. "కోమల ఉదయం లాగాలేదు ఏదో దిగులుగా వుందికదూ?" ఒకమ్మాయి అంటే దానికి జవాబుగా రెండో అమ్మాయి. "ఒసేయ్! నీకు కోడి గుడ్డు మీద ఈకలు పీకటం అలవాటే కదా! ఫస్ట్ నైట్ అంటూ ఉదయం నుంచీ కోమల్ ని మనం ఆటలు పట్టిస్తుంటే. మన ఆనందం పాడు చెయ్యటం ఎందుకని మనతోపాటు తానూ మాటలు విసురుతూ సరదాగా గడిపింది. రాత్రవుతున్నది, దాన్ని కాసేపయినా వదిలామా, కాసేపు మధురంగా ఆలోచించుకోవటానికి! ఇహ విసుగు పుట్టి ముఖం గంభీర్యం చేసుకుని కూర్చుంది. దానిమౌనంలో అర్ధం పెళ్లిగాని నీకేం తెలుసే!" ఇలా సాగాయి వాళ్ళమాటలు. అప్పుడు వారి మాటలు విన్న తను మనసార నవ్వుకున్నాడు ఇది నవ్వే విషయం కాదు.
"దగ్గరకు తీసుకోక ముట్టుకోక సంసారం ఎలా చేయాలోయ్" అజయ్ నవ్వు బలవంతానా తెచ్చుకుని అడిగాడు.
"సంసారందాకా దేనికి నన్నుముట్టుకోవద్దు అన్నాను అంతే దయచేసి నన్ను వేధించక వెళ్ళి పడుకోండి."
"ఉదయం రాసిన లెటర్ కి అర్ధం."
"నా బుద్ది తక్కువ."
"మన పెళ్ళికి అర్ధం"
"తెలివి తక్కువ, తొందరపాటు, నా గ్రహపాటు."
అకస్మాత్తుగా పిడుగుపాటు తగిలినట్లయింది అజయ్ కి. మాటకు మాట తడుముకోకుండా విసురుతున్నది అనుకున్నాడు.
"నీలో ఈ మార్పుకి కారణం?"
"మార్చటం ఏమార్చటం వూసరవిల్లిలా రంగులు మార్చటం నా తత్వం కాదు" టకీమని జవాబిచ్చింది కోమల.