Previous Page Next Page 
అతడు ఆమె ప్రియుడు పేజి 16


                                   మూడో అధ్యాయం

    "నా అణువణువూ నీ అణువణువునూ ముద్దాడాలని పిస్తూంది."

    సిరిచందన నవ్వింది. "ఏమిటీరోజు కవిత్వం వస్తూంది?"

    "ప్రాక్టికల్స్ ఎలాగూ లేవుకదా, కనీసం థియరీ అయినా ప్రాక్టీస్ చేద్దామని" అన్నాడు రవితేజ.

    సిరిచందన మొహంలో నవ్వు కాస్త తగ్గింది. "నిజంగా మిమ్మల్ని బాధ పెడుతున్నానా రవీ?" అంది.

    "ఏ మగాడైనా పెళ్ళవగానే శోభనాన్ని వూహించుకుంటాడు."

    "సరే మీ ఇష్టం"

    అతడామెని దగ్గరకి తీసుకుంటూ "ఊరికే అన్నాన్లే. నువ్వన్నట్లే కొంతకాలం ఆగుదాం."

    "నాకెందుకో మీకు కళ్ళొస్తాయనిపిస్తూంది. తొందరలోనే..... అతి తొందరలోనే."

    "అవును. నువ్వు చెప్పింది కూడా నిజమే. నీ ఆద్భుత సౌందర్యాన్ని కళ్ళులేకుండా చూసి ఆనందించటం నేనూ కొంతకాలం ఎదురుచూస్తాను"

    ఆమె అతడి నుదుటిమీద ముద్దుపెట్టుకుంటూ "మీరు నిజంగా చాలా గొప్పవారు" అంది.

    "ఆ రోజు నువ్వలా ఎందుకు ఫోన్ చేశావ్? నేను విలవిలలాడి పోయాను."

    "మీరు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకుందామని అలా చేశాను. అది దీనికి దారితీస్తుందని తెలిస్తే, మనసులో కూడా ఆ ఊహ రానివ్వక పోయేదాన్ని."

    "నిజంగా అక్కడ ఇంకో మగాడు నీతో కలిసుంటే ఏం చేసేవాణ్ణో తెలుసా?"

    "ఏం చేసుండేవారు?"

    "రివాల్వర్ తో వాణ్ణి షూట్ చేసుండేవాణ్ణి"

    "పెళ్ళికాకుండానే.....!"

    "అప్పటికే నువ్వు నా సొంతమని నా మనసులో ముద్ర పడిపోయింది."

    "అవునూ, ఇన్ని చెబుతున్నారు కదా- మీ జీవితంలో పెళ్ళికి ముందు మీకే అమ్మాయితో పరిచయమే లేదా? పరిచయం అంటే మళ్ళీ ఏమేమో ఊహించుకోకండి. కనీసం మాట్లాడాలనిపించటమూ, స్నేహం చేయాలనిపించటమూ, ఇంకా...."

    అతడు ఆమె మాటలు మధ్యలో ఆపుచేస్తూ, నెత్తిమీద చెయ్యిపెట్టి, "నీ మీద ఒట్టు. నాజీవితంలో మొట్టమొదటి ఆఖరి స్త్రీవి నువ్వే" అన్నాడు.

    "ఒట్లు వెయ్యక్కర్లేదులెండి. నమ్ముతాను"

    "అయినా నీ కెందుకొచ్సిందా అనుమానం?"

    "సాధారణంగా ఆడవాళ్ళ దగ్గిర కవిత్వం చెప్పే మగవాళ్ళు ప్రొఫెషనల్స్ అయ్యుంటారట- ఎక్కడో చదివాను" అంది కిలకిలా నవ్వుతూ.

    "చంపేస్తాను. నేనేదో మనసులోంచి వచ్చినమాట నీ దగ్గిర చెబితే. దాన్ని ప్రొఫెషన్లిజం కింద జమకడతావా? అయినా ప్రేమ అనేది చాలా విలవైనది దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది."

    "ఇది కూడా ఒక ప్రొఫెషనల్ మాట్లాడినట్టే వుంది. ఇదే పెళ్ళికాని ప్రొఫెషనల్ అయితే 'ప్రేమ అనేది చాలా విలువైంది. దాన్ని వివాహం అనే చట్రంలో బిగించకూడదు' అంటాడేమో"

    అతను కోపం నటిస్తూ, "ఏమిటి ఈ రోజు నన్నేడిపించటమే ప్రధాన ఉద్దేశ్యంగా పెట్టుకున్నావా?"

    ఆమె అతడి షర్టు బటన్స్ విప్పుతూ "ఏమిటలా చిన్నపిల్లాడిలా ఉడుక్కుంటారు?" అంది. అతను మాట్లాడలేదు. ఆమె చక్కలిగింతలు పెడుతూ, పెదవుల మధ్య అతని ఛాతి వెంట్రుకలు బింకంగా.

    "మీ అలక ఎలా పోగొట్టాలో నాకు తెలుసులేండి" అని మొహాన్ని కిందకి జార్చింది.


                          *    *    *

    ఉదయం పదిగంటలయ్యింది. పోర్టికోలో ఉన్న కారు డిక్కీలోకి నౌఖర్లు సామాన్లంతటినీ జేరుస్తున్నారు. విష్ణువర్థనరావు మెట్లమీద నిలబడి వున్నాడు. సిరిచందన లోపలినుంచి రవితేజ చెయ్యి పట్టుకొని తీసుకువస్తూ "వెళ్ళొస్తాను డాడీ" అంది తండ్రితో.

    "జాగ్రత్తగా వెళ్ళండమ్మా. ఏ అవసరమొచ్చినా ఫోన్ చెయ్యండి. మధ్యలో నేను అప్పుడప్పుడూ వచ్చి చూస్తూ వుంటాన్లే."

    "సరే డాడీ"

    రవితేజ విష్ణువర్థనరావుతో "వెళ్ళొస్తామండి" అన్నాడు.

    "వెళ్ళిరా బాబూ! ఆరోగ్యం జాగ్రత్త."

    సిరిచందన వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. ఆమె ప్రక్కనే రవితేజ కూర్చున్నాడు. కారు కదలబోతుంటే విష్ణువర్థనరావు మెట్లు దిగి కారు దగ్గరకొచ్చాడు. "చూడమ్మా, నిన్న అప్పాయింట్ చేసిన మనిషి అక్కడ మీకోసం ఎదురు చూస్తూంటాడు. అతను నమ్మకస్థుడిలాగానే ఉన్నాడు. ఇక్కడినుంచి ఏమైనా కావలసి వస్తే అతన్ని పంపించండి. అతనికి కారు డ్రైవింగ్ కూడా తెలుసనుకుంటాను. నువ్వు ఎక్కువ డ్రైవ్ చెయ్యకుండా అతనితోనే డ్రైవ్ చేయించు."

    సిరిచందన కొంచెం కోపం నటిస్తూ "నేను పెద్దదాన్నయ్యానని, కనీసం కారన్నా స్వంతంగా డ్రైవ్ చేసుకోగలనని- నీకెప్పుడూ నమ్మకం కుదురుతుంది నాన్నా" అంది.

    ఆయన నవ్వేస్తూ "ఇప్పుడు పెళ్ళయింది కదమ్మా. నువ్వు పెద్దదానివయ్యావని అనిపిస్తుందిలే" అన్నాడు.

    "థాంక్స్ నాన్నా. నా నిర్ణయాలు నేను తీసుకోగలననే నమ్మకం నీకిప్పటికైనా కలిగినందుకు" అని కారు సార్టు చేసింది.

    గేటు మలుపులో కారు అదృశ్యమయ్యేవరకూ ఆయన లాగే నిలబడి తరువాత లోపలి కెళ్ళిపోయాడు.

    "మన హనీమూన్ ఇలా ప్రారంభమవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు" అన్నాడు రవితేజ కారు సీట్లో వెనక్కి వాలుతూ.

    "నాకో వాగ్దానం చేస్తారా?"

    "ఏమిటి?"

    "ఇప్పటినుంచి మనం వెనక్కితిరిగి వచ్చేవరకు, మీకు కళ్ళు లేవన్న బాధ మాటల్లోగానీ, చేతల్లోగానీ కనబడకూడదు. అలా ప్రామిస్ చేయండి."

    రవితేజ నవ్వి "అక్కడినుంచి తిరిగొచ్చాక, మళ్ళీ కళ్ళు లేనందుకు బాధపడటం మొదలుపెట్టొచ్చా?" అని అడిగాడు.

    "నాకెందుకో మీకు అక్కడే కళ్ళు తిరిగి వస్తాయని అనిపిస్తూంది."

    "అక్కడెవరైనా దేవుడున్నాడా, మంత్రజలం చల్లి కళ్ళు తెప్పించటానికి?"

    "ఆశ ఉండటంలో తప్పులేదుగా"

    "పెద్ద పెద్ద డాక్టర్లు, సూపర్ స్పెషలిస్టులు స్కానింగ్ లు చేయిస్తున్నారు పరీక్షలు చేస్తున్నారు. వీళ్ళందరూ చేయలేనిది ఆ అద్భుతం అరకులో ఎలా జరుగుతుంది?"

    "ఆశ మనిషికి బలాన్నిస్తుంది. ఇంక ఈ టాపిక్ వదిలిపెడదామా?"

    "తప్పకుండా" అంటూ అతడు తన సీట్లోంచి పక్కకి జరిగి, ఆమె భుజంమీద తల ఆన్చి, "నిన్ను బార్బరా మేకెల్ ని కిడ్నాప్ చేసినట్టు చెయ్యాల నుంది" అన్నాడు.

    "ఎవరా బార్బరా మేకెల్? ఏమా కథ?"

    "ఒకమ్మాయిని కోటిరూపాయల కోసం కిడ్నాప్ చేశారు. దాన్ని మా పోలీస్ ట్రెయినింగులో ఒక పాఠంగా చెబుతారులే! ఆవిడే దాన్ని ఒక  నవలగా  వ్రాసింది."

    "మీరింత అన్ రొమాంటిక్ అనుకోలేదు."

    అతడు చప్పున లేచి సరిగ్గా కూచుంటూ "ఏం.... ఏం.... ఎందుకని?" అన్నాడు.

    "భార్యతో కలిసి మొట్టమొదటిసారి ఇలా సముద్రం పక్కనుంచి వెళుతుండగా మీరు భయంకరమైన కథలూ, కిడ్నాపులూ చెబుతారా?"

    "అతడు నవ్వేస్తూ "ఐయాం సారీ!" అన్నాడు. కారు వేగం పుంజుకుంది.

   
                            2

    స్టాండులో దిగి, అడ్రస్ చేత్తో పట్టుకొని వాకబు చేస్తూ నడవసాగాడు మహర్షి. రద్దీనుంచి కొంచెం దూరంగా రాగానే అక్కడి ప్రశాంతత అతడి అలసటని పోగొట్టింది. చుట్టూ కొండలు, ఎక్కడ చూసినా పచ్చదనం!

    దాదాపు అరగంట నడిచి అతడు గెస్ట్ హౌస్ కి చేరుకున్నాడు. అక్కడ పనిచేసే చలమయ్యకి తనెవరో, ఎందుకొచ్చాడో చెప్పగానే, "అవును బాబూ! మీరొస్తారని చెప్పారు. నాతోరండి" అంటూ అవుట్ హౌస్ కి తీసుకెళ్ళి అతని సామాన్లు అందులో పెట్టాడు.

    అల్లుడ్నీ, అమ్మాయిని కనిపెట్టుకొని ఉండటానికి, ఒక మనిషి వస్తున్నాడని విష్ణువర్థనరావు చెప్పినప్పుడు- అతడు తనలాంటి నౌఖరో, కారు డ్రైవరో అని అనుకున్నాడు కానీ ఇలా చదువుకున్నవాడు, మొహంలోనే సంస్కారం కనబడేవాడు వాస్తాడని చలమయ్య అనుకోలేదు. అందుకే అప్రయత్నంగా అతడు మహర్షికి గౌరవం ఇచ్చి మాట్లాడసాగాడు.

    చలమయ్య భార్య అతడికి కాఫీ తెచ్చిచ్చింది.

    కాఫీ తాగి అవుట్ హౌస్  ముందు లాన్ లో  ఉన్న బల్లమీద కూర్చున్నాడు మహర్షి. తను చేయవలసిన  పనేమిటో అతనికి సరిగ్గా అర్థంకాలేదు. ఆయన  కూతురూ, అల్లుడూ హనీమూన్ వస్తే అందులో తను చేయవలసింది ఏముంటుంది?

    అతడికి ఆ ప్రదేశం బాగా నచ్చింది. చిన్నకొండ, కొండమీద గెస్ట్ హౌస్ చుట్టూ చెట్లు చల్లని గాలి.....ముఖ్యంగా సిటీలో వుండే ధ్వని కాలుష్యం కానీ, వాతావరణ కాలుష్యం కానీ అక్కడ లేకపోవటం అతని మనసుకి ప్రశాంతతని చేకూర్చి పెట్టసాగింది.

    చేయవలసిన పని ఏదైతేనేం అనుకున్నాడు. సిరిచందన గురించిన వివరాలు  తన స్నేహితుడు పంపిస్తే మంచిదే, లేదంటే తను ఇక్కడ వెతకొచ్చు. అంతకాలం వరకు ఈ మూలప్రాంతంలో పోలీసులు తనని పట్టుకుంటారనే భయం మాత్రం ఉండదు.

    తాత్కాలికంగా నిర్వేదాన్నంత ప్రక్కకునెట్టి, అతడు ఆ ప్రకృతిలో లీనమైపోయాడు. ఆస్వాదనలో మినిగిపోయిన అతను పోర్టికోలో కారువచ్చి ఆగటం కానీ, అందులోంచి విష్ణువర్థనరావుగారి అమ్మాయీ, రవితేజా దిగటం కానీ గమనించలేదు. డోర్ వేసిన శబ్దం వినిపించి, స్పృహలో కొచ్చినట్లు ఉలిక్కిపడి తలతిప్పి అటు చూశాడు.

    పోర్టికోలో కారు కనబడింది. చప్పున లేచి గబగబా అటువైపు వెళ్ళాడు. ఈ లోపులోనే చలమయ్య వెనకాల డిక్కీ తెరిచిసామాన్లు తీస్తున్నాడు. డ్రైవింగ్ సీట్లోంచి దిగిన సిరిచందన మహర్షికి ముందు కనబడ్లేదు. తెరిచిన డిక్కీ ఇద్దరిమధ్యా అడ్డుగా వుంది. భర్తని ఎడమవైపు నుంచి దింపటంకోసం ఆమె కారు వెనకవైపు కొచ్చింది. అదే సమయానికి చలమయ్య సిరిచందనతో "ఆయనేనమ్మా- బాబుగారు పంపించిన మనిషి" అని చూపించాడు. సిరిచందన తలెత్తి అతనివైపు చూసింది.

    ఆ సమయానికి అతడు కూడా ఆమెకి దగ్గరగా చేరుకున్నాడు. 

 Previous Page Next Page