Previous Page Next Page 
ది బ్లడ్ పేజి 16


    తెల్లబోయింది ధీరజ. అతనలా ఎందుకు చేశాడో ఆమెకు అర్ధం కాలేదు.

    కారు స్టీరింగ్ కంట్రోల్ తప్పింది...వెంటనే అందుకున్నది.

    బ్రేక్ మీద కాలు వేసింది. బ్రేకులు పడడం లేదు...

    తను వున్న పరిస్థితి ధీరజకు పూర్తిగా అవగతమయింది.

    స్టీరింగ్ ను కంట్రోల్ చేయగలిగినా, కారు వేగం కంట్రోల్ కావడం లేదు...

    ఎదురుగా లోడ్ లారీ యమ స్పీడుతో వస్తున్నది...

    బ్రిడ్జికి ఎడమ వైపున చెడిపోయిన కారు పార్క్ చేసి వుంది.

    ఏది దారి? ఎటు పోవాలి ? ఎలా ఆపాలి...?

    ధీరజ ముఖాన ముచ్చెమటలు పోశాయి. ఇదేమిటి ? ఇది మరొక అగ్ని పరీక్షా...?

    తను అనవసరంగా ప్రాణంతో చెలగాట మాడుతున్నట్టా ? లైఫ్ రిస్క్...

    ఏం చేయాలి? ఆలోజించడానికే  వ్యవధి లేదు...

    ఏదో ఒకటి చేయాలి ! ముందు ఈ ఉపద్రవం నుంచి ప్రాణంతో బయటపడాలి...

    కారును పూర్తిగా ఎడమవైపుకు కట్ చేసి, పేవ్ మెంటు మీదకు ఎక్కించేస్తే...?

    పొరపాటున కారు బ్రిడ్జికి సైడ్ న వున్న డిఫెన్స్ వాల్ ను గుద్ది కిందకు పడిపోతే...?

    క్రింద రైల్వే ట్రాక్. ఎలక్ట్రికల్ లైన్స్...

    పోనీ, కుడివైపుకు కట్ చేస్తే...? ఎదుట లోడ్ లారీ...ఢీ కొనడం ఖాయం...సరిగ్గా అప్పుడు వినిపించింది-అప్పటికే ఆన్ చేసి వున్న టేప్ రికార్డరులోని అధికారి గొంతుః

    "మిస్ ధీరజ! ఇప్పటి నుంచి సరిగ్గా పది సెకండ్లలో గనుక ఈ ప్రమాదం నుంచి నిన్ను నీవు కాపాడుకోలేకపోతే, పదకొండవ సెకన్ లో కారులో వున్న టైంబాంబు పేలిపోతుంది. కారు, కారుతోపాటు నువ్వు, నీతోపాటు నీ లక్షరూపాయలూ మాడి మసైపోతారు-ఏం చేస్తావో, ఎలా తప్పించుకుంటావో, నీ ఇష్టం! విష్ యు బెస్ట్ ఆఫ్ లక్..."

    ధీరజకు వళ్ళు మండింది. కనులు చింతనిప్పులయ్యాయి. పళ్ళు పటపటలాడాయి...

    తనను ఈ పరిస్థితిలో ఇరికించిన అధికారి ఈ క్షణాన కనిపిస్తే...

    ఇప్పటికే అయిదు సెకన్లు అయిపోయాయి...

    అధికారి అంతుతేల్చడం తరువాత. ముందు ఈ గండం గడిచేది ఎలా...?

    ప్రమాదకరమైన ఈ పరీక్షలో ఎలా నెగ్గాలి? ఎలా బ్రతికి బట్టకట్టాలి...?

    మరొక సెకను అయిపోయింది. ఇక కేవలం నాలుగంటే నాలుగే సెకండ్లు...

    మృత్యువుకూ, జీవితానికీ మధ్య దూరం ఈ నాలుగు సెకండ్లే...

    ఆమె సిక్త్స్ సెన్స్ నిద్రలేచింది. శరీరావయవాలు చకచకా పనిచేయడం ప్రారంభించాయి.

    ఎంతో అనుభవం వుండి, నైపుణ్యం గల డ్రైవరుగా కాళ్ళూ చేతులూ కదిలాయి.

    మొదటిగా ఇంజన్ ను లాక్ చేసింది. ఆ వెంటనే గేర్స్ ను టాప్ నుంచి ఫస్ట్ కు తీసుకువచ్చింది. కారు స్లో మోషన్ లోకి వచ్చింది!

    మృత్యువుతో పోరాటంలో మరి రెండు సెకన్లు పరుగెత్తాయి...

    క్లచ్ నొక్కింది. రివర్స్ గేర్ వేసింది, క్లచ్ ని వదిలింది. కారు బ్రేక్ పడినట్టు కీచుమనే శబ్దంతో మరింతగా స్లో అయింది.

    క్లచ్ ప్లేట్లు పటపటమంటూ విరిగిపోయాయి. ఇంజనులో పెద్ద శబ్దం...

    డోర్ తెరచుకుని, క్రిందకు ఉరికింది ధీరజ.

    కారులో లక్ష రూపాయల సూట్ కేసు...! తీసుకోవడం మరచేపోయింది. అవి వదులుకోవడానికా తను ఇంతటి విషమ పరీక్షలను తట్టుకుంది...?

    మెరపు వేగంతో ధీరజ బేక్ డోర్ తెరచింది. సూట్ కేసును అందుకుని కిందకు లాగింది...

    కన్ను మూసి తెరచేంతలో ఇంతా చేసింది ధీరజ. దటీజ్ ధీరజ!

    సెకండ్ జీరో కౌంట్ లో పడడంతోనే కారులోని టైంబాంబు ప్రేలిపోయింది...

    కారు తునాతునకలయ్యింది. పెట్రోల్ టాంక్ బ్రద్దలయి మంటలు మిన్నంటాయి...

    పగిలిన గాజు ముక్కలు, విరిగిన ఇనుప ముక్కలు ఆమె శరీరాన్ని తూట్లుపొడిచాయి.

    డ్రైవ్ చేసి, కిందపడిన దెబ్బకంటే మిన్నగా ఈ గాజు ముక్కలు, ఇనుప ముక్కలు శరీరంలో సలసల కాలుతూ బాధించాయి. క్షణం మెలికలు  తిరిగిపోయింది ధీరజ...

    అయినా పరిస్థితిని గమనించింది. బాధను పంటి బిగువున  భరిస్తూ, లేచింది. నిటారుగా నిలచింది.

    అప్పుడు ప్రత్యక్షమయ్యాడు అధికారి.

 Previous Page Next Page