"అందుకే, దాన్ని ఎవరూ చూడనక్కరలేకుండా, అది ఎవరికీ బరువు కాకూడదనే దానికి ఓ దారి చూపించుతాను. ఈ ఇల్లు దానికే ఉంటుంది." నిశ్చయంగా అన్నారు శివశంకరంగారు.
శారదాంబ నిట్టూర్చింది. "అలా చేసి మీ చేతుల్తో మీరే వాళ్ళ మధ్య శతృత్వానికి పునాదులు వేస్తున్నారన్నమాట!" కటువుగా అంది.
"అయితే ఏం చెయ్యమంటావు? దాన్ని రోడ్డుమీద వదిలేయమనా నీ ఉద్దేశం?"
"రోడ్డు మీద వదిలేయక్కరలేదు. దానికి ఏదో ఉద్యోగం చూడండి. మనం ఉన్నన్ని రోజులు బాధలేదు. తదనంతరం కొంతడబ్బు దానికి చెందేట్లు రాయండి."
"నిన్నెవరూ సలహా అడగలేదు. నా ఆస్తి నా సార్జితం. నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను." కుసురుకన్నారాయన. శారదాంబ మాటల్లో నిజం ఆనాడు గుర్తించలేదు. అది కుటుంబంలో ఎన్ని కలతలకి కలహాలకి దారి తీస్తుందో ఆయన ఊహించదలచలేదు.
నిర్మల ఆ వూరిలో ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్ గా చేరి ఆరునెలలు అయింది. ఉద్యోగంలో చేరాక కాలక్షేపం అవుతోంది నిర్మలకి. ఉదయం లేచిందగ్గరనించి కాలేజీకి వెళ్ళడానికి ముస్తాబు హడావిడి, వచ్చాక మర్నాటి క్లాసులకి ప్రిపేరు అవడం, కాలేజి టైములో రెండు మూడు క్లాసులకి అటెండ్ అవడం - అలవాటులేక శారీరకంగా శ్రమ అనిపించినా మానసికంగా ఉల్లాసంగానే ఉంది నిర్మలకి. అనవసరమైన ఆలోచనలు, దిగులు, ఆమెరోజ్ నెస్ తగ్గాయి.
'వారంరోజులకే ఎలా నల్లబడ్డావో చూడమ్మా? ఎందుకమ్మా తిని కూర్చుని ఈ ఉద్యోగం నీకు?' అన్నారు శివశంకరంగారు కూతురి తల నిమిరి.
"ఫరవాలేదు డాడీ, అలవాటయిపోతుంది..... 'అంది తలవంచుకుని. శారదాంబ భర్తవంక కాస్త కోపంగా చూసింది - 'బాగుంది సంబరం, ఎండ కన్నెరగకుండా పెంచుతారా' అన్నట్టు.
మొదటిసారి రఘుకి కాస్త కోపం వచ్చింది చెల్లెలి మీద. 'తన కాలేజి ఎంతదూరం తను బస్సులో వెళ్ళాలా..... రెండు మైళ్ళున్న ఈవిడ స్కూటరు మీద వెళ్ళాలా.....' అన్నట్టు మొహం మాడ్చుకున్నాడు.
'నాకు చాలా దూరం. రెండు బస్సులు మారాలి' అని నసిగాడు.
'ఫరవాలేదు లేవోయి! మగవాడివి ఆ మాత్రం కష్టపడవచ్చు. ఇంకొకటి కొనే వరకూ బస్సులో వెళ్ళు' అన్నారాయన.
అన్న మొహం మాడ్చుకోవడం చూసి నిర్మల మనసు చివుక్కుమంది. 'వద్దులే చిన్నన్నయ్యా! నాన్న అలాగే అంటారు. నేను బస్సులో వెడతాను' అంది.
'నీకు తెలీదమ్మా..... నీవు ఆ బస్సులు అవి ఎక్కలేవు. వాడికేం మగవాడు, ఎలా అన్నా వెడతాడు' అని తేల్చేశారాయన. రఘు కాస్త విసురుగా వెళ్ళిపోయాడు.
'కూతురంటే అంటే ప్రేముంటే ఇంకో కారు కొనిచ్చుకోమను. నా స్కూటరెందుకు ఇయ్యాలి?' అని తల్లి దగ్గర మొహం మాడ్చుకుని గొణిగాడు రఘు.
'దేనికన్నా లిమిట్ ఉండాలి. దాన్నలా నెత్తికెక్కించుకుంటున్నారు' అని కూడా చేర్చాడు.
శారదాంబ ఎవరిని ఏం అనాలో తెలియక నిట్టూర్చింది. భర్త మీద ఆవిడకి కోపం వచ్చింది.
మొదటి జీతం అంతా ఖర్చుపెట్టి ఇంట్లో అందరికీ బట్టలు తెచ్చింది నిర్మల.
'ఎందుకే ఇలా తగలేయడం? నీ జీతం వేరే ఎకౌంట్ ఓపెన్ చేసి దాచుకో. అనవసరంగా ఇలా ఖర్చు పెట్టేయకు. ముందు పనికి వస్తుంది' అంది శారదాంబ.
'అదేదో సరదాగా తెస్తే ఆ మాటలేమిటి? ఏదో దానిజీతం దాచుకోకపోతేగతిలేనట్టు మాట్లాడతావేమిటి?' శివశంకరంగారు కసిరారు. 'మీ అమ్మ మాటలకేం తల్లీ, అలాగే అంటుంది. నీ సంపాదన నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చెయ్యి' అనేశారు.
ఎంజాయ్!..... ఏం చేస్తుంది ఎంజాయ్.... ఎవరితో చేస్తుంది తను! ఏడాది తిరిగేసరికి అలా అనిపించింది నిర్మలకి. తను సంపాదించి ఏం ఎంజాయ్ చెయ్యాలి? సినిమాలు, షికార్లు.... ఎన్నిరోజులు తిరుగుతుంది, ఎవరితో తిరుగుతుంది? కాలేజీలో ఇద్దరు ముగ్గురు కొలిగ్స్ తో స్నేహం అయింది. మాధవి ఇంగ్లీషు లెక్చరర్ సరదాగా ఏదన్నా సినిమాకి వెడదాం పదా అంటే "ఇంటికెళ్ళాలోయ్! మా శ్రీవారికి కోపం వచ్చేస్తుంది. లేటుగా వెడితే మొహం మాడ్చేస్తారు" అంటుంది నవ్వుతూ. ఆమెకి ఆరునెలలయింది పెళ్ళయి.
ఏమిటో వీళ్ళు! ఓ సినిమాకి వెడితే మొగుడికి కోపం వస్తుంది అనుకుంటారీ ఆడవాళ్ళు. ఇంత చదివినా, ఉద్యోగం చేస్తున్నా అంత భయపడి చావడం ఏమిటి అనుకుంటుంది నిర్మల కోపంగా. హిస్టరీ లెక్చరర్ ఉమ గలగలా మాట్లాడుతూ జోక్స్ వేస్తూ నవ్విస్తుంది. సరదాలున్నాయిగాని 'ఇంట్లో ఇద్దరు పిల్లల్ని అత్తగారి మీద వదిలి వచ్చాను. రోజంతా చూస్తుంది గాని సాయంత్రం ఆలస్యం అయితే ఆవిడగారు మూతి ముడుచుకుని, జీతం బత్తెం లేని నౌకరీదాన్ని వుండగా నీకేం అమ్మా తిరిగి వస్తావు అని దెప్పుతుంది' అంటూ సినిమాకి రమ్మంటే తప్పించుకుంటుంది.
కెమిస్ట్రీ లెక్చరర్ పద్మ అవివాహిత ఏమో, నిర్మలతో రెండు మూడుసార్లు సినిమాలు, హోటళ్లకి పిలిస్తే వెళ్ళింది. ఓసారి హోటల్ లో వాళ్ళ అన్న చూసి ఇంట్లో చెప్పాడు. 'ఆ నిర్మలతో స్నేహం ఏమిటి? ఏం ఆవిడగారిలా నీవూ తయారవుతావా? ఆవిడ సంసారం, మొగుడూ అన్నీ వదులుకుని వచ్చినా ఆదుకునే తల్లిదండ్రులున్నారు. మాకేం అంత డబ్బులేదు. పిచ్చి స్నేహాలు చేసి మతులు పోగొట్టుకోకు అంటూ తల్లి తిట్టింది.
ఆ తరువాత నిర్మల పిలిచినా ఏదో సాకుతో తప్పించుకోవడం మొదలు పెట్టింది పద్మ. ఎందుకు తననిని తప్పించుకుంటుందో ముందు నిర్మలకి అర్థం కాలేదు. ఒకరోజు లేడీస్ రూంలో మీటింగు పెట్టినట్టున్నారు. ఆ రోజు నిర్మల వంట్లో జ్వరం వచ్చినట్టు వళ్ళంతా నొప్పులు, తలనొప్పి వచ్చి, క్లాసు తీసుకుని పాఠం చెప్పలేక క్లాసు వదిలి, ప్రిన్సిపాల్ పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళబోతూ కామన్ రూం దగ్గరకు వచ్చింది.
'ఈ బస్సులు, వెయిటింగు అది నీకు పడలేవమ్మా! అన్నయ్య స్కూటరు నీవు తీసుకెళ్ళు. వాడు బస్సులో వెడతాడు. లేదంటే వాడికి ఒకటి కొంటాను' అంటూ, కొడుకుని పిలిచి స్కూటరు ఇమ్మని చెప్పారు ఆయన.