అంతే.... ఆమెని చూడగానే అతడు శిలాప్రతిమలాగా అక్కడే ఆగిపోయాడు ఒక స్మృతికెరటం ఉప్పెనై సముద్ర జలాలన్నిటినీ అధిగమించి వెనుకనుంచి రివ్వురివ్వున వస్తూ ఒడ్డుని ముంచెత్తిన భావం అతడికి కలిగింది.
ఒక్కసారిగా అతడి కళ్ళముందు వేల వేల కాంతిపుంజాలు ప్రభవించాయి. సి....రి.....చం...ద...న...!
గ్రీష్మ యామినిలో శరత్ చంద్రికోదయం జరిగినట్లు అనిపించింది చైతన్యం పొందిన ఒక గాలి అల.... పరిమళాన్ని మోసుకొచ్చినట్టు, దాహార్తుడైన వ్యక్తికి నీటిజల కనిపించినట్టు అతడు సంతృప్తమైన ఉద్వేగంతో చేష్టలుడిగి నిలబడిపోయాడు. "గిరిగిరి తిరిగితి, విసిగితి, విరిగితి, విడిచితి, విరిదట్టు విరివిడి చూసితి. విధి కిరికిరి చివరికి మీ విరివి విని నగిడి నిలిచితి, సిరియిడి నిల్పితిని నిల్చిక్షితిమినిమ్మా...." అన్నట్టుగా- అతడు ఆమెకు అల్లంతదూరంలోనే ఆగిపోయి కోల్పోయిన వస్తువుని తిరిగి పొందిన మనిషిలా అపురూపంగా చూస్తూ నిలబడ్డాడు.
ఆమె 'విరి' లా అనిపించింది. విరాళి ఆమెలో కనిపించింది.
ఇన్నాళ్ళూ ప్రేమను కని- పెంచిన హృదయం విరాజమానమయింది.
రాక్షసుడు ఎత్తుకుపోయిన ప్రేయసిని, సప్తసముద్రాలుదాటి, అరణ్యాలు ఛేదించి, ఒంటిస్థంభపు మేడ ఎక్కివియోగం తర్వాత మొట్టమొదటిసారి కలుసుకున్న అనుభూతి.
అతడు తన స్థితి మర్చిపోయాడు. చుట్టూ వున్న పరిస్థితికి అర్చితుడయ్యాడు.
కళ్ళచుట్టూ ఒక వెలుగు. ఆ వెలుగు మధ్యలో ఆమె!
ఆమె తప్ప మరేమీ కనబడటంలేదు. కేవలం ఆమె ఒక్కతే. ఆమె తప్ప మరేమీలేదు. ఆమె తప్ప మరేమీ లేకపోవడం తప్ప, అతనికి ఇంకేమీలేదు. నిర్ద్వంద ప్రేమ నిష్వనాఘాతుడై అతడు అడుగు ముందుకేయబోయాడు.
సరిగ్గా అప్పుడే ఆమె గుండెమీద మెరిసిన మంగళసూత్రపు మెరుపు అతడ్ని అడుగు వెనక్కీ తీసుకునేలా చేసింది.
వసంతం వచ్చింది. అయినా వాస్తవం గుర్తొచ్చింది.
వాస్తవం!
ఆమెను తనదాన్నిగా చేసుకోవాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు.'చూసుకొని తృప్తిపడాలి. తృప్తిపడి ఉరికంబం ఎక్కాలి' అన్న ఆలోచనే- అదీ వాస్తవం. ఆమె పరాధీనమన్న వాస్తవం, అతడ్ని ప్రేమతో వెన్నుతట్టి హెచ్చరించింది.
అతడు 'కదిలిపోతూనే' ముందుకు కదిలాడు.
అంతకుముందే ఆమె తేరుకుంది. దగ్గరికి వస్తున్న అతన్ని చూసి మహర్షీ.... నువ్విక్కడ.....?" అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అందంగా, చిన్నపిల్లలాగా తీరాన్ని తాకబోతున్న ఒక చిన్న అలని, తీరం చేరేలోపులోనే పెద్ద అల మింగేసినట్టు అతడి ఆనందాన్ని, ఆమెకి సేవకుడిగా నియమింపబడ్డానన్న భావం కప్పేసింది.
పెదవులపై చిరునవ్వు పుట్టించి "మీ కోసం అప్పాయింట్ చేయబడిందినేనే" అన్నాడు.
"వ్వాట్?" అదిరిపడిందామె. ఒక మంచి మిత్రుడ్ని సేవకుడి స్థానంలో ఆమె సంస్కారం చూడలేకపోయింది. అతడి వైపు అయోమయంగాచూస్తూ "నీ కంత అవసరం ఏమొచ్చింది?" అంది ఆశ్చర్యంగా.
వెంటనే ఏం సమాధానం చెప్పాలో అతడికి అర్థంకాలేదు.
తల పక్కకి తిప్పుతూ "అవన్నీ తీరికగా మాట్లాడుకుందాంగానీ, ఇంతకీ మీ వారేరీ?" అంటూ కారు డోర్ తెరవబోయాడు.
"నేను తీసుకొస్తాను. ఈ బ్రీఫ్ కేస్ లోపలికి తీసుకెళ్ళు" అంటూ ఓ బ్రీఫ్ కేస్ అందించడంతో, అతడది తీసుకుని గెస్ట్ హౌస్ లోపలికి నడిచాడు. లోపల గదుల్లో సామాన్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసి, అతడు తిరిగి బయటికి వచ్చే సమయానికి, గంగమ్మ ప్లాస్క్ కప్పులు తీసుకొస్తూ కనిపించింది. ఆమె చేతినుండి అవి అందుకొని డ్రాయింగ్ రూంలో బల్లమీద సర్దాడు.
అతడింకా క్షణాలక్రితం తను చూసిన దృశ్యంనుంచి తేరుకోలేదు. విధి ఒక వృత్తంలాంటిదని, ఎక్కడ బయలుదేరినా అది కావాల్సినా చోటుకే వస్తుందని అతడికా క్షణం అర్థమైంది. తనని తాను సంబాళించుకుంటూ బయటికి వస్తూ ఉండగా కనిపించిందా దృశ్యం!
చేయి పట్టుకొని భర్తను తీసుకొస్తూంది ఆమె. తడుముకుంటూ నడుస్తున్న భర్తని కాటేజీ లోపలికి తీసుకువస్తూంది.
అతడికి మొదట అర్థంకాలేదు. ఈ లోపులో వెనకనించి చలమయ్య కూడా వచ్చి పక్కన నిలబడటంతో "అయ్యగారికేమైంది?" అని అడిగాడు.
"అయ్యో, మీకింకా తెలీదాబాబూ? ఆయనకీ ఈ మధ్యనే కళ్ళు పోయాయి. అందుకే మనశ్శాంతి కోసం ఇలా వచ్చారు" అని చెప్పాడు చలమయ్య.
అదిరిపడ్డాడు మహర్షి.
సిరిచందన భర్త ఒక అంధుడా!
అతడి హృదయమంతా నొక్కిపెట్టినట్టు అదోలా అయిపోయింది. ఎందుకూ పనికిరాని గడ్డిపరకని సైతం మంచుముక్క కడుగుతుంది. కటిక చీకటిని సైతం వెన్నెలముక్క వెలుగుతో నింపుతుంది. అలాంటిది ఒక అమాయక స్త్రీ మూర్తికి ఇంతటి శిక్ష వేసే హక్కు ఆ భగవంతుడి కెక్కడిది? అనుకున్నాడు.
రాలబోతున్న అశ్రుకణాలు కళ్ళకొలనులోనే నిలిచిపోతూ, తెరచాప తెరని అడ్డుగా వేసాయి. చెమ్మగిల్లిన కళ్ళలోంచి అస్పష్టంగా ఆ దంపతుల ఆకారాలు తనవైపుకి నడిచి రావటం కనిపించింది. కళ్ళలో నలక పడ్డట్టు ఓ కారణం సృష్టించుకొని, అతడు కళ్ళు తుడుచుకున్నాడు. తుడుచుకుంటూ తలెత్తి చూసేసరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోవటం కనిపించింది.
ఇంక అక్కడ వుండి చేయవలసిన పనులేమీ లేనట్టు అతడు గెస్ట్ హౌస్ నుంచి బయటికి వచ్చేశాడు. సాయంత్రం అయిదయ్యింది. గెస్ట్ హౌస్ కి దూరంగా వున్న రాతి బెంచీమీద అతడు కూర్చున్నాడు.
సిరిచందన, ఆమె భర్త బయటికి రాలేదు. మధ్యాహ్నం చలమయ్యే లోపలికి వెళ్ళి వారికి భోజనం ఏర్పాట్లు చేశాడు.
చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు. తానే ప్రశ్నించుకున్నాడు. నిన్నటివరకూ మనసుని ఊపేసిన కోరిక ఇప్పుడు అర్థరహితంగా కనబడుతోంది. ఇలా చూడటంలో మనసులో ఏమూలో చిన్నఆశకూడా వుందా? ఆమెకి వివాహం జరగకుండా వుండుంటే తను మరింత సంతోషంగా ఉండి ఉండేవాడా? సమాధానంలేని ప్రశ్నలు! అర్థంలేని సమాధానాలు!
అతడు లేచి అరగంటలో వస్తానని చలమయ్యతో చెప్పి మార్కెట్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడినుంచి వర్మకి ఫోన్ చేశాడు.
అట్నుంచి వర్మ గొంతు వినగానే "సిరిచందన కనపడింది" అన్నాడు.
అట్నుంచి వర్మ ఎగ్జయిటింగ్ గా "కనపడిందా? ఎక్కడ?" అని అడిగాడు.
"నేను పనిచేసే గెస్ట్ హౌస్ ఓనర్ కూతురే సిరిచందన. భర్తతో కలిసి ఇక్కడికొచ్చింది."
"మైగాడ్! ఆమెకి వివాహం జరిగిపోయిందా?"
మహర్షి సన్నగా నవ్వాడు. "ఆమెకి వివాహం జరగటం, జరగకపోవడం అనేది ఇక్కడ అప్రస్తుతం కాదా వర్మ! నేనూ ఊహించలేదనుకో. కానీ తరువాత ఆలోచిస్తే ఆ విషయానికి అంత ప్రాముఖ్యత లేదనిపించింది. ఇంతకీ ఇప్పుడు నేనెందుకు ఫోన్ చేశానంటే నువ్వక్కడ ఇంకా ఆ అమ్మాయి అడ్రస్ కోసం వెతుకుతూ వుంటావేమో, అది అనవసరం అని చెప్పటం కోసం".
"పోన్లే, వెదకబోయిన తీగ కాలికి తగిలిందిగా!"
"నేను ఈ సాయంత్రమే బయల్దేరి వచ్చేద్దామనుకుంటున్నాను."
"అదేమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు వర్మ.
"అవును. ఇక్కడ నేనుండి చేసేదేముంది? తనని చూడాలనుకున్నాను, చూశాను."
"కానీ, ఇక్కడికొస్తే ప్రమాదం మహర్షీ."
"ఏం ప్రమాదం? పోలీసులనించేగా! నేను వెళ్ళి పోలీసులకి సర్రెండర్ అయిపోతాను."
"ఇంత కష్టపడి ఇన్నిప్రయత్నాలు చేసింది చివరికి సర్రెండర్ అయిపోవటానికా?"
"మరేం చెయ్యమంటావ్? ఆ గెస్ట్ హౌస్ బయట వరండాలో కూర్చొని లోపల ఆ దంపతులు ఎలా ఉన్నారో ఊహించుకుంటూ కాలం గడపమంటావా? లేకపోతే కాషాయ వస్త్రాలు వేసుకొని, గడ్డాలు పెంచుకొని, హిమాలయ పర్వతాలకు వెళ్ళామంటావా? లేదు వర్మ, ఆ రెండు పనూలు నేను చేయలేను. దీనికన్నా జైలుకి తిరిగి వెళ్ళటమే నాకు సంతోషాన్నిస్తుంది."
చాలాసేపు మౌనంగా వుండి వర్మ "నీ యిష్టం" అన్నాడు.
మహర్షి ఫోన్ పెట్టేసి తిరిగి గెస్ట్ హౌస్ కొచ్చాడు. అతడి మనసు ఇప్పుడు ప్రశాంతంగా వుంది. తను చెయ్యాలనుకున్న పని చేసేసాడు. కోరిక తీరింది. ఇప్పుడు చావు కూడా తనని భయపెట్టడం లేదు. ముఖ్యంగా ఇప్పటివరకూ వున్న అసంతృప్తి ఇకలేదు.
అలా ఆలోచిస్తూ అతను గెస్ట్ హౌస్ కి వచ్చేసరికి, బయట లాన్ లో అదే సిమెంటు బల్లమీద సిరిచందన కూర్చొని వుంది. అతన్ని చూసి "రా మహర్షీ. నువ్వెక్కడికో బయట కెళ్ళావని చలమయ్య చెప్పాడు" అంది. ఈ లోపులో చలమయ్య గార్డెన్ ఛెయిర్ తీసుకొచ్చి అక్కడి వేశాడు.
"కూర్చో" అంది.
"మీరక్కడ కూర్చోండి. నేనీ చప్టామీద కూర్చుంటాను" అన్నాడు.
"నాన్సెన్స్" అంది సిరిచందన. "మీరు ఏమిటి? మనం ఒకే క్లాసులో కలిసి చదువుకుంటున్నప్పుడు ఇలాగే గౌరవించుకునే వాళ్ళమా? ఫరవాలేదులే రా, "కూర్చో" అంది.
అతడు ఇబ్బందిగా ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. ఆమె ఇంక ఆ విషయాన్ని పొడిగించకుండా తనే వెళ్ళి ఛెయిర్ లో కూర్చుంటూ "ఊ.... ఇప్పుడు చెప్పు ఏమిటి విశేషాలు? మన క్లాస్ మేట్స్ ఎవరన్నా కనబడుతూ ఉంటారా?" అని అడిగింది.
"సుశీల దుబాయ్ లో వుంది. అంతవరకే తెలుసు."
"అవునట. నాకూ తెలిసింది. కానీ అడ్రస్ లేదు. నీ క్లోజ్ ఫ్రెండ్ వర్మ ఎలా ఉన్నాడు?"
బాగానే వున్నాడు. ఇంకా పెళ్ళి చేసుకోలేదు."
"అన్నట్టు అడగటం మర్చిపోయాను. అంత చదువుకొని, ఇంత చిన్న ఉద్యోగం కోసం ఎందుకొచ్చావు నువ్వు?" అందామె.
అప్పటికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటే చాలనిపించింది. "ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడిని. నష్టం వచ్చిందంటూ కంపెనీ మూసేశారు. మరోటి దొరికేవరకూ ఖాళీగా ఉండటం దేనికని.....! అదీగాక నాకీ పరిసరాలంటే చాలా ఇష్టం."
అవును. పెళ్ళంటే గుర్తొచ్చింది. నువ్వు పెళ్ళిచేసుకోలేదా?"
అతనొక్క క్షణం తడబడ్డాడు. ఏం చెప్పాలి? భార్యని హత్య చేసినట్టు చెప్పాలా? ఆ నేరానికి ఉరిశిక్ష పడినట్టు చెప్పాలా? నిన్ను చూడటం కోసం జైలునుంచి తప్పించుకున్నానని చెప్పాలా? తప్పించుకు వచ్చి నా భార్య పప్రియుడ్ని హొటల్ పైనుంచి తోసేసానని చెప్పాలా? ఏం చెప్పాలి?
అతని మౌనాన్ని మరోలా అర్థం చేసుకుని, సిరిచందన నవ్వుతూ "ఓ మంచి అమ్మాయిని చూసి నేనే చేస్తాన్లే. అన్నట్టు అమ్మాయి..... ఎర్రగా, సన్నగా ఉండాలా? లేక తెల్లగా, బొద్దుగా వుండాలా? లేక నల్లగా కళగా వుండాలా?" అంది చిలిపిగా.
ఆమెలో సహజమైన చిలిపితనం కాలేజీ రోజుల్ని గుర్తుకు తెస్తూండగా అతడు నిర్లిప్తతని తాత్కాలికంగా ప్రక్కకు పెట్టి "ఉహూ.... అలా ఏమీవద్దు. పొట్టిగా, అస్థిపంజరంలా, చామన ఛాయగా వుండాలి" అన్నాడు.
ఆమె ఫక్కున నవ్వింది. అతడా నవ్వుని అపురూపంగా చూసుకున్నాడు.
అతడు తననే పరీశీలనగా చూడటం చూసి, నవ్వు ఆపి "ఏమిటిలా కొత్తగా చూస్తున్నావ్?" అంది.
"ఇంకా నువ్వు అప్పటి సిరిచందనలాగే ఉన్నావ్. అసలు ఏమీ మార్పులేదు నీలో" అన్నాడు.