Previous Page
Next Page
పడిలేచే కడలితరంగం పేజి 17
ఆమె తీక్షణ దృక్కుల్ని తాళలేనివాడిలా తలతిప్పుకున్నాడు..... లజ్జాభారంతో అతని కనులు అరమోడ్పులయ్యాయి.
"సంస్కారవంతుడ్నని చాటిచెప్పుకున్న మిస్టర్ కిరీటి! మీరిప్పుడు చేయబోయిందేమిటి?"
వాడి బాణంలా అతడి మనసును తాకింది.
"సంఘంలో అతి పెద్దమనిషిగా చెలామణి అవుతున్న కిరీటిగారూ! మీ చేతలేం ఇంత నికృష్టంగా వున్నాయి?"
మరో శరాఘాతం అతడి మేధను తాకింది.
"పశువును కానని చెప్పుకుంటే చాలదండీ.... చేతల్లో నిరూపించుకోవాలి....."
"శిల్పా....."
అతడి గొంతు ఖంగున మ్రోగింది.
"ఏం..... ఎందుకలా గొంతు చించుకుంటారు. నిజం నిష్ఠూరంగా వుందా, లేక మీ అహం అంగీకరించనంటోందా"
"నువ్వు నా భార్యవి....."
"అని మీరు మాత్రమే అనుకుంటే చాలదని మీకు ముందే చెప్పాను"
"ఏం చేస్తే నా భార్యవని అంగీకరిస్తావో అదైనా చెప్పు"
"ఆ అవకాశం మీరు కోల్పోయారు......"
"కాదు.... నిన్ను నీవు సంస్కరించుకోటానికి నేను అవకాశం యిస్తున్నాను"
"దానికి నేను సిద్ధంగా లేకపోతే....."
"బలవంతంగానైనా నిన్ను నాదారిలోకి మళ్లించుకోవాల్సి వుంటుంది"
"అలాంటి పరిస్థితే వస్తే ఈ శిల్ప ప్రాణాలు తీసుకోవటానికైనా వెనుకాడదు"
"అంతటి ఆత్మాభిమానిగా?"
"అంతేకాదు.... రాజా నరేంద్రదేవ్ మనుమరాల్ని కూడా"
"అంత గొప్పదానివైతే నా సహాయాన్నెందుకు అంగీకరించావు. నా జీవితంలో ఎందుకు ప్రవేశించావు?"
"నేను నీ జీవితంలోకి ప్రవేశించలేదు. మా నాన్నగారికి డబ్బు ఎరచూపి మీరే నాజీవితంలోకి ప్రవేశించారు. నన్ను యుక్తిగా ట్రాప్ చేశారు."
ఆవేశంగా బయటకు వెళ్ళబోతుంటే "ఆగు, అటెక్కడికి" అంటూ అడ్డంగా వెళ్ళి నిలబడ్డాడు.
"ప్రక్క గదిలోకి......"
రోషంగా అతని కళ్లల్లోకి చూసింది.
"ఎందుకు?"
"మీ నుండి కలిగే ప్రమాదం నుండి నన్ను నేను రక్షించుకోడానికి"
"నేను హాని చేయాలని సంకల్పిస్తే ఈ బంగళాలో ఏ గదీ నిన్ను కాపాడలేదు"
"చెప్పానుగా అలాంటి పరిస్థితే ఏర్పడితే నన్ను నేను అంతం చేసుకోడానికైనా వెనకాడనని"
కిరీటి అడ్డం తొలగిపోయాడు బాధగా నిట్టూర్చుతూ.
"ఓకె...... నీ ఇష్టం..... కాని ఒక్క విషయం. మన మధ్య ఏర్పడ్డ అగాధం గురించి మూడోవ్యక్తి తెలుసుకోవటం నాకిష్టంలేదు."
"అలాంటి ఇబ్బంది ఇష్టంలేకనే ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర మీ సహధర్మచారిణిలా నటించింది."
"ఇలా ఎన్నాళ్ళు......"
ద్వారం దాటబోయిన శిల్ప క్షణంపాటు ఆగింది.......
"మనం భార్యాభర్తలుగా ఉన్నన్నాళ్ళు....."
సమాధానం పూర్తికాకుండానే తలుపు లోపలనుండీ బోల్ట్ వేసింది.
నిస్సత్తువగా పరుపుపై వాలిపోయాడు 'మూషిక మార్జాల యుద్ధానికి ముగింపు ఎప్పుడో' అనుకుంటూ.
Previous Page
Next Page