ఎందుకో అతనికి ప్రశాంతంగా సాగుతున్న తన జీవితంలో కొత్త మార్పులు తలెత్తి కొత్త సమస్యలకు దారితీసేట్లు పదే పదే అనిపిస్తోంది.
కానీ ఏమి చెయ్యగలడు.
మనమంతా విధి చేతిలో కీలుబొమ్మలం కదా !
అది ఎలా ఆడిస్తే అలా ఆడాల్సిందే.
తెలిసి తప్పు చెయ్యకూడదు అనేది అతని సిద్ధాంతం.
అందుకే విద్యావతి విషయంలో మనసును చాలా అదుపులో ఉంచాడు.
ఇంకా భద్రంగా ఉండాలని ఆంజనేయస్వామి మూర్తిని తన బంగారు గొలుసులో ఉంచి మెళ్ళో వేసుకున్నాడు ఇక తన మనసు బ్యాంకు లాకర్ లో ఉన్నట్లే అని ధీమాగా అనుకున్నాడు.
****
కాలం ఎవరికోసం ఆగదు.
రోజులు చాలా వేగంగా పరుగెత్తుతున్నాయి.
ఓ ఏడాది గడిచింది.
ఈ ఏడాది అందరి జీవితాలలో ఎన్నో మార్పులు తెచ్చింది.
అనుకున్న సమయానికి విద్యావతి కి విడాకులు మంజూరు చేసింది కోర్ట్.
ఆ విషయంలో కిరణ్ ఎంతో సహాయం చేసాడు.
కోర్ట్ లో విద్యావతి కి ఏ ఇబ్బంది కలగకుండా మూర్తి ని పోలీసుల ద్వారా కంట్రోల్ లో ఉంచి హాజరు పరిచారు ఇద్దరినీ.
కిరణ్ హామీ ఇచ్చినట్లు రెండే రెండు సార్లు విద్యావతి కోర్ట్ కి అటెండ్ అయ్యింది.
జడ్జి గారి ఎదుట తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు విద్య, మూర్తి చెప్పారు.
అందుకు తగినట్లు సంతకం చేశారు.
అంతటితో వారి వివాహ జీవితం ముగిసింది.
విద్య మూర్తి వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
అతను పెట్టిన హింస గుర్తుకు వచ్చి మనసులోనే కుమిలిపోయింది.
తన అవస్థ ఏ స్త్రీకి రాకూడదని ప్రార్ధించింది.
పరస్పర అంగీకారం తో విడాకులు కాబట్టి కోర్ట్ వారికి ఏ అభ్యంతరము లేకపోయింది.
సంవత్సరంలోపే విడాకులు మంజూరయ్యాయి.
జెడ్జిమెంట్ కాపీ కిరణ్ బ్రాంచ్ కె తెచ్చి ఇచ్చాడు విద్య కి.
విద్య కోర్ట్ కి అటెండ్ అయ్యే రెండు సార్లు కృష్ణకుమార్ తన కారులోనే పంపించాడు.
డ్రైవర్ రాము కు, కిరణ్ కి మరీ మరీ చెప్పాడు ఆమె భద్రత ముఖ్యం అని.
కిరణ్ పోలీస్ వారి సహాయం కూడా తీసుకున్నాడు మూర్తి మళ్ళీ తన విశ్వరూపం చూపించకుండా.
దానితో అంత సజావుగా సాగింది.
మూర్తి లో ఏమైనా మార్పు వచ్చి అద్భుతం ఏదన్నా జరుగుతుందేమోనని ఎదురు చూసాడు కృష్ణకుమార్.
విడాకులు మంజూరయ్యేంతవరకు వాళ్ళ బ్యాంకు లో తెలిసిన వాళ్ళ ద్వారా వాకబు చేస్తూనే ఉన్నాడు.
అతనిలో తను అనుకున్న మార్పు వస్తే విద్య ని ఒప్పించి విడాకులు ఆపొచ్చు.
కానీ మూర్తి లో ఏ మార్పూ రాకపోగా అతని చెడు అలవాట్లు ఇంకా ఎక్కువై లివర్ డామేజ్ వరకు వెళ్ళింది.
అంతదూరం వచ్చాక ఇక తన ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టాడు కృష్ణకుమార్.
విద్యకు విడాకులే సరి అయిన మార్గం అని అతనికి తోచింది.
ఒక వైపు విద్య ఇవన్నీ గమనిస్తూనే ఉంది.
కృష్ణకుమార్ చేస్తున్న సహాయానికి ఆమె మనసులోనే అతనికి వేల వేల కృతఙ్ఞతలు అర్పించింది.
అతనికి సహాయం చెయ్యడమే తెలుసు కానీ ఇలా ఇన్నిసార్లు థాంక్స్ తీసుకోవడమంటే అస్సలు నచ్చదు.
కిరణ్ జెడ్జిమెంట్ కాపీ ఇచ్చినప్పుడు మాత్రం కృష్ణకుమార్ కేబిన్ లో ఇద్దరికీ కలిపి థాంక్స్ చెప్తూ నమస్కరించింది విద్య.
విడాకులు మంజూరు ఐన పది రోజులకు మూర్తి తన అలవాటు ప్రకారం తప్ప తాగి టు వీలర్ పై వెళ్తూ రోడ్ ఆక్సిడెంట్ లో లారీని ఢీకొని మరణించాడు.
గుర్తుపట్టలేనంత గా చితికిపోయింది అతని శరీరం.
తప్పు మూర్తి దే కావడంతో కృష్ణ కుమార్ ఏమీ చెయ్యలేకపోయాడు.
మూర్తి శవాన్ని తన వైపు వారు కూడా ఎవరూ తీసుకెళ్లడానికి ముందుకు రాలేదు.
విద్య కొడుకు శ్రీకాంత్ ఆఫీస్ పని మీద కెనడా వెళ్లి ఉన్నాడు.
అతను రాలేని పరిస్థితి.
మూర్తి శవం పోస్టుమార్టం చేయించి కృష్ణకుమార్ తనే పూనుకుని దగ్గరుండి దహనక్రియలు జరిపించాడు.
ఇవన్నీ చెప్తే బాధపడుతుందని విద్య కి ఏ విషయం చెప్పలేదు.
కానీ ఆమెకు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి.
మూర్తి మరణం ఆమెకు చాలా దుఃఖం కలిగించింది.
ఆ రోజు కొడుకు, కూతురితో చెప్పి వెక్కి వెక్కి ఏడ్చింది.
కెనడా లో ఉన్న శ్రీకాంత్, అమెరికా లో ఉన్న శ్రీష తల్లిని ఓదార్చే ప్రయత్నం చేశారు.
విద్య దుఃఖం చూడలేక రేణూ ఆమెని ఓ వారం తమ ఇంట్లోనే ఉంచి ఓదార్చింది.
బాగా అప్పులు చేసున్న మూర్తి కి బ్యాంకు లో అప్పులు అన్నీ పోను రెండు లక్షలు మిగిలాయి.
వాటికోసం అతని అక్క కృష్ణకుమార్ ఇంటికి వచ్చింది.
విద్య గదినుంచి బయటకి కూడా రాలేదు ఆమెను చూడడానికి.
ఎందుకంటే తన భర్తని ప్రేరేపించి తనను హింసించడంలో ఆమే ప్రధాన పాత్రధారి.
అందుకే ఆమె మొహం చూడటం ఇష్టం లేదు విద్యకి .
రెండు లక్షలు కృష్ణకుమార్ ద్వారా మూర్తి అక్కకి ఇచ్చింది.
ఆమె దుఃఖం నటిస్తూ డబ్బు చేతిలో పడంగానే వెళ్ళిపోయింది.
రేణూ చాలా బాధపడింది ఆ సంఘటనకి.
మనుషుల్లో ఇంత మానవత్వం లేనివాళ్లు కూడా ఉంటారా అని భర్త దగ్గర వాపోయింది కూడా.
అన్ని దుఃఖాలు తోడవడంతో విద్యావతి ఇక ఉద్యోగం చేయడం తన వల్ల కాదనుకుంది.
రేణూ చెప్పి చూసింది నేనున్నాను గా నీకేంటి నేను చూసుకుంటాను అన్నీ అంది.
అందుకు విద్య ఒప్పుకోలేదు. తను ఒకరికి భారం కాకూడదు అనుకుంది.
ఎలాగూ పెన్షన్ వస్తుంది కదా అనుకుని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని తన కొడుకు శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళింది ముంబై కి.
వెళ్లే ముందు రోజు కృష్ణకుమార్ ని తన ఇంటికి రమ్మని కోరింది.
రేణూ, నేను ఇద్దరం వస్తున్నాం అని చెప్పాడు కృష్ణకుమార్.
వద్దు ప్లీజ్ మీరొక్కరే రండి అని బ్రతిమాలింది.
కృష్ణకుమార్ కి అలా ఆమె ఇంటికి ఒంటరిగా వెళ్లడం ఇష్టం లేకపోయినా ఫర్లేదులే ఐదు నిముషాలు ఉండి వచ్చేస్తాను అనుకుని వెళ్ళాడు.
నేనేమీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను లెండి. మీరేం వర్రీ వద్దు అని నవ్వుతూ ఆహ్వానించింది.
ఓ మంచి కాఫీ తన స్టైల్ లో పెట్టి ఇచ్చింది.
లోపలి నుంచి చక్కగా ఫ్రేమ్ చేయించిన రేఖా చిత్రం తెచ్చి అతని చేతికిచ్చింది.
అందులో ఇప్పటి కృష్ణకుమార్ పోలికలతో అద్భుతంగా గీసిన చిత్రం, అతని పాదాల దగ్గర పువ్వులేస్తూ విద్య చిత్రం గీసి ఉన్నాయి.
చాలా చక్కగా గీసింది విద్య.
మీరు ఇప్పటి పోలికలతో మీ చిత్రం గీయమన్నారు గా వచ్చిన కొత్తల్లో .
అందుకే కొంచెం టైం తీసుకుని మీ చిత్రాన్ని నా శాయశక్తులా గీసాను.
మీరు నాకు ఎంతో మేలు చేశారు.
అందుకు కృతజ్ఞతలు చెప్తే సరిపోదు.
అందుకే అలా నా చిత్రం కూడా గీసాను.
మీరు చేసిన సహాయానికి మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అంది విద్య గద్గద స్వరంతో.
ఓహ్ థాంక్స్ విద్యా. చాలా బాగుంది ఈ చిత్రం.
ఇక సహాయానికొస్తే అంత పెద్ద మాటలు ఎక్కువేమో అనిపిస్తుంది నాకు.
నీ మిత్రుడి గా నాకు చేతనయినంత నేను చేసాను.
అంతకంటే ఎక్కువేమీ లేదు.
అందువల్ల ఈ రుణాలు అలాంటి పెద్ద పెద్ద మాటలు వద్దు ప్లీజ్.
జీవితంలో నీకు ఎప్పుడైనా ఎలాంటి సహాయమైనా నేనుంటాను నీ పక్కనే.
అది గుర్తుంచుకో చాలు. నీకు అంతా మేలే జరగాలి అని నా కోరిక.
ఎక్కడున్నా హ్యాపీగా ఉండు. రేణూ మాత్రం జీవితాంతం నిన్ను వదలదు.
అంతగా ఆమె నిన్ను ప్రేమిస్తోంది. తన తోబుట్టువు లానే నిన్ను భావిస్తోంది.
మరి ఉంటాను అని బయలుదేరాడు కృష్ణకుమార్.
ఈ ఒక్క మారన్నా మీ పాదాలు తాకొచ్చా అంది విద్య.
నీ ఇష్టం అన్నాడు కృష్ణకుమార్.
కృష్ణకుమార్ ఇంటికి వెళ్ళగానే రేణూకి విద్య ఇచ్చిన రేఖా చిత్రం ఫ్రేమ్ ఇచ్చాడు.
రేణూ అది చూసి చాలా సంబరపడింది.
ఎంతో బాగుంది కదండీ అని ఆనందం వెలిబుచ్చింది.
రేణూది చాలా మంచి మనసు. కృష్ణకుమార్ ఆమె దగ్గర తన విషయాలేమీ దాచడు.
అన్నీ దాపరికంలేకుండా చెప్పేస్తుంటాడు చిన్నపిల్లాడిలా.
రేణూకి అది ఎంతో నచ్చుతుంది.
అందుకే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ప్రాణం.
ముంబై వెళ్లే రోజు విద్య, ఆమె అక్కని రేణూ మధ్యాన్నం భోజనానికి పిలిచింది.
కృష్ణకుమార్ కి పదే పదే చెప్పింది రేణూ వాళ్ళిద్దరిని భోజనానికి పిలుస్తున్నాను మీరు తప్పకుండా రండి ఒక గంట సేపు అంది.
పలుమార్లు ఫోన్ లు కూడా చేసింది.
బ్యాంకు లో బాగా బిజీ గా ఉండటంతో ఇంటికి వెళ్లలేకపోయాడు కృష్ణకుమార్.
విద్య కి, ఆమె అక్కకి చీరలు పెట్టింది.
రేణూ ఎయిర్పోర్ట్ కి వెళ్లి విద్య కి సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చింది.
సాయంత్రం కృష్ణకుమార్ ఇంటికి రాగానే అన్ని కబుర్లు పూసగుచ్చినట్లు చెప్పింది రేణూ.
విద్య వెళ్లినందుకు ఆమె మోహంలో దుఃఖం కనిపించింది.
****
మోహిత్ తను అనుకున్నది సాధించాడు.
బి టెక్ లో జె యెన్ టి యు ఫస్ట్ రాంక్ తెచ్చుకున్నాడు.
చాలా మంచి మార్క్స్ వచ్చాయి.
జి ఆర్ ఈ, టోఫెల్ లో చాలా మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు.