Previous Page Next Page 
ఆనందం పరమానందం పేజి 16

సింహాచలం తన కళ్లు తుడుచుకుంటూ చెప్పేడు.
"మా అన్నయ్య కూడా సరిగ్గా ఇలాగే వాడి ప్రియురాలి కోసం పరిగెత్తుతున్న బస్సులోంచి దూకి చచ్చిపోయేడు. ఆ సీను గుర్తొచ్చింది."
ఆనందం సింహాచలాన్ని బుజ్జగిస్తూ అన్నాడు.
"మీ అన్నయ్యని మరిచిపో! సత్యమూర్తి దూకినా బతికే ఉన్నాడు అందుచేత ఆనందించు. కళ్లు తుడుచుకో!"
"నేను ఏడ్చేది సత్యమూర్తి గురించి కాదండి మా అన్నయ్య గురించి!"
ఆనందం విసుగ్గా అన్నాడు.
"సత్యమూర్తి కథ వింటూ మీ అన్నయ్యని తలుచుకుని ఏడవడం తప్పు అంటున్నాను. అర్థమైందా?"
"చిత్తం"
"మళ్లా ఏడ్చేవంటే పళ్లు రాలిపోతాయ్! జాగర్త! నువ్వు చెప్పవయ్యా మూర్తి" అన్నాడు ఆనందం.
సత్యమూర్తి ప్రారంభించేడు.
"దెబ్బలు తగిలినందుకు నేను బాధ పడలేదు. ప్రాణం పోయినా బాధ  పడను రెండేళ్ల తర్వాత తళుక్కున మెరిసిన శారద పదినిమిషాల్లో మాయమైనందుకు మాత్రం తట్టుకోలేక పోయేను. తల్లడిల్లి పోయేను. నన్ను నేను తిట్టుకున్నాను."
"సర్లేవయ్యా ఆ తర్వాత....?"
"గాయాలకు కట్లవీ కట్టించుకుని డ్యూటీ కెళ్లేను. అంటే బట్టల షాపుకి వెళ్లేనన్న  మాట" అని  చెప్పడం  ఆపేడు సత్యమూర్తి.
"ఆగిపోయేవేం? చెప్పు!" అన్నాడు ఆనందం.
సత్యమూర్తి మొహమాట పడుతూ అన్నాడు.
"ఇక్కడ మళ్లీ ప్లాష్ బాక్ పద్దతిలో కథ చెప్పాలి!"
"దాందేముంది? అల్లాగే  కానివ్వు?" అన్నాడు ఆనందం.
   
                                         20
అది చింతామణి శారీ మందిర్! ఊళ్లో మంచి పేరున్న దుకాణం! అక్కడ చీరల్తో పాటు సమస్తమైన ఆధునిక దుస్తులు - ఆడవాళ్లకి సంబంధించినవి మాత్రమే దొరుకుతాయి. అందువల్ల ఆ షాపు ఎల్లప్పుడూ రద్దీగానే వుంటుంది.
ఆ రోజు.....
కస్టమర్లతో పాటు లైట్లు, రిప్లేక్టర్లు, కెమెరా మొదలైన సరంజామాతో శారీ మందిర్ మరింత రద్దీగా వుంది.
షూటింగ్ తాలూకు హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది. దర్శకుడు భుజాన టవల్  వేసుకున్నాడు. గొప్ప ఖంగారుగా అటూ ఇటూ తిరుగుతూ యూనిట్ వాళ్లకి సూచనలిస్తున్నాడు.
చింతామణి శారీ మందిర్ యజమాని కౌంటర్లో వినాయకుడు మల్లే కూర్చుని  వున్నాడు. అతనెప్పుడూ అక్కడే కూర్చుని వుంటాడు. స్థిమితంగా కూర్చోడం అతని హాబీ! ఆ రోజు మాత్రం షూటింగ్ కారణంగా కొంచెం నెర్వస్ గా  వున్నాడు. మొహమ్మీద పౌడరు రాసుకుంటున్నాడు. షాపు  కంటే అతనే అందంగా కనిపించేందుకు జాగర్తలు తీసుకుంటున్నాడు.
షాపులో  వున్న కస్టమర్లు షూటింగు హంగామా మొత్తం శ్రద్దగా చూస్తున్నారు. అందులో ఒకడు ప్రోప్రటర్ని అడిగేడు.
"షూటింగేమైనా పెట్టుకొన్నారా?"
"అవునండి" అన్నాడు ప్రోప్రయిటరు సిగ్గుపడుతూ.
"ఆర్టిస్టులెవరు? నాగార్జున వున్నాడా?" అని ఓ కస్టమరు ఆత్రంగా అడిగేడు.
"ఇది  సినిమా షూటింగు కాదండీ! ఏడ్ పిక్చరు దూరదర్శన్లో చూపిస్తారు" అని సమాదాన మిచ్చాడు ప్రొప్రయిటరు.
దర్శకుడు ప్రొప్రయిటరు దగ్గరికి రాగానే ప్రొప్రయిటరు  లేచి నిలబడ్డాడు.
"ఫర్లేదు కూచోండి! ఇప్పుడు మనకు అందమైన ఆడపిల్లలు నలుగురైదుగురు కావాలి!"
"ఆమ్మో! నలుగురైదుగురే! అంత మంది ఎందుకంట?" బెంగపడిపోతూ అడిగేడు ప్రొప్రయిటరు.
"మన షాపులో దొరికే దుస్తులూ, వాటి వెరైటీలు, నాణ్యత, రెట్లు, వగైరాలు మనం ఈ పిక్చర్లో స్పష్టంగా చెప్పాలి. నలుగురైదుగురు ఆడపిల్లలుంటే తలా ఒకరు ఒక్కో పాయింటు చెబుతారు. ఈవిధంగా మన షాపు గురించి మనం  చెప్పదలచుకున్న పాయింటన్నీ అందంగా చెప్పొచ్చు." అన్నాడు దర్శకుడు.
"ఈ  పాయింటు ముందే మీరు నాకు చెప్పి వుంటే మా ఆడవాళ్లని పట్టుకొచ్చే వాడ్ని" అంటున్నాడు ప్రొప్రయిటరు.
సరిగ్గా  అప్పుడే శారద తన స్నేహితురాళ్లతో ఆ షాపులో అడుగు పెట్టింది.
దర్శకుడు వాళ్లను చూసేడు. వాళ్లని చూడగానే అతని మొహం కళ కళ లాడింది. ఎంతో  ముచ్చట పడ్డాడు. అంచేత ప్రొప్రయిటర్తో అన్నాడు-
"వాళ్లను చూడండి. వాళ్లయితే సరిగ్గా సరిపోతారు. అడుగుదామంటారా?"
ప్రొప్రయిటరు అమ్మాయిలను చూసేడు. శారదని చూడగానే  ఎంతో గౌరవంగా, ఆప్యాయంగా -
"ఏమ్మా! బాగున్నావా?" అని అపకరించేడు. సమాధానంగా శారద చిరునవ్వు నవ్వింది.
దర్శకుడి ఆశలు చిగురించేయి.
"మీకు తెలిసిన వాళ్లేగా! అడిగి చూడండి!" అన్నాడు డైరెక్టరు.
"తెలిసిన అమ్మాయి గనకనే అడగడానికి ఇబ్బంది పడుతున్నాను. ఆ అమ్మాయి గోవిందంగారి ఏకైక పుత్రిక. కోటీశ్వరులు. మా బిజినెస్ సర్కిల్లో గోవిందం గారంటే మా కందరికీ గురీ, గౌరవాలేక్కువ! ఏడ్ లో ఏక్ట్ చేయమంటే  ఏమంటుందో ఏమో" అన్నాడు ప్రొప్రయిటరు.
"పోనీ నేనే అడుగుతాను" అన్నాడు డైరెక్టరు.
"అడిగి చూడండి" అన్నాడు ప్రొప్రయిటరు.
దర్శకుడు చొరవగా  శారదా వాళ్ల దగ్గిరకెళ్లి నమస్కారం చేసి అన్నాడు-
"నా పేరు మహాలింగమండి. ఏడ్ ఫిలిమ్స్ తీస్తుంటాను. అతి త్వరలో ఒక గొప్ప ఫీచరు ఫిల్ము డైరెక్టు చెయ్యబోతున్నాను. మీరు నాకో సాయం చేసి పెట్టాలి?"
"సాయమా? అంటే చందానా?"
ఆ మాట విని దర్శకుడు  ఉలికి పడ్డాడు. ఆ తరువాత  ముసిముసిగా నవ్వేస్తూ అన్నాడు.
"వండ్రపుల్ మేడమ్! మీకు సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. ఒకే ఒక్క చెణుకు విసిరి మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా  ఏ పొజిషన్లో వుందో చెప్పెసేరు. కాని మేడమ్! నేను అడుగుతున్నది చందా సాయం కాదు. మీరంతా ఈ షాపు తాలూకు ఏడ్ ఫిలమ్ లో కనిపిస్తే చాలు!"
"అంటే నటించాలన్నమాట "అడిగింది శారద.
ప్రొప్రయిటరు భయపడుతూ అన్నాడు...
"ఇష్టం లేకపోతే నో అని చెప్పేయమ్మా! నాన్నగారికి తేలిస్తే  బాగుండదు"
"పెద్దగా  నటించక్కర్లేదు  మేడమ్! రెండు మూడు డైలాగు  లుంటాయి. అంతే! ఒక్కొక్కరు ఒక్కో డైలాగు చెబితే చాలు" అన్నాడు దర్శకుడు.
"ఆలిస్యం కాదుగా?" అని అడిగింది శారద.
"ఆలిస్యమా? నాటేటాల్! వర్కులో నేను చాలా ఫాస్టుగా వుంటానండీ! జస్ట్ పదంటే పది నిముషాలే.....!దట్సాల్"
ఆ తర్వాత తన అసిస్టెంటును పిలిచి ప్ర్కిప్టు తీసుకున్నాడు.
"స్ర్కిప్టు చూస్తూండండి ఈలోగా నేను కెమెరా రెడీ చేస్తాను.
శారద స్ర్కిప్టు చదువుతోంది.
షాపు యాజమాని తృప్తిగా గాలి పీల్చుకున్నాడు.
సరిగ్గా అప్పుడే సత్యమూర్తి ముక్కు మొహనికీ, చేతులకీ కట్లు కట్టించుకుని షాపులోకి ప్రవేశించేడు.
ప్రొప్రయిటరు సత్యమూర్తిని పోల్చుకోలేక ముష్టి వాడనుకుని కోప్పడుతున్నాడు.
"ఆగక్కడ! లోపలికి వస్తావేమిటి? అడుక్కోడానికి వేళాపాళా వుండదా? వెళ్లేళ్లు."
సత్యమూర్తి నీరసంగా  అన్నాడు.
"నేను ముష్టివాడిని కాదు సార్! మీ సేల్స్ మేన్  సత్యమూర్తిని!"
ప్రొప్రయిటరు షాకు తిన్నాడు. ఆశ్చర్యంగా అడిగేడు.
"ఏమిటీ అవతారం"
"ఏక్సిడెంట్ సార్! బస్సులోంచి దూకి కింద పడ్డాను."
"మంచి పని చేసేవ్! దెబ్బల్తో డ్యూటీ ఏం చేస్తావ్!"
"చేస్తాను సార్!"
"వద్దు లేవయ్యా! నీ అవతారం చూస్తే ఆడపిల్లాలు భయపడగలరు వెళ్లి రెస్టు తీసుకో!"
స్టాకు వెరిఫై చేయమన్నారుగా! కనీసం ఆ పనైనా చేస్తాను" ఆన్నాడు సత్యమూర్తి.
ప్రోపయిటరు ఏ కళనున్నాడో కానీ "సరి సరి.. ఆపని చూడు" అన్నాడు.

 Previous Page Next Page