13. మేము అన్నవంతులము. గోవులతో ఆనందించుచున్నాము. ఇంద్రుడు సహితము అట్లే మాగోవులతో ఆనందించవలెను. అప్పుడు ఆగోవులు మాకు సంపన్నములు అగును.
14. ఇంద్రా ! నీవంటి దేవుడు ప్రార్థించగనే ప్రసన్నుడు అగును. రథచక్రములకు ఇరుసువలె, నిన్ను స్తుతించు వారికి అమర్చెదవు.
15. ఇంద్రా ! నిన్ను స్తుతించినవారి కోరికలను బండికి ఇరుసువలె కూర్చెదవు.
16. "ఫ్రూ" అని ధ్వనించునవి, సకిలించునవి, బుసలు కొట్టునవి అగు అశ్వములతో ఇంద్రుడు సర్వధనములను జయించినాడు. దాతయగు ఆ ఇంద్రుడు మాకు బంగారు రథమును ఇచ్చినాడు.
17. అశ్వినులారా ! అనేక గుఱ్ఱములు అమర్చిన రథములలో సమృద్ధ ద్రవ్యములను కొనిరండు. మా ఇంటిని గోవులతోను, బంగారముతోను నింపుడు.
18. అశ్వినులారా ! మీ ఉభయుల రథమునకు అడ్డులేదు. అది సర్వగమనము కలది. అది సాగరమందు కూడ సంచరించగలదు.
19. అశ్వినులారా ! మీ రథము ఒక చక్రమును నష్టపరచరాని పర్వత శిఖరమునను రెండవ చక్రమును ద్యులోకమునను నియమించినారు.
20. అంతము ఎరుగని ఉషస్సా ! నీవు స్తుతిప్రియవు. నీ అందమును ఆనందించు నరుడు ఉన్నాడా? తేజోమయీ ! నీ కాంతిని అందుకొను వాడు ఉన్నాడా ?
21. ఉషోదేవీ ! నీవి చిత్రవిచిత్రములయిన రంగులు. అవి వ్యాపించు రీతి అద్భుతము. నిన్ను దరిచేరిగాని, దూరముగా గాని ఆస్వాదించుట అసాధ్యము.
22. ఉషోదేవీ ! నీవు ద్యులోకమునకు కూతురవు. మాకు పదార్థములను, ద్రవ్యములను ప్రసాదించుము.
(ప్రథమ మండలములోని ఆరవ అనువాకము సమాప్తము.)
ఏడవ అనువాకము - ముప్పది ఒకటవ సూక్తము
ఋషి - అంగిరస పుత్రుడు హిరణ్య స్తూపుడు, దేవత - అగ్ని
ఛందస్సు - 8,16,18 త్రిష్టుప్, తక్కినవి జగతి.
1. అగ్నీ ! నీవు తొలుత అంగిరస ఋషిని అయినావు. దేవతవు అయినావు. దేవతల సఖుడవు అయినావు. మరుత్తులు మేధావులు. జ్ఞానులు. తళతళలాడు ఆయుధపాణులు. వారు నీ నుండియే అవతరించినారు.
2. అగ్నీ ! నీవు అంగిరసులలో ప్రధానుడవు. మేధావిని. అన్యదేవతల యజనములను ప్రకాశింప చేతువు. భూ, ద్యులోకములు-ఉభయ అరణులు, ఇద్దరు తల్లులు గలవాడవు. మానవులకు బహురీతుల ప్రకటమగుదువు.
3. అగ్నీ ! నీవు వాయువుకన్న ముందు ఆవిర్భవించినావు. నీ బలదర్పములకు భూమ్యాకాశములు గడగడలాడుచున్నవి. యజ్ఞములందు హోతలలో శ్రేష్ఠుని కార్యభారము వహించినావు. పూజ్యులయిన దేవతల కొఱకు యాగములు చేసినావు. దేవతలను యజించినావు. సత్కర్మలు చేయు యజమాని కొఱకు నీవు ఆవిర్భవింపుము.
4. అగ్నీ ! నీవు మనువునకు ద్యులోకమును తెలియపరచినావు. పురూరవుడు సత్కర్మచేసినాడు. అతనికి శుభఫలమును ప్రసాదించినావు. అరణులను మధింపగా అవతరించినావు. వేదికి తూర్పున ఆహవనీయవు అయినావు. పడమట గార్హపత్యమవు అయినావు.
5. అగ్నీ ! నీవు మా కోరికలను తీర్చువాడవు. మాకు పుష్టివర్ధనుడవు. పదార్థములు అన్నియు నీయందే ఉన్నవి. యజమాని నీకు మంత్రములు, హవిస్సులు సమర్పించుచున్నాడు. అతనికి సంతానము ప్రసాదించుము.
6. అగ్నీ ! నీవు విశిష్టజ్ఞానివి. పాపకర్ములను యోగ్యులను చేతువు. ధనమునకుగాను, శూరులు యుద్ధములు చేతురు. అ యుద్ధములందు నీవు శత్రువును వధింతువు.
7. అగ్నీ ! నీవు రోజు రోజు నరునకు అన్నము అందింతువు. మరణము దూరము చేతువు. ద్విపాద, చతుష్పాత్తులనుకోరు యజమానికి అన్నము, సుఖము సమకూర్చుచున్నావు.
8. అగ్నీ ! నిన్ను స్తుతించుటకు, మాకు ధనమును కీర్తిని కలుగచేసి, కర్మలను ఆచరించు పుత్రుని ప్రసాదించుము. పుత్రునితోకూడ యాగములు చేతుము. భూమి, అంతరిక్షములు మమ్ము రక్షించవలెను. ద్యావాపృథివీ ప్రావతం నః
9. అగ్నీ ! నీవు దోషరహితుడవు. దేవతలందు అగ్రుడవు. జ్ఞానివి. ద్యావా పృథ్వులు నీకు తలిదండ్రులు. వారికి దగ్గరగా ఉండుము. మాకు సంతానము ప్రసాదించుము. సత్కర్మ చేయువారిని అనుగ్రహింపుము. సంపదలు గుమ్మరించుము.
10. అగ్నీ ! నీవు బుద్ధిమంతుడవు. మాకు పాలకుడవు. నీకు నూర్లకొలది ధనములు, వేల కొలది సంపదలు సంప్రాప్తములు అగును.
11. అగ్నీ ! తొలుత నీవు మా తండ్రి అంగిరసుని పుత్రుడవు అయినావు. తదుపరి దేవతలు నిన్ను సహుషునకు సేవాపతిని చేసినారు. మనువు పుత్రిక ఇళను ధర్మోపదేశము చేయుటకు నియమించినారు.
12. అగ్నీ ! నీవు స్తవనీయుడవు. నీ రక్షణమున మాకు ధనము లభించినది. మమ్ము పాలింపుము. మా పుత్రులను రక్షింపుము. మా మనుమల యజ్ఞములను, గోవులను రక్షింపుము.
13. అగ్నీ ! యజ్ఞపాలకుడవు. నాలుగు దిశలందు ప్రజ్వరిల్లుచు యజమానిని రక్కసులనుండి రక్షింతువు. అహింస హవిస్సులు అర్పించు యజమానులు నిన్ను స్తుతింతురు. అట్టివారి స్త్రోత్రములచే నీవు మనసా స్వీకరింతువు.
14. అగ్నీ ! నీవు స్తవనీయుడవు. యజమాని కోరిన ఉత్తమ ధనమును ప్రసాదింతువు. నీవు దర్బలుడగు యజమానిని విషయమున కూడ ప్రసన్నుడవు అగుదువు. శిశు యజమానిని సహితము నీవు అనుగ్రహింతువు. అట్లే దిశలను ప్రకటముగా చూపింతువు.
15. అగ్నీ ! దక్షిణలు ఇచ్చిన యజమానిని నీవు కవచమువై రక్షించుచున్నావు. తన ఇంట అతిథులకు రుచికరమయిన భోజనము పెట్టి సుఖింప చేయుచు జీవ యజ్ఞము నిర్వహించు యజమాని స్వర్గతుల్యుడు.
16. అగ్నీ ! మా వ్రత లోపమును మన్నింపుము. నీకు దూరమయి దోషము చేసినాము. దానిని కూడ క్షమింపుము. సోమార్హులయిన నరులు ఆశ్రయింపదగిన తండ్రివి. బుద్ధిమంతుడవు. నీవు వారలకు దర్శనీయుడవు.
17. అగ్నీ ! నీవు శుచివి, సర్వము గమనించగలవు. నీవు పూర్వము అంగిరసుడు, మనువు, యయాతి సభలకు విచ్చేసినావు. ఆవిధముగానే మేము చేయు దేవసదనములకును విచ్చేయుము. దేవతలను తీసుకొని రమ్ము. వారిని దర్భలమీద కూర్చుండ పెట్టుము. వారికి ఇష్టములగు హవిస్సులను అందించుము.
18. మేము మా సామర్ధ్యము, జ్ఞానమును అనుసరించి మంత్రమును చేసినాము. అగ్నీ ! దీనిని గ్రహించుము. నీవు వర్ధిల్లుము. మాకు సంపదను, జ్ఞానమును ప్రసాదించుము. వః సృజసుమత్యా వాజవత్
ముప్పది రెండవ సూక్తము, ఋషి - అంగిరస పుత్రుడు హిరణ్యస్తూపుడు,
దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. ఇంద్రుడు వజ్రము కలవాడు. పూర్వము అతడు మహత్కార్యములు చేసినాడు. మేఘములను కొట్టినాడు. జలములను చీల్చినాడు. కొండల నుండి నదులను బహిర్గతము చేసినాడు.
2. కొండమీద ఉన్న మబ్బులను కొట్టినాడు. త్వష్ట ఇంద్రునకు వజ్రాయుధము నిర్మించి ఇచ్చినాడు. ఇంద్రుడు కొట్టిన మబ్బులు కురిసినవి. నదులయినవి. దూడల కొఱకు గోవులు పరుగులు తీయును. అట్లే నదులు సముద్రములకు సాగినవి.
3. ఇంద్రుడు ఆబోతువలె ఠీవిగా నడచినాడు. వజ్రాయుధమును సాధించినాడు. తొలుతపుట్టిన 'అహి' అను మేఘమును కొట్టినాడు. (నడచుట, ఎన్నుకొనుట, త్రావుట, సాధించుట, కొట్టుట ఒక క్రమము కనిపించుచున్నది.)
4. ఇంద్రుడు తొలుత పుట్టిన అహి అను మేఘమును కొట్టినాడు. అసురుల మాయలను అంతము చేసినాడు. పగవానిని అగపడకుండ చేసినాడు. అప్పుడు ఆకాశమును, ఉషస్సును, సూర్యుని కల్పించినాడు.
5. వృత్రుడు సర్వమును ఆవరించినవాడు. ఇంద్రుడు గొడ్డలివంటి వజ్రాయుధము అందుకున్నాడు. చెట్టును నరికినట్లు వృత్రుని భుజములు నరికినాడు. వృత్రుడు నరికిన చెట్టువలె నేల కూలినాడు. శయత ఉపసృకే పృథివ్యాః
6. వృత్రుడు పొగరుబోతు, తనతో తలపడువారు లేరనుకున్నాడు. వీరుడు, శత్రుంజయుడగు ఇంద్రుని పోరునకు పిలచినాడు. ఇంద్రుని దెబ్బలకు వృత్రుడు తాళలేక పోయినాడు. కూలిన వాడు నదుల దరులను పిండి కొట్టినాడు.
7. వృత్రుడు కాళ్లు, చేతులు లేనివాడు అయినాడు. అయినను నపుంసకుడు మగతనము కొఱకువలె, ఇంద్రునిపైకి యుద్ధమునకు ఉరికినాడు. కొండ కొనవంటి వృత్రుని రొమ్ముమీద ఇంద్రుడు వజ్రముతో బాదినాడు. వృత్రుని అవయవములు అన్నియు చెదిరి పడినవి. వృత్రో అశయ ద్వ్యస్తః
8. పూర్వము వృత్రుడు తన బలదర్పములతో నదులను నాలుగు దిశల నుంచి బంధించి ఉంచినాడు. ఇప్పుడు కూలిన వృత్రుడు పాయలు పాయలయిన నదివలె పడి ఉన్నాడు. అతడు కట్టిపెట్టిన నదులే వృత్రుని పాదాక్రాంతుని చేసి పారుచున్నట్లున్నవి.
9. వృత్రుని తల్లి బిడ్డ అవయములపై బడినది. బిడ్డను కప్పి కరచి పట్టినది. ఇంద్రుడు తల్లికింద బిడ్డమీద వజ్రము విసిరినాడు. దూడమీద పడిన ఆవువలె తల్లి చచ్చి కూలినది.
10. నిలకడలేని నీరు వృత్రుని దేహమును ముంచి, దాటి పారినవి. వృత్రుడు నీటి మధ్య దీర్ఘ నిద్ర పోయినాడు. దీర్ఘం తమ ఆశయదిన్ద్ర శత్రుః
11. పూర్వము అసురులు గోవులను గుహలో బంధించినారు. వృత్రుడే నాధుడు, రక్షకుడు అయిన నదులు గోవుల వలెనే బంధింపబడి ఉండెను. వృత్ర హంతకి ఇంద్రుడు గుహ ద్వారమును, ప్రవాహ ద్వారమును తెరచినాడు.
12. వృత్రుడు అద్వితీయమగు వజ్రమునకు అడ్డు పడినాడు. గుఱ్ఱము తన తోకతో ఈగలను తోలును. ఇంద్రుడు అంత అవలీలగా వృత్రుని కొట్టినాడు. ఇంద్రుడు గోవులను నదులను విడిపించినాడు. సోమమును తెచ్చినాడు. సప్త సింధులను సృష్టించినాడు సృజః సర్తవే సప్త సింధూవ్
13. వృత్రుడు విసరిన విద్యుత్తు ఇంద్రునిపై పారలేదు. అది ఇంద్రుని గర్జనను, వర్షమును, అడ్డలేక పోయినది. ఇంద్రుడు వృత్రుని ఇతర మాయలను కూడ జయించినాడు.
14. వజ్రబాహువు అయినవాడు ఇంద్రుడు. అతడు చలనము ఉన్న, చలనములేని, కొమ్ములు ఉన్న, కొమ్ములులేని సకల ప్రాణి జాలములకు ప్రభువు. బండి చక్రమును ఆవరించిన కమ్మివలె ఇంద్రుడు సకల స్థావర జంగమ ప్రాణులను ఆవరించి ఉన్నాడు.
ఆలోచనామృతము :
1. ఈ సూక్తము అద్భుతము. ఆశ్చర్యకరమయిన జలముక్తి మహాకార్యమును వివరించుచున్నది. కొండలందు దాగిన నదుల అడ్డంకులను తొలగించి ప్రవహింపచేయు మహత్కార్యమును వర్ణించుచున్నది.
ఇది నేడు నదులకు ఆనకట్టలు కట్టు యంత్రముల అట్టహాస కార్యమును తలపించుచున్నది. నేటిది కట్టుట, నాటిది విప్పుట.
ఇది ఒక గొప్ప ఇంజనీరింగ్ ప్రక్రియ. ఇంజనీర్లే దీనిని వివరించగలరు.
వృత్రుడు దస్యుడు. అసురుడు. రాక్షసుడు. మహావీరుడు. ఇంద్రశత్రువు. ఈ సూత్రమున నీటికి అడ్డు పడిన కొండవలెనో, మేఘమునకు అడ్డుపడిన మరుతమువలెనో ఉన్నాడు.
వృత్రుని వధించిన విధము కన్నులకు కట్టినట్లుగా చెప్పబడినది.
9వ ఋక్కున వృత్రుని తల్లి బిడ్డను కాపాడుకొనుటకు కరచిపెట్టిన విధము మాతృప్రేమకు సజీవ నిదర్శనము.
శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత మొ.అష్టకము మొ.మండలము రెండవ అధ్యాయము సమాప్తము.
ఓం నతా మనన్తి మాయినో నధీరా వ్రతా దేవానాం ప్రథమా ధ్రువాణి |
నరోదసీ అద్రుహ వేద్యాభిర్న పర్వతాని నమేత స్థివాంసః ||
మూడవ అధ్యాయము - ముప్పదిమూడవ సూక్తము
ఋషి-అంగిరస పుత్రుడు హిరణ్య స్తూపుడు, దేవత-ఇంద్రుడు, ఛందస్సు-త్రిష్టుప్.
1. దేవతలారా ! గోవులను తెచ్చుటకు ఇంద్రునివద్దకు పోవుదుము రండు. ఇంద్రుడు శత్రువులేని వాడయినాడు. అతడు మన మనసుల మురిపెమును పెంచును. అతడు మనకు సంపదల - గోవుల పరిజ్ఞానము కలుగచేయును.