డబ్బిచ్చే సుఖాల అనుభవం పాతపడగానే అలవాట్లు, అనుభవాలు అన్నీ రొటీన్ లో పడగానే జీవితం అతనికి నిస్సారంగా అనిపించసాగింది. ఎయిర్ కండిషన్ గదులు చల్లదనం, డన్ లప్ ల మెత్తదనం , స్టీరియో రికార్డుల మాదుర్యం ఎన్నడూ చవిచూడని పదార్ధాల రుచిదనం , అడుగులకి మడుగు లోత్తే నౌకర్ల వినయం, జన్మలో తొడుక్కోలేననుకున్న సూట్లు బూట్లు అనుభవం , సినిమాలలో మాత్రమే చూసిన నైట్ క్లబ్బులు హోటళ్ళు అపురూప సౌకర్యాలు, కాలు కింద పెట్టక్కర లేకుండా అడుగుకో కారులో ప్రయాణాలు యివన్నీ అతనికి తీపి తినితిని మొహం మొత్తి నతట్టు రెండు నెలలకే పాత పడిపోయాయి. ఎదన్నా అనుభవం లోకి రానంత వరకే విలువ అన్న సంగతి అతనికీ తెలిసిపోయింది. అందని దూరంలో వుండి కావాలని అర్రులు చాచినది చేతిలోకి రాగానే అది అపురూపత్యం పోగొట్ట కొంటుంది అన్న సంగతి తెల్సిన తరువాత..... ఈ డబ్బు , అవి యిచ్చే సుఖాలు తాత్కాలికం కాదు శాశ్వితం అని తెలిసాక అతని దృష్టిలో డబ్బుకి విలువ పోయింది. ఆ డబ్బు విలువ పడిపోగానే...... లతతో అతని సహచర్యం అడుగడుగునా నిప్పుల మీద నడకలా తయారయినది. జీవితంలో అతి ముఖ్యమైనది వివాహబంధం. ఆ వైవాహిక జీవితంలో అర్ధాంగి సహకారం, సానుభూతి, అవగాహన , అన్యోన్యత లోపిస్తే జీవితం ఎంత దుర్భరంగా తయారవుతుందో ప్రసాద్ కి రెండు నెలల వైవాహిక జీవితం లోనే అర్ధమయిపోయింది.
లత శారీరక అవిటితనం అతనికంత బాధించలేదు కాని ఆమె బుద్ది, ఆలోచనలు ఎంత వక్రంగా ఉన్నాయో తెలిసాక తను డబ్బు కోసం ఆపెళ్ళి చేసుకోడం ఎంత పొరపాటో అర్ధం అయింది.
ధనవంతుల యింట ఏకైక కుమార్తెగా పుట్టడం, అల్లారు ముద్దుగా ఆడిందాటగా పాడింది పాటగా పెరగడంతో ఆమెలో మంచితనం, పెంకితనం అన్నీ ఎక్కువయి, తను అన్నదే రైటు, తను చెప్పిందే వేదం, అనే అలవాట్లు అయ్యాయి. కూతురు ఏం అన్నా ముద్దుకిందే చలామణి అయ్యేది తల్లిదండ్రులకి. ఆమె నోట్లోంచి మాట వచ్చిందే తడవుగా కొండ మీద కోతిని సహితం అమర్చేవారు. ఆమె అలీగితె వాళ్ళ ప్రాణాలు తల్లకిందులయినంత గాభారాపడి బతిమలాడి ప్రసన్నరాలిని చేసుకునేవారు. ఆమెకి ఒక డిగ్రీ జ్వరం వస్తే చాలు కాలు కింద పెట్టనీయకుండా అరడజను డాక్టర్ల ని పిలిపించేవారు. వూర్లో ఏ కొత్తరకం గౌన్లు వచ్చినా, ఆటబొమ్మలు వచ్చినా కొని యిల్లంతా నింపేవారు. చుట్టుపక్కల పిల్లలని కూతురితో ఆడుకోవాలని యింటికి రాప్పించేవారు. లత ఎంత చెపితే అంతా అలా తలలాడించాలని చెప్పేవారు. ఆమె యివ్వందే ఏ బొమ్మముట్టు కోకూడదు. ఆమె పెట్టందే చాకలెట్లు అడగరాదు. ఆమె కూర్చోమంటే కూర్చొని, పరిగెత్త మంటే పరిగెత్తి, నవ్వమన్నప్పుడు నవ్వి, ఆరేళ్ళ పిల్ల వయస్సులో యిరుగు పొరుగు పిల్లల మీద అధార్టి చూపించి తనో మహా రాణి, వారంతా సేవకులు అన్నట్టు ప్రవర్తించే కూతురు వైఖరి చూసి తల్లిదండ్రులు కూతురిలో ఠీవి , దర్జా చూసి మురిసి పోయేవారే తప్ప అది తప్పని వారికీ తట్టలేదు. చిన్నప్పటి నుంచి తను మిగతా వారి కంటే పై మెట్టు మీద వున్నానని, మిగతావారి కంటే ప్రత్యేకత తనకుందని, ఆ చిన్నపిల్ల మనసులోనే నాటుకుని ఆమెతో పాటు ఆ అహంభావం పెరిగి పెద్దదయింది. ఆమె ప్రవర్తన తల్లిదండ్రులకి ముద్దయింది గాని యింట్లో నౌకర్లు, చాకర్ల కి ప్రాణాంతకమైంది. యిరుగు పొరుగు వారి బంధువుల విమర్శలకి లోనైంది. పిల్లని పాడు చేస్తున్నారు, అమ్మ బాబోయ్ పట్టుమని ఆరేళ్ళు లేవు దాని కెంత పొగరు , తిండికి లేకపోయినా మాకేం అభిమానం లేదా, డబ్బుంటే వాళ్లకుంది మా పిల్లలని అలా ఎడిపిస్తుందా.....యిప్పుడే యిలా వుంది, రేపింక పట్టపగ్గాలుంటాయా , మొక్కయి వంగనిది మానయి వంగుతుందా . ఆ ముద్దంతా వదలగోడ్తుంది పెద్దయ్యాక అప్పుడు తెలుస్తుంది ఆ తల్లిదండ్రులకి. నౌకర్లు, ఇరుగు పొరుగు చాటుగా తిట్టుకునేవారు.....అందరి ఉసురు తగిలిందో, లేక ఆమె కి తల్లిదండ్రులకి బుద్ది చెప్పాలనో కాని దేముడు తుళ్ళిపడే లత కాళ్ళు తీసుకుని ఆమెకి, తల్లితండ్రులకి బుద్ది చెప్పాడు. వారికున్న లక్షలన్నీ ఖర్చు పెట్టటానికి సిద్దపడ్డా ఆమె కాళ్ళు రాలేదు. ఏ డబ్బు చూసుకుని తాము అందరి కంటే మిన్నా అనుకున్నారో ఆడబ్బు వారికి ఎందుకూ ఉపయోగపడలేదని అర్ధమయ్యాక కూతురికి పట్టిన దుర్గతి కి కన్నీరు మున్నీరుగా విలపించారు ఆ తల్లిదండ్రులు.
తానెం కోల్పోయిందో చిన్నతనంలో అంతగా అర్ధం కాకపోయినా పెద్ద అవుతున్న కొద్ది లతకు తెల్సి వచ్చింది. అప్పటి నించి ఆమెలో ఏదో కసి, కోపం నూన్యత భావం అన్నీ కల్సి ఆమెను అదోలా తయారుచేసాయి. పరుగులు పెట్టి ఆడే పిల్లలని చూస్తె కసి, షికార్లు తిరిగేవాళ్ళని చూస్తె ఉక్రోషం, భుజాన సంచులు తగిలించుకుని ఉషారుగా స్కూలుకి వెళ్ళే పిల్లలని చూసి అసూయ పడేది. తనకు దక్కని సుఖాలు, మిగతా వాళ్ళ కెందుకు దక్కాలి అనే కసి మనుష్యుల మీద పెంచుకుంది. ఎవరి మీద చూపాలో తెలియని కోపం ప్రాణం లేని వస్తువుల మీకా తీర్చుకునేది. బొమ్మల కాళ్ళు చేతులు విరిచేది కసిగా, తలగడలు విసిరేసేది , పుస్తకాలు చింపి పోగులు పెట్టేది. జుట్టు పీక్కునేది. పాలగ్లాసులు , భోజనం పళ్ళాలు విసిరేది కోపంతో. నౌకర్ల మీద ఏదన్నా తప్పు దొరికితే కాట్ల కుక్కలా కలియబడేది. కూతురి అవతారం, ఆమె మూడ్స్ చూసి తల్లి దండ్రి హడలి పోయేవారు. ప్రతిక్షణం ఆమెని ప్రసన్నం చేసుకుని శాంతింప చేయడానికి నానాతంటాలు పడేవారు. బుజ్జగించి, బ్రతిమాలి , లంచాలు ముట్ట చెప్తూ అన్నం తినిపించేవారు. కూతురు ఎక్కడ బాధ పడ్తుందోనని మిగతా పిల్లలని ఇంటికి రానీయడం మానిపించారు. ఆమె కోసం వాళ్ళిద్దరూ అన్ని సరదాలు చంపుకుని అనుక్షణం ఆమెని కనిపెట్టు కునుండేవారు. ఎంత బిజినెస్ వ్యవహరాలున్నా తండ్రి కూతుర్ని షికారు తీసికెళ్ళడం , సినిమాకి తీసుకెళ్ళడం చేసేవారు. యింట్లో తిరగటానికి చక్రాల కుర్చీ , ఎక్కడి కన్నా వెళ్ళడానికి ఎత్తుకుని తీసుకెళ్ళి కారులో, సినిమాలో కూర్చో పెట్టడానికి వస్తాదు లాంటి మనిషి.....యింట్లో చదువుకునేందుకు ఓ మాస్టరమ్మా...... ఆమె ఏం చేస్తే అది చేసేందుకు ఓ అని అనుక్షణం ఆమెతో మాట్లాడుతూ ఆడేందుకు ఓ చిన్ని పనిపిల్లా. యిలా రకరకాలుగా ఏర్పాటు చేసినా లత బతుకు నాల్గుగోడల మధ్యనే సతమతమవడంతో శరీరంతో పాటు బుద్ది వికసించలేదు. పెద్ద అవుతున్న కొద్ది తన ఆకారాన్ని అంతా హేళనగా చూస్తున్నారని ఊహించుకుని ఎక్కడికి వెళ్ళడం మానుకోడంతో ఆమె లోకం అంతా యిల్లే అయింది. దాంతో కాస్త హాయిగా వున్న వాళ్ళను చూస్తె ఆమెకి మంట. నవ్వేవాళ్ళని చూస్తె ఏడుపు తన యీడుది పని పిల్ల హాయిగా నడుస్తూ తిరుగుతుంటే అసూయతో దహించుకు పొయ్యేది. దాన్ని నానా మాటలతో హింసించి ఏ చిన్న తప్పు చేసినా దాన్ని కొట్టడం, నడుం మీద గుద్దులు గుద్ది, కరిచి కర్రతో కాలి మీద కొట్టి రకరకాలుగా హింసించేది. చిన్నప్పుడు ఏడుస్తూనే ఆ పిల్ల పడి వుంది. కాని కాస్త జ్ఞానం వచ్చాక కూడా కొట్టడంతో అది పారిపోయింది. తరువాత ఎవరు వచ్చినా లత హింసలకు భరించలేక పారిపోయేవారు. ఎవరూ దొరక్క ఆఖరికి తల్లే కూతురికి సేవలు చేసి ఆమెతో పాటు అనుక్షణం గదిలో బందీగా కూర్చునేది. అంత సంకుచిత్వంలో పెరిగిన లత యుక్త వయస్సు వచ్చి పెద్దయ్యే సరికి పైశాచిక ప్రవృత్తిగా మారింది. ఎవరినో ఏదో అని ఏడిపించడం, ఆమెకు ఏదో తృప్తిగా ఆనందంగా వుంటుంది. ఏదో కక్ష సాధించినట్లు అనిపిస్తుందామెకి. అన్నాళ్ళు యింట్లో నౌకర్లు తప్ప ఆమె ఆగ్రహానికి గురి కావడానికి ఎవరూ దొరకలేదు.