Previous Page Next Page 
పడిలేచే కడలితరంగం పేజి 16


    శిల్ప జాడ కనిపించకపోవడంతో ఆమెను చూడాలన్న ఉత్సుకత అధికమైంది.

    నెమ్మదిగా టెర్రస్ పైకి వెళ్ళాడు.

    నిశ్చలంగా సముద్రం కేసి చూస్తూ నిలబడి వుంది శిల్ప
    అడుగుల చప్పుడు కావటంతో ఓమారు వెనక్కి తిరిగి యధాప్రకారం సముద్రాన్ని చూడటంలోనే లీనమైంది.

    అభ్యంగనస్నానం చేయటం మూలాన లయబద్దంగా గాలికి ఎగురుతున్న యామినీకుంతలాన్ని సుతిమెత్తగా స్పృశించాలని చేయి తిరిగిన చిత్రకారుడి కుంచెనుండి జాలువారిన చందాన అద్భుత లావణ్యాన్ని సంతరించుకున్న ఆమె శరీరాన్ని సందిట బంధించాలన్న ఊహ అతడిలో వివశత్వాన్ని రేపింది.

    "గుడీవినింగ్"

    మాటలు కలిపే ఉద్దేశ్యంతో నెమ్మదిగా విష్ చేశాడు.

    ఓ మారు క్రీగంట చూసి మళ్ళీ తనను కాదన్నట్టుగా తల తిప్పుకుంది.

    "నీ చేత్తో అందించిన కాఫీ తాగాలనుంది."

    వరం కోరుకుంటున్నట్టుగా అడిగాడు.

    "చాలామంది నౌకర్లున్నారుగా......"

    "నేను కోరుకున్నది నీచేతి కాఫీని........"

    "ఓహో...... నేను ఖరీదైన నౌకర్నిగా, అందుకని నా చేతి కాఫీ రుచిగా ఉంటుందని చెప్పడం మీ అభిప్రాయం అనుకుంటాను." ఆమె నిష్ఠూరంగా నీరసపడి పోయాడు కిరీటి.

    ఎంత దగ్గరవుందామన్నా కావాలని దూరంగా జరుగుతున్న శిల్ప మొండి వైఖరి అతనికో పెద్ద ప్రశ్నలా తయారైంది.

    "హనీమూన్ కి వెళ్దామా....."

    ఆమెతో ఏకాంతంగా గడపాలని ఆ విధంగా ఒకరి నొకరు స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశముంటుందన్న తలంపుతో అడిగాడు.

    "అప్పటికైనా నేను మీకు లొంగిపోతానని నమ్మకమా?"

    ఆమె జవాబు సూటిగా అతడి హృదయాన్ని తాకింది. మౌనంగా క్రిందికి నడిచి లైబ్రరీరూంలో కూర్చున్నాడు.

    వికలమైన మనస్సుతో చేతికందిన పుస్తకాన్నొకటి తీసుకుని పేజీలు తిరగేయసాగాడు.

    ఏకాగ్రత చూపించలేక లాన్ లోకి నడిచి కొంతసేపు పచార్లుచేస్తూ గడిపాడు.

    ఆ ఇద్దరి మధ్య వైరుధ్యాల్ని నౌకర్లు ఎక్కడ గుర్తు పడతారోనన్న అనుమానం.... గిల్టీనెస్.....

    భోజనాలవేళ బుద్ధిగా డైనింగ్ టేబుల్ దగ్గర తన ప్రక్కనే కూర్చున్న శిల్పను చూడగానే అతని మనసుకాస్త స్థిమితపడింది - కనీసం ఆ ఒక్క చోటనైనా ఎటికసీ మెయింటైన్ చేసినందుకు.

    భోంచేశాక ఓ గంటపాటు లైబ్రరీలో గడపడం అతని కలవాటు

    పదిగంటలవేళ బెడ్ రూంలో అడుగు పెట్టేసరికి శిల్ప తన కాట్ పైనే పడుకుని ఉండటం గమనించాడు.

     నిద్రలేపడమా లేకపోతే తనే మరోకాట్ పై పడుకోవడమా అని కొన్ని క్షణాలు ఆలోచించాడు.

    ఆ మీమాంసలోనే కాస్త దగ్గరికి వెళ్ళాడు.....

    సబ్ డ్యూడ్ లైటింగ్ చిమ్ముతున్న చిరుకాంతిలో ఆదమరిచి నిద్రపోతున్న శిల్ప శరీర సౌష్టవం ఎల్లోరా శిల్ప సౌందర్యాన్నిగుర్తుచేస్తోంది.

    చెదిరిన పైట..... ఫాలబాగంపై అస్తవ్యస్తంగా పడిన కురులు..... అదురుతున్న చిరుపెదవులు....

    కొన్ని లిప్తపాటు అతని గుండె లయతప్పింది.

    తమకంగా ఆమె ప్రక్కనే కూర్చున్నాడు.

    దూరంగా సముద్రపుహోరు.....

    చిలిపిగా శరీరాన్ని తాకుతున్న సన్నజాజుల పరిమళం..... అల్లరిచేస్తున్న పిల్లగాలులు.....

    హరివిల్లులా వంగిన ఆమె నడుంపై చేయివేశాడు.

    ఆమెలో చలనం లేదు.

    మరికాస్త చొరవ తీసుకుంటున్నట్టుగా ముందుకు వంగాడు.

    అతని వేడి నిశ్వాసం ఆమె చెంపల్ని తాకింది....

    కళ్ళువిప్పిన శిల్ప జరుగుతున్నదేమిటో తృటిలో గుర్తించింది.

    ఆవేశంతో పైకి లేచి రొప్పుతూ పైట సర్దుకుంది.

 Previous Page Next Page