తను ప్లాన్ చేసుకున్న సిన్సినాటి యూనివర్సిటీ లో ఎం ఎస్ లో చేరాడు.
అప్లై చేయడం నుంచి అక్కడ అకామడేషన్ వరకు విద్య కూతురు శ్రీష చాలా హెల్ప్ చేసింది.
ఆ అమ్మాయి రెండో సంవత్సరం చదువుతోంది ఆ యూనివర్సిటీ లో.
మోహిత్ కూడా అక్కా అక్కా అంటూ తనతో బాగా క్లోజ్ అయ్యాడు.
మోహిత్ తో పాటు రేణూ కు కూడా శ్రీషతో బాగా చనువు ఏర్పడింది.
మోహిత్ యూనివర్సిటీలో జాయిన్ అయినపుడు శ్రీష తనే రిసీవ్ చేసుకుని అన్ని ఏర్పాట్లూ చేసింది.
దాంతో రేణూకి శ్రీష మీద ప్రేమ పెరిగిపోయింది.
విద్య తో కూడా రేణూ రోజూ వాట్సాప్ లో వీడియో కాల్స్ మాట్లాడు కుంటోంది.
అవన్నీ కృష్ణకుమార్ విన్నా వినకపోయినా రాత్రి ఏకరువుపెడుతూ ఉంటుంది.
అతను అన్యమనస్కంగానే వింటుంటాడు.
కోటి బ్రాంచ్ లో టార్గెట్స్ రీచ్ అయ్యి అద్భుతమైన పెర్ఫార్మన్స్ కనబరిచినందుకు ఏటా ఇచ్చే ప్రమోషన్స్లో కృష్ణకుమార్ కి డిప్యూటీ జనరల్ మేనేజర్ గా ప్రమోషన్ ఇచ్చి ముంబై కి జోనల్ మేనేజర్ గా వేశారు బ్యాంకు వారు.
ముంబై అనేప్పటికీ రేణూ ఎగిరిగంతేసినంత పని చేసింది.
ఇంకేముంది విద్యక్క ను తరచూ కలుస్తూ ఉండొచ్చు అని హ్యాపీగా ఫీల్ అయ్యింది.
కృష్ణకుమార్ కు ఇచ్చిన బ్యాంకు క్వార్టర్స్ కు దగ్గరలోనే విద్య ఉండే అపార్ట్మెంట్స్.
విద్యావతి, రేణూ మధ్య వాట్సాప్ హాట్ లైన్ గా మారి రోజంతా బిజీ గా ఉంటున్నారు కబుర్లతో.
తరచూ వారానికి రెండు సార్లు కలవడం మొదలుపెట్టారు విద్య, రేణూ.
అప్పుడప్పుడు కృష్ణకుమార్ ఇంటికి వచ్చేప్పటికి విద్య ఎదురవుతోంది.
వారిద్దరి మధ్య బ్యాంకు విషయాలు తప్ప మాటలు ముందుకుపోవడంలేదు.
రేణు, విద్య ల మధ్య రాకపోకలు బాగా ఎక్కువయ్యాయి.
కృష్ణకుమార్ వర్క్ లో బాగా బిజీ కాబట్టి అవి పట్టించుకోవడం మానేసాడు.
విద్య వాట్సాప్ మెస్సేజిస్ కూడా ముఖ్యం అనుకుంటే స్పందించేవాడు. లేకుంటే అసలు చూసేవాడు కాదు.
రేణూకి తన రచనల గురించి చర్చించేందుకు ఇప్పుడు విద్య ఫుల్ టైం శ్రోత గా దొరికింది.
అమ్మయ్య అనుకున్నాడు కృష్ణకుమార్ తనకు ఆ బాధ్యత తప్పించినందుకు.
విద్య కూడా ఓపిగ్గా రేణూ కధలన్నీ విని తన ఆలోచనలను చెప్తుంది.
అది రేణూకి ఎంతో నచ్చింది కూడా.
రేణు సీరియల్ వెబ్ సిరీస్ లో సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది.
ఆ విషయంలో మాత్రం చాలా అసంతృప్తి కలిగింది కృష్ణకుమార్ కి . ఆ సీరియల్ అంతా చూసాడు కానీ ముగింపు మాత్రం చూడకుండా చాలా సార్లు తప్పించుకున్నాడు. ఎందుకంటే రేణూ హీరో కి ఇద్దరు హీరోయిన్లతో ముడిపెడుతుంది చివరలో. ఆ ఒక్కటి కృష్ణకుమార్ అభిప్రాయానికి వ్యతిరేకం. అందుకే ముగింపు చూడటం చాలా సార్లు దాటవేశాడు. అయినా పెద్దగా పట్టించుకోలేదు రేణూ ఆ విషయం.
తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అనేది సామెతేకాదు యదార్థం కూడా.
విధి చేయు వింతలన్నీ మతిలేని చేష్టలేనని అని ఒక కవిగారు తన సినిమా పాటలో అన్నట్లు ఒక్కోసారి విధి తమాషాలు చేస్తుంటుంది తన తడాఖా ఏంటో మనుషులకు చూపించేందుకు.
అలాంటి ఒక తమాషా కృష్ణకుమార్ జీవితంలో అనూహ్యంగా జరిగింది.
అతని జీవితాన్నే మలుపు తిప్పింది.
కాలం మౌనంగా తన పని తను చేసుకుపోతున్న తరుణంలో ఓ రోజు
రేణూ ఫోన్ చేసి కృష్ణ కుమార్ ని ఇంటికి త్వరగా రమ్మని చెప్పింది.
ఎంత తెమిలినా ఆరు గంటలకు ఇల్లు చేరగలిగాడు. మరి జోనల్ మేనేజర్ కదా. బ్యాంకు లో బిజీ బిజీ గా ఉంటాడు అతను.
ఇంటికి రాగానే అతనికి ఇష్టమైన ఆనియన్ పకోడీ టిఫిన్ పెట్టి, వేడి వేడి ఫిల్టర్ కాఫీ ఇచ్చింది రేణు.
ఏంటబ్బా ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ అనుకున్నాడు.
తను ఎప్పుడూ చీరలు, బంగారం లాంటివి కోరదు.
అసలు తమ వైవాహిక జీవితంలో అలాంటి పేచీలు ఎప్పుడూ లేవు ఇద్దరి మధ్య.
మిమ్మల్ని ఒకటి అడుగుతానండి అంది గోముగా.
అడుగు అన్నాడు ఏమైఉంటుందా అని ఒకవైపు ఆలోచిస్తూ.
నాకు ఒక్కతే ఇంట్లో బోర్ కొడుతోందండి అంది ఇండైరెక్టుగా.
పనమ్మాయిని కాస్త నేను వచ్చేవరకు ఉండమను. కబుర్లు చెపుతుంటుంది. నీకు హిందీ బాగా వచ్చుగా. తను కూడా బోలెడన్ని కధలు చెప్తుంది. అవి నీ సీరియల్స్ కి బాగా పనికొస్తాయి అన్నాడు నవ్వుతూ.
ఊహూ అది కాదు అంటూ మూతి సున్నాలా చుట్టింది.
అలా చేస్తే అది ఆమె ప్రయోగించే బ్రహ్మాస్త్రం అన్నమాట.
ఎవరెస్టు లాంటి కృష్ణకుమార్ ఆ అస్త్రానికి ఆసాంతం కరిగిపోతాడు.
ఆ విషయం ఆవిడకి బాగా తెలుసు.
చెప్పరా రేణు నీకేం కావాలిరా బుజ్జి అని దగ్గరికి తీసుకున్నాడు రేణూ ని.
ఆ సమయంలో మాట్లాడేప్పుడు అతని వాయిస్ లో మంచు కురుస్తుంటుంది. భార్య ని కోపగించుకున్న దాఖలాలు అతని డైరీ లో అసలు లేవు. కసురుకోవడం కూడా అసలే లేదు ఇప్పటివరకు.
ఆవిడకు ఎంతో మర్యాద ఇస్తాడు. అది అతని నైజం.
నేను అడిగితే మీరు నో అనకూడదు అంది గారాలు పోతూ.
ఇక తట్టుకోవడం కష్టమయ్యింది కృష్ణకుమార్ కి. అదేదో చెప్తే కదా బేబీ అన్నాడు.
వెబ్ సిరీస్ లో నా సీరియల్ ఎండింగ్ మీకు బాగా నచ్చింది కదా అంది అతని మొహంలోకి కొంటెగా చూస్తూ.
మింగలేక, కక్కలేక పొలమారినట్లు ఏదో అనబోయాడు కీచు గొంతుతో.
నాకు తెలుసు లెండి. ఆ ఇద్దరు భార్యల అంశం మీకు బాగా నచ్చింది. అవునా అంది.
ఏదో పనున్నట్లు లేవబోయాడు.
రేణూ వదల్లేదు. విద్యక్క ను మీరు పెళ్లిచేసుకోవాలి అంది ఇక నాన్చకుండా.
పక్కలో బాంబు పడ్డట్లు ఉలిక్కిపడ్డాడు.
నిశ్చలమైన సరస్సులాంటి అతని జీవితంలో ఒక పెద్ద కొండ రాయి పైనుంచి దొర్లి దభాలున పడ్డట్లు ఫీలింగ్.
ఇక తను నోరు విప్పకపోతే పెద్ద ప్రమాదంలో పడేట్లున్నాడు.
రేణూ . నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్ధమవుతోందా. ఇలాంటివి నిజ జీవితాల్లో ఎక్కడా జరగవు. అసలు నీకీ ఆలోచన ఎందుకొచ్చింది. ఇది చాలా ప్రమాదం రా రేణూ. ప్లీజ్. అలాంటి ఆలోచనలు మానుకో. ఇప్పుడు తనకేం బాగానే ఉంది కదా కొడుకు దగ్గర. మీరిద్దరూ వారంలో మూడు రోజులు కలుస్తున్నారు. ఇంకేం కావాలి. ఇలాంటి నిర్ణయం వలన నాకెంత ప్రమాదమో ఆలోచించావా. వద్దు రేణూ ప్లీజ్. ఇలాంటివి మనకొద్దు. ఇలా అయితే నేను వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను అన్నాడు గట్టిగా.
ఎంత గట్టిగా అన్నా కోపం మాత్రం లేదు అతని స్వరంలో.
అతని బలహీనత రేణూ కి బాగా తెలుసు.
భార్య మాటను త్రోసిపుచ్చలేడు కృష్ణకుమార్.
ఎందుకంటే ఆమెను తనకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు కనుక.
****
ఆ రోజు నుంచి ఇంట్లో ముభావంగా ఉండటం మొదలు పెట్టాడు.
అలాగైనా రేణు తన మనసు మార్చుకుంటుందేమోనని.
తన సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలీలేదు కృష్ణకుమార్ కి.
ఇదొక వింత సమస్య. ఎవరైనా వింటే నవ్వుతారు.
ఎవరితో చెప్పినా తనకు అభాసుపాలు తప్పదు.
లోకమంతా తనవైపే చూసి నవ్వుతున్న ఫీలింగ్.
ఒక నెల అతి భారంగా గడిచింది.
ఈ నెల రోజుల్లో ఇంటికి ఆలస్యంగా రావడం.
పొద్దున తొందరగా వెళ్లడం చేస్తున్నాడు.
అంతా గమనిస్తూనే ఉంది రేణు.
ఆమెకు మటుకు తన మాట నెగ్గుతుందన్న నమ్మకం ఉంది .
అందుకే తనూ బెట్టుగా ఉంది ఏమీ పట్టించుకోనట్లు.
కృష్ణకుమార్ ఒక్కో రోజు కరిగిపోదామని మనసులో అనుకున్నా భవిష్యత్తు తలచుకుని ఇద్దరి భార్యల నడుమ తనని ఊహించుకుని మనసు గట్టి చేసుకునేవాడు.
ఈ విషయంలో ఏదైనా అద్భుతం జరిగి రేణూ మనసు మారితే అని కనిపించిన దేవుళ్ళకి, దేవతలకి భారీగా మొక్కు కున్నాడు.
అటు వైపు రేణూ కూడా అలానే మొక్కుకుంది.
ఇంకో రెండు నెలలు గడిచాయి.
రేణూ లో ఏ మార్పూ లేదు.
తన పాటికి తను వండి టేబుల్ పైన పెట్టేది.
కృష్ణ కుమార్ వడ్డించుకుని తినేవాడు.
రచనల్లో బిజీ గా ఉండటం ప్రాక్టీస్ చేస్తోంది ఓ కంట భర్తని గమనిస్తూ.
భార్య రచనలంటే భయం పట్టుకుంది కృష్ణకుమార్ కి .
ఇలాంటి కొత్త కొత్త వింత వింత ఆలోచనలు వచ్చి అవి రచనలు గా మారి జనాలమీదకు వైరస్ లా విరుచుకు పడితే పాఠక లోకానికి దిక్కెవరు అన్న దిగులు పట్టుకుంది.
అందులో ఇలాంటి రచనలకి వాక్సిన్ కూడా ఉండదు.
చూస్తుండగానే ఆరు నెలలు గడిచాయి.
రేణు మాత్రం వీసమెత్తైనా కరగడం లేదు.
రోజు రోజుకు గట్టిపడుతోంది.
ఇక తప్పలేదు కృష్ణకుమార్ కి.
సరే తనే మాట్లాడి చూద్దాం అని ఆరోజు ఇంటికి తొందరగా వచ్చాడు.
తగ్గితే తప్పేముంది అనుకున్నాడు.
అందులోనూ తను అమితంగా ప్రేమించే తన భార్య దగ్గర.
ఏమీ తప్పులేదు అని మనసు పదే పదే చెప్పింది.
ఇంటి గుమ్మంలో అడుగుపెడుతూనే రేణూ, విద్య మాటలు బిగ్గరగా వినిపిస్తున్నాయి.
ఏవో జోక్స్ వేసుకుంటున్నారు.
పెద్దగా నవ్వుతున్నారు.
ఓహ్ ఇద్దరూ ఇక్కడే ఉన్నారు.
ఇవాళ ఇక తాడో పేడో తేల్చుకోవాలి అనుకుని ఫుల్ హాండ్స్ పైకి మడుచుకున్నాడు.
రేణూ అని గట్టిగా అరవబోయి అలవాటులేక రేణూ అని మార్దవ స్వరంలోనే అభ్యర్ధిస్తున్నట్లు పిలిచాడు.
పిలిచింది తడవుగా రేణూ వచ్చింది అతని పిలుపు కోసం ఎంతగానో వేచి చూస్తున్నట్లు, పరితపిస్తున్నట్లు.