Previous Page Next Page 
నారి నారి నడుమ మురారి పేజి 18

 

మొహంలో మాత్రం ఆ బిగువుతనం తగ్గించలేదు. 
అదే రేణూ. ప్లీజ్ నీ మనసు మారినట్లేగా అన్నాడు అమాయకంగా అడుగుతూ. 
ఊహూ లేదు . ఇవాళ అక్కని కూడా పిలిచాను. తన ముందే తేల్చేస్తాను అంది మనసులో ఒకవైపు నవ్వుకుంటూ. 
వీళ్ళ మాటలు వింటూ హాల్లోకొచ్చింది విద్యావతి. 
ఆమెను చూడాలంటేనే ఇబ్బంది పడ్డాడు కృష్ణకుమార్.
దీనికంతటికీ తనే మూల కారణం.
ఏమీ ఎరుగని నంగనాచిలా ఎలా చూస్తోందో చూడు అనుకున్నాడు మనసులో.
చాలా కోపంగా ఉంది ఆమెమీద.
రేణూ కూడా ఎత్తుకు పై ఎత్తు ఆలోచిస్తోంది.
ఇక లాభంలేదనుకుని అతని కాళ్లపై పడింది.
సినిమా స్టైల్ లో ప్రాధేయపడింది.
నేను మన వివాహ జీవితంలో ఈ ఒక్క కోరికే కదండీ కోరింది.
అదీ కూడా మీరు తీర్చకుంటే ఎలా అంది ముక్కు గట్టిగా చీదుతూ. 
అయోమయంలో పడ్డాడు కృష్ణకుమార్.
ఎందుకు తనకే ఇలా ఇంత పెద్ద సమస్య.
దీన్ని ఎలా ఎదుర్కోవడం. తప్పించుకు తిరిగేకంటే ధైర్యంగా ఎదుర్కొని మాట్లాడటం మేలు అనుకున్నాడు.
ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. 
ఇద్దరినీ కూర్చోమన్నాడు.
విద్యావతి వైపు సూటిగా చూస్తూ, భయపెడుతున్నట్లు మొహం పెట్టి నన్ను పెళ్లిచేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగాడు. కనుబొమ్మలు పైకెత్తి విలన్లా చూడాలనుకున్నాడు కానీ అవి సహకరించలేదు.  
మనసులో ఇష్టంలేదు అని చెప్పాలని తన ఇష్టదేవతలందరిని ఆరునొక్క రాగంలో ప్రార్ధించాడు.
కానీ అతని రాగంలో ఎక్కడో ఎదో లోపం వినిపించింది దేవతలకి.
అతని అభీష్టానికి వ్యతిరేకంగా విద్యావతి చక్కగా  తలూపింది.
ఆమె వాలుజడలో మల్లెపూలు కూడా నవ్వుతూ పలకరించాయి.  
చాలా ఇష్టం అని నోటితో కూడా చెప్పింది అదేదో చిన్నపిల్లలు పిప్పరమింట్ అంటే చాలా ఇష్టం అని చెప్పినట్లు.
భగవంతుడా ఇక నాకేంటి దిక్కు అని దిక్కులు పిక్కటిల్లేలా మనసులోనే అరిచాడు.
అంతులేని అతని వేదన అరణ్య రోదనే అయ్యింది.
అయిపోయింది. అంతా అయిపొయింది.
తను ఒంటరిగా మిగిలిపోయాడు.
తన జీవన నావ ముక్కలైపోయింది అనుకున్నాడు.
రేణు వారంలోనే తన బలాన్ని కూడగట్టుకుంది.
సైన్యాన్ని మోహరించింది.
ఒకవైపు రేణు పేరెంట్స్ చెప్పారు కృష్ణకుమార్ కి విద్యావతిని పెళ్లి చేసుకోమని.
కృష్ణ కుమార్ పేరెంట్స్ నుంచి కూడా వత్తిడి వచ్చింది చేసుకోరా అబ్బాయి రేణూ చెప్పినట్లు అని.
ఇక చిన్న పిల్లలు మోహిత్, శ్రీకాంత్, శ్రీష వాళ్ళకు వచ్చిన భాషలో వాళ్ళూ చెప్పారు.
లోకమంతా ఒకవైపు, తానొక్కడే ఇంకోవైపు ఉన్నట్లు ఫీల్ అయ్యాడు.
మరీ సాగదీస్తే రేణూ తన మీద ఇంకో నవల రాసి పాఠక లోకాన్ని కూడా తనకి సపోర్ట్ తెచ్చుకునేట్లుంది.  
అన్ని విధాలా ఆలోచించాడు.
ఇప్పటికిప్పుడు మాయమై సన్యాసం తీసుకుని కనిపించకుండా హిమాలయాలకి వెళ్ళిపోతే అన్న ఆలోచన కూడా వచ్చింది.
ఆమ్మో తల్లి లాంటి నా బ్యాంకు ను వదిలి వెళ్లిపోవడమే.
ఆ ఆలోచన భరించలేకపోయాడు.
తన బ్యాంకు కు చేయాల్సింది ఎంతో ఉంది.
తల్లి ఋణం తీర్చుకోకుండా ఎక్కడికీ వెళ్ళకూడదు అని నిశ్చయించుకున్నాడు.
ఏదైతే అది అవుతుంది.
ఇప్పటివరకూ జీవితంలో మంచే జరిగింది.
ఇకముందు కూడా అలానే జరుగుతుందిలే అన్న నమ్మకం తనకుంది. 
రేణూ పట్టుబట్టినట్లు రేపు విద్య తో తన పెళ్లి జరిగితే అన్న ఆలోచన అతన్ని ప్రశాంతంగా నిద్రపోనీడంలేదు.
దీనితో కృష్ణకుమార్ మనసుకు తగిలిన గాయాలు తీవ్రం కావడంతో ఒక వారం సెలవు పెట్టి తన రూమ్ కి  పరిమితమయ్యాడు.
ఎప్పుడూ ట్రిమ్ గా ఉండే అతను గడ్డాలు పెంచేసాడు గుర్తుపట్టలేనట్లుగా. 
ఇలా ఎంత కాలం.
ఏమైతే అది అయ్యింది అని తెగించి ఒక నిర్ణయానికి వచ్చేసాడు.
రేణూ ని పిలిచి చెప్పేసాడు ఇక నీ ఇష్టం అంటూ.
కండిషన్ ఏంటంటే పెళ్లి ఎవరికీ తెలీకుండా, తన పరువు పోకుండా సీదా సాదాగా జనం అంతగా రాని గుడిలో జరగాలని నివేదించుకున్నాడు.
ఇలాంటి పెళ్లి, ఈ వయసులో జనం చూస్తే ఎంత తలవంపు తనకు అనుకున్నాడు. 
విద్యతో పెళ్ళికి కృష్ణకుమార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యురేకా అని ఎగిరి గంతేసింది రేణు. 
అనుకున్నదే తడవు పంతులు గారికి కబురు పెట్టింది.
భర్త, విద్య నక్షత్రాలు చూసి మంచి పెళ్లి ముహూర్తం పెట్టమని అడిగింది. 
పంతులు గారు అనుమానంగా ఇద్దరి వయసు అడిగాడు. 
రేణుక చెప్పిన వయసు వివరాలు విని, మనసులో పెద్దగా నవ్వుకుని ఇంత పెద్దవారికి జాతకాలు, నక్షత్రాలు ఎందుకమ్మా, అందులోనూ ఇద్దరికీ రెండో పెళ్ళాయె, ఏ పట్టింపులు అవసరంలేదు అంటూ వచ్చే వారం దివ్యమైన ముహూర్తం ఉంది. చక్కగా ఇద్దరికీ పెళ్లి చేసెయ్యండి అని చెప్పాడు. 
ఎంత సంభావన అడగొచ్చో మనసులో లెక్కలేసుకుంటున్నాడు.
దగ్గరలో ముహూర్తం అనేసరికి రేణూ ఎగిరి గంతేసింది. 
తన కోరిక నిర్విఘ్నంగా నెరవేరే సమయం దగ్గరపడుతుండటంతో ఆమెకు మిక్కిలి ఆనందం కలిగింది. 
పెళ్లి ఏర్పాట్లు ఊపందుకున్నాయి.
రేణూ అంతా తానై పనులు పురమాయిస్తోంది అందరికి. 
అవన్నీ చూస్తున్న కృష్ణకుమార్ అయోమయంగా చూస్తుంటే రేణూ అతన్ని హుషారు చేస్తూ కాస్త నవ్వండి ఇది మీ పెళ్లి. మీరే అలా ఉంటె ఎలా అంటూ కొంటెగా కన్నుగీటుతూ నవ్వుతోంది.
కృష్ణకుమార్ కి ఎదో జరుగుతోందని తెలుస్తోంది కానీ ఇది కలా నిజమా అన్న మీమాంస  అతన్ని ఇంకా వదల్లేదు.
ఈ వయసులో నాకు పెళ్లేంటి దేవుడా అని మాటి మాటికీ పైకి చూస్తున్నాడు అక్కడ దేవుడు కనపడతాడేమోనని.
రేణూ కాళ్ళు పట్టుకున్నంత పనిచేశాడు కేవలం దండలు మార్చుకుంటాంరా రేణూ అంటూ.
ఈ వయసులో ఇంత పెళ్లి తతంగం అవసరంలేదని మరీ మరీ చెప్పాడు.
అతనికి చాలా ఇబ్బందిగా ఉంది ఇదంతా.
రేణూ కి కృష్ణకుమార్ బలహీనత తెలుసుగా !
అతని చుబుకం పట్టుకుని మా తండ్రివి కదూ, మా బుజ్జివి కదూ ఈ ఒక్కసారికి నేను చెప్పినట్లు చెయ్యండి అని లాలనగా అడిగింది.
రేణూ అలా అనేసరికి ఇక మాటలు పెంచలేక పోయాడు.
మనసును తన బ్యాంకు లో వదిలేసి శరీరాన్ని రేణూ కి అప్పగించాడు నువ్వేం చెప్తే అలా చేస్తా అంటూ.
అతనికి వాదనలు పెద్దగా నచ్చవు అందులోనూ తన ముద్దుల భార్య రేణూతో. 
అలా రేణు ఇరుపక్షాలకి పెళ్లి పెద్దగా వ్యవహరించింది. 
గుళ్లో పెళ్లయినా బయట ఒక పెద్ద బ్యానర్ కట్టించింది రేణు.
విద్య వెడ్స్ కృష్ణ అని.
అందులో కృష్ణకుమార్ విద్యల యుక్త వయసు ఫోటోలు ప్రింట్ చేయించింది.  
ఎలా ఉంది అని అడిగింది కృష్ణకుమార్ ని ఆ బ్యానర్ చూపించి.
ఏడవలేక నవ్వాడు బాగుంది అన్నట్లు తల ఊపాడు.
అతనికి ఓపిక పూర్తిగా నశించింది. 
రజనీకాంత్ సినిమాలో రోబోలా మారిపోయాడు. 
పెళ్లి జరిపిస్తున్న పురోహితుడికి మంత్రాలు చదువుతున్నంతసేపూ బోలెడు సందేహాలొచ్చాయి.
రేణూ అటూ ఇటూ తిరుగుతూ తనే అంతా హడావిడి చేస్తుంటే ఉండబట్టలేక కృష్ణకుమార్ ని అడిగాడు ఎవరండీ ఆవిడ మీ చెల్లెలుగారా అని. 
అంత దుఃఖం లోనూ చెప్పాడు కృష్ణకుమార్ ఆమె తన మొదటి భార్యని.
ఆ ! అని మూర్ఛపోయినంత పని చేసాడు పురోహితుడు.
అబ్బా ! ఎంత అదృష్టవంతుడవయ్యా నువ్వు.
ఇలా దగ్గరుండి పెళ్లి చేసే భార్య దొరకడం నభూతో నభవిష్యతి అన్నాడు.
ఏదీ నీ చెయ్యి చూపించు ఇంకా ఎన్ని పెళ్లి యోగాలున్నాయో చూస్తాను అన్నాడు.
మీ తల్లితండ్రులు పెట్టిన పేరును సార్ధకంచేస్తున్నావన్నమాట శుభం అని దీవించాడు.
అసలే మనసులో మండుతున్న కృష్ణకుమార్ పురోహితుడిపై చిరాకుపడ్డాడు.
పక్కనే ఉన్న విద్యావతి అతన్నే చూస్తూ అంతా గమనిస్తూ నవ్వుకుంటోంది పెదాల చాటున.
రేణూ ఊరుకోకుండా వెబ్కాస్టింగ్ కూడా పెట్టించింది పెళ్ళితంతుని.
అమెరికాలో ఉన్న తన కొడుకు మోహిత్, విద్య కూతురు శ్రీష ఆద్యంతం పరికిస్తూ పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని హుషారు చేస్తున్నారు.
శ్రీష కూడా కృష్ణకుమార్ ని డాడీ అని పిలవడం మొదలుపెట్టింది అప్పుడే.
విద్య కొడుకు శ్రీకాంత్ పెళ్లి పనుల్లో రేణూకి కుడి ఎడమ రెండూ భుజాలూ తానే అయి చక చక పనులు చేస్తున్నాడు.
మధ్య మధ్యలో డాడీ అంటూ కృష్ణకుమార్ ని పిలుస్తున్నాడు.
అప్పటికి ఇంకా విద్య మెడలో తాళి కట్టనేలేదు.   
మధ్య మధ్యలో ఏమండీ ఇలా చెయ్యండి అలా చెయ్యండి అంటూ విద్య చెప్తోంది పురోహితుడు చెయ్యమన్నవి.
యాంత్రికంగా చేస్తున్నాడు.
విధి ఎందుకో నాపై పగబట్టింది అని మాత్రం మనసులో పదే పదే అనుకుంటున్నాడు.
విద్య కు పెళ్లికూతురు అలంకారం చాలా స్పెషల్ గా చేయించింది రేణూ దగ్గరుండి. 
విద్య ముక్కు సంపెంగలా నాజూకుగా, అందంగా ఉంటుంది.
రేణుకి ఆ అందానికి ఆభరణం అద్దాలని  ఎప్పటినుండో కోరిక. 
అందుకే విద్య ముక్కును కుట్టించి ఒక చక్కని రవ్వల ముక్కుపుడక చేయించి అలంకరించింది. 
 

 

 Previous Page Next Page