Previous Page Next Page 
డా || వాసిరెడ్డి సీతాదేవి రచనలు - 4 పేజి 15


    "శకునపక్షిలా పలక్క అలా నోరుమూసుకు కూర్చో, నీ నమ్మకాలూ, అపనమ్మకాలతో నన్ను వేధించకు. నీకు తోచిందేతప్ప, ఇతర్లు చెప్పింది ఏనాడు నమ్మావు కాబట్టీ?" అన్నాడు కృష్ణారావు కోపంగా.     

 

    ఈ మాటలతో కాంతమ్మ ముఖం కందగడ్డలా చేసుకొని, "కూరాకులో పురుగులా నన్ను దులిపెయ్యకండి. కాస్త లోకం తెలిసినవాళ్ళెవరికైనా, దొంగతనంచేసి దేశాలు పట్టిపోయిన కుర్రాడేమవుతాడో వూహించటం కష్టంకాదు. చంద్రం ఎప్పుడో ఆకలిదప్పులకు అలమటించిపోయి వుంటాడు. అలాకాక, బతికివుంటే, ఏ జేబులు కొట్టే వృత్తిలోనో ప్రవేశించి సగం కాలాన్ని జైళ్ళల్లో గడుపుతూండి వుంటాడు" అన్నది.

 

    కృష్ణారావు భార్యమాట పూర్తిచేసే లోపలే రౌద్రమూర్తి అయిపోయి, చేయిపైకెత్తి ఆమెకేసి ఒక అడుగు వేశాడు. కాంతమ్మ భయపడిపోయి, చల్లగా అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది.

 

    కృష్ణారావు కోపాన్ని అణుచుకునే ప్రయత్నంలో కళ్ళలో నీళ్లు తిరిగినై. అతడు సోఫాలో ఉస్సురంటూ కూలబడి, రజనిని దగ్గిరకు తీసుకొంటూ, "మీ అమ్మ వుండుండి, అనవసరంగా నాకు కోపం తెప్పిస్తుంది సరే, అది మామూలుగా యీ కొంపలో జరుగుతున్నదే అనుకో. నువ్వెందుకు ముఖం అలా పెట్టుకున్నావ్? ఏం భయంలేదు. బాబాయి ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. వాడికి నువ్వంటే ఎంత ప్రేమ! ఎప్పుడూ భుజాన వేసుకొని తిప్పుతూ, ఆడిస్తూండేవాడు" అన్నాడు.  

 

    రజని పసిహృదయానికి బాబాయిని చూడాలన్న కోర్కె కలచివేసింది. ఆ పన్నెండేళ్ళపిల్లా, తండ్రి ఒడిలోంచి లేచి, హాలులోవున్న నిలువెత్తు వేంకటేశ్వరుడి పటందగ్గిరకు వెళ్ళి, చేతులు జోడించి, "వేంకట రమణా! మా బాబాయి యివ్వాళే యింటికొచ్చేట్టు చెయ్యి. యిలా చెయ్యమని నిన్ను చాలాసార్లు అడిగాను. ఈసారికైనా తప్పక చేస్తావా?" అంటూ నమస్కరించింది. కృష్ణారావుకూడా అప్రయత్నంగా కూతురుతో పాటు లేచి, నిలబడి, ఆ పటానికి తలవంచి నమస్కరించాడు.   

 

                                             8

 

    ప్రసాదరావు ఇంటికొచ్చేప్పటికి, హేమ టేబిల్ ముందు కూర్చుని ఏదో రాస్తూండటము అతడి కంటపడింది. తండ్రిరాకను కూడా గమనించనంతగా ఆమె తన పనిలో లీనమైపోయింది.

 

    ప్రసాదరావు కూతుర్ని సమీపించి, "ఏమిటమ్మా! రాస్తున్నావ్?" అంటూ పక్కనున్న సోఫాలో కూర్చున్నాడు.

 

    హేమ ఉలిక్కిపడి, తలఎత్తి తండ్రికేసి చూసింది. ఆమె ముఖం జేవురించి వున్నది. తడబడుతూ ఏమో చెప్పబోయి వూరుకున్నది.   

 

    "సాహిత్య అకాడెమీకీ, పత్రికవాళ్ళకూ చంద్రం అడ్రసుకోసం రాస్తున్నావా?" అన్నాడు ప్రసాదరావు, సోఫాలోంచి లేచి ఆప్యాయంగా కూతురు తల నిమురుతూ.

 

    "అవును, నాన్నా!" అన్నది హేమ, మరింతగా తల వంచుకుంటూ.  

 

    "పిచ్చితల్లీ! నా దగ్గిరకూడా ఎందుకమ్మా అంత సందేహం, దాపరికం? నీ మనసు ఏనాడో నేనర్థం చేసుకున్నాను. ముందుగానే లేనిపోని ఆశలు మాత్రం పెంచుకోకు. మనిషిని పోలిన మనుషులుంటారు. చంద్రం విషయంలో అలాంటి అనుమానాలకు ఆస్కారం వున్నట్టు కనబడకపోయినా, నన్నో సందేహం బాధిస్తున్నది - పేరు మార్చుకున్నవాడు, మనకు తన అడ్రసు తెలియనిస్తాడా అని," అన్నాడు ప్రసాదరావు.   

 

    "చంద్రం యింకా అజ్ఞాతవాసం గడపాల్సిన అవసరం ఏమిటి నాన్నా? చిన్నప్పుడు - ఇల్లు విడిచి పారిపోయినప్పుడు, తన నెవరూ పట్టుకోకుండా అలా పేరు మార్చుకొని వుంటాడు. ఇప్పుడు అలాంటి అవసరం ఏమీ లేదుకదా?" అన్నది హేమ.

 

    "ఆలోచిస్తూంటే నాకూ అలానే తోస్తున్నది. ఆ ఫోటో చంద్రానిదే అయివుండాలనీ, అతడు మనం రాయగానే ఇంటికి తిరిగి రావాలనీ, నేను మనసారా కోరుకొంటున్నాను. నువ్వు సుఖపడాలనే కోర్కెతప్ప, నాకీ లోకంలో మరే కోర్కెలూ లేవు. నేను చేసిన పాపానికి శిక్ష అనుభవించకూడదు," అన్నాడు ప్రసాదరావు జీరపోయిన గొంతుతో.

 

    హేమ అదిరిపడింది. నాన్న పాపం చేశాడా? ఈ మాట తనతో ఆయన అనటం యిది రెండోసారి. నాన్నలాంటి మనిషి పాపంచేస్తే, యిక యీ లోకంలో పుణ్యం సేసినవాళ్ళెవరు? అలాకాక, పైకి పుణ్యాత్ముల్లా, పెద్దమనుష్యుల్లా కనిపించేవాళ్ళంతా ఏదో ఒక పాపంచేసే వుంటారా? ప్రతి మనిషి హృదయంలోనూ చీకటి కోణాలుంటాయా?....

 

    "నాన్నా!"

 

    తన గదికేసి వెళ్ళిపోతున్న ప్రసాదరావు కూతురి కంఠస్వరంలో పలికిన ఏదో అపశృతికి విహ్వలుడైపోయి "ఏమిటమ్మా!" అంటూ వెనుదిరిగాడు.    

 

    "నాన్నా! నువ్వు పాపం చేశావంటే నేను నమ్మను. నాకు వూహ వచ్చింతరవాత నీ నోటినుంచి యీ మాట వినటం. యిది రెండోసారి. నన్ను బాధపెట్టక, జరిగిందేమిటో చెప్పు, నాన్నా!" అనడిగింది హేమ.

 

    ప్రసాదరావు ముఖం వెలవెల పోయింది. తను అప్రయత్నంగా యీ మాట కూతురుతో చెప్పటం రెండోసారి అన్నమాట! తనెందుకీ మధ్య యింతగా మనోవేదన పొందుతున్నాడు? ఏ మాత్రం తొణకకుండా, నిబ్బరంగా వుండే తను, ఎందుకింతగా చలించిపోతున్నాడు? తనింత కాలంగా హృదయంలో దాచిన రహస్యం పురుగులా తనను తొలిచేస్తున్నది. ఆ రహస్యం ఎవరికీ చెప్పదగింది కాదు. హేమకు అసలే చెప్పగూడదు. అది విన్ననాడు, తానామె దృష్టిలో హీనాతిహీనుడై పోతాడు. కాని తనకు తెలియకుండానే తనలో అలాంటి రహస్యం... పాపం.... దాగి వున్నట్టు హేమతో అనేశాడు.....

 

    "నాన్నా! ఏమిటలా మాటా పలుకూ లేకుండా నిలబడ్డారు?" అన్నది హేమ, తండ్రి స్థాణువులా నిలబడి, వెర్రిచూపులు చూస్తూండటం గమనించి.  

 

    ప్రసాదరావు తేరుకున్నాడు. హేమ కళ్ళల్లో నీళ్ళు తిరగటం అతడి కంటబడింది. "హేమా! ఎందుకలా కన్నీళ్ళు పెడతావు? నీ విచారం నేను చూడలేనమ్మా! నా మాటలేవీ పట్టించుకోకు. నాకున్న ఒక్క విచారం నువ్వు కోరుకున్న వ్యక్తీ నీకు లభిస్తాడో లేదో అనీ, జీవితంలో నీవు సుఖపడతావో లేదో అనీ మాత్రమే. ఈ బాధక్కారణం నేను చేసిన పాపం, నిన్ను వెన్నాడి కష్టాలపాలు చేస్తుందేమో అని. అంతకన్నా నా విచారానికి మరే కారణం లేదు" అంటూ గబగబా తన గదిలోకి వెళ్ళిపోయాడు.

 

    హేమ తండ్రి వెళ్ళిన వైపుకేసి చూస్తూ నిల్చుండి పోయింది. పాపం చేశానని తండ్రి అన్నమాటల్లో ఆమె కేమాత్రం నమ్మకం కలగలేదు. పాపం, నేరం, ప్రాయశ్చిత్తం - యిలాంటి పదాల అర్థాన్ని, ఎవరికి వారు తమ మానసికస్థాయికి అనుగుణంగా అన్వయించుకుంటారు. 'పాపం' అన్న మాటకు తండ్రి నిర్వచనం ఏమిటో తనకు తెలియదు. ఇరవై రెండేళ్ళ వయసుగల యువతిగా తనకున్న జీవితానుభవం, సైకాలజీలో ఎం.ఏ. ఫస్టుక్లాసులో ప్యాసై, కాలేజీలో లెక్చరరుగా ఉద్యోగం చేస్తున్న తన వ్యక్తిత్వం - తండ్రిని అర్థం చేసుకోవటానికి కొరకాకుండా పోయినై.     

 

    విజ్ఞానం, సంస్కారం, ఎందునా తొణకని గాంభీర్యతా - యివన్నీ, హేమలోవున్న సుగుణాలు. జీవితంపట్ల ఎంతో నిర్లిప్తత కనబరిచేది. ఆమెకు చెప్పుకోదగ్గ స్నేహితులంటూ ఎవరూ లేరు. మనసిచ్చి యితర్లకు చెప్పుకోవలసిన విషయాలూ, సమస్యలూకూడా ఏవీలేవు. కాలేజీలో అందరికీ ఆమె వ్యక్తిత్వంపట్ల ఆశ్చర్యం, గౌరవంతోపాటు జిజ్ఞాసకూడా కలిగేది. అంతా తండ్రి స్వభావమే అనుకొనేవారు.  

 

    ప్రసాదరావు మాత్రం కుమార్తె భవిష్యత్తు ఎలా వుండబోతుందో అని దిగులుపడేవాడు. చంద్రంపట్ల ఆమెకున్న ప్రేమ సంగతి తెలిసిన తరవాత, ఆమె వివాహం పెద్ద చిక్కు సమస్య కావచ్చునని ఆయనకు భయం కలిగింది. కావాలనే తను హేమను యితర ఆడపిల్లలకు భిన్నంగా పెంచాడు. తన ఆదర్శాలకు అనుకూలంగా ఆమె వ్యక్తిత్వాన్ని మలిచేందుకు ప్రయత్నించాడు.   

 

    అందర్లాగే తనూ తన కూతురిని పెంచి వున్నట్టయితే, ఆమె కాలేజి చదువప్పుడో, అది ముగిసిన తరవాతో, అందుబాటులో వున్న ఏ అబ్బాయినో చూసి ప్రేమించి వివాహం ఆడివుండేది. స్త్రీలో జిజ్ఞాస పెరిగినకొద్దీ ఆమె జీవిత సుఖాలపట్ల నిర్లిప్తంగా వుంటుందని ప్రసాదరావు గట్టిగా నమ్మాడు. కాని, హేమ యీ రోజున అందరు యువతుల్లానే ప్రవర్తిస్తున్నది. చంద్రం తిరిగి రాకపోతే, తనకు జీవితం శూన్యం అన్న ధోరణి కనబరుస్తున్నది. అతడి ప్రసక్తిరాగానే, ముఖంలోని గాంభీర్యత అంతాపోయి, ఏవో సిగ్గుతెరలు కమ్మినట్టు ముఖం దించేసుకొంటున్నది.  

 

    "ఇదీ ఒక విధంగా మంచిదే! దాని భవిష్యత్తు అదే నిర్ణయించుకోవటంకన్న కావలసిందేముంది?" అనుకొంటూ తల మీంచి పెద్ద భారం దిగినవాడిలా, ప్రసాదరావు దిండులో తలదూర్చి కళ్ళు మూసుకున్నాడు.    

 

    హేమ తాను సాహిత్య అకాడమీవాళ్ళకూ, పత్రికవాళ్ళకూ రాసిన వుత్తరాలు ముందు పెట్టుకొని, ఆలోచనా ప్రవాహంలో కొట్టుకుపోసాగింది. చంద్రమోహన్ చంద్రం కాకపోతే, తన భవిష్యత్తు ఎలా వుంటుంది? చిన్నప్పటి ఫోటోల ఆధారంతో, తాను ఆ రెండు పేర్లూ ఒక్కరివే అన్న దృఢనిశ్చయానికి రావటం అంత మంచిది కాదేమో! జీవితంలో తిరిగి చంద్రాన్ని చూడగలనని తాను ఎన్నడూ ఊహించలేదు. చిన్నప్పటి చంద్రం రూపం, తన హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయింది. తాను పెరిగి పెద్దవుతున్నకొద్దీ, ఆ రూపం తన అభిరుచులకు అనుకూలంగా మార్పులు చెందుతూ వస్తున్నది. నిత్యం ఆ రూపాన్ని తను ఆరాధిస్తూనే వున్నది. తన హృదయంలోని ఆ స్థానాన్ని మరెవరూ ఆక్రమించలేరన్న నమ్మకంతో, తను యావజ్జీవితమూ ఒంటరి బతుకు గడపటానికి నిశ్చయించుకొన్నది.

 Previous Page Next Page