"నిన్ను పెళ్ళి చేసుకుంటానని అంటున్నాను కదా! ఏ పద్ధతిలో చేసుకుంటానని అనుకుంటున్నావు"
"అంటే మీ ఉద్దేశం ఏమీటండీ?"
"నేను నిన్ను అడిగితే తిరిగి నన్నే అడుగుతావేమిటి సరోజా! ఆకాశం అంత పందిరి, భూమంత...." అని అనబోతూ వుంటే_
"ఎగతాళి చేస్తున్నారా?" అని అడిగేను.
"ఇందులో వేళాకోళానికేముంది"
"అయినప్పుడు మీరెలా చేసుకున్నా నాకేమీ అభ్యంతరంలేదు. పెళ్ళి మాత్రం ఏదో పద్ధతిలో మీరు చేసుకోవాలి. మీకు భార్యననిపించుకోవాలి. నా పిల్లలు ఫలానావారి పిల్లలు అని పదిమందీ చెప్పుకోవాలి. అదొక్కటే నా కోరిక" అన్నాను.
"నేను దాన్ని ఒప్పిస్తాను. నా మాట కాదనదు. దానికి నేనంటే విపరీతమైన ప్రేమ. నిన్ను చేసుకుంటానంటే అల్లరి పెడుతుంది. తప్పదు. నా కోసం ఏం చెయ్యటానికైనా వెనకతియ్యదు నాకా నమ్మకం వుంది" అన్నారు.
"ఏవండీ నేనొక్కటడుగుతాను. మరేమనుకోకుండా చెప్తారా"
"అడుగు సరోజా!"
"మీరు ఓ అమ్మాయిని పెంచుకున్నారు కదా. ఆ అమ్మాయి ఎవరి పిల్లండీ?"
"1946 సంవత్సరంలో మా ఇంటికి పది నెలల కడుపుతో మా బంధువురాలు ఒకామె వచ్చింది. వచ్చిన రెండు రోజుల్లోనే హాస్పిటల్ లోనే ఆడపిల్లను కన్నది.
పిల్లను కన్న పదమూడవ రోజునే ఆమెను బండెక్కించి ఊరికి పంపించేసి ఆ పిల్లను మేం వుంచేసుకున్నాం. అమ్మాజీ అని పిలుస్తాం. ఆ పాపని పెంచటానికి కూడా నానా తిప్పలు పడ్డాం. ఇప్పుడవన్నీ ఎందుకులే. జరగబోయేదాన్ని గురించి ఆలోచించు" అన్నారు.
"ఇప్పుడు మనం అనుకున్న విషయం తొందరపడితే జరిగే పనికాదండీ. టైము వస్తే అదే అవుతుంది" అన్నాను.
ఆయనకి ఒళ్ళు మండిపోయింది.
"అలాగని కూర్చో సరోజా. నీ నామాలవాడు, నీ దేవుళ్ళమ్మలు వచ్చి అన్ని పనులు చేసేస్తారు. మూఢనమ్మకాలూ నువ్వూను. ఏ పదిహేనవ సెంచరీలోనో పుట్టాల్సినదానివి. ఇప్పుడు పుట్టి నా ప్రాణం తీస్తున్నావు" అన్నారు.
నేనేమీ సమాధానమివ్వలేదు.
"ఏమిటి సైలెంట్ గా వున్నావు?" అని అడిగారు.
"మీ మూడ్ బాగులేదు. అందుకే_" అన్నాను.
"మూడ్ కేం? బాగానే వుంది. ఏమయినా మంచి మాటలు చెప్పు" అన్నారు.
"నాకు తోచింది అడుగుతాను. మీరు చెప్పాలి" అన్నాను.
"సరే_అడుగు" అన్నారు.
"మీకు పెళ్ళి ఏ సంవత్సరంలో అయ్యింది?" అని అడిగాను.
"1925వ సంవత్సరంలో ఎస్ ఎస్ ఎల్ సీ చదివాను. ఆ సంవత్సరమే నాకు పెళ్ళి కూడా అయ్యింది. ఆ పెళ్ళి భలే తమాషాగా జరిగిందిలే. అది ఇంకోసారి సావధానంగా చెప్తాను కానీ నీ పెళ్ళి ఎప్పుడు?" అని నవ్వారు.
"మహాకవి చేసుకున్న నాడు!" అని "కానీ ఎస్ ఎస్ ఎల్ సీలో పెళ్ళి అయిపోతే గ్రాడ్యుయేషన్ ఎక్కడ ఎప్పుడు ఎలా చేశారు?" అని అడిగాను.
"భలేదానివే! పెళ్ళయితే చదవకూడదనా? మా నాన్న నన్ను మద్రాస్ తీసుకొచ్చి ప్రెసిడెన్సీ కాలేజీలో సీటుకి ప్రయత్నించారు. అక్కడ దొరకలేదు .మద్రాస్ క్రిష్టియన్ కాలేజీలో బి.ఏ. లో సీటు ఇప్పించి స్టూడెంట్స్ హోమ్ లో చేర్పించి వెళ్ళిపోయారు. మా నాన్న నన్ను ఎంత గారాబంగా పెంచినా ఆయన కట్టుబాట్లు నాకూ తప్పలేదు.
1930లో డిగ్రీ పూర్తిచేశాను. (30 అనే చెప్పినట్టు జ్ఞాపకం) పది సంవత్సరాలు బంతిలావున్న చోట ఉండకుండా గడిపానన్నానే_ఆ రోజుల్లోనే ఒక ఉద్యోగమంటూ కాదు ఏ ఉద్యోగమూ వదల్లేదు. ఇన్ని ఉద్యోగాలు చేశానని చెప్పడానికిలేదు. కాలేజీలో ఉద్యోగం, సైన్యంలోనూ, సాహిత్య పాఠశాలలోనూ, సెక్రటేరియట్ (హైదరాబాద్)లోనూ, పత్రికల్లోనూ ఒకటేమిటి సరోజా చాలా ఉద్యోగాలు చేశాను. ఏ ఒక్కటీ సంవత్సరకాలమైనా లేదు.
చాలా సంవత్సరాలపాటు తెగిన గాలిపటంలా తిరిగి తిరిగి చివరకి 1938వ సంవత్సరంలో 'ఆంధ్రప్రభ' సహాయ సంపాదకులలో ఒకడిగా మళ్ళీ మద్రాస్ చేరుకున్నాను.
నేను సైన్స్ విద్యార్ధిని. బిఏ పాసయిన తర్వాత లక్నో యూనివర్శిటీలో ఎమ్. ఎస్పీ, ఎల్ ఎల్ బి చదవాలనుకున్నాను. కానీ అప్పటికే మా ఆర్ధిక పరిస్థితి క్షీణించిపోతోంది. ఆ సంగతి తెలుసుకోలేనంత చిన్న వాడ్ని కాను. మా నాన్న పంపించాలనే అనుకున్నారు. నేనే వెళ్ళనని విరమించుకున్నాను.
1930 నుండి 1940వరకు ఆర్ధికక్షోభ ,మానసిక బాధ అనుభవించాను. సరిగ్గా అదేటైములో అంటే 1930_40 మధ్యలోనే మహాప్రస్థానం గీతాలన్నీ ఇంచుమించు పూర్తిచేశాను. ఒకటో రెండో తర్వాత రాశాను" అని చెప్పారు.
"మీ స్కూల్ ఫైనల్ పరీక్ష అయిన తర్వాత పెళ్ళయిందా, పెళ్ళి తర్వాత పరీక్షా?" అని అడిగాను.
పెళ్ళయిన వారంరోజుల లోగానే స్కూల్ ఫైనల్ పరీక్షకు కూర్చున్నాను. పెళ్ళినాటికి నా వయస్సు పదిహేనేళ్ళు. దానికి తొమ్మిది పదేళ్ళు వుంటాయి" అని అన్నారు.