Previous Page Next Page 
ఇంటింటి కధ పేజి 14


                                                                                                *    *    *    *
    "వసంతగారూ .....వసంతగారూ" వసంత వెనుతిరిగి చూసింది ఆఫీసులో డిస్పాచ్ కర్ల్క్ మూర్తి వెనకాతల వస్తూ పిలిచాడు.
    వసంత బస్సు దిగి ఫర్లాంగు రెండు ఫర్లాంగులు నడవాలి యింటికి. తన ఆఫీసులో పనిచేసే మూర్తి అదే బస్సులో ఎక్కడం ఒకటి రెండు సార్లు చూసినా పట్టించుకోలేదు వసంత. అతనే స్టాపులో దిగిందీ కూడా గుర్తించలేదు. మొదటిరోజు ఆఫీసులో ఉత్తరాలకి, ఎలా డిస్పాచింగ్ నంబరు వేయాలో, లేడ్జర్ లో నంబరు అది ఎలా నోట్ చేసుకోవాలో దగ్గిరుండి వివరించాడు. ఆ మర్నాడు సాయంకాలం మీరు చెయ్యగలరా నేను హెల్ప్ చెయ్యనా అంటూ వచ్చి అడిగితె వసంత తను చెయ్యగలనని చెప్పింది. మూర్తి అసలు వసంత కంటికి అనలేదు. పొట్టిగా, పీలగా , నల్లగా , అమాయకంగా కనిపించే మూర్తి అంటే ఏ అభిప్రాయమూ లేదేమో వసంత అతను మాట కలపాలని ప్రయత్నించినా తుంచేసి తన పనిలో నిమగ్నురాలై పోవడంతో అతను యింకేం చెయ్యలేక తన సీటుకి వెళ్ళిపోయాడు. వసంత కూడా తనేక్కే బస్సులో ఎక్కి తను దిగే స్టాపులో దిగడం చూసిన మూర్తి కుతూహలంగా "మీ యిల్లెక్కడండీ " అనడిగాడు ఓ రోజు బస్సులో.
    వసంత అనాసక్తంగా 'ఆ రెండో లైన్లో" అంటూ చెప్పింది.
    "మా యిల్లు మొదటి క్రాస్ రోడ్డులో నండి" అన్నాడు. ఏదో కొండెక్కినంత సంబరంగా అన్నాడు మూర్తి.
    'ఆహా!" అంది నిర్లిప్తంగా వసంత.
    ఒక ఆఫీసులో పనిచేస్తూ, ఒకే చోట బస్సు దిగి, ఒకేచోట యిళ్ళూన్న తాము రోజు కలిసి రావచ్చు. మాట్లాడుకుంటూ నడవచ్చు అన్న ఆశతో మూర్తి వసంతని యీ పదిహేను రోజులుగా ఏదో విధంగా పలకరించి పరిచయం పెంచుకోవాలంటే వసంత అంటి ముట్టనట్టుగా ఏదన్నా అడిగితే జవాబు చెప్పి మరి మాట్లాడక పోవడంతో నిరుత్సాహపడ్డాడు. మూర్తి లాంటి మామూలు వాళ్ళు వసంత కంటికి అనరన్న సంగతి తెలియని అతను - వసంత కులం, గోత్రం, తండ్రి వివరాలు అన్ని తెలుసుకుని మనసులో ఏవో ఊహలు అల్లుకున్నాడు. చక్కగా యిద్దరూ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు, ఇద్దరూ సంపాదిస్తున్నారు. అమెదీ మధ్యతరగతి సంసారం . తనని వివాహం ఆడడానికి ఆమెకి ఏం అభ్యంతరం వుంటుంది? యీ రోజుల్లో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళకి ఎంతో కష్టపడుతున్నారు. తనంతట తాను అడిగితె వాళ్ళంతా సంతోషించి వెంటనే అంగీకరిస్తారు. వసంత చలాకీగా, స్మార్టుగా వుంటుంది. వసంత తనదయితే యింకేం కావాలి? అతని ఆలోచనలు అలా సాగి, వసంతతో పరిచయం స్నేహం చనువు పెంపిందించుకున్నాక, నెమ్మదిగా పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుని.... ఆమెతో మాట్లాడాలని ఎంతో ప్రయత్నించాడు. అతన్ని ఏమాత్రం ప్రోత్సహించకుండా, ఎప్పటికప్పుడు ముభావంగా వసంత తుంచేయడంతో అతను నిరుత్సాహపడ్డాడు. కాని అంతటితో నిరాశపడి వదిలేయకుండా ఆమె అనుగ్రహం కోసం అన్నట్టుగా అవకాశం దొరికినప్పుడల్లా మాట కలుపుతూనే వున్నాడు.
    "అబ్బ, మీరేమిటండీ అంత ఫాస్ట్ గా పరిగెడుతున్నట్టు నడుస్తాడు" వసంత దగ్గిర కివచ్చి పక్కన నడుస్తూ చనువుగా అన్నాడు.
    వసంత కొద్దిగా మొహం చిట్లించి "నాకు తొందరగా నడపడం అలవాటు....' అంది ముభావంగా. వీడేమిటిలా రోజు వెంటపడ్తూన్నాడు అసహ్యంగా అనుకుంది మనసులో. "ఎందుకూ పిలిచారు, ఏమన్నా పనుందా?" అంది.
    "అబ్బే ఏం లేదు. నేనూ మీ యింటి వైపే గదా వెళ్ళేది, యిద్దరం కలిసి వెళ్ళొచ్చు గదా అని..." నసిగారు.
    వసంత మొహం చిట్లించి ఏమనలేక నెమ్మదిగా నడవడం ఆరంభించింది.
    "ఏమండీ వసంతగారూ.....రేపు ఆదివారం మీరింట్లో వుంటారా.'
    "ఏం , ఎందుకు?"
    "అబ్బే, ఏం లేదు. మీ యింటి వైపు వచ్చి మీ వాళ్ళని చూద్దామని.... మనం ఒక ఆఫీసులో పనిచేస్తూ , ఒక వీధిలో ఉంటూ, యింతవరకూ పరిచయం చేసుకోలేదు. మీరు మా యింటికి రండి. నేనూ మీ యింటికి వస్తాను . రేపు నేనొచ్చి మిమ్మల్ని మా యింటికి తీసి కేడ్తాను. మా చెల్లెలు బి.ఏ. చదువుతుంది. మీరిద్దరూ మంచి స్నేహితులవచ్చు?" అమాయకంగా చెప్పుకుపోతున్నాడు మూర్తి.
    వసంత ఏమిటీ జిడ్డుగాడు. వీడే కాక, వీడి యింటికి కూడా వెళ్ళి పరిచయం చేసుకోవాలిట. బోరుగాడు. మనసులో తిట్టుకుని, "లేదండి, ఆదివారం అసలు యింట్లో వుండను. సినిమాలకి, బజారుకి వేడ్తుంటాను" అంది నిర్మొహమాటంగా.
    "పోనీ , సాయంత్రాలు యింట్లోనే వుంటారుగా , ఓరోజు వస్తాలెండి.'
    ఎడిశావు. నిన్నేదో నేను ఆహ్వానించినట్టు ఉదారంగా ఒదారుస్తూన్నావు అనుకుంటూ చుల్కనగా నవ్వుకుంది. ఈలోగా వసంత సందు వచ్చి బతుకుజీవుడా అనుకుని 'వస్తానండీ ' అంటూ వడివడిగా వెళ్ళిపోయింది.
    వసంత చిరాకు, ముభావం అర్ధం చేసుకోలేని మూర్తి ప్రతిరోజూ బస్ స్టాప్ లోకి రాగానే పలకరించేవాడు. ఒకరోజు సందు మొదట వసంత కోసం ఎదురు చూస్తూ నిల్చునేవాడు. రెండుసార్లు వసంత యింటికి వెళ్ళాడు. యింటికి వచ్చిన అతనితో యిష్టం లేకపోయినా మాట్లాడాక తప్పలేదు వసంతకి. యింట్లో అందరిని పరిచయం చేయక తప్పలేదు. చనువుగా కలుపుగోలుగా అందరితో మాట్లాడిన మూర్తిని అందరూ మంచివాడు పాపం, సరదాగా వున్నాడు అనుకున్నారు.
    "ఎవరే వాళ్ళు. మనవాళ్ళేనా, యింటి పేరేమిటి. పెళ్ళయిందేమిటి?' కాంతమ్మ అరా తీసింది.
    వసంత తల్లి వంక చురచుర చూస్తూ "ఎందుకే ఆరాలు తీస్తున్నావు పెళ్ళి సంబంధానికా?" అంది కోపంగా.
    'అయ్యో రాత! ఏమిటే ఆ రుసరుసలు నిక్షేపం లాంటి కుర్రాడు ఈడు జోడు అవుతుందని అడిగాను. ఏం, యింతకంటే మంచి సంబంధం దొరుకుతుందేమిటి మనకు - మన తాహతుకి.
    మంచి సంబంధం. గుమస్తా ఉద్యోగం. మేష్టారు కొడుకు మంచి సంబంధం లా కనిపించే నీ టెస్టు మెచ్చుకోవాలి" వసంత హేళనగా నిరసనగా అంది.
    'అమ్మా! నీకెన్ని సార్లు చెప్పాలమ్మా, అక్కయ్యా.....రాజశేఖరం.....' మాలతి నవ్వుతూ అంది.
    "ఎవడే ఆ రాజశేఖరం....కొంపదీసి ఏ కులం గోత్రం లేని వాడేమిటి? ప్రేమించి పెళ్ళి చేసుకుంటుందా ఏమిటి?" కాంతమ్మ అనుమానంగా చూస్తూ అంది.
    'అమ్మా.....రాజశేఖరం అంటే ఎవరూ కాదమ్మా. ఓ నవలాలో హీరో అలాంటి అందగాడు, డబ్బున్న వాడు కావాలిట వసంతకి" కమల అంది.
    "ఆ....వస్తాడు . మన అమ్మాయి అందానికి మనమిచ్చే కట్నానికి, మన తహతుకి, అయ్యో సంబరం. యింకా ఏమిటో అనుకున్నాను" కాంతమ్మ కోపంగా అంది.
    "వస్తారమ్మా వస్తాడు . నవల్లో హీరోయినూ, మనకంటే బీదని, అదేనమ్మ ప్రేమ గొప్పదనం."
    "నోరుముసుకోండి. వెధవ వేళాకోళాలు మాని, కాంతమ్మ లేచి పోయింది. వసంత ఆ కేకలు, ఆ వేళాకొళాలు ఏవి పట్టించుకోలేదు ఆమె ఆలోచనలు ఊహలు వేరు.

                                                 *    *    *    *
    ప్రసాద్ వివాహం జరిగి రెండు నెలలే అయినా అతనికి రెండేళ్ళుగా. ఎన్నేళ్ళుగానో వైవాహిక జీవితంలో విసిగిపోయినవాడిలా అయిపోయాడు.

 Previous Page Next Page