Previous Page Next Page 
ఆఖరి మజిలి పేజి 16


    క్షణాలు నిమిషాలుగా గడుస్తున్నాయి...

    అయినా, అతనిలో చలనం లేదు.

    అరగంట గడిచింది...

    అప్పుడు కదలిక కనిపించిందతనిలో...

    అంత బాధలోనూ ఏదో ఆశాకిరణంలా కృష్ణప్రియకు కనిపించాడతను.

    "ఏమండీ..."

    అంటూ పిలిచిన ఆమె పిలుపుకు గుడిమెట్లు దిగుతున్న అతను ఒక క్షణం ఆగాడు. ఏం కావాలన్నట్టు చూశాడామెవైపు.

    "ఆరోజు మా బాబును రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పే అవకాశం నాకు ఇవ్వనేలేదు. మీ మేలు ఏ జన్మలోనూ మరచిపోలేను...కానీ" ఆమె గొంతు ఆర్ద్రమయింది.

    అప్పటికీ అతనిలో చైతన్యం లేదు.

    దుఃఖాన్ని దిగమింగుతూ "టింకూకు బ్రెయిన్ ట్యూమర్..." చెప్పిందామె.

    అతనిలో ఆమె ఊహించిన మార్పు ఏమీ కలగక పోగా, అలాగా అన్నట్టు తలూపి వెళ్ళిపోయాడు...

    తన అహం దెబ్బతిన్నట్టు కృష్ణప్రియ ప్రాణం గిజగిజలాడిపోతూ స్థాణువైంది.


                        *    *    *


    హాస్టల్ గోడకువున్న గడియారం లెక్కప్రకారం సరిగ్గా తొమ్మిది గంటలు కొట్టింది.

    శాంతి శ్రీ హాస్టల్ గేటు తాళాలు తీసింది.

    హాస్టల్ లో వున్న ఉద్యోగినులంతా బిలబిలమంటూ ఆఫీసులకు బయలుదేరారు.

    గేటు వరకు వెళ్ళి  వాళ్లందర్నీ సాగనంపి, వాళ్ళంతా సరాసరి సిటీబస్సులు ఎక్కారని నిర్ధారించుకున్నాక  వెనుదిరిగింది శాంతిశ్రీ.

    సరిగ్గా అదే సమయంలో హాస్టల్ ముందు ఆటో ఆగింది. సూట్ కేసు తీసుకుని ఆటోవాలాకు చార్జి ఇచ్చి హాస్టల్ ఆఫీసు రూమ్ లోకి అడుగుపెట్టింది నీలిమ.

    "ఎవరు మీరు? ఏం కావాలి?" శాంతిశ్రీ వెంటనే అడిగింది.

    స్నేహితురాలు చెప్పిన పోలికలనుబట్టి  ఆమెని పోల్చుకుంది నీలిమ.

    "నా పేరు నీలిమ. మీ హాస్టల్ లో చేరుదామని వచ్చాను" అన్నది ఆమె.

    "ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు?"

    "ఒక ప్రవేటు హాస్పిటల్ లో నర్స్ గా..."

    "అంటే నైటు డ్యూటీలు  వుంటాయా..." సంశయంగా అడిగింది.

    నీలిమ క్షణం ఆలోచించింది.

    "అబ్బే నాకు నైటు డ్యూటి వుండదు లెండి. నేను పనిచేసేది  ఒక క్లీనిక్ లో. ఇన్ పేషెంట్స్ ఎవ్వరూ వుండరు. డే టైమ్ అటెండ్ అయితే చాలు..." నైటు డ్యూటీ వుందంటే ఎక్కడ పేచీ పెడుతుందోనని ముందే ఊహించి అంది నీలిమ.

    "నైటు డ్యూటీలు లేకపోతే చేర్చుకుంటాను. మీకు పెళ్ళి అవ్వలేదుకదా?" సంశయంగా మెడ నుండి కాళ్ళ వరకు చూసింది శాంతిశ్రీ.

    లేదన్నట్టు తలవూపింది నీలిమ.

    నెలసరి ఫీజు రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఒకసారి శాంతిశ్రీ ఏకరువు పెట్టింది.

    నీలిమ అన్నింటికీ ఒప్పుకుని డబ్బు కట్టింది.

    శాంతిశ్రీ ఆమెకి కేటాయించిన గది చూపించింది.

    "డిసిప్లేన్ విషయంలో నా దగ్గర మొహమాటం ఏమాత్రం ఉండదమ్మా, ముందే చెబుతున్నాను, నేను పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనా అతిక్రమిస్తే వెంటనే బయటకు పంపుతాను. అది గుర్తు వుంచుకుని సక్రమంగా వుండాలి." హెచ్చరించి వెళ్ళింది.

    "చూడమ్మా! పది అవుతున్నది ఇవ్వాళ మీరు హాస్పిటల్ కి వెళ్ళరా?" వెనక్కి తిరిగివచ్చి అడిగింది.

    "అవును, అవును వెళ్ళాలిగా..." తత్తరపడుతూ అంది. తను మరచేపోయింది పేషెంట్స్ ఈపాటికి హాస్పిటల్ కి వచ్చేవుంటారు. ఖంగారుగా గది లాక్ చేసి బయలుదేరింది.

    "భోజనం చేసి వెళ్ళమ్మా..."

    "టైమ్ లేదండీ ఈ పూటకి బయటే చేస్తాను..."

    నీలిమ వచ్సినంత వేగంగా బయటకు వెళ్ళిపోయింది. తన జీవితం ప్రస్తుతం సాఫీగా జరిగిపోతుంది. ఏదో చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొంటున్నా, తన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కి నగరంలో మంచి పేరే వుంది అనుకున్నది శాంతిశ్రీ.

 Previous Page Next Page