Previous Page Next Page 
జీవితం చేజారనీయకు పేజి 15

    నాలుగయిదు నెలలు గడిచిందగ్గర నించి ఏ వ్యాపకం లేక బోరు కొట్టసాగింది నిర్మలకి. వెధవ సినిమాలలా వున్నాయి అనుకుంది విసుగ్గా. ఎమ్మే అయ్యాక ఆరునెలలు ఇంటిపట్టున ఖాళీగా వున్నా ఇలా లేదప్పుడు. ఈ పెళ్ళి అయ్యాక ఏమిటో ఈ ఇల్లు తనకి పరాయిదయినట్టు, ఈ ఇంట్లో ఇప్పుడు తనోగెస్టులా ఉన్నట్టు అన్పించసాగింది ఆరునెలలు గడిచేసరికి. తల్లి ఏం అనకపోయినా ఏదో తప్పుచేసినట్టు తల్లితో పూర్వంలా మాట్లాడలేకపోతోంది.
    చనువుగా ఇదివరకులా తల్లిని ఏం అడగాలన్నా మొహమాటంగా ఉండేది. అడిగే అవసరం లేకుండా తండ్రి పాకెట్ మనీ ఇస్తున్నాడు. కాని పెళ్ళవకముందు అయితే ఫ్రెండ్సు, సినిమాలు, పార్టీలు, పిక్నిక్ లు అంటూ తండ్రి ఇచ్చినది చాలదని వాదించి గుంజుకునేది. ఇప్పుడు తండ్రి ఇస్తున్నా తీసుకోవాలంటే ఏదో బిడియంగా ఉంది ఆమెకి. ఇదివరకులా యధేచ్చగా ఖర్చు పెట్టాలన్నా జంకు కలిగేది. ఇదివరకు కన్పించిన మంచి చీరల్లా కొనమని వేధించేది తల్లిని. ఇప్పుడు మంచి చీరలు కన్పించినా కొనాలన్న ఇంటరెస్ట్ పెద్దగా కలగడం లేదు. కలిగినా అడగాలంటే ఏమనుకుంటారోనని మొహమాటపడేది. తనలో మార్పు తనకే వింతగా అన్పించేది నిర్మలకి. 'పెళ్ళి' అన్న రెండు అక్షరాలు జీవితంలో ఇంత మార్పు తెస్తాయా అని విస్తుపోయింది.    
    నిర్మల వచ్చి ఏడాది గడిచినా అక్కడే ఉండిపోవడంతో ప్రతివాళ్లకీ చెప్పకుండానే నిర్మల కాపురం చెడిందన్నది అర్థం అయింది. మొహంమీద అడక్కపోయినా ఆరాలు తీయడానికి కొందరు ప్రయత్నిస్తే, మొహాలు చూసుకునేవారు కొందరు. దగ్గిర బంధువులు శివశంకరంగారిని మందలించారు. ఆయన పినతండ్రి ముసలాయన "శివా.... నీ వుత్త తొందరమనిషివి - ఆడపిల్ల కాపురం గురించన్నా ఆలోచించకుండా ఇలా చేస్తావా కాస్త నెమ్మదిగా నచ్చచెప్పుకుంటారు గాని, ఆలోచన లేకుండా ఇలా చేస్తారా?" అని కేకలు వేశారు.
    "నన్నెళ్ళి మాట్లాడమంటారా బావగారూ!" అని బావమరిది జోక్యం కలిగించుకున్నా ఆయన మాట్లాడలేదు.  
    "అదేమిటి శారదా.... మీ ఆయన ఎలా అన్నా, ఆడదానివి నీవు చెప్పద్దటే. కాస్త మాటకే కాపురాలు వదులుకుంటాడుటే! అలా అయితే మనందరం ఇన్నాళ్ళు కాపురాలు చేసేవారమా? నీకు తెలీదేతల్లి. పెళ్ళికాని ఆడపిల్లనన్నా భరించగలం గుండెల మీద కుంపటిలా. కాని ఒకసారి పెళ్ళయిన ఆడది పుట్టింటపడుంటే దానికి, మీకు ఇద్దరికీ నరకమేనే." ఆవిడ పెద్దతల్లి చివాట్లు పెట్టింది.
    "నేనేం చెయ్యనుదొడ్డమ్మా. ఈ ఇంట్లో నా మాట చెల్లదు" అని చెప్పుకొని వాపోయింది ఆవిడ. శివశంకరంగారు ఆ చెప్పేది పెద్దవాళ్లయితే ఏమనలేక మొహం మాడ్చుకునేవారు. చిన్నవాళ్లయితే" నా కూతురి గురించి మీకంటే నాకు ఆదుర్ధా ఎక్కువే గదా! నాకు తెలుసు నేనేం చేసింది. నాకెవరూ చెప్పక్కరలేదు" అని ఎగిరేవారు.  
    నాల్గురోజులు చెప్పి అలవాటయి అందరూ వూరుకున్నారు - మీ ఖర్మ మాకెందుకు అన్నట్టు.
    "అందరూ అడగడమే. ఏం, అమ్మాయి ఇక్కడుంది అని, జవాబు చెప్పలేక చస్తున్నాను." శారదాంబ విసుక్కునేది.   
    "ఏం, మనమ్మాయి బరువు వాళ్ళు మోస్తున్నారా! నీకసలు జవాబు ఇవ్వడం తెలీదు. మా పిల్ల సంగతి చూసుకోడానికి మేం ఉన్నాం. మీకెందుకు అను ఒకసారి..... మళ్ళీ ఎవరూ అడగరు ఆ మాట."  
    "ఆ..... ఇప్పటికే ఇరుగుపొరుగు వింతగా చెప్పుకుంటున్నారు. ఇంక పొగరుగా జవాబిస్తే గుమ్మం తొక్కరు ఎవరూ."
    తొక్కకపోతే మరీ మంచిదిలే. "శివశంకరం కోపంగా అనేవారు. ఆ సంభాషణ వింటూ ఇదివరకు మాదిరి తేలిగ్గా తీసుకోలేక ఏదో గిల్టీగా ఫీలయ్యేది నిర్మల. తనవల్ల తల్లిదండ్రులకి బాధలు, ప్రోబ్లమ్స్ అనుకునేది. ఓ ఏడాది గడిచేసరికి నిర్మల విషయం అందరికీ పాతబడి, అడగడం, అనుకోవడం మానేశారు.   
    నిర్మల స్నేహితులలో బెస్టు ఫ్రెండ్స్ నలుగురూ నాలుగు దార్లయి వెళ్ళిపోయారు. కుసుమ ఎమ్మే అయ్యాక లెక్చరర్ గా కాకినాడలో ఉద్యోగం వస్తే వెళ్ళిపోయింది. లత, రేణు పెళ్ళిళ్ళయి కాపురాలకి వెళ్ళారు. పద్మిని ఫారెన్ లో డాక్టరేట్ కోసం వెళ్ళింది. ఇతర కాలేజిమేట్ స్లో కూడా చాలామంది పెళ్ళిళ్ళయ్యే, ఉద్యోగాల కోసమో ఇటుఅటు వెళ్ళిపోయారు. శివశంకరంగారుండే లోకాలిటీ ఊరికి కాస్త దూరం. పోప్ లోకాలిటీ  ఏమో ఇళ్ళు విసిరేసినట్లు ఇక్కడొకటి అక్కడొకటి ఉండేవి. ఇరుగు పొరుగు ఒకరేమో రిటైరయిన వయసు మళ్ళిన దంపతులు. ఇంకొకరు ఏదో కంపెనీలో పనిచేస్తున్న బెంగాలీ కుటుంబం. ఆ వీధిలో నిర్మల ఈడు పిల్లలు అసలు లేరు, పరిచయం చేసుకోవాలన్నా - దాంతో నిర్మలకి బొత్తిగా కాలక్షేపం లేకుండా అయింది. ఇదివరకయితే లత, రేణు, పద్మిని అంతా కలసి సినిమాలకి వెళ్ళేవారు. ఆదివారం వస్తే ఎవరింట్లోనో ఒకరింట్లో లంచ్ తిని గేమ్స్ ఆడుకునేవారు.
    నిర్మల వెళ్ళిన ఆరునెలలకి రేణు భర్తతో ఏదో పండక్కి పుట్టింటికి వచ్చింది... నిర్మల ఇంటికి వచ్చి "ఇదేమిటి.... ఇలా అయింది నీ సంగతి?" అంది బాధగా. రేణుమొహం చూస్తుంటే, ఆమె మొహంలో సంతోషం, ఆ కళ్ళలో వెలుగు చూస్తుంటే ఆమె ఎంత ఆనందంగా సుఖంగా వుందో ఎవరూ చెప్పనక్కర లేకుండానే గ్రహించవచ్చు. ఆమె భర్త విక్రమ్ కూడా చాలా సరదాగా ఎంతో పరిచయం వున్నట్లు మాట్లాడాడు. అతని మొహంలో నవ్వు, ఆ ఫ్రెండ్లీ నేచర్ చూస్తుంటే మూతిబిగించుకొని ధుమధుమలాడే తన భర్త గుర్తువచ్చి రేణు అదృష్టవంతురాలు అనుకుంది.    
    "అసలేం జరిగిందే?" అంది గదిలోకి వెళ్ళాక. నిర్మల టూకీగా జరిగింది చెప్పాక 'ఐయామ్ వెరీ సారీ!' నీరూ, ఇప్పుడేం చేస్తావు అయితే" అంది రేణు.

 Previous Page Next Page