"తింటున్నాను, తిరుగుతున్నాను. అంతకంటే ఏం చేస్తాను? శుష్కహాసం చేస్తూ అంది నిర్మల.
"బాగుంది..... ఎన్నాళ్ళిలా ఇంట్లో వూరికే కూర్చుంటావు? పోనీ ఏదన్నా ఉద్యోగమన్నా చెయ్యి..... కాలక్షేపం ఉంటుంది. పోనీ నీరూ.... ఏడాది అయింది. పెళ్ళాంలేక అతనికీ కాస్త లోటు తెలిసివచ్చి బుద్ధి వచ్చి వుంటుంది. మరోసారి వెళ్ళి ప్రయత్నం చెయ్యకూడదా, ఎన్నాళ్ళిలా వంటరిగా వుంటావు?" అంది.
ఆమె సానుభూతి భరించలేనట్టు నిర్మల మనస్సు నొచ్చుకుంది. అదే ఇదివరకయితే వాదించేది. ఎవరేమన్నా దులిపేసుకునేది. ఇప్పుడెవరే చిన్నమాట అన్నా మనసుకి బాధగా వుంటోంది. చిన్నపోయిన ఆమె ముఖంచూసి "సారీ, హర్ట్ చేశానా? నీవిలా వంటరిగా వున్నావని బాధగా అన్నానే. మేమందరం హాయిగా కాపురాలు చేసుకుంటుంటే నీవిలా....."
ఆ తర్వాత అరగంట భర్త ఎంత మంచివాడో, ఎంత సరస హృదయుడో! అత్తవారు తనని ఎంత అపురూపంగా చూస్తారో, తన అదృష్టం అంతా చెప్పుకొచ్చింది.
ఆమె వెళ్ళాక అనిపించింది. రేణు తనకంటె అందగత్తె కాదు. రేణు వాళ్ళు తమ అంత డబ్బుగలవారూ కాదు. అయినా ఆమె ఎంత అదృష్టవంతురాలు. తనేం పాపం చేసిందని ఇలా అయింది - అన్పించింది నిర్మలకి. రేణు ఎంత సంతోషంగా ఉంది. అలాంటి సరసుడు భర్తగా దొరికితే ఎవరన్నా అలాగే ఉంటారు. రేణు వచ్చి వెళ్ళిన దగ్గిర నుంచి ఏదో దిగులుగా అన్పించింది నిర్మలకి. మూడునెలల క్రితం లతకి పెళ్ళి అయి వెళ్ళింది. అసలు పెళ్ళిలోనే పెళ్ళికూతురు, పెళ్ళికొడుకూ ఇద్దరూ ఎంత సరదాగా మాట్లాడుకుంటున్నారు! తనను ఎన్నాళ్ళ బట్టో ఎరిగినట్టు అప్పుడే జోక్ లు వేసేవాడు. పెళ్ళవగానే పదిహేను రోజులు శలవు పెట్టి హానీమూన్ కి కాశ్మీర్ వెళ్ళారు. వాళ్ళత్తగారు చూడ్డానికి పాత ఫాషన్ గా ఉన్న భావాలు ఆధునికంగా ఉన్నాయి. 'ఇంకా తోటలో దిగడాలు, మొహాలు కడిగించటాలు అవన్నీ ఎందుకండీ వదినగారూ, పెళ్ళి సింపుల్ గా కానీయండి 'అందట. 'ఇద్దరినీ సరదాగా ఓ నెల రోజులు తిరిగిరానీయండి, గృహప్రవేశం అవీ తరువాత చేసుకుంటాం. పెళ్ళయిన కోడలు ఇంటికి ఎప్పుడైనా వచ్చేదేకదా! మీ అమ్మాయి, మీ అల్లుడు - మీకుంటే వాళ్ళకు పెట్టుకున్నా వద్దనం, అలా అని మేం అడగం. మీ యిష్టం, వాళ్ళిష్టం. కాపురానికి ఏం కావాలో వాళ్ళే చూసుకుంటారు. మనవంతు పెళ్ళి చేయడం వరకే' అందిట. లత ఎంత అదృష్టవంతురాలు! మూడు ముళ్ళు వేయించుకుని, అంతవరకు ప్లేను ఎక్కకపోయినా ఛంగుమని మొగుడితో తిరగడానికి వెళ్ళిపోయింది.
కుసుమ చక్కగా బోస్టల్ యూనివర్సిటీలో ఎమ్మే ఎకనామిక్స్ లో డాక్టరేట్ కి సీటువచ్చి స్కాలర్ షిప్ మీద వెళ్ళింది. అదింకా ఇండియా రాదుట. అక్కడే ఎవర్నో ఇండియన్ ని చూసి చేసుకుంటుందిట. నలుగురిలో "చిన్నప్పటి నుంచీ అదృష్టవంతురాలివి! అల్లారు ముద్దుగా పెరిగావు. నీలా మాకు చీరలు అవీ ఎలా వస్తాయి తల్లీ! మీ డాడీలా మా డాడీకి అంత డబ్బు లేదు" అని ఈర్షపడిన స్నేహితురాళ్ళు ముగ్గురిని చూసి తనిప్పుడు అసూయ పడాల్సి వస్తుంది. హు..... పెట్టి పుట్టడం అంటే ఇదే కాబోలు! తన అదృష్టం ఇలా మారుతుందని ఎవరనుకున్నారు? వంటరిగా కూర్చుంటే ఇవే ఆలోచనలు వస్తున్నాయి నిర్మలకి. వంటరిగా కూచోక రోజంతా జత ఎవరుంటారు తనకి?
రేణు వచ్చి వెళ్ళాక ఆమె చెప్పినట్లు ఉద్యోగం చేస్తే కాస్త బోరు తగ్గుతుంది అన్పించింది నిర్మలకి.
"నీకెందుకమ్మా ఉద్యోగం? నీకేం లోటు అయిందిప్పుడు?" అన్నారు శివశంకరంగారు." ఉద్యోగం అంటే మాటలా! నీవంత శ్రమ పడలేవు తల్లీ?"
"లేదు డాడీ..... వుత్తినే కూర్చుంటే విసుగొస్తుంది. ఏదన్నా ఉద్యోగం చేస్తే కాలక్షేపం అవుతుందని....." అని నసిగింది.
"చెయ్యనీయండి. ఇటు చదువో, అటు సంసారమో లేకుండా ఉత్తినే ఎన్నాళ్ళు కూర్చుంటుంది? ఏ వయస్సులో ముచ్చట ఆ వయస్సులో. సంసారం ముచ్చట ఎలాగో తేలిపోయింది. కనక ఉద్యోగమన్నా చేయనీయండి. తిని కూచుంటే పిచ్చెత్తుతుంది ఎవరికన్నా." శారదాంబ అంది. భార్యవంక చురచురా చూశారాయన. నిర్మల తలదించుకుని వెళ్ళిపోయింది అక్కడ నించి.
"నీకు బుద్ధీ జ్ఞానం ఎప్పుడొస్తుంది? దాని ముందు అలా అంటే అది బాధపడదూ?" కోపంగా అన్నారు భార్యతో.
"ఏం..... తప్పుమాట ఏం అన్నాను? అవును. ఉత్తినే తిని ఎన్నాళ్ళు కూచుంటుంది? మొగుడు, సంసారం లేవు. దాని బతుకు అది బతకడానికి ఓ ఆధారముండొద్దూ?" శారదాంబ గట్టిగానే అంది.
"దానికేం లోటు? ఉద్యోగం చేసి బతకవల్సినంత ఖర్మ దానికి పట్టదు నేనుండగా."
"మీరుండగా సరే, ఎల్లకాలం మనం ఉండం. ఈలోగా దానికొకదారి చూపవద్దా....."
"అది కూర్చుని తినే వీలు కల్పించకుండా పోతాననుకున్నావా? నా తరువాత కూడా అదెవరి మీదా ఆధారపడకుండా చేసే పోతాను" గరంగా అన్నాడు.
"ఇంకా మనకి ముగ్గురు మగపిల్లలున్నారు! ఇద్దరి చదువులున్నాయి. వాళ్ళ పెళ్ళీ పేరంటాలున్నాయి.... అని మరవకండి. ఎన్ని లక్షలు తిని కూర్చుంటే కరిగిపోతాయి."
"వాళ్ళు మగపిల్లలు. చదువులు చెప్పిస్తున్నాం. ఎలాగో బతకగలరు. ఈ ఇల్లు, కొంత డబ్బు దానికి రాయాలని నిశ్చయించుకున్నాను."
శారదాంబ ఆశ్చర్యంగా చూసింది. "బాగుంది..... మగపిల్లలు మట్టికొట్టుకుపోతారు అనుకున్నారా? ఇంత ఇల్లుదాని పేర రాసిపోతే జన్మలో మనల్ని క్షమించరు మగపిల్లలు..... దేనికన్నా న్యాయం వుండాలి. మీరు కూతురు అపురూపం అయితే అవచ్చు. కాని మగపిల్లలకి అన్యాయం చేసే హక్కు మీకు లేదు." తీవ్రంగా అంది ఆవిడ.
"హు.... మీరు మీ లాయర్లు. ఇంతవయసు, అనుభవం వచ్చి ఇలా మాట్లాడుతున్నారేమిటి?"
"ఈనాడు చెల్లెలి మీద వున్న అభిమానం, సానుభూతి రేపు వాళ్ళకి పెళ్ళిళ్లయి, వాళ్ళకి సంసారాలు వచ్చాక ఉంటాయా? వుండకపోవడంలో అసహజం ఏముంది? ఎవరి స్వార్థం వారిది.