Previous Page Next Page 
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 17


    యస్తేస్తనః శశయో యోమయో భూర్యోరత్నధా వసువిద్యాః సుదత్రః |
    యేనవిశ్వాపుష్యసి వీర్యాణి సరస్వతి తమిహదాతవోకః ఉర్వ్య న్తరిక్షమన్వేమి ||

                                   మూడవ ప్రపాఠకము

                                    మొదటి అనువాకము
   
        (ఈ ప్రపాఠకమున అగ్నిషోమీయ పశువు ప్రతిపాదించబడినది.)

        (ఈ అనువాకమున మిగిలిన మండప నిర్మాణాదులు చెప్పబడుచున్నవి.)

    1. అభ్రీ! నేను సవిత అనుజ్ఞ యందు ఉన్నవాడను. అశ్వినుల బాహువులతోను - పూష హస్తములతో నిన్ను పట్టుకొనుచున్నాను.

    (అభ్రి అనగా త్రవ్వుగోల - అధ్వర్యుడు అభ్రిని పట్టుకొన వలెను.)

    2. నీవు అభ్రివి. మాకు శత్రువవు కావు.

    (1. అవటమున అభ్రితో గీతలు గీయవలెను. 2. పితృదేవతల లోకమునకు సంకేతము అవటము.)

    3. పరిలిఖితగం రక్షః పరిలిఖితా అరాతయ ఇదమాహగం రక్షసోగ్రీవా అపి కృన్తామి యోస్మాన్ద్వేష్టి యంచ వయం ద్విష్మ ఇదమస్యగ్రీవా అపికృన్తామి.

    అర్థమునకు 1 - 2 - 5 చూడండి.

    4. అభ్రీ త్వాదివేప్రోక్షామి. నిన్ను ద్యులోకము కొరకు ప్రోక్షించుచున్నాను. త్వా అంతరిక్షాయ ప్రోక్షామి. త్వా పృథివ్యైప్రోక్షామి.

    (అధ్వర్యుడు అభ్రియొక్క అగ్ర, మధ్య, మూల భాగములను ప్రోక్షించవలెను.)

    5. పితృదేవతలు ఉండు 'అవట' స్థానము పరిశుద్ధమగును గాత.

    (అధ్వర్యుడు అవటమున నీరు పోయవలెను.)

    6. ధాన్యమా! యవోసి - నీవు వేరుచేయుదానవు. మమ్ము ద్వేషించు రాక్షసులను, శత్రువులను మానుండి వేరుచేయుము.

    (అవటమున ధాన్యము చల్లవలెను.)

    7. బర్హిస్సా! నీవు పితరులకు స్థానమవు అగుచున్నావు.

    (దర్భల కట్టను ఊడదీసి అవటమున పరచవలెను.)

    8. మేడి కొమ్మా! స్వర్గలోకపు ఉపరి ప్రదేశమున నిలువుము. అంతరిక్షమును పూరింపుము. భూమిని గట్టిపరచుము.

    (మేడికొమ్మ పైకెత్తి పట్టుకొనవలెను.)

    9. మేడికొమ్మా! నిన్ను మిత్రా వరుణులు పట్టుకున్నారు. అందువలన నీవు దృఢపడినావు. మారుతుల పుత్రుడు 'ద్యుతానుడు' నిన్ను అవటమున ఉంచునుగాక.

    (మేడికొమ్మను అవటప్రదేశమున ఉంచవలెను.)

    10. మేడికొమ్మా! నీవు బ్రహ్మణ్యమును ఇచ్చుదానవు. క్షత్రియత్వమును ఇచ్చుదానవు. మంచిసంతానమును ఇచ్చుదానవు. ధనసమృద్ధి కలిగించు దానవు. నిన్ను భూమియందు ఆరోపించుచున్నాను.

    (మేడికొమ్మను పాతి మట్టితో పూడ్చవలెను.)

    11. దండమా! నీవు బ్రాహ్మణ్యమును దృంహ - దృఢపరచుము. క్షత్రమ్ దృంహ. ప్రజామ్ దృంహ. ధనసమృద్ధిని దృంహ.

    (దండముతో మట్టిపై కొట్టవలెను.)

    12. ద్యావాపృథివీ రూపలైన మేడికొమ్మ అగ్ర, మూలములారా! ఘృతమున సంతృప్తులగుడు.

    (మేడికొమ్మ మీద నేయి పోయవలెను.)

    13. ఔదుంబరీ! నీవు సమస్త జనులకు నీడవు. ఇంద్రునకు స్థానమవు అగుచున్నావు.

    14. ఇంద్రా! నీవు స్తుత్యుడవు. దీర్ఘాయువవు. మా స్తుతులు వర్థిల్లునవి. అవి నిన్ను చుట్టుకొనును గాత. మా సేవలు నీకు ఇష్టమగును గాత.

    15. రజ్జువా! ఇంద్రునకు బంధనమగుచున్నావు. గ్రంధీ! ఇంద్రునకు ధ్రువమవగుచున్నావు. ఇంద్రదేవతాకమవు. ఇంద్రునకు ప్రియమగును గాత.

                                 రెండవ అనువాకము

                  (గర్తముల నిర్మాణము చెప్పబడుచున్నది.)

    1. ఉపరవములు విష్ణుదేవతాకములు. నేను వానిని త్రవ్వుచున్నాను. ఈ ఉపరవములు రాక్షస నాశకములు. వలగ నాశకములు.

    (1. ఉపరవములు - గుంతలు. 2. వలగములు - విరోధినాశనమునకు ఎముకలు, వెంట్రుకలు, కాలిదుమ్ము పాతబట్టలో కట్టి పాతినవి.)

    2. మాతో సముడు కాని - అసముడు కాని పాతిపెట్టిన వలగమును పెల్లగించుచున్నాను. మాకు శత్రువు - సమానుడైనను, అసమానుడైనను - యజమాని అడుగు క్రిందపడి ఉండునట్లు చేయుదును. గాయత్రీ ఛందమున వలగము బాధింపబడును గాత.

    (గుంతనుండి దుమ్ము తీయవలెను.)

    3. యజమాని అడుగుచున్నాడు :-

    ఈ ఉపరవములందు ఏమి ఉన్నది?

    అధ్వర్యుడు చెప్పుచున్నాడు :

    భద్రమస్తి, భద్రము కలదు.

    యజమాని అనుచున్నాడు :

    ఆ క్షేమము మన ఉభయులకు కలుగునుగాక.

    4. ఉపరవమా! నీవు అభ్యంతర శత్రువును వధించుదానవు. వివిధరీతుల ప్రకాశించుదానవు అగుచున్నావు.

    ఉపరవమా! బాహ్యశత్రువును వధించు దానవు, చక్కగా ప్రకాశించుదానవు అగుచున్నావు.

    ఉపరవమా! ఇతర శత్రువును వధించు దానవు, స్వయం ప్రకాశవు అగుచున్నావు.

    ఉపరవమా! అన్ని దేశములందలి శత్రువులను వధించుదానవు. సర్వప్రకాశవు అగుచున్నావు.

    5. విష్ణుదేవతాకములైన రాక్షసులను నశింప చేయువానిని, వలగములను ప్రోక్షించుచున్నాను. వైష్ణవ రక్షోహణములను వలగములను నీటితో తడుపుచున్నాను.

    ధాన్యమా! నీవు వేరు చేయుదానవు. మమ్ము ద్వేషించు శత్రువులను - రాక్షసులను మానుండి వేరుచేయుము.

    వైష్ణవ రక్షోహణ వలగముల ఉపరవములందు దర్భలు పరచుచున్నాను.

    వైష్ణవ రక్షోహణ వలగముల ఉపరవములందు హోమము చేయుచున్నాను.

    6. వైష్ణవ రక్షోహణ, వలగముల మీద రెండు ఫలకములను ఉంచుచున్నాను.

    వైష్ణవ రక్షోహణ, వలగముల ఫలకములను తడిచేతితో తుడుచుచున్నాను.

    వైష్ణవ రక్షోహణ, వలగముల ఫలకములనుపరచుచున్నాను.

    వైష్ణవ రక్షోహణ, వలగముల ఫలకములను తాకుచున్నాను.

    (ఆ విధముగా అధ్వర్యుడు చేయవలెను.)

    7. పాషాణమా! నీవు గొప్పదానవు. పెద్దపెద్ద రాళ్ళు అవయవములుగా గల దానవు. ఇంద్రుని కొరకు మహారావము చేయుము.

                                   మూడవ అనువాకము

    (అగ్నీధ్రీయ సదస్సు మున్నగు స్థానములందలి 'ధిష్ణియము' ల గురించి చెప్పబడుచున్నది. 'ధిష్ణియ' అగ్నిస్థానమగును.)

    1. అగ్నీధ్రీయమా! నీవు వివిధరూపములు కలవాడవు.

    హోత్రీయమా! నీవు హవ్యవాహనుడవు.

    మైత్రీవరుణీయమా! నీవు మిత్రావరుణ స్వరూపవు.

    బ్రాహ్మచ్చాంసీ! విశ్వవేద 'తుధ' దేవతాస్వరూపవు.

    పోతృస్థానీ! నీవు మహా విద్వాంసుడవు.

    నేష్టృస్థానీయమా! నీవు సోమరక్షకమగు అంఘారి నామదేవతవు. బంభారినామదేవతవు.

    అచ్చావాకమా! అవస్యు, దువస్యులనెడి వాయు స్వరూపమవు.

    మర్జాతీయమా! నీవు శోధకుడవు, మార్జనస్థానభూతుడవు.

    ఆహవనీయమా! నీవు ప్రకాశించువాడవు. కృశించినను సమృద్ధినొందించువాడవు.

    ఆస్థావమా! నీవు పరిషదమునందు పవిత్రుడవు.

    చాత్వాలమా! శ్రేష్ఠగమనమున అంతరవకాశము కలవాడవు.

    పశుశ్రవణమా! నీవు రాక్షసాదులతో కలియక హవిస్సును పక్వము చేయువాడవు.

    ఔదుంబరీ! నీవు చక్కని నివాసము కలిగి స్వర్గమును ప్రకాశింపచేయువాడవు.

    బ్రాహ్మసదనమా! నీవు బ్రహ్మజ్యోతిస్థానమవు, స్వర్గతుల్యస్థానమవు.

    నూతన గార్హ పత్యమా! అజ, ఏకపాద దేవతా స్వరూపుడవు.

    పరిత్యాజ్య గార్హ పత్యమా! నీవు అహిర్బుధ్న్య దేవతా స్వరూపుడవు.

    అగ్నీ! నీవు అగ్నీధ్రియాది పదహారు స్థానములందు ఉన్నవాడవు. ఉగ్రమగు సైన్యము కలిగి మమ్ము రక్షింపుము. నా కోరికలు తీర్చుము. నన్ను బాధించకుము.

    (ఇవి 16 అగ్నిస్థానములు. వీటికి పదహారుగురు ఋత్విజులుందురు. 1. బ్రహ్మ. 2. ఉద్గాత. 3. హోత. 4. అధ్వర్యు. 5. బ్రాహ్మణాచ్చంసి. 6. ప్రస్తోత. 7. మైత్రావరుణ. 8. ప్రతిప్రస్థాత. 9. పోత. 10. ప్రతిహర్త. 11. అచ్చావకుడు. 12. నేష్ట. 13. అగ్నీధుడు. 14. సుబ్రహ్మణ్యుడు. 15. గ్రావస్తుత్. 16. ఉద్గాత.)

                               నాలుగవ అనువాకము

                 (వైసర్జన హోమము చెప్పబడుచున్నది.)

    1. సోమమా! నీవు రాక్షసులకు, శత్రువులకు, శత్రువులు ప్రేరణ కలిగించిన వారికి నియంతవు అగుచున్నావు. మమ్ము వారు బాధించని చోట ఉంచినావు. పాలించుచున్నావు. కావున నీవే మాకు బలమవు - స్వాహా.

    సోమమా! నీవు మా విషయమున ప్రీతికలదానవు. రాక్షసులకు అగుపించకుండుటకు అల్పశరీరవు అగుచున్నావు. నేతి చుక్కను త్రాగుము - స్వాహా.

    అగ్ని మాకు శ్రేయస్సులు కలిగించును గాత. శత్రువులను చీల్చును గాత. ముందుకు ఉరుకును గాత. అగ్ని సంతుష్టుడగును గాత. శత్రువును జయించును గాత. అన్నము కొరకు జరుగు యుద్ధములందు అగ్ని జయించును గాత.

    ఆహవనీయాగ్నీ! నీవు సర్వవ్యాపివి. మా శత్రువుల మీద నీ జ్వాలా ప్రతాపము చూపుము. మా కొరకు గృహ ధనాదులను ఆర్జించుము. నీవు ఘృతమున వర్థిల్లువాడవు. హోమపు నేతిని త్రాగుము. యజ్ఞకర్తను ఎంతో వృద్ధినొందింపుము.

    (అధ్వర్యుడు స్రువపుఘృతమున నాలుగు మారులు శాలాముఖీయమునందు వైసర్జన హోమము చేయవలెను.)

    2. సోమమునకు హవిర్ధాన మార్గము తెలియును. అది - దేవతల స్థానమగు - హవిర్ధాన స్థలమునకు పోవుచున్నది. అందుకు హవిర్ధాన స్థలము అలంకరించబడినది. అందు గ్రహ, చమసాది హవిస్సులు ఉంచబడినవి. అందువలన అది యజ్ఞకారణమైనది.

    3. కృష్ణాజినమా! నీవు భూమికి స్థానమవు. సోమమా- భూమికి స్థానమగు - కృష్ణాజినమున ఆసీనవగుము.

    (అధ్వర్యుడు హవిర్ధాన మంటపపు దక్షిణదిశన కృష్ణాజినము పరచి దాని మీద సోమమును ఉంచవలెను.)

    4. సవితృదేవా! ఇది దేవతల సోమము. దీనిని ఇంతవరకు యజమాని కాపాడినాడు. ఇకముందు నీవు కాపాడుము. నిన్ను ఎంతటివాడును బాధింపకుండును గాత.

    (అధ్వర్యుడు సోమమును దేవతలకు అర్పించవలెను.)

 Previous Page Next Page