"హు-పొరపాటు యిప్పుడు పడడం ఏం నిన్ను పెళ్ళాడి నప్పుడే పొరపడ్డాను. మొఖాన్ని మాటలని చూసి మోసపోయాను. నీ అందం లాగే నీ మనస్సు నీ గరం నిర్మలమైనది అనుకోవడం పొరపాటుగదు? మట్టిలో అణిగిపోయిన బవజ్రానివే అనుకున్నాను గాని నీ నిజరూపం బొగ్గని మరిచిపోవడం పొరపాటు గదూ? కానిలే, అయిపోయిందానికి బాధపడే మనిషిగా నేను ....." పరిస్థితి క్రమంగా మారుతోంది. రంగారావు గొంతు కఠినంగా, తీవ్రంగా అవుతూంది.
"మీరు నన్ను అపార్ధం చేసుకోకండి. ఇందులో నన్ను శంకించవలసింది ఏమీలేదు. ఏనేనేపాపం ఎరుగను నా మాట నమ్మండి" శ్యామల దీనంగా అంది. "ఉష ఎవరు? రోడ్లంట తిరిగే ఆ రౌడీ కూతురేనా? ఈ రహస్యం దాచడానికి యింతవరకు ఎంత డబ్బు తగలేశావు?" తీక్షణంగా చూశాడు రంగారావు. శ్యామల దీనంగా, నిస్సహాయంగా చూసింది "ఉష ఎవరో చెప్పలేను. చెప్పనని ఒకరికి మాటిచ్చాను. దయచేసి ఆ సంగతి అడక్కండి మీనించి దాచాలనిగాదు. కాని చెప్పగలిగే శక్తి నాకులేదు. నిజం చెపుతున్నాను. ఉషకి తల్లిదండ్రులులేరు ఉష మనింటికి వచ్చేదాక అతడెవరో నాకసలు తెలియదు" రంగారావు హేళనగా నవ్వారు.
"శ్యామలా అబద్దం ఆడినా అతికినట్లుండాలి. అతడెవరో తెలియకుండానే రెండుసార్లు డబ్బిచ్చావన్నమాట. శ్యామలా యింకా నన్నెందుకు నమ్మించచూస్తావు ఎందుకు యింకా వంచిస్తావు ఆయన గొంతు కంపించింది." "భగవంతుడి సాక్షిగా చెపుతున్నాను అతనికి నాకు ఏ సంబంధం లేదు. దయచేసి నన్నర్ధం చేసుకోండి తొందరపడి అనుమానించకండి నన్ను."
"అయితే ఉష ఎవరో చెప్పు?"
"శ్యామల నిస్సహాయంగా చూసింది కొద్ది క్షణాలు ఆమె జవాబుకి ఎదురుచూసి సరే ఇంక మాట్లాడవలసింది ఏమీలేనట్టు లైటార్పి మంచం మీద పడుకున్నారు రంగారావు. ఆయనకి బాగా కోపం వచ్చిందన్న సంగతి శ్యామలకి అర్ధమైంది. కాని అప్పటికి ఆ గండం గడిచినందుకు సంతోషించింది.
కాని-
ఆ సంతోషం తెల్లవారేసరికి మాయమయింది -
ఉదయం శ్యామల నిద్రలేచేసరికి ఆయనింకా లేవలేదు, శ్యామల మామూలు అలవాటు ప్రకారం కాలకృత్యాలు తీర్చుకుని, పూజ ముగించి, ఓ గంటపోయాక కాఫీ కప్పుతో గదిలోకి ప్రవేశించింది - అలవాటుకి విరుద్ధంగా రంగారావు అప్పటికే లేచిపోయారు - అంతేకాదు. స్నానం కూడా ముగించి బట్టలు వేసుకుంటున్నారు. మంచంమీద ఆయన సూటుకేసు సర్దివుంది. శ్యామల ఆశ్చర్యంగా "అప్పుడే లేచారే - ఇంత ఉదయానే ఎక్కడికి ప్రయాణం పెట్టుకున్నారు?" అంది. రంగారావు మాట్లాడలేదు- ఆయన చూపులో నిశ్చలత, ఒక విధమయిన స్థిరత్వమూ చూసిన శ్యామలకి సగం సంగతి అర్ధమైంది - రాత్రి జరిగిన సంభాషణ పూర్తి కాలేదన్నది అర్ధం చేసుకుంది.
బట్టలు వేసికొని, అద్దం ముందు నిలబడి దువ్వుకుని సావకాశం శ్యామల వైపు చూశారు' శ్యామలా' రంగారావు గొంతు దృఢంగా వుంది. "నిన్న ఈ సంఘటన జరిగిన దగ్గిరనించి నేను ఒక్కటే విషయం ఆలోచిస్తున్నాను- ఈ అవమానానికి పరిష్కారం ఏమిటని ఇది నా ఒక్కడికే కాదు- మొత్తం మా వంశానికే ఘోరావమానం -వంశం, పరువు, ప్రతిష్టలకి ప్రాణం పెట్టే నేను తొందరపడి చిన్న తప్పు చేసినందుకు నాకీ శిక్ష సరి అయిందే. ఇంత జరిగాక యింక మనిద్దరి మధ్య పాత భావాలకి చోటుండదు. అలా అని నిన్ను బయటకి పంపి నా పరువు ప్రతిష్టలకి భంగం కలిగించుకోను. ఈ నిజం బయటపడ్డాక ఇంకొక రెవరన్నా అయితే ఏం చేసి వుండేవారో అయిన నిన్నింత అభిమానించిన ఈ చేతులతో అంతపని చెయ్యలేకపోయాను. ఆ ఆశక్తతనాది. రాత్రంతా ఆలోచించాక మనిద్దరిలో ఎవరో ఒకరే మిగిలి ఉండడం మంచిదన్న నిర్ణయానికి వచ్చాను. అంతకన్నా గత్యంతరం కనపడలేదు. చెప్పింది అర్ధమైందనుకుంటాను - నేను మద్రాసు వెళ్తున్నాను. నేను మళ్ళీ తిరిగొచ్చేసరికి ఈ యింట్లో యిదివరకటి స్మశాన శాంతి కనపడాలి. రెండు రోజుల్లో నాకు టెలిగ్రాం అందకపోతే, నీవు మొండికెత్తితే సరే, నువింక నన్ను చూడలేవు" అంటూ ఆయన ఎటాచీ చేతిలోకి తీసుకున్నారు. యింక చెప్పవలసింది ఏంలేనట్టు గుమ్మంవైపు అడుగులు వేశారు.
చకితురాలై, చేష్టలుడక్కి అయోమయంగా వింటున్న శ్యామల అదిరిపడి చటుక్కున తెలివి తెచ్చుకుంది గబగబ గుమ్మంవైపు వెళ్ళింది. "ఆగండి - ఒక్క క్షణం నిలబడండి. ఇంత కఠిన శిక్ష విధించాల్సిన ఘోర పాపం నేనేం చెయ్యలేదు నిజం చెపుతాను తొందర పడకండి. వణుకుతూ అంది. రంగారావు శ్యామల వంక నిర్లిప్తంగా చూశారు. "ఆ అవకాశం నిన్నరాత్రి నేనిచ్చాను. ఇప్పుడింక నీ కట్టుకధలు వినే ఓపిక నాకులేదు." ఆయన గుమ్మానికి అడ్డుగా ఉన్న శ్యామలని తప్పించుకు వెళ్ళి కారులో కూర్చున్నారు. "ఆగండి - ఆగండి" శ్యామల వెంట పరిగెత్తింది. శ్యామల మొహాన ఇంతదుమ్ము కొట్టి పరిగెత్తింది కారు నిశ్చేష్టురాలైవుండిపోయింది శ్యామల.
మద్రాసు చేరిన మూడోరోజున ఆవేదనగా, ఆత్రంగా రాబోయే టెలిగ్రాం కోసం చూడసాగారు రంగారావు -గత రెండుమూడు రోజులుగా ఆయన ఆయనగా లేడు. శ్యామలతో వున్న అనుబంధం కొద్దిరోజులదే అయినా ఆమె పట్ల ఆయనకి వున్న మమతానురాగాలు ఎంత ప్రయత్నించినా దూరం చేసుకోడం ఆయన వశం కాకపోయింది. ఆమె తప్పుచేసినా అంత కఠినశిక్ష విధించక పోవలసిందేమో ఓ- ఆమెపట్ల కాస్తదయ చూపవలసిందేమో అని ఒక్కక్షణం మదనపడేవారు- మరుక్షణం తన పరువు, ప్రతిష్టలు నిలుపుకోడానికి యింత కంటే గత్యంతరం ఏముంది? అని నచ్చచెప్పుకునేవారు. ఒక మనిషి ప్రాణం కంటే నీ పరువు, ప్రతిష్టలు ముఖ్యమా. అని అంతరాత్మ నిలవేసేది. కాకపోయినా అలాంటి ఆమెతో మార్గం అనుకునేవారు ఒకసారి తన నిర్ణయం సరియినదా కాదా అన్న మానసిక సంఘర్షణ మధ్య నలిగిపోతూ- ఏం చెయ్యాలో తేల్చుకోలేని స్టితిలో తనను తాను మరిచిపోవడానికి రోజంతా తాగుడుతో గడిపే వాడు. ఏ క్షణాన టెలిగ్రాం వస్తుందోనని ఎదురు చూస్తున్న ఆయనకి రెండో రోజున ఇంటి నౌకరు స్వయంగా తెచ్చి యిచ్చిన పార్శిల్ అందింది. అది శ్యామల దగ్గరనించి అని అర్ధం కాగానే ఆశ్చర్యంగా, ఆరాటంగా విప్పి చూశాడు. అందులో ఒక డైరీ వుంది. ఆయనకేం అర్ధం అవలేదు. ఆశ్చర్యంగా ఆ డైరీ పేజీ తిప్పారు. అది చనిపోయిన ఆయన తమ్ముడు మాధవ్ ది. శ్యామల మాధవ్-ఆ డైరీల తోక అంతుపట్టక ఆయన మరో పేజీ తిప్పారు. దయచేసి ఈ డైరీ 14 వ పేజీనించి చివరవరకు పూర్తిగా చదవండి, శ్యామల అని వుంది. శ్యామలకీ, తమ్ముడు డైరీకి వున్న సంబంధం ఏమిటో అర్ధం కాకఆశ్చర్యంగా కుతూహలంగా 14వ పేజీ తిప్పారు.