ఆ పిల్ల చెప్పింది ఏమిటో బొత్తిగా అర్ధంకాకపోయినా అదేదో చాలా ప్రమాదకరమైన విషయమేనని తట్టగానే ఎందుకైనా మంచిదని ఎడాపెడా చప్పట్లు కొట్టారు.
ఇలా ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే ఒక్కోరకంగా అనుకోవటం జరిగింది. మొత్తానికి సభలో చలనం, ఆనందం వగైరాలు చోటు చేసుకున్నాయి.
జయంతి లేచి నుంచుంది.
"సభలో అందరూ చాలా చక్కగా అద్భుతంగా మాట్లాడారు. చాలా విషయాలు మనం తెలుసుకోవటం జరిగింది. అందరూ మాట్లాడిన తరువాత అధ్యక్షురాలు మాట్లాడి సభ చాలించటం పధ్ధతి. ఆ పధ్ధతి ప్రకారం నాలుగు ముక్కలు మాట్లాడి నేను సభ ముగిసింది అని చెపుతాను. అప్పుడు మీరు లేచి మీమీ ఇళ్ళకి వెళ్ళవచ్చు." అంది జయంతి.
ఈ సందర్భంలో చప్పట్లు కొట్టాలో లేదో తెలియని ఓ ఇల్లాలు చప్పట్లు కొట్టింది. దాంతో తతిమ్మా వాళ్ళుకూడా కొట్టారు.
"దీక్ష అనే అమ్మాయి విచిత్ర రాతలు గల పాంప్లెట్లు పంచి పెట్టటం వల్ల ఆమె చేతలు, రాతలు మనకి అర్ధంకాక అందరం ఇక్కడ సమావేశం అయి చర్చించుకున్నాము. ఎవరికి తోచింది వారు చెప్పారు.
మనలో కొందరు ఆమె నక్సలైటేమో అన్నారు. నక్సలైటు, కమ్యూనిస్టు, రాడికల్స్ అంటూ మనం రాజకీయాలు పులమవద్దు. సంఘ విద్రోహి అన్నారు. అంత పెద్దమాట వాడే అవసరం లేదు. దొంగల తాలూకు మనిషేమో అన్నారు. ఇది కొద్దిగా ఆలోచించ తగినమాట.
రేపు దీక్ష వచ్చినప్పుడు అందరూ తెలివిగా వీధిలోనే మాట్లాడి పంపండి. అంతేకాదు. 'ఇలా ఎన్నాళ్ళు కాగితాలు పంచుతావు. నిజం చెప్పకపోయావో పోలీసు రిపోర్ట్ యిస్తాము.' అని పై పై మాటలతో బెదిరించండి. మరీ తీవ్రంగా బెదిరించడం మంచిది కాదు గాబట్టి పై పై బెదిరింపు మాత్రమే చేయాలి.
రేపు ఫలితాలు చూసుకుని మళ్ళీ మనం కలుసుకుని ఈ విషయం చర్చించుకుందాము. ఇక్కడ అందరూ ఆమె విషయంలో తలోరకం అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని అందరూ వ్యక్తం చేసిన అభిప్రాయం ఒకటుంది. ఆమె పంచుతున్న పాంప్లెట్లు చీరలు, సబ్బులు వగైరా ప్రకటన తాలూకావి మాత్రం కాదు. ఈ విషయంలో మీ అభిప్రాయము, నా అభిప్రాయమూ ఒకటే.
పబ్లిసిటీ అనేది అందంగా ఆకర్షణీయంగా మృదువుగా వుంటుంది. భయంకరమైన రాతలతో వుండదు, ఏది ఏమైనా మనమంతా యిలా కలసికట్టుగానే వుండి మరో రెండు రోజులు ఓర్పుగా వేచి చూడటం మంచిది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ అందరం సమావేశం అయి ఏం చేయాలి అన్నది ఆలోచిద్దాము. అనుభవంతో తలలు పండిన మీ ముందు నేను చాలా చిన్నదానిని అయినా మీరు దొడ్డ బుద్ధితో పెద్ద మనసుతో నాకీ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెపుతూ యింతటితో సభ ముగిసిందని చెపుతున్నాను."
జయంతి ముగించింది.
అందరూ పొలోమంటూ లేచారు.
క్రొత్తొక వింత పాతొక రోత.
ఇది కొత్త వింత.
ఈ కొత్త వింతలో పాల్గొన్న అందరూ ఆనందంతో ఇళ్ళకి బైలుదేరారు.
- 10 -
దీక్ష ఆ వీధిలో అడుగు పెట్టింది.
తను చేపట్టిన కార్యం ఎవరూ వూహించనిది. తను పంచిన పాంప్లెట్లు ఈ సరికే చిన్న గందరగోళాన్ని సృష్టించి వుంటాయి. వాళ్ళంతా తనని గురించి ఏమనుకుంటున్నారో! ఏమనుకున్నా ఫరవాలేదు. అసలు రహస్యం తెలుసుకోకుండా వుంటే చాలు. అప్పుడే తను విజయం సాధించగలుగుతుంది....