Previous Page Next Page 
ఆమని కోయిల పేజి 18

    దీక్ష ఆలోచనలోకి రానిది మరొకటి వుంది.

    ఇల్లాళ్ళు ఇదివరకటి ఇల్లాళ్ళు కాదని...

    సహనానికికూడా ఓ హద్దు వుందని...

    ఆటలు యికపై సాగవని...

    అవసరమైతే రణభేరి మోగించటానికి సిద్ధంగా వున్నారని...

    ఇవేమి దీక్షకి తెలియవు.

    ఈ రోజు దీక్ష మహా హుషారుగా వుంది.

    ఇదేరోజు ఇంటింట ఆడవాళ్ళు పారాహుషారుగా వున్నారు.

    షరా మామూలే! దీక్ష ఓ యింటి తలుపుల మీద మునివేళ్ళతో సుతారంగా కొట్టింది.

    తలుపులు తెరుచుకున్నాయి.

    మందారవర్ధిని బైటికి వచ్చింది.

    పాంప్లెట్ కోసం సంచిలో చేయిపెట్టింది దీక్ష.

    "ఏమిటి మళ్ళీ ఆ దిక్కుమాలిన కాగితం యివ్వటం కోసమే వచ్చావా! చూడమ్మాయ్! నీ వరస నాకు బొత్తిగా నచ్చలేదు. ఒకరోజు కాదు.

రెండు రోజులు కాదు. దరిదాపు వారంనుంచీచూస్తున్నాను. అసలు నీవెవరు! ఈ పిచ్చిపిచ్చి రాతల కాగితాలు ఏమిటి?"

    మందారవర్ధిని రుసరుసలాడుతూ అడిగింది.

    "ఆడవాళ్ళకి సహనం ఎక్కువ. వేచి చూడండి వర్ధనిగారూ!" దీక్ష సంచిలోంచి పాంప్లెట్ తీసి నవ్వుతూ అంది.

    "ఇంకా ఎంత రెండు రోజులు." అంది మందారవర్ధని.

    "దేనికి వర్ధనిగారూ!"


    'ఈ పిల్ల సామాన్యురాలు కాదు. మేడమ్ గీడమ్ అంటూ పిలిచేది కాస్తా పేరుపెట్టి పిలిచేవరకూ వచ్చింది. అంటే ఈ పిల్ల అన్ని ఆరాలూ

బాగానే తీస్తున్నది. జాగ్రత్తగా మాట్లాడాలి.' అనుకున్న మందారవర్ధని "ఇవాళ రేపటిలో ఆలోచించుకుని రేపు నీవు వచ్చినప్పుడు నిజం చెప్పాలి..." అంది

తీవ్ర స్వరంతో.

    "నిజం అంటే?"

    "నిజమే."

    "మీరు సరీగా చెపితేకాని నాకు అర్ధంకాదు వర్ధనిగారూ!"

    "నువ్వెవరు! ఈ కాగితాలు యిలా పంచటం దేనికి! ఈ రాతలకి అర్ధం ఏమిటి! ఈ నిజం చెప్పకపోతే మేము వూరుకోము. ఇంత వరకు

మర్యాదగా ఎందుకు వూరుకున్నామంటే సాటి ఆడదానివన్న జాలితో పోలీసులదాకా పోలేదు." అంది మందారవర్ధని.

    నిన్నటి మీటింగు ఫలితంగా మందారవర్ధని కొత్త శక్తి పుంజుకుంది. దీక్షని ఎడాపెడా వాయించాలన్నంతగా...

    మందారవర్దని ధోరణి బట్టి దీక్ష విషయాన్ని పసిగట్టింది. 'మేము అంటున్నది ఈవిడ అంటే తనమీద దాడి చేయటానికి కొందరు కలిశారన్న

మాట! ఇదీ మంచిదే' అనుకుంది.

    "నాకు తెలుసు వర్ధనిగారూ! మీలాంటి పద్మిని జాతి స్త్రీలే సహనానికి మారుపేరులా, స్త్రీ జాతికి వన్నెతెస్తూ, మానవత్వం, మంచితనం,

మూర్తీభవించి వుంటారని. మీలాంటి సద్గుణవంతులు సాటి స్త్రీ మీద దయ, సానుభూతి గలవారు..."

    దీక్ష చిరునవ్వుతో అలా గంభీరంగా మాట్లాడుతుంటే నిన్నటి విషయం మర్చిపోయింది మందారవర్ధని. బొడ్డుమల్లె పూవులా ఆమె ముఖం

విచ్చుకుంది. అప్పటికప్పుడే పొద్దుతిరుగుడు పూవులా నిన్నటి అటు ముఖం ఈ నిమిషాన ఇటు తిరిగింది.

    "అదికాదు అమ్మాయీ!" ఏదో చెప్పబోయింది మందారవర్ధని.

    "మీ ఉదారబుద్ధి నాకు తెలుసు. మీ సహనానికి యింకా నేను పరీక్ష పెట్టను. రేపు సాయంత్రం మీరు మా ఉచిత ప్రదర్శనకి రావాలి.

మీలాంటి వారి మాట, మంచితనం, సహకారం కావాలి. మీతోపాటు మీకు తెలిసిన ఆడవాళ్ళని తీసుకురండి." అంటూ ఆమె చేతికి పాంప్లెట్ యిచ్చింది

దీక్ష.

    అది పాంప్లెట్ కాదు ఆహ్వానము.

    ఈ రోజు ఏం రాతలు వున్నాయో అని మందారవర్ధని చూసింది.

    కాగితం మీద....

    కదలిరండి! కదలిరండి!!

    అమ్మలారా! అక్కలారా! చెల్లుల్లారా!

    కలసికట్టుగా కదలిరండి!

    కట్టకట్టుకుని తరలిరండి!

    మీరు వారం రోజులుగా ఎదురుచూసిన శుభదినం.

    మీరు ఇన్నాళ్ళు వేచిచూసిన మధురక్షణం.

    వచ్చేసింది! వచ్చేసింది!!

    మీరు మా ప్రదర్శన ఫ్రీగా చూడటం తప్ప పైసాపెట్టి కొనే పనిలేదు. అయిదుపైసలు ఖర్చుపెట్టె అవసరం లేదు. మీరు కనీ వినీ ఎరుగని

అద్భుత ప్రదర్శన. అంతా స్త్రీలు పాల్గొని చూపించేది. స్త్రీలకి మాత్రమే ప్రవేశము. ఈ ప్రదర్శన స్త్రీలకు సంబంధించినది.అత్యద్భుతమైనది.  

 Previous Page Next Page