Previous Page Next Page 
ది బ్లడ్ పేజి 15


    ఆమె స్పోర్ట్సు డ్రెస్ లో వున్నది. భుజానికి 'కిట్ బ్యాగ్' వ్రేలాడుతున్నది.

    ఆమె వేకువవేళ "జాగింగ్"చేస్తున్నట్టు కనిపిస్తున్నది. నుదిటి చెమటను చేతివ్రేళ్ళతో విదల్చింది. ఆమె ఏడ ఎగిరెగిరిపడుతున్నది. జాగింగ్ తో ఆయాసమా ? లేక వెనుకనే అల్లంత దూరాన ఆమెను ఆ యువకుడు వెంబడిస్తున్నాడనా ?

    ఇవేమీ పట్టించుకోని ఆ యువతి మరల పరుగెత్తనారంభించింది.

    పరుగెత్తీ పరుగెత్తి, శక్తి కొద్దిగా సన్నగిల్లుతున్నట్టు  అనిపించి, ఆగింది. ఆగి, తలెత్తి చూసింది. ఎదుట పులి...

    అప్పటి వరకు తరుముకుంటూ వస్తున్న అటవీశాఖోద్యోగులను, పోలీసులను, వారి వాహనాల శబ్దాలను, అరపులను వింటున్న పులి బెదరింది.

    బెదరిన పులి ఎప్పుడేం చేస్తుందో ఎవరూ చెప్పలేరు !

    ఆ యువతి ఇప్పుడు పులికి ఎదురు నడుస్తున్నది! ఆమె ముఖంలో భయం లేదు. ఆందోళన లేదు. పైగా, ఎంతో నిబ్బరంగా వున్నది !

    "అమ్మాయ్...ఓ అమ్మాయ్...! పులి ! పులి ! పారిపో ! పారిపో...!"

    పులి వెనుక వున్నవారు అరుస్తున్నారు. కేకలు వేస్తున్నారు.

    ఆమెలో ఏ మాత్రం భీతి లేదు. అలాగే పులి ముందుకు వెడుతున్నది! పులి ఒక్కసారిగా గాండ్రించింది. పంజా విప్పింది. పులి పంజా...

    ఆమె ప్రాణాలు పోవడానికి ముహూర్తం దగ్గర పడింది ! జరగనున్న ఘోరాన్ని చూడలేమన్నట్టు జనం కళ్ళు మూసుకుంటున్నారు !

    భయంకరమైన క్షణాలు దొర్లిపోతున్నాయి.

    పది...

    తొమ్మిది...

    ఎనిమిది...

    కౌంట్-డౌన్ ప్రారంభమయింది.

    ఎదురెదురుగా... ఆధునిక యువతి... భయంకరమైన పులి...

    రెండు...

    ఒకటి...

    ఆమెను అప్పటి వరకు వెన్నంటుతూ వస్తున్న యువకుడు ఊపిరి బిగబట్టాడు.

    పులికి తుపాకీని గురిపెట్టాడు.

    సరిగ్గా, ఆ క్షణానే జరిగిందొక  అద్భుత విన్యాసం !

    యువతి మెరుపు వేగంతో తన కిట్ బ్యాగ్ నుంచి పెట్రోల్ తో తడిచి వున్న దివిటీవంటి దానిని తీసి సిజర్ లైటర్ తో అంటించింది. ఒక్కసారిగా ఉవ్వెత్తున మంట లేచింది. మంటకు భీతిల్లిన పులి వెనుదిరిగి పరుగుపెట్టింది !

    జనంలో కలకలం. అంతా ఎటువారటు చెల్లాచెదరైపోయారు !

    యువతి దివిటీ మంటను ఆర్పివేసి, ఆ రెండు వస్తువులను మరల తన కిట్ లో వేసుకుంది.

    యువకుడు తృప్తిగా గాలి పీల్చాడు. గురిపెట్టిన తుపాకిని దించాడు.

    క్షణంలో సగంలో ఎంత జరిగిపోయింది !

    ఊహించని ఈ సంఘటనకు అవాక్కయిన ఉద్యోగులు, సిబ్బంది ఒకొక్కరూ ఆమెకు చేరువకాజొచ్చారు. ఆమె ధైర్యసాహసాలను పొగడడం ప్రారంభించారు.

    సరిగ్గా అదే సమయానికి అక్కడికొక మారుతీ కారు దూసుకువచ్చి ఆగింది.

    కారును డ్రైవ్ చేసుకు వచ్చిన ఆగంతుకుడు దాని తాళాలను యువకునికి అందించి అతను కనుమరుగయాడు.

    యువకుడు ఒక్క ఉదుటున ఆమెను కారులోకి తోసి, తనూ ఎక్కి కూర్చున్నాడు.

    మరల అనుకోని ఈ సంఘటనకు అక్కడ మూగినవారంతా ఆశ్చర్యపోయారు.

    F/R అనే నెంబరు ప్లేటు కారు వారికి వెక్కిరిస్తూ ఈపాటికే తుర్రన వెళ్ళిపోయింది !

    "కంగ్రాచ్యులేషన్స్ ధీరజ!"

    అప్పటి వరకు మౌనంగా వున్న యువకుడు మొదటిసారిగా పెదవి విప్పాడు.

    అతను పేరు అధికారి.

    ఆమె చిరునవ్వు నవ్వింది. ఆమె పేరు ధీరజ.

    "పరీక్షలో విజయం సాధించారు. మీ ధైర్యసాహసాలకు మరొకసారి నా కంగ్రాట్స్! టేక్ దిస్ మని...!" అంటూ సూట్ కేస్ ను ఆమె ముందుపెట్టాడు.

    "ఎంత ?" ధీరజ దానిని చూడకుండానే అడిగింది.

    "భలేవారే ! ఒప్పందం ప్రకారం ఇచ్చాను. లక్ష ! జస్ట్ ఒన్ లాక్ !"

    అప్పటికి మారుతీ కారు ఓవర్ బ్రిడ్జి మీదకు వచ్చింది. కారు డౌన్ లోకి రావడంతోనే అప్పటి వరకు తను నడుపుతున్న మారుతీ స్టీరింగును వదలి, డోర్ తెరచుకొని క్రిందకు దూకేశాడు అధికారి !

 Previous Page Next Page