బుల్లెట్ మోటారు సైకిలు మీద ఆమె సమీపానికి వచ్చాడు. నవ్వాడు.
కంగ్రాట్స్ ధీరజ...యు వార్ రియల్లీ క్వీన్ ఆఫ్ డేర్ అండ్ డాషింగ్! కమాన్, హర్రి అప్!" అంటూనే, బుల్లెట్ ను ఎక్కమన్నట్టు స్లో చేశాడు.
"బుల్ షిట్! నా దారి నేను చూసుకోగలను. తమరిక దయచేయవచ్చు!" ధీరజ ముఖంలోనే కాదు, మాటలో కూడా కోపం ధ్వనించింది.
అతని నవ్వు ఆమెకు పుండుమీద కారం చల్లినట్టు వుంది.
డబ్బుగల సూట్ కేసును విసురుగా అతని చేతికి అందించేసింది ధీరజ!
"సారీ ధీరజా! ముందే చెప్పానుగా, ఈ ట్రేడ్ లో డేర్ డెవిల్ గా వుండగలవారికే స్థానం వుంటుందని! మీకు కలిగిన అసౌకర్యానికి క్షంతవ్యుడిని. ప్లీజ్...ఎక్కండి...!" అధికారి గొంతు సౌమ్యంగా వుంది. ఆమె పడుతున్న బాధకు అతని కనులు సానుభూతిని కనబరుస్తున్నాయి. ఇదీ నాటకమా, నిజమా...?
అప్పటి వరకు అంతా చూస్తూ మ్రాన్పడి వున్న జనం తేరుకున్నారు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ట్రాఫిక్ డ్యూటీకి అప్పుడే వస్తున్న పోలీసులు విజిల్స్ వేస్తూ సంఘటనా స్థలానికి ఉరుకులు పరుగుల వస్తున్నారు.
పరిస్థితిని గమనించిన ధీరజ మారుమాట్టాడకుండా బులెట్ మీదకు ఎగిరి కూర్చుంది.
చుట్టు చేరిన జనం, ట్రాఫిక్ పోలీసులు చూస్తుండగానే మెరపువేగంతో బుల్లెట్ ముందుకు దూసుకుపోయింది. దాని వెనుక F/R వెక్కిరిస్తున్నది!
సిటీ దాటి అడ్డదారిన పడి కొండలూ దాటి ఓ పాడుపడిన బంగళా ముందు ఆగింది బుల్లెట్.
అప్పటికి పూర్తిగా పొద్దెక్కింది. ధీరజను దిగమన్నాడు అధికారి. అతని గొంతు ధ్వనిలో ఇప్పుడు వింత మార్పు! దానిని గుర్తించింది ధీరజ!
"ధీరజా...!" అతని పెదాలు అస్పష్టంగా కదిలాయి. అవి వణుకుతున్నాయి!
అధికారి ధైర్యం చేసి, హఠాత్తుగా ఆమె భుజంమీద చేయివేశారు.
ధీరజ చాచి చెంపకాయ కొట్టబోయింది.
ధీరజ ఇంతకు తెగిస్తుందని ముందే ఊహించుకున్న అధికారి ఆమె చేతిని బలంగా అదిమిపట్టి ఆమె ప్రయత్నాన్ని అదుపుచేయగలిగాడు. అతని కళ్ళలో క్రౌర్యం...
మరుక్షణం ఆమెను నేలమీదకు తోసివేశాడు. విసురుగా ఆమె మీదకు దూకేశాడు.
అతని శరీరం పూర్తిగా ఆమెమీద వుంది. అది సలసల కాగుతున్నది!
నిర్విణ్ణ అయిన ధీరజ క్షణం ఆలోచించింది. తను అబలగా శక్తిహీనురాలని ఓడిపోయి శీలం పోగొట్టుకోవడమా, చివరి యత్నంగా ఎదుర్కొని తనను తాను సబలగా నిరూపించుకోవడమా? ఆమె సిక్త్స్ సెన్స్ మరల మేల్కొంది.
నాలుగు గోడల మధ్యన బంధిస్తే, పిల్లి కూడా పులికావడం నిజమేనా...?
ఎవరికైనా సరే మానసికంగా తనమీద తన శక్తి సామర్ధ్యాలమీద నమ్మకం బలపడితే, శారీరక శక్తికూడా అవలీలగా రెట్టింపుకు పెరిగే అవకాశం వుంది!
ధీరజ తన రెండు అరికాళ్ళను దగ్గరకు చేర్చింది. అంతే! ఒక్క ఊపుతో అతని రెండు తొడల మధ్య కుమ్మింది!
"అ...అమ్మ..." బాధతో విలవిలలాడుతూ అతను గిరికీలు కొట్టి పక్కకు ఒరిగిపోయాడు!
వెనువెంటనే వైద్య సహాయం అందకుంటే అతనిక శారీరక సంపర్కానికి జీవితంలో పనికిరాకపోవచ్చు...! కామాంధుని బ్రతుకు గజ్జల్లో తన్నుతో గడ్డకట్టుకుపోయింది.
చప్పట్లు వినిపించి ఉలిక్కిపడింది ధీరజ. ఒక్క గెంతున లేచి నిటారుగా నిలచింది.
అక్కడే, కనీకనిపించకుండా వున్న స్థావరం నుంచీ చప్పట్లు చరుస్తూ వెలికి వచ్చాడు ఒక వ్యక్తి.
అతని ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. ఎత్తు, లావు, డ్రస్...ఇదివరలో ఎక్కడ ఇతనిని చూసినట్టులేదు. అరుదైన మగవాడు. ఇంపోజింగ్ పర్సనాలిటీ...
"శెహబాష్, మిస్ ధీరజా...శెహబాష్! యు ఆర్ రియల్లీ గ్రేట్! నోనో...క్వీన్ ఆఫ్ ఎడ్వంచర్స్!" అతను తనను తెగమెచ్చుకుంటున్నాడు. ఎందుకు...?
ధీరజలో కోపం స్థానే క్రమేణా ఆలోచన మొదలయింది.
ధీరజ ఇప్పుడు ఆలోచిస్తున్నది తన ఎదుటవున్న ఇద్దరు మగవాళ్ళ గురించి కాదు, గుడిశలో చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన చెల్లెలు సింధు గురించి...
తక్షణ కర్తవ్యాన్ని గుర్తించింది ధీరజ. బులెట్ మీద సూట్ కేస్ ను అందుకోబోయింది...
"వెల్, ధీరజా...వెల్! ఆ లక్షనూ అందుకోవద్దు! నీ అవసరం మాకు తెలుసు! నీ చెల్లి గుండె ఆపరేషన్ కోసం నువ్వు ఎంత రిస్క్ తీసుకుంటున్నావో మాకు తెలుసు. కాని, నీ సాహసాలకు మురిసిపోయి లక్ష రూపాయలను బహుమతిగా ఇవ్వడానికి మేం 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్' ప్రతినిధులం కాము! నీకు పెట్టిన పరీక్షలలో నెగ్గావు కనుకనే మాకు నచ్చావు! నీతో చేయి కలపడానికి మాకు అభ్యంతరం లేదు కాని, మాతో చేయి కలపడానికి నీ అంగీకారమే కావాలి! ఏమంటావు?"