ఆమె మొహం గంభీరంగా మారిపోయింది. మొహంలో నవ్వు మాయమైంది.
అతడు తడబడుతూ "ఐయాం సారీ" అన్నాడు.
"ఆమె ఆశ్చర్యపోతూ తలెత్తి "దేనికి?" అంది.
"ప్రొద్దున్నే తెలిసింది! మీ వారికి..... "అతడు వాక్యం పూర్తి చేయలేకపోయాడు.
అర్థమైనట్లు చిన్నగా విశ్వసించి "బాధపడి ప్రయిజనమేముంది? జరగాల్సింది జరిగిపోయింది" అంది.
"గుర్తుచేసి బాధపెట్టానా?"
"నో.... నో.... ఇందులో నువ్వు కొత్తగా బాధపెట్టేదేంలేదు."
అతడు ఆ సంభాషణ మారుస్తున్నట్టు "ఈ రోజునుంచీ మీ ప్రోగ్రామ్స్ ఏమిటో, ఏయే స్థలాల కెళ్ళాలోముందుగా చెబితే, నేను ఎప్పటికప్పుడు అన్నీ అరేంజ్ చేస్తాను" అన్నాడు. ఆమె భర్త గుడ్డివాడని తెలిసిన తర్వాత, అతడికిప్పుడు తనేం ఉద్యోగం చెయ్యాలో కొద్దిగా అర్థమైంది.
"ఎక్కువగా బయట తిరగాలని కూడా అనుకోలేదు. ఒకవేళ ఆయన్ని అక్కడికన్నా బయటికి తీసుకు వెళ్ళినా కూడా అక్కడ తనకి చూపులేదన్న విషయం గుర్తు చేసుకొని బాధపడతారు. అందుకే ఉదయం సమయాల్లో మాత్రం అలా బయటికి తీసికెళితే చాలు."
ఆమె గొంతులో తొణికిసలాడిన ఆ కొద్ది నిర్లిప్తతే అతడి హృదయాన్ని ముల్లుతో పొడిచినట్టు బాధపడ్డాడు.
అతడికి ఆశ్చర్యం వేసింది. అయిదు నిమిషాలక్రితమే తను రేపు వెనక్కి తిరిగి వెళ్లిపోదామనుకున్నాడు. కానీ ఇప్పుడు ఈమెతో అలా మాట్లాడాడేమిటి? ప్రేమించిన వ్యక్తి ఎదురుగా వుండగా మనసుకీ, మెదడుకీ సంబంధం తెగిపోతుంది అంటే ఇదేనేమో!
ఆమె లేచి "ఆయన తయారయ్యేరేమో చూస్తాను. వెళ్దామంటే అలా కొండల చివరివరకూ వెళ్ళొద్దాం. కారు రెడీగా ఉంచు. అన్నట్లు నీకు డ్రైవింగ్ వచ్చుకదూ?" అంది.
మహర్షి నవ్వి 'మీ నాన్నగారు నా కిక్కడ ఉద్యోగం ఇచ్చిందే డ్రైవర్ గా" అన్నాడు.
ఆమెకూడా చిరునవ్వుతో తల పంకించి, అక్కడినుంచి కదిలి గెస్ట్ హౌస్ లోపలి వెళ్ళిపోయింది.
అతడు సిగరెట్ తీసి వెలిగించాడు.
మొన్న మొన్నటివరకూ అతడికి సిగరెట్ అలవాటు లేదు.
మొదటి రోజున కాలేజీలో ర్యాగింగ్ చేసినట్టుగానే, కొత్త ఖైదీని జైల్లో ఇబ్బంది పెట్టడం మామూలే. అలవాటు లేదని తెలిసి కూడా తోటి ఖైదీలు బలవంతంగా సిగరెట్ అతని నోట్లో పెట్టిపొగ ఊదమన్నారు. అతడు ఉక్కిరిబిక్కిరివుతూ ఉంటే పడీ పడీ నవ్వారు. అదోలాటి మత్తు అతన్ని ఆవరించింది. ఆ మత్తు తర్వాత బాగున్నట్లనిపించింది. ఆ తరువాత అతడు దానికి అలవాటు పడ్డాడు. మొదట్లో రోజుకి ఒకటి మాత్రమే తాగేవాడు. బాధ ఎక్కువయ్యేకొద్దీ, జ్ఞాపకాలు చుట్టుముట్టేకొద్దీ రానురాను సంఖ్య పెరిగింది. ఇప్పుడతను కనీసం రోజుకి ఒక ప్యాకెట్ సిగరెట్ తాగుతాడు.
అయిపోయిన సిగరెట్ ని దూరంగా విసిరేసి అతడు చలమయ్య ఇంటి దగ్గర కెళ్ళాడు. పళ్ళు, కాఫీ ప్లాస్క్ కారులో పెట్టించాడు. కారు షెడ్ లో నుంచి తీసి పోర్టికో దగ్గర నిలిపాడు.
పడి నిమిషాలు తర్వాత లోపల గది తలుపు తీసిన శబ్దం వినిపించి అటెన్షన్ లో కొచ్చాడు. లోపలినుంచి భార్యాభర్తల సంభాషణ వినిపిస్తోంది. "ఎక్కడికెళదాం ఇప్పుడు?" అని అడుగుతున్నాడు భర్త.
"మీ ఇష్టం. మీరెక్కడికంటే అక్కడికే" అంటోంది సిరిచందన. వాళ్ళు సింహద్వారం వైపు వస్తున్నట్లు మాటలు దగ్గరగా వినిపించసాగాయి.
"టైమెంతయ్యింది?"
"ఐదున్నర" చెబుతోంది సిరిచందన.
మహర్షి కారు వెనకాల తలుపు తెరిచి పట్టుకున్నాడు.
సింహద్వారం నుంచి సిరిచందన భర్త బయటి కొచ్చాడు.
అస్తమిస్తున్న సూర్యుడి వెలుగులో అతడి మొహం పచ్చగా మెరుస్తోంది. అతడు మరో రెండు అడుగులు వేసి మెట్లుదిగి కారు వైపు రాసాగాడు. నల్లకళ్ళజోడు పెట్టుకున్న అతడి మొహం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తూంది.
మెల్లి మెల్లిగా మబ్బు చెదిరి చాటునున్న చంద్రుడు స్పష్టమవుతున్నట్లు మహర్షి మనసు పొరల్లోంచి ఒక నిజం బయటికొచ్చి దేదీప్యమైన వెలుగుతో అతడ్ని దగ్ధం చేస్తున్నట్టు అనిపించింది.
అతడు నిటారుగా అయ్యాడు.
హృదయంలో ఎక్కడో పిడుగుపడింది!
వెనువెంటనే వేలవేల విస్ఫోటనాలు!!
విశ్వం తలకిందులయిన భావన!!!
అతను స్తబ్డుడై..... నిశ్చేష్టుడై..... వేల వేల అణువులుగా విసిపోయాడు. శూన్యంగా మిగిలిపోయాడు.
"మహర్షి! మీట్ మై హజ్బెండ్ .....రవి...... రవితేజ...... ఐ.పి.యస్." సిరిచందన పరిచయం చేస్తోంది.
తన భార్య ప్రియుడు!
రవి!
తన ప్రియురాలి భర్త! రవితేజ! ఎవరినైతే తను హొటల్ బాల్కానీలోంచి తోసేశాడో- ఆ వ్యక్తి!
అతడి మానసిక స్థితి అతడికే అర్థంకాలేదు.
ఈ ప్రపంచంలో తను ద్వేషించే ఏకైక వ్యక్తి..... ఈ ప్రపంచంలో తాను ప్రాణంకన్నా అధికంగా ప్రేమించే ఏకైక వ్యక్తి ప్రాణవిభుడు.
విధి నాటకం అంటే ఇదేనేమో.
బ్రద్ధలైన అగ్ని పర్వతం- పొంగుకొస్తున్న లావానుంచి పరుగెడుతూంటే, ఎదురుగా ఉప్పెనొచ్చి ముంచెత్తిన ఫీలింగ్.
మనసులోని సంచలనాన్నంతా కళ్ళవెనకాల దాచుకుంటూ అతడు మామూలుగా ఉండటానికి ప్రయత్నించాడు. సిరిచందన అతడికోసం కారు మరోవైపు డోర్ తెరవబోయింది.
"కార్లో వద్దులే. ఇద్దరం నడిచి వెళ్దాం" అన్నాడు రవితేజ."
"సరే మీ ఇష్టం" అంటూ అప్పుడే గుర్తొచ్చినదానిలాగా "అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. తను నా క్లాస్ మేట్ మహర్షి" అంది పరిచయం చేస్తున్నట్టు.
రవితేజ చేయి ముందుకు సాచి "మీ గురించి ప్రొద్దున్నే సిరి చెప్పేది" అన్నాడు.
మహర్షి ఆ చేయి అందుకొని కరచాలనం చేస్తూ "గ్లాడ్ టు మీట్ యూ సర్!" అన్నాడు
తోసిన శరీరాన్ని తిరిగి తాకటం అతనికి ఏదోలా అనిపించింది. ఈ చేయే తన భార్య భుజాలచుట్టూ పాములా పెనవేసుకొని వుండి వుంటుంది అన్న ఆలోచన అతడికి గగుర్పాటు కలిగించింది.
"మన మెళ్దామా?" అంది సిరిచందన.
"ష్యూర్!" అన్నాడు రవి. వాళ్ళిద్దరూ ఒకళ్ళ చేతులు ఒకరు పట్టుకొని నడవసాగారు. మహర్షి అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాడు.
4
ఆ రాత్రి అతడు నిద్రపట్టక అటూ ఇటూ దొర్ల సాగాడు. అప్పటికి అతడు అక్కాడ చేరి రెండు రోజులయ్యింది. ఆ రోజు సాయంత్రం వారు ముగ్గురూ కారులో అక్కడికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడికి వెళ్ళారు. తిరిగి వస్తూంటే మధ్యలో కొండ మలుపులో కారు ఆపమంది సిరిచందన. మహర్షి కారుదిగి రవితేజ కూర్చున్నవైపు డోర్ తెరిచి పట్టుకొని "దిగండి" అన్నాడు.
రవితేజ దిగాక, అటుపక్కనుంచి సిరిచందన దగ్గరకొచ్చి "అలా నడుస్తారా? అంది.
"నడుస్తాను. నడిపించటానికి నువ్వున్నావుగా?" అన్నాడు రవి.
ఆమె భర్తచేతిని పట్టుకొని, ఆ పరిసరాల అందానికి మైమరచి అప్రయత్నంగా "అబ్బా ఎంత బాగుందిక్కడ" అంది.
రవి చిన్నగా నవ్వటానికి ప్రయత్నిస్తూ "నాక్కూడా ఎంతో బావుంది. ఇప్పుడు హఠాత్తుగా కళ్ళొచ్చి ఈ ప్రకృతి చూడగలిగితే ఎంత బావుణ్ణు అనిపిస్తూంది అన్నాడు.
ఆ మాట అక్కడున్న ఇద్దరి గుండెల్లోనూ చెరోవిధంగా గుచ్చుకుంది. పరోక్షంగా కారణమైంది తనే అని సిరిచందన, ప్రత్యక్షంగా తనవల్లే జరిగినందుకు మహర్షీ.....ఇద్దరూ విలవిలలాడిపోయారు.
రవితేజ ఆ వాతావరణాన్ని తేలిక పరచటానికి అన్నట్టు " ఇలా చేయి పట్టుకొని నీతో కలిసి సప్తపదులు కాకుండా శతపదులు నడవాలని ఉందోయ్ అన్నాడు.
ఆ మాట ఆమెలోని పశ్చాత్తాప భావాన్ని పక్కకి నెట్టివేసి మొహంలోకి చిరునవ్వు తెప్పించింది.
ఇదంతా గుర్తొచ్చి- ఇక నిద్రపట్టదని నిశ్చయించుకొని, అతడు లేచి శాలువా కప్పుకొని బయటికి నడిచాడు.
సముద్రమట్టానికి బాగా ఎత్తుగా ఉండటం వల్ల చలి ఎక్కువుగా వుంది. అతడు బయటికి రాగానే శీతలపవనాలు అతన్ని చుట్టుముట్టాయి. అతడికి మాత్రం ఆ చలి తెలియడం లేదు. రాసలీఫియా పుష్పం మాత్రం అతడి బాధని అర్థం చేసుకున్నట్టు సానుభూతితో చూస్తోంది.
అతడు వచ్చి బయట తోటలో కూర్చున్నాడు. గెస్ట్ హౌస్ హవుస్ ముందున్న మెర్క్యురీలైట్ కాంతి అతడి మొహానికి ఒకవైపున పడుతోంది. మరోవైపు చీకటి! అతడి మనసులాగే వెలుగునీడలా మిశ్రమం అతడి మొహంమీద ప్రతిబింబిస్తోంది.
గెస్ట్ హౌవుస్ చుట్టూ కాపలాగా తిరుగుతున్న చలమయ్య అటువైపు వచ్చేసరికి, అక్కడ కూర్చొనివున్న మహర్షి కనిపించాడు.
అతన్ని చూసి ఆశ్చర్యంగా "ఏంటి బాబుగారూ ఇక్కడ కూర్చున్నారు?" అని అడిగాడు.
"ఏం లేదు తాతా, నిద్ర రావడంలేదు" అన్నాడు తను.
"భలేవారే. అందుకని మంచులో కూర్చుంటారా?"
"పెద్ద చలేం లేదు తాతా."
"ఈ కొండలమీద మంచు సంగతి మీకు తెలియదు బాబూ! చలి లేనట్టే వుంటుంది. కానీ తలకి పట్టిందంటే మాత్రం ఒక పట్టాన వదలదు. జ్వరంలోకి దింపుతుంది."
"ఈ చలికూడా మనుషుల్లాటిదే నన్నమాట" అనుకున్నాడు మనసులో. తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది. "మరి నువ్వెలా తిరుగుతున్నావు తాతా?"
"మాకేటి బాబూ! ఇక్కడే పుట్టి పెరిగినోళ్ళం. అలవాటై పోయింది."
చలమయ్య కూడా అతని కెదురుగా గడ్డిలో కూర్చుంటూ "కొత్తస్థలం కదా, అందుకే నిద్ర పట్టి వుండదు బాబూ" అన్నాడు.
అంత చదువుకొని కూడా ఏ మాత్రం అధికారం చూపించకుండా తనతోపాటు ఒక నౌఖరులాగే నమ్రతగా ప్రవర్తిస్తూ ఉండటంతో మహర్షి మీద అభిమానం పెరిగింది చలమయ్యకి.
అతడి కెందుకో రవితేజ మొదటి చూపులో నచ్చలేదు. దానికి ప్రత్యేకమైనా కారణాలంటూ ఏం లేవు. అమ్మగారు అతన్ని ఎందుకు పెళ్ళి చేసుకున్నారో అర్థంకాలేదు.
చలమయ్య కొంచెంసేపు మౌనంగా కూర్చొని తరువాత నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ "ఏంటో చిన్నమ్మగారిని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతూ వుంది" అన్నాడు.