తన రహస్యం డాక్టర్ కు తెలిసిపోయిందని అర్ధం కావడంతో బెంబేలు పడిపోయింది.
"బాబుని ఇటు ఇవ్వండి డాక్టర్ ..." అంటూ టింకూని అందుకుని ఆమెకన్నా వేగంగా అడుగులు వేసింది లిల్లీ.
కృష్ణప్రియ తనలో తనే నవ్వుకుంటూ తన గది వైపుకు నడిచింది.
పేషెంట్స్ రద్దీ తగ్గడంతో టింకూను అన్ని పరీక్షలూ తనే దగ్గరుండి మరీ చేయించి ఎక్స్ రే రిజల్టు, బ్లడ్ రిపోర్టులు వచ్చేవరకూ ఆగవలసి వచ్చింది.
తను చేసిన పరీక్షల రిజల్ట్స్ చూసిన కృష్ణప్రియ గుండె లయతప్పినట్టయింది.
ఎక్స్ రే చూశాక తన అనుమానంనిజమనే వాస్తవాన్ని అంగీకరించక తప్పలేదు...
టింకూ పరిస్థితి ఊహించగానే దుఃఖం ముంచుకు వచ్చి తను ఒక డాక్టర్ నన్న సంగతి మరచిపోయి కృష్ణప్రియ వెక్కి వెక్కి ఏడ్చింది.
ఎంతటి కఠిన హృదయాన్ని అయినా కదిలించేటట్టుగా వుంది ఆమె ఆవేదన.
గంభీరతకు...కఠినత్వానికి మారుపేరు అయిన ఆమె అలా రోదించడం హాస్పిటల్ స్టాఫ్ కు వింతగా తోచింది.
ఎప్పటిలానే సాయంకాలం టింకూతో కలిసి ఇంటికి బయలుదేరింది కృష్ణప్రియ.
కానీ ఇంటికి వెళ్ళలేదు...
ఒకచోట నిలువలేక కారులో ఊరంతా తిరుగుతున్నది. ఆమె అవతారం శోకదేవతకు మారు రూపంలా వుంది.
ఈ బంధాలు అన్నీ అశాశ్వతాలు అని తెలిసినా మనసు అశాంతికి గురవుతూనే వుంది...టింకూతో కలిసి వెళ్ళిన చోట్లన్నిటికీ వెళ్ళింది...
పచ్చగా వుండి చల్లని గాలులు వీచే పబ్లిక్ గార్డెన్స్ చైతన్యరహితంగా నిర్మానుష్యంగా కనిపించాయి. గొడుగులా నీడను ఇచ్చే పొగడచెట్టు పడగ విప్పి బుసలు కొడుతున్న కాలనాగులా కనపడింది.
నిశ్చలంగా వుండే స్విమ్మింగ్ ఫూల్ నురగలు కక్కుతున్న నడిసముద్రంలా తోచింది.
జంటలతో నిత్యకళ్యాణం పచ్చతోరణంలా వుండే ఆ గార్డెన్స్ అశోకవనంలా వెలవెలా పోతున్నట్టు వుంది.
జరుగుతున్న తతంగం అంతా అర్ధంకాకపోయినా తనకు ఏదో సీరియస్ గానే వుందని టింకూ ఊహించ గలిగాడు.
అన్యమనస్కంగానే కృష్ణప్రియ ఇంటికి వెళ్ళింది.
టింకూని ఆయాకు అప్పగించి...బిర్లామందిర్ కు బయలుదేరింది డాక్టర్ కృష్ణప్రియ.
రాత్రి అంతా లైట్లతో అరవిచ్చిన మల్లెపూవులా కనబడే బిర్లామందిరం తేజోవిహీనంగా కనిపించింది.
మౌనంగా వున్న స్వామిని చూస్తూ మరింత మౌనంగా స్వామిని ధ్యానిస్తూ కూర్చుంది.
బాధ్యత కలిగిన ఒక డాక్టర్ అయివుండీ స్వామి మీద భారం వేయడం చిత్రం...పేషెంట్లు డాక్టరే దేవుడనుకుంటే...డాక్టరు దేవుడిదే భారమన్నట్టు ప్రార్ధించడం వెనుక ఆమె అసహాయత తేట తెల్లమవుతున్నది...
కొందరికి కోరికలు తీరడం కోసం దేవుడు కావలసివస్తే మరికొందరికి చేసిన పాపాలు పోయి మనశ్శాంతి కలగడానికీ కావలసి వస్తాడు.
ఒకవిధంగా ఇద్దరూ స్వార్ధపరులే అనుకోవాలేమో...ఎందుకంటే ఇద్దరు తమ స్వప్రయోజనాలకే దేవుడిని ప్రార్ధిస్తారు.
కానీ, డాక్టర్లు తమ పేషెంట్లు త్వరగా కోలుకోవడంలో స్వార్ధం ఉండదేమో...
ఎక్కువసేపు స్వామి సాన్నిధ్యంలో వుంటే చేసిన పాపాలనీ బయటపడతాయి అని కాబోలు చూడడానికి వచ్చినవాళ్ళంతా మెల్లగా జారుకుంటున్నారు.
ఔను...పాపభీతి అలాంటిది.
అప్పటివరకూ కోలాహలంగా వున్న మందిరంలో తిరిగి ప్రశాంతత చేకూరింది.
ఉన్నట్టుండి గంట గణగణమని మోగడంతో కృష్ణప్రియ ఉలిక్కిపడి తల పైకెత్తింది.
ఎదురుగా కనిపిస్తున్న వ్యక్తిని తన్మయత్వంతో చూసింది.
స్వామి ధ్యానంలో లీనమయ్యాడు ఆ వ్యక్తి.
పద్మాసనంలో వుండి ధ్యానసముద్రంలో వున్న బుద్ధ భగవానుని ప్రతిరూపంలా కనిపిస్తున్నాడు.