Home » Yandamuri veerendranath » అతడు ఆమె ప్రియుడు


    విష్ణువర్థనరావు మొహం తెల్లగా పాలిపోయింది. ఆయన నిస్తేజంగా కూతురివైపు చూస్తుండిపోయాడు.

    "నిజం డాడీ. తేజాకి కళ్ళు పోవటం జరిగింది. అతడికి నా మీద ఎంత ప్రేముందంటే, ఆ క్షణమే ఆ విషయం తేల్చుకోవటం కోసం అతడు హొటల్ వెనుకవైపు బాల్కనీ పట్టుకొని కిటికీ దగ్గరకు వెళ్ళాడు. స్మగ్లర్స్ కనబడటంతో పోలీసాఫీసరుగా కర్తవ్యం గుర్తుకొచ్చి రివాల్వర్ తో వాళ్ళని బెదిరించి లొంగదీసుకోవాలనుకున్నాడు. చివరికి అతనే డానికి బలయ్యాడు. మొత్తంమీద ఏది ఎలా జరిగినా, ఎంతో ప్రేముంటే తప్ప ఒక మగవాడు అంత రిస్కు తీసుకోలేడు డాడీ. ఆ  ప్రేమకోసం నేను నా జీవితాన్నే అతనికి ఇవ్వదల్చుకున్నాను" ఆమె చెప్పటం ఆపింది.

    అప్పటివరకు కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్న విష్ణువర్థనరావు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. వయసు నేర్పిన అనుభవాలతో పండిపోయిన అతనిమేధస్సుకి కూతురు చెప్తుంది పెద్ద గొప్ప విషయంలా కనబడలేదు. "చూడమ్మా....." అన్నాడు. "............నీక్కాబోయే పెళ్ళికూతురు ఫలానా హొటల్ రూంలో వుందని ఒక  ఆకాశరామన్న చెబితే ఏ మగవాడైనా దానియొక్క నిజానినిజాలు పరీక్షించుకోవటానికి తప్పకుండా అక్కడికి వెళతాడు. పోతే రవితేజ పోలీసాఫీసరు కాబట్టి మరింత చొరవ తీసుకొని ఆ గదిలోకి ప్రవేశించాడు. దీనికి నువ్వనుకున్నట్లు గుండెలనిండా ప్రేమే ఉండనవసరంలేదు తల్లీ" అన్నాడు.

    "నిజమైన ప్రేమున్నచోటే అనుమానానికి, అసూయకి చోటుంటుంది డాడీ! అతనికి నా మీద ప్రేమ లేకపోతే కేవలం ఆ ఫోన్ కాల్  కారణంగానే నన్ను వదిలేసి వుండవచ్చు. కానీ అతను అలా చేయలేదు. నిజానిజాలు పరీక్షించుకోవాలనుకున్నాడు. అది చాలు" అంది సిరిచందన.

    విష్ణువర్థనరావు వాదించదలచుకోలేదు. ఇలాంటి విషయాలు వాదనవల్ల తేలవు.

    తండ్రి మౌనాన్ని మరోలా అర్థం చేసుకున్న సిరిచందన "నేనీ విషయాలన్నీ తేజాతో మాట్లాడాను డాడీ" అంది.

    "ఎప్పుడు మాట్లాడావు?"

    "మీరందరూ స్కానింగ్ కోసం డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు."

    "తేజ ఏమన్నాడామ్మా?"

    "ఏమీ అనలేదు. నేనే ఆ ఫోన్ చేసిందని చెబితే నవ్వి వూరుకున్నాడు. నావల్లే అతడు అంధుడైనందుకు అతన్ని పెళ్ళి చేసుకుంటానన్నప్పుడు మాత్రం జాలితో ఈ నిర్ణయం తీసుకోవద్ద'ని చెప్పాడు నిజం డాడీ...... నేను మాత్రం జాలితో ఈ  నిర్ణయం తీసుకోవటం లేదు. తేజాని నేను మనస్ఫూర్తిగా ఇష్ట పడుతున్నాను."

    "మళ్ళీ ఇంకొక్కసారి ఆలోచించుకోమ్మా."

    "డాడీ. నేను పెళ్ళంటూ చేసుకుంటే తేజానే చేసుకుంటాను. ఈ విషయంలో మీ కిష్టం లేకపోయినా కూడా నేను నా నిర్ణయానికి కట్టుబడి వుంటాను. నా అదృష్టం బావుంటే అతడు మళ్ళీ ఈ లోకాన్ని చూడగలడు. ఒకవేళ అంధత్వం శాశ్వతమైతే నా కళ్ళతోనే అతనికి లోకాన్ని చూపిస్తాను. కానీ ఒక రిక్వెస్ట్ డాడీ. మా  పెళ్ళి ఘనంగా చేయొద్దు. సింపుల్ గా చేసినట్టు అయితే మాకు ఇబ్బందిగా వుండదు. వీలైతే రేపే ఏర్పాటు చేయి డాడీ. నా వల్ల అంధుడైన అతన్ని ఎక్కువకాలం ఒంటరిగా, దిగులుతో ఉంచటం నాకిష్టం లేదు" చెప్పేసి వెళ్ళిపోతున్న కూతురివైపు స్తబ్దంగా చూసాడు విష్ణువర్థనరావు.

    ఒక నిర్ణయం తీసుకుంటే ఎన్ని అడ్డంకులొచ్చినా దాన్ని వదలకుండా ఉండగలగడం అతడి లక్షణం. కూతురు కూడా తన లక్షణాల్ని పుణికి పుచ్చుకొని పుట్టిందని ఆయనకి బాగా తెలుసు.

           
                             7

    విష్ణువర్థనరావు ఇల్లు ముందెన్నడూలేని అందంతో కళకళలాడుతూ వుంది. ఆ రోజు ఉదయమే సిరిచందన, రవితేజలకి రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్ళి జరిగింది.

    ఒక అంధునితో తన కూతురు జీవితం పంచుకుంటుందన్నబాధలోంచి నెమ్మది నెమ్మదిగా తేరుకున్నాడు విష్ణువర్థనరావు.

    కూతురి మాట ప్రకారమే పెళ్ళికి అతిథుల్ని ఎక్కువ మందిని పిలవలేదు. కూతురి వాదనలో కూడా నిజం వుంది. తేజని ఇబ్బంది కరమైన పరిస్థితిలో పెట్టడం ఎవరికీ ఇష్టంలేదు. పెళ్ళి జరగగానే అందరూ కలిసి ఇంటికి వచ్చేసారు.

    "డాడీ."

    "ఏమిటమ్మా?"

    సిరిచందన కొంచెం తటపటాయించి "ఆయనా నేను ఒక నెలరోజులపాటు అరకులో మన గెస్ట్ హౌస్  లో ఉంటాం డాడీ."

    "ఎక్కడ?" సిరి గార్డెన్స్ లోనా"

    "అవును డాడీ."

    "ఇప్పుడెందుకమ్మా. ఇంకో పదిరోజులు పోయిన తర్వాత....."

    "డాడీ, ఆయన్ని ఉద్యోగం నుంచి రిటైర్ కమ్మని మెసేజ్ వచ్చింది. డ్యూటీలో వుండగా ఈ ప్రమాదం జరిగినందువల్ల రిటైరయ్యే వయసు వచ్చేవరకూ జీతం ఇస్తారట. కానీ అదేమీ అంత సంతోషించాల్సిన విషయం కాదు. ఆయన మానసికంగా చాలా కృంగిపోయి వున్నాడు. ఎంతో సాధించవలసిన వయసులో ఇలా కళ్ళు పోయినందుకు, పనిలోంచి తొలగించబడ్డందుకు ఆయన మెంటల్ షాక్ లో  వున్నారు. దాన్నుంచి కొంచెం తేరుకోవాలంటే ఈ పరిసరాలనుంచి దూరంగా వెళ్ళాలి. అందుకని ఆయన్ని తీసుకొని మన గెస్ట్ హౌస్ కి  వెళదామను కుంటున్నాను."

    విష్ణువర్థనరావు ఏమీ మాట్లాడలేకపోయాడు "సరేనమ్మా" అన్నాడు.

    సిరిచందన ఆగి తండ్రివైపు చూసింది. "మీతోపాటు ఎవరినన్నా తీసికెళితే బావుంటుందేమో?"

    "ఎవర్నన్నానా? ఎందుకు?" అనడిగింది అర్థంకానట్టు.

    "చూడమ్మా. అంతపెద్ద  గార్డెన్స్ లో, గెస్ట్ హౌస్ లో మీరిద్దరే వుంటారు. అఫ్ కోర్స్! తోటమాలి, పనివాళ్ళు అందరూ వుంటారనుకో. కానీ అతడేమో గుడ్డివాడు. మీకు తోడుగా ఇంకొంచెం చదువుకున్నవాడు, కొంచెం చిన్న చిన్న  పనులు చేసి పెట్టడానికి వుంటే బావుంటుందేమో ఆలోచించు."

    సిరిచందన తండ్రి చెప్పేది నిజమేనన్నట్లు "అలాగే డాడీ" అంది. విష్ణువర్థనరావు ఇంటర్ కమ్ తీసుకుని సెక్రటరీని పిలిపించాడు. అతడొచ్చాక ఒక న్యూస్ పేపర్ లో ఎడ్వర్టయిజ్ మెంట్ ఇవ్వమని చెప్పాడు.

    ఆ మరుసటిరోజు దినపత్రికలో ఒక చిన్న ప్రకటన పడింది.

    'WANTED,

    అరకులో హౌస్ కీపర్ గా పనిచేయటం కోసం ఒక అసిస్టెంట్ కావలెను. ఉత్సాహవంతమైన యువకులు సంప్రదించండి. జీతం అర్హతలను బట్టి నిర్ణయించబడుతుంది."


                                                      8

    మహర్షి ఆఫీస్ మెట్లక్కి లోపలి ప్రవేశించాడు. అతడి చేతిలో క్రితం రోజు తాలూకు దినపత్రిక ప్రకటన వుంది.

    నిజానికది చాలా ఉద్యోగమైనా, కూతుర్ని అల్లుడ్ని చూసుకోవలసిన పని కాబట్టి విష్ణువర్థనరావే స్వయంగా అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాడు.

    మహర్షి వెళ్ళిన అరగంటకి లోపలికి పిలుపు వచ్చింది. అతడు లోపలకు వెళ్ళాడు, చూడగానే విష్ణువర్థనరావుకి మహర్షినచ్చాడు. ఎత్తుగా బలంగా ఉన్నా మొహంలో వినయమూ, నమ్రతా కనబడుతున్నాయి.

    "నీ పేరు?" అని అడిగాడు.

    "మహర్షి."

    "ఏం చదువుకున్నావ్?"

    మహర్షి చెప్పాడు.

    ఆయన ఆశ్చర్యంగా చూస్తూ "ఇంత చదువు చదివి కేర్ టేకర్ ఉద్యోగం చేస్తావా?" అనడిగాడు.

    మహర్షి సమాధానం చెప్పలేదు. అయితే విష్ణువర్థనరావు ఆ విషయం మరి రెట్టించలేదు.

    మరికొన్ని ప్రశ్నలువేసి సంతృప్తి చెందినట్లు "వెళ్ళి, రేపు ఉదయం డ్యూటీలో జాయిన్ అయిపో. అక్కడ పనిచేసే చలమయ్యకు నేను ఫోన్ చేసి చెప్తాను. సిరి గార్డెన్స్ అని అరకులో ఎవరినడిగినా చెప్తారు. ఆ కాంపౌండ్ లోనే వున్నా అవుట్ హౌస్ లో ఉండు."

    మహర్షి తల వూపాడు.

    విష్ణువర్థనరావు తిరిగి చెప్పాడు "......మా అమ్మాయికి మొన్నే పెళ్ళయింది వాళ్ళు హనీమూన్ కోసం అక్కడికి వస్తున్నారు. నెల రోజులు వుంటారు. వారికి ఏ అసౌకర్యం కలగకుండా చూసుకుని, తిరిగి నాకు క్షేమంగా అప్పజేప్పే బాధ్యత నీది."

    "అలాగే సర్ థాంక్యూ" అని నమస్కరించి బయటకొచ్చాడు. మహర్షి వెళ్ళాక ఆయన ఇంటికి ఫోన్ చేసాడు. "అమ్మా. ఈ రోజూ ఒక క్యాండిడేట్ వచ్చాడు. నా కన్నివిధాలా నచ్చాడు. అతన్ని అరకు పంపించేసాను. రేపు మీరు  వెళ్ళే సరికి అతను అక్కడ వుంటాడు" అన్నాడు.

    సిరిచందనకి ఆ విషయంమీద అంత ఆసక్తిలేనట్టు "అలాగే డాడీ" అంది "అతను మీకేమాత్రం నచ్చకపోయినా, తిరిగి అతన్ని వెనక్కి పంపించేసేయండి. రెండు నెలల జీతమిచ్చి తీసేస్తాను."

    "దాందేముందిలే డాడీ! మేము మాత్రం  ఒక నెలకన్నా ఎక్కువ వుంటామా ఏమిటి?" అని ఫోన్ పెట్టేసింది.

    ఆమె సంభాషణంతా వింటున్న రవితేజ "ఏమిటి?" ఉద్యోగం అంటున్నావ్?" అన్నాడు.

    "ఎవరో కేర్ టేకర్ ని  అప్పాయింట్ చేసారట. నాన్నదంతా ఛాదస్తం" అంది సిరిచందన.

    "కేర్ టేకరా..... ? నీ కేర్ టేకరా? నా కేర్ టేకరా? మనం  వెళుతున్నది హనీమూన్ కా లేక ఏదయినా యుద్ధభూమికా?"

    సిరిచందన కూడా నవ్వేసి, "నెలరోజుల కోసం ఎంతో హడావుడి చేస్తున్నారు నాన్నగారు" అంది.

    ఆ నెలరోజులే ఆమె జీవితాన్ని  నిర్దేశించబోతున్నాయని ఆ క్షణం ఆమెకి తెలీదు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra