Previous Page Next Page 
ఋగ్వేద సంహిత - 1 పేజి 17


    2. యుద్ధములందు స్తుతికర్తలు ఇంద్రుని ఉపాసింతురు. ఇంద్రుడు అజేయుడు. ధనదుడు. అట్టి ఇంద్రుని నిరుపమాన స్తుతుల పూజింతును. డేగ తన పూర్వనివాసమునకు చేరినట్లు నేను ఇంద్రుని చేరుదును.

    3. ఇంద్రుడు తూణీరములు ధరించి సమస్త సేనతో సిద్ధముగా ఉండును. గోవులను విడిపించమనిన వారి గోవులను విడిపించును. గోధనములను ఇచ్చునట్టి ఇంద్రుడు మా విషయమున విపణి కారాదు. మాపణిర్భూ రస్మదధిప్రవృద్ధ (గోరక్షణను వర్తకము చేయరాదు అనుచున్నాడు.)

    4. ఇంద్రా ! మరుత్తులతో కూడి ఒక్కడవే నీ కఠినమైన వజ్రమున ధనవంతుడయిన దస్యుని, వృత్రుని వధించినావు. వృత్రుని అనుచరులు సనకులు నీ ధనుస్సును ఆక్రమించినారు. యజ్ఞమును నిలిపినారు. అట్టి సనకులు కూడ అంతరించినారు.

    5. వృత్రుని అనుచరులు సనకులు. వారు యజ్ఞవిరోధులు. యజ్ఞముచేయు వారిని నిరోధింతురు. అటువంటి అసురులు తలలువంచుకొని పారిపోయినారు. హర్యశ్వములు గల ఇంద్రా ! భూమ్యాకాశముల నుండి సనకులను ఊదివేసినావు.

    6. ఇంద్రుడు దోషరహితుడు. అతని సేనతో సనకులు యుద్ధము చేయదలచినారు. మాననీయులయిన మానవులు మంత్రములు పఠించి ఇంద్రుని ఉత్సాహవంతుని చేసినారు. శూరవీరుడు నపుంసకుని ఓడించినట్లు ఇంద్రుడు సనకులను ఓడించినాడు. సనకులు ప్రాణములు దక్కిననేచాలును అనుకున్నారు. ఇంద్రునకు దూరముగా పారిపోయినారు.

    7. ఇంద్రా ! వృత్రుని ద్యులోకము నుండి లాగినావు. వానిని దహించినావు. వృత్రుని అనుచరులు నిన్ను తినుటకు వచ్చినారు. వారిని ఏడిపించినావు. వారిని ఆకసమునకు ఆవల వధించినారు. వారిని ఏడిపించినావు. వారిని ఆకసమునకు ఆవల వధించినావు. తదుపరి నీకు సోమమును సమర్పించి అర్చించిన యజమానిని రక్షించినావు.

    8. వృత్రుని కుటుంబము ధరిత్రిని అంతను ఆక్రమించినారు. బంగారము, రత్నములతో ప్రకాశించినారు. వృద్ధిపొందినారు. అయినను ఇంద్రుని గెలువలేక పోయినారు. అపుడు ఇంద్రుడు వారిని సూర్యుని ఆవలికి తోలినాడు.

    9. ఇంద్రా ! నీవు భూమిని, అంతరిక్షమును ఆక్రమించినావు. అనుభవించుచున్నావు. మంత్రపు అర్ధము ఎరుగనివారయినను యజమానులను అభిమానించినావు. వారి మంత్ర ప్రభావమున వృత్రుని పరిమార్చినావు.

    10. జలములు అన్నియు ద్యులోకమునందే ఉండెను. భూమికి రాలేకపోయెను. భూమిని సస్యశ్యామలము చేయలేకపోయెను. అప్పుడు ఇంద్రుడు వజ్రము ధరించినాడు. వెలుగుచున్న వజ్రమున చీకటివంటి మబ్బులను కొట్టినాడు. జలమును నిశ్శేషముగ రాల్చినాడు.

    11. ఇంద్రుని వలన జలములు భూమికి దిగినవి. ఓడలు దాట దగిన జలములందు వృత్రుడు వృద్ధి చెందినాడు. తనతో సమమయిన వృత్రుని ఇంద్రుడు కొన్ని దినములు కనిపెట్టినాడు. తదుపరి వజ్రాయుధమున వృత్రుని వధించినాడు.

    12. వృత్రుడు గుహలో శయనించినాడు. జలములను నిరోధించినాడు. జగములను శోషింపచేసినాడు. అట్టి వృత్రుని ఇంద్రుడు శృంగభంగము చేసినాడు. ఇంద్రా ! నీవు ధనవంతుడవు. బలవంతుడవు. వేగవంతుడవు. యుద్ధము కోరిన శత్రువును వజ్రమున సంహరించినావు.

    13. ఇంద్రుని వజ్రము శత్రువులమీద కూలినది. వజ్రము వాడియైనది. శ్రేష్ఠ మయినది. అది శత్రువుల నగరములను చిందర వందర చేసినది. అప్పుడు ఇంద్రుడు తెలివిగా వజ్రమును వృత్రుని మీదకు విసరినాడు.

    14. ఇంద్రా ! నీవు కుత్సు మహర్షి స్తుతిని కోరినావు. ఆ మహర్షిని రక్షించినావు. నీవు యుద్ధమున ఉన్నావు. నీ గుఱ్ఱముల గిట్టల ధూళి ఆకసమును అంటినది. ఆ సమయమందును దశదిశల ప్రకాశించు ద్యుమంత ఋషిని రక్షించినావు. శిత్రాపుత్ర మహర్షిని నీదయవలన జలముల నుండి బయటికి తీసినావు.

    15. ఇంద్రా ! నీవు సంపన్నుడవు. భూమి కొఱకు యుద్ధములు చేసినావు. అప్పుడు కూడ శాంతుడు, గుణశ్రేష్ఠుడు అయిన శిత్రాపుత్రుడు శ్విత్రియుని నీటి నుండి రక్షించినావు. యుద్ధములందు మాపై పగబట్టిన వారిని దుఃఖములపాలు చేసినావు.

        ముప్పది నాలుగవ సూక్తము, ఋషి - అంగిరస పుత్రుడు హిరణ్య స్తూపుడు.

        దేవత - అశ్వినులు, ఛందస్సు - 9, 12 త్రిష్టుప్, తక్కినవి జగతి.


    1. అశ్వినులారా ! మీరు మేధావులు. మీ రథము సర్వత్ర సంచరించును. మీ దానము సర్వవ్యాప్తము. మీ ఉభయులది అన్యోన్య సంబంధము. అది వెలుగుగల పగటికి మంచుగల రాత్రికి ఉన్న సంబంధము వంటిది. మీరు మా ఉదయము, పగలు, సాయంత్రములందుచేయు సవన త్రయములకు విచ్చేయుడు. ఋత్విజులవద్ద నిలుచుడు.

    2. చంద్రునకు వేనకు వివాహము. ఇది దేవతలకు అందరకు తెలియును. అశ్వినులు మధుర పదార్థములను రథముమీద తీసుకొని పోవుచున్నారు. ఆ రథమునకు మూడు చక్రములు ఉన్నవి. అవి వజ్రమంతటి గట్టివి. రథము అతివేగవంతము. అందువలన పట్టుకొనుటకు మూడు స్తంభములు ఉన్నవి. అశ్వినులారా ! మీరు పగలు మూడు మారులు రాత్రి మూడు మారులు రావలెను. త్రిర్నక్తం యాథస్త్రిరశ్వినాదివా

    3. అశ్వినులారా ! మా కర్మములందలి దోషములను రోజుకు మూడుసార్లు పరిహరించుడు. మా యజ్ఞములందు మూడుసార్లు మధువును చల్లుడు. రాత్రిందివములందు మాకు బలము కలిగించు ఆహారమును ప్రసాదించుడు.

    4. అశ్వినులారా ! మా ఇంటికి మూడుసార్లు రండు. మా మిత్రుని ఇంటికి మూడుసార్లు రండు. మాకు మూడు విధముల కర్మలను బోధించుడు. ఆనందకరమగు కర్మఫలమును మూడుసార్లు ప్రసాదించుడు. మేఘము వర్షమును ఇచ్చినట్లు మూడుసార్లు అన్నము అందించుము.

    5. మూడు చక్రముల రథము మీద సూర్యపుత్రిక ఆసీనురాలయి ఉన్నది. అశ్వినులారా ! మీరు మాకు మూడుసార్లు ధనము ఇవ్వవలెను. దేవ కర్మలకు ముమ్మారు విచ్చేయవలెను. మా బుద్ధులను ముమ్మారు రక్షింపవలెను. మా బుద్ధులను ముమ్మారు రక్షింపవలెను. సౌభాగ్యమును ముమ్మారు ఇవ్వవలెను. ముమ్మారు అన్నమును ఈయవలెను.

    6. అశ్వినులారా ! ద్యులోకమునందలి ఓషధులు భూలోకమున మూడుసార్లు ఉద్భవించినవి. మూడుసార్లు ఆకాశమున పుట్టినవి. వాటిని మాకు మూడుమారులు ఇండు. మీరు బృహస్పతి పుత్రుడు శంయునకు సుఖములను ఇచ్చినారు. మా సంతానమునకు అటువంటి సుఖమును ప్రసాదించుడు. వాత, పిత్త, కఫ ధాతువులకు సుఖము శాంతి కలిగించుడు.

    7. అశ్వినులారా ! మీరు పూజ్యులు. మా వేదికమీద మూడు వరుసల దర్భలు పరచినాము. వానిపై శయనింపుడు. ప్రాణవాయువులు అవయవములను చేరునట్లు అయిష్టిక, పాశుక, సౌమిక అను త్రివేదులకు విచ్చేయగలరు.

    8. సప్త సింధు నదీ జలముతో మూడు ఆహవములలో ద్రోణ, ఆధవనీయ, పూత భృత్తులను మూడు పాత్రలందు, మూడు విధముల హవిస్సులు సిద్ధముగా ఉన్నవి. అశ్వినులారా ! మీరు మూడు లోకముల సంచరింతురు. ద్యులోకమందు ఉన్నవాడును, రాత్రింబవళ్ళు కలిగించువాడును అయిన సూర్యుని రక్షించుచున్నారు.

    9. అశ్వినులారా ! మీరు మీరథమున మా యజ్ఞమునకు వచ్చుచున్నారు. ఆ రథపు మూడు చక్రములు తెలియకున్నది. ముక్కోణపు నొగలు తెలియకున్నది. కూర్చుండు మూడు తావులందలి పట్టుకొను దండెలు తెలియకున్నవి. మీ రథమునకు గాడిదలు పూన్చినది తెలియదు. అట్లు మాకు తెలియని రథమున మీరు మా యజ్ఞమునకు విచ్చేయ వలసినదని ప్రార్థన.

    (రథము వేగవంతమని అర్థము కావచ్చును.)

    10. అశ్వినులారా ! మేము యజ్ఞమునకు పిలుచుచున్నాము. రారండు. నేతిని పూసిన మీ రథమును సూర్యుడు ఉషస్సునకు ముందే మా యజ్ఞమునకు పంపవలెను. మీనోళ్లు మధుర పదార్థములకు తగినవి. మధుర హవిస్సులను స్వీకరింపుడు.

    11. అశ్వినులారా ! ముప్పది ముగ్గురు దేవతలతోను మా యజ్ఞమునకు రాగలరు. మధుర సోమపానము చేయగలరు. మా ఆయువులను పెంచగలరు. మా పాపములను నిర్మూలించగలరు. మమ్ము ద్వేషించువానిని నాశము చేయగలరు. మీరు దయచేసి మా వద్ద ఉండగలరు. ఇది మా ప్రార్థన.

    12. అశ్వినులారా ! మిమ్ము ఆహ్వానించుచున్నాము. త్రివృతారథేవ ముప్పేటల నొగలుగల రథమున మాకు అభిముఖులయి విచ్చేయుడు. మాకు వీరవరులయిన పుత్రులను, భృత్యులను ప్రసాదించుడు. మా స్తుతులను స్వీకరించుడు. యుద్ధములందు మాకు జయములు కలిగించుడు.

    ఆలోచనామృతము :

    1. మానవ జీవితయాత్ర అనంతము. అద్భుతము. ఆశ్చర్యకరము అయినది. భగవంతుని సృష్టి సమస్తమున మానవునకు మాత్రమే ఆలోచన ప్రసాదించినాడు. ఆలోచన మానవుని ప్రగతికి, వినాశమునకు కారణభూతము అగుచున్నది.

    ఈ సూత్రమున మూడవ సంఖ్యకు తొలిసారిగా ప్రాధాన్యత ఈయబడినది. నేటికీ ఇది ప్రధానమయి ఉన్నది. త్రిలోకములు, త్రిమూర్తులు, త్రికాలములు, త్రయీవిద్యలు ఇట్లు ఎన్నియో !

    2. బండికి మూడవ చక్రము అమర్చబడినది. బరువులాగు జంతువులకు ఇది ఎంతో ఉపయుక్తమగును. కాని వేగమునకు పనికిరాదు. అందుకే అదికొనసాగలేదు.

    బండికి గాడిదలు కట్టినట్లు చెప్పబడినది.

    3. మూడు పూటల అన్నము తినుట విధించినారు. ఇది నేటికిని ఆచారముగ ఉన్నది.

    4. త్రిర్నక్తం యూథ స్త్రి రశ్వినాదివా రాత్రి మూడుసార్లు, పగలు మూడుసార్లు తిరుగుట రోజుకు ఆరుజాములు అని చెప్పుట. నాలుగు గంటలు లేక పది గడియలకు ఒక జాము. రోజుకు ఆరువది గడియలు లేక ఇరువది నాలుగు గంటలు. ఇందులో నేటికీ మార్పులేదు.

    రోజును జాములో ఇంత నిర్దిష్టముగ ఆనాడు నిర్ణయించుట సామాన్యముకాదు.

        ముప్పది అయిదవ సూక్తము, ఋషి - అంగిరస పుత్రుడు హిరణ్యస్తూపుడు,

        దేవత - సవితృడు, ఛందస్సు - 1,9 జగతి, మిగిలినవి త్రిష్టుప్.


    1. మా క్షేమమునకు తొలుత అగ్నిని ఆహ్వానించుచున్నాము. రక్షణకొఱకు మిత్రావరుణులను ఆహ్వానించుచున్నాము. జంగమములను స్వస్థానమున నిలుపు రాత్రిని ఆహ్వానించుచున్నాము. మమ్ము కాపాడుటకు సవితృని, సూర్యుని ఆహ్వానించుచున్నాము.

    ( రాత్రీం జగతో నివేశనీం జగత్తుని నిలిపి ఉంచు రాత్రి అనునది ఎంత సత్యవచనము !)

    2. సూర్యుడు నల్లని లోకమునుండి వచ్చును. దేవతలను, మానవులను వారివారి స్థానములందు ఉంచుచు వచ్చును. సర్వ లోకములను చూచుచు వచ్చును. బంగారు రథముమీద వచ్చును. దేవో యాతి భువనాని పశ్యన్ 

    3. వెలుగులు పరుచు భానుడు ఆకసము నుండి దిగుచున్నాడు. ఎక్కు చున్నాడు. తెల్లని రెండు గుఱ్ఱముల రథమున దేవయజన స్థానములకు వచ్చుచున్నాడు. దూరదేశము నుండి వచ్చుచున్నాడు. సకల పాపములను హరింప చేయుటకు వచ్చుచున్నాడు.

    4. సూర్యుని రథము సర్వత్ర సంచరించుచున్నది. సువర్ణమయమయినది. బంగారు స్తంభములు కలది. సూర్యుడు అట్టి రథమును ఆరోహిం'చినాడు. బయలుదేరినాడు. చీకట్లను పారద్రోలినాడు. చిత్ర కిరణములతో బంగారు వెలుగులు పరచినాడు.

    5. సూర్యుని అశ్వములు, శ్యాయవములు అనుపేరు గలవి. వాటి పాదములు తెల్లనివి. దేవతలతో కూడి ఉండునవి. సూర్యుని బంగారు నొగల రథమును లాగునవి. అవి సూర్య సహితములయి దశదిశల కాంతులు చిమ్ముచున్నవి.

    6. లోకములు మూడు. వాటిలో రెండు సూర్యుని సమీపమున, ఒకటి దూరమున ఉన్నవి. రథ చక్రము మేకుమీద ఆధారపడినట్లు, చంద్ర నక్షత్రాదులు సూర్యునిమీద ఆధారపడి ఉన్నవి. సూర్యరూపము తెలిసినవాడు ఈ విషయము తెలిసిన వాడగును.

    7. సుపర్ణ అను సూర్యరశ్మి యోగ ప్రసారము గలది. గంభీరమయినది. సకల ప్రాణప్రదాత. మార్గదర్శి. లోకములందు వ్యాపించునది. రాత్రి అయినది. ఆ వెలుగులు ఏవి ? అవి ఎచట దాగినవి ? ఎవడు ఎరుగును ? 

    8. సూర్యుడు దశదిశలను నింపినాడు. ప్రాణులను వారి స్థానముల నిలిపినాడు. మూడు లోకములను, సప్త సింధులను ప్రకాశింప చేసినాడు. అతడు "హిరణ్యాక్షః" బంగారు కన్నులవాడు. యజమాని కొఱకు రత్నములు తెచ్చును.

    9. "హిరణ్యపాణిః" సవితా, బంగారు కిరణములుగల సవితృడు బహువిధ దర్శనములవాడు. సమస్తము చూచుచున్నవాడు. ద్యావా పృథ్వుల మధ్య సంచరించుచున్నాడు. అతడు రోగములను శమింప చేయును. సవితృడు సూర్యుని చేరును. అంధమయ జగమును దాటును. అంతరిక్షమును ప్రకాశింపచేయును.

    (సవితా - సూర్యుని వేరువేరుగా పేర్కొన్నాడు. బహుశః గుణభేదము కావచ్చును. సూర్యశాస్త్రజ్ఞులు తెలియగలరు.)

 Previous Page Next Page