"యాదగిరీ...నువ్వు చాలా మంచోడివి... నా గుర్తుగా తీసుకో" అన్నాడు.
"గట్లనే సార్... ఈ నోటుని ఖర్చుచేయను...మీ గుర్తుగా దాచుకుంటా...ఇన్స్ పెక్టర్ సాబ్ నా మంచితనం గుర్తించి యిచ్చిండ్రు అని చెబుతా...ఎప్పుడైనా ఎవరైనా పోలీసోళ్లు నా ఆటోని పట్టుకున్నా...ఈ నోటు చూపిస్తా" మెరిసే కళ్లతో అన్నాడు యాదగిరి.
"అలాగే" అన్నాడు కృపాల్ చిరునవ్వుతో.
"వెళ్తాసార్"అన్నాడు.
"మంచిది"
"సార్" ఆగాడు యాదగిరి.
"చెప్పు"
"మరేం లేదుసార్." అంటూ ఏదో చెప్పబోయి ఆగాడు.
"ఫర్వాలేదు చెప్పు."
"ఒక్కసారి షేక్ హ్యండివ్వరా సార్" సిగ్గుపడతూ అడిగాడు.
కృపాల్ నవ్వుతూ చేతిని చాచి షేక్ హ్యండిచ్చాడు.
"థాంక్యూ సార్...యిది ఎప్పుడు గుర్తుంచుకుంటాను... ఈసారి ఫోటో గ్రాఫర్ ని తీసుకువచ్చి మీ పక్కనే నిలబడి ఫోటో తీయించుకుంటాను. ఆ ఫోటో నా ఆటోలో పెట్టుకుంటాను" అన్నాడు హుషారుగా.
"అలాగే"అన్నాడు కృపాల్.
యాదగిరి ఆనందంగా వెళ్లిపోయాడు.
మళ్ళీ యాదగిరి సజీవంగా కనిపించడన్న విషయం కృపాల్ కు తెలియదు.
తెలిస్తే కథ మరోలా వుండేది.
* * *
యాదగిరి వెళ్ళిపోగానే అపూర్వ వచ్చింది.
ఆశ్చర్యంగా చూస్తుండి పోయాడు. స్టేట్స్ నుంచి వచ్చిందనగానే ఏ జీన్స్ లోనో , మిడ్డిలోనో వుంటుందనుకున్నాడు.
అచ్చ తెలుగు ఆడపడుచులా వుంది. చక్కగా చీరలో వచ్చింది.
"హలోసార్" అంది వస్తూనే.
ప్రతిగా కృపాల్ విష్ చేసి, కానిస్టేబుల్ ని పిలిచి కూల్ డ్రింక్స్ తీసుకురమ్మని చెప్పాడు.
"నిన్ననే వచ్చాను. మీరు బిజీగా ఉన్నారని కానిస్టేబుల్ చెప్పారు" అంది అపూర్వ.
"అవును...ఓ హత్య కేసు. ఆ శవాన్ని మా ఇంట్లోనే వేసారు."
"వాట్" ఆశ్చర్యంగా అడిగింది అపూర్వ.
"అవును...ఘోరమైన హత్య...శ్యామ్ అనే కాలేజీ కుర్రాడు. అతని కిడ్నీలు తొలగించి, కళ్ళు తీసేసి, కాలేయం తీసేసి...హారిబుల్...ఆ డెడ్ బాడీని మా ఇంట్లో వేసి నాకు వార్నింగ్ ఇచ్చాడు."
"మైగాడ్...వాడు శాడిస్ట్ లా ఉన్నాడు" అంది అపూర్వ.
"ఎగ్జాట్లీ. కాకపోతే, మీ నాన్నగారి కిడ్నాప్ లో కూడా వాడి హస్తం వుండొచ్చు... డౌట్ మాత్రమే."
"వాడు నాన్నగారిని ఏమైనా.." భయంగా అంది.
"నథింగ్ టు వర్రీ...ఐ థింక్ హీ ఈజ్ సేఫ్" నాకు ఆ కుర్రాడిని తలుచుకుంటుంటేనే బాధగా ఉంది. అయినా ఆ కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు ఏం చేసుకుంటాడు?" కృపాల్ సాలోచనగా అన్నాడు.
"వాటికి చాలా డిమాండ్ ఉంటుంది. కృపాల్ గారూ కన్నుకు ముప్పయి, నలభై వేలు పలుకుతుంది.ఒక్కోసారి ఎనభైవేలుపలకొచ్చు. గుండె రెండు వరకూ చేస్తుంది. ఊపిరితిత్తులు యాభైవేలు, కాలేయం యాభైవేలు, మూత్రపిండం లక్ష వరకూ పలకొచ్చు. చివరికి అస్దిపంజరం కూడా పదివేలు పలుకుతుంది. విదేశాల్లో వాటి డిమాండ్ చాలా ఎక్కువ.అంతెందుకు 'రాబిన్ కుక్' ఈ బేస్ లో ఒక నవల రాసారు. 'కోమా'.....అని అదో మెడికల్ స్తెన్స్ ఫిక్షన్.
ఆపరేషన్ థియేటర్ లో రోగి అనూహ్యంగా కోమాలోకి పడిపోవడం...ఆ తరువాత చాలా మంది అలా కోమాలోకి పడిపోయారని తెలియడం...
ఓ అమ్మాయి దాన్ని పరిశీలిస్తుంది.
ఆ ఆసుపత్రిలో జరిగే నేరాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. అనారోగ్యంగా ఉన్న వారిని ఆసుపత్రిలో చేర్చుకుని శస్త్రచికిత్స అవసరమని చెప్పి, ఆపరేషన్ జరుతున్నప్పుడు రోగికి ఆక్సిజన్ అందకుండా చేసి కోమాలో పడేసి ఆస్పత్రిలో ఒక మూల వార్డులో చేర్చి, వాళ్ళకు కావలసిన ప్పుడు ఆ రోగిలో నుంచి కావలసిన అవయవాలు తీసుకొని అమ్ముకుంటూ ఉంటారు.
ఆ నవల అప్పట్లో సంచలనం సృష్టించింది." అప్పూర్వ చెప్పుకుపోతోంది.
కృపాల్ ఆలోచనలో పడ్డాడు. కేసు కొత్త మలుపు తిరుగుతుందేమోనని అనిపించింది.
దీని వెనుకు పెద్ద రాకెట్ ఉందా? అన్న ఆలోచన కూడా రాకపోలేదు.
"ఏంటి ఆలోచిస్తున్నారు?" కృపాల్ మౌనంగా ఉండడం చూసి అడిగింది అపూర్వ.
"మీరు చేప్పిన విషయమే ఆలోచిస్తున్నాను. మనిషి బ్రతికి ఉండగా తన విలువేమిటో తనకే తెలియదు. కానీ, యిప్పుడు ఆ మనిషి శరీరంలోని భాగాలకు ఇంత విలువా?"
"అవును......అయితే మంచి ఎఫిషియాంట్ వుంటే తప్ప యిలా ఈ శరీర అవయవాలను అమ్మలేరు. ఎఫిషియంట్ సర్జన్ అవసరం తప్పనిసరి."
అప్పుడు ఉలిక్కిపడ్డాడు కృపాల్.
"ఏమన్నారు?"
"ఆపరేషన్ సమర్ధవంతంగా చేయగలిగే సర్జన్ వుండాలి ఎవరుపడితే వాళ్లు చేయలేరు. చాలా నైపుణ్యం అవసరం."
"అంటే.....వాళ్ళకు ఖచ్చితంగా ఓ సర్జన్ అవసరపడతారు కదూ!"
"అంటే...... మీ డాడీని....ఈ ముఠానే కిడ్నాప్ చేసి ఉంటుంది."
అపూర్వ మొహంలో రంగులు మారాయి.
"బహుశా వ్యక్తులను కిడ్నాప్ చేసి వాళ్ళ అవయవాలను బిజినెస్ చేసే ముఠా, మీ నాన్నని కిడ్నాప్ చేసి అతని చేత ఆపరేషన్స్ చేయిస్తూ ఉండొచ్చు." అన్నాడు కృపాల్.
అపూర్వ క్షణకాలం మౌనంగా ఉండిపోయింది. అదే సమయంలో ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తాడు కృపాల్. నవ్వు వినిపించింది అటు వైపు నుంచి.
ఆ నవ్వు గుర్తుపట్టాడు కృపాల్. తనింట్లో శ్యామ్ శవాన్ని వుంచి, తన ఇల్లు ధ్వంసం చేసిన వ్యక్తిది.
"నీకేం కావాలి" కోపంగా అడిగాడు కృపాల్. మళ్ళీ నవ్వు.
"నిన్నే....నువ్వు నా చేతికి చిక్కక తప్పదు. మర్యాదగా లొంగిపో."
మళ్ళీ అదే నవ్వు "పిచ్చి ఇన్స్పెక్టర్...ఇవ్వన్నీ ఏ సినిమాలోనో డైలాగులు కొట్టడానికి బాగుంటాయి. నన్ను నువ్వేం చేయగలవు? అన్నట్టు ఖాళీగా వున్నట్టున్నావు. నీకో పని చెప్పనా? నీ జీపులో మూడు శావాలున్నాయి. ప్రదీప్, స్వరూప్, మోహన్ వెళ్ళి వాటిని స్వాధీనం చేసుకొని, పోస్ట్ మార్టమ్ చేయించు... అన్నట్టు వాళ్ల పేరెంట్స్ కు ఇన్ ఫామ్ చెయ్యి. వాళ్ళు పిల్లల శవాలు చూసి ఏడవాలిగా.....
"యూ.." కోపంతో టేబుల్ మీద వున్న పేపర్ వెయిట్ ని తీసి నేలకేసి కొట్టాడు.
అపూర్వ బెత్తంపోయింది.
"ఇప్పడే ఏం చూసావు ఇన్ స్పెక్టర్...ఏదో బుద్ధిగా అందర్నీ చంపుకుంటూ పోదామనుకున్నా...నువ్వు స్క్రీన్ మీదకి వచ్చావు ఎలా వదిలిపెట్టను చెప్పు. నేనెవరో తెలియక, నన్నేమీ చేయలేక జుట్టంతా పీక్కోవాలి. అర్ధమైంది. బ్యాడ్ డే..."అంటూ ఫోన్ పెట్టేసాడు.
కృపాల్ స్టేషన్ బయటకు పరుగెత్తాడు. జీపులో మూడు శవాలున్నాయి. సెంట్రీలను పిలిచి అడిగాడు.
"జీపు దగ్గరికి ఎవరైనా వచ్చారా"అని
ఓ బస్తాలో చెత్తు ఏరుకునే వ్యక్తి వచ్చాడని చెప్పారు. విషయం అర్ధమైంది కృపాల్ కు.
బస్తాలో శవాలను వేసుకొని వచ్చి ఉంటాడు. పోలీస్ స్టేషన్ ఆవరణలోకి వచ్చి, శవాలను ధైర్యంగా వేసి పోయాడంటే!
మూడు శవాలు భయంకరంగా ఉన్నాయి. వామ్టింగ్ సెన్సేషన్ కలిగింది కృపాల్ కు. శవాలు కుళ్ళిపోయాయి. కళ్ళ స్ధానంలో గుంతలున్నాయి. నడుం పక్కన కుట్లున్నాయి. చూడకూడని దృశ్యం ఏదో చూసినట్టు వున్నాయి వాళ్ళ వాలకాలు.
కృపాల్ వెనకే వచ్చిన అపూర్వ ఆ దృశ్యం చూసి అవాక్కయింది. ఎన్నో డెడ్ బాడీలను చూసిన అపూర్వ కూడా ఆ దృశ్యాన్ని చూడలేకపోయింది. కడుపులో దేవినట్టయింది.
"హారిబుల్" ఆప్రయత్నంగా అంది. అపూర్వ.
పోలీస్ స్టేషన్ ముందు రోటీన్ హడావిడి మొదలైంది. ఫింగర్ ప్రింట్స్ ఎక్స్ పర్ట్స్, పోటో గ్రాఫర్లు.
"ఇన్ స్పెక్టర్ ...మీకు అభ్యంతరం లేకపోతే ఈ పోస్ట్ మార్టమ్ లో నేను పార్టిసిపేట్ చేస్తాను. ఎందుకంటే...మీరన్నట్టు మా డాడి ని వీళ్ళు ఈ పనికే కిడ్నాప్ చేస్తే,నేను ఈ జీగా చెప్పగలను. కాదనకండి ప్లీజ్" ప్రాదేయపూర్వకంగా అడిగింది అపూర్వ.
కృపాల్ సరేనన్నాడు.
డెడ్ బాడీని పోస్ట్ మార్టమ్ కోసం తరలించారు.
* * *
కృపాల్ కళ్ళు ఎరుపెక్టాయి. గుండె బరువెక్కింది.
ఆ కుర్రాళ్ళ తల్లిదండ్రులు బిడ్డల శవాల మీద పడి ఏడుస్తోంటే మనసు ద్రవించిపోయింది.
మరణం ఇంత భయంకరంగా ఉంటుందా?నేచురల్ డెత్ అయితే ఇంత బాధ కలిగేది కాదు.
కొన్ని రోజుల క్రితం తమతో కలిసి వున్న బిడ్డ ఎన్నో ఆశలతో పెద్దయ్యాక తమకు తోడుగా ఉంటాడనుకున్న బిడ్డ....ఇలా అర్ధాంతరంగా చావడం ఎవరికైనా గుండెకోతనే మిగులుస్తుంది.
అప్పటికి ఈ వార్త గుప్పుమంది. పత్రికా విలేకరుల కృపాల్ ని చుట్టూముట్టారు.
పోలీసుల అసమర్ధత అని కొందరు రెచ్చిపోయారు. తప్పు ఎవరిదైనా చివరికి పోలీసుల మీద నెట్టడం బాధగా ఉంది కృపాల్ కు.
ఇందులో తమ అసమర్ధత ఏమీ లేదు. ప్రజలు కూడా జాగృతమవ్వాలి. కలిసికట్టుగా వుండాలి. మాకేమైంది మేం సేప్టీగా ఉన్నామనుకుంటే కుదరదు.
ఈ వినింగ్ ఎడిషన్ లో ఈ వార్తే హైలైట్ గా వచ్చింది. కమీషనర్ పిలిచి అడిగాడు.
ఈ కేసును తనకే అప్పగించారు. అది తన ఎఫిషియన్సీ కి తగిన గుర్తింపు అంతే.
కానీ యిప్పుడు తన ఎఫిషియన్సీ ఏమైంది. హంతకుడు ధైర్యంగా తనకు ఫోన్ చేసి తనని ఛాలెంజ్ చేస్తుంటే తను చేతులు ముడుచుక్కూర్చున్నాడు.
ఏదో ఒకటి చేయాలి. అసలా హంతకుడి మోటివ్ ఏమిటి? కనుక్కోవాలి అలా ఆలోచిస్తూ ఆ రాత్రి చాలా వరకు మెలుకువుగా ఉన్నాడు.
అర్ధరాత్రి పన్నెండు దాటుతుండగా పోస్ట్ మార్ట్ మ్ రిపోర్ట్ వచ్చింది.
ఆ వ్యక్తుల నుంచి కిడ్నీ, కాలేయం, కన్ను, ఊపిరితిత్తులు తొలగించి, ఆ తరువాత క్రూరంగా హత్య చేసారు.
చనిపోయే ముందు వాళ్ళు భయంకరమైన ఫీలింగ్ కు గురయ్యారు.
అపూర్వ వచ్చింది.
ఆమె మొహంలో అదో రకమైన ఉద్విగ్నత.
సార్...మా డాడీని కిడ్నాప్ చేసింది ఖచ్చితంగా వాళ్ళే. ఎందుకంటే ఆ ఆపరేషన్ చేసింది కూడా డాడీనే...అంత ఎఫిషియెన్సీతో, అంత నైపుణ్యంతో చేయగలిగిన వాళ్ళు ఇండయాలో ఇద్దరే. ఒకరు మా డాడీ...మరొకరు మల్హోత్రా...డాక్టర్ మల్హోత్రా...అతను రెండు నెలల క్రితం చనిపోయారు. మిగిలింది డాడీ మాత్రమే. ఆ ఆపరేషన్స్ కూడా చాలా తక్కువ ఎక్విప్ మెంట్ తో చేసారు. ఏ మాత్రం టెక్నాలజీ లేకపోయినా, ఇంత నైపుణ్యం గా చేయగలిగారంటే అది డాడీ వల్లే సాధ్యం. వాళ్ళు డాడీ ని బెదిరించో, భయపెట్టో ఈ పని చేయించి ఉంటారు."
అపూర్వ కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి.
"అంటే వాళ్ళ మోటివ్ అవయవాలను అమ్మడమా?" సాలోచనగా అడిగాడు కృపాల్.
"అంతే అయి వుంటుంది" అపూర్వ అంది.
కాని,ఎందుకో కృపాల్ కు ఈ విషయం నమ్మబుద్ది కాలేదు.
కేవలం అవయవాల కోసమే అయితే గుట్టుచప్పుడు కాకుండా ఆ పని చేసి, శవాలను ఎక్కడో తగలబెట్టడం చేస్తారు. కానీ, ఇలా తనకు సవాల్ విసిరే....హంతకుడి ఉద్దేశం మరేమైనా వుందా?
కృపాల్ ఆలోచనలు రకరకాలుగా సాగుతున్నాయి.
"కృపాల్ గారూ......నాకేమిటో భయంగా ఉంది. నాకు తెలిసి డాడీ తన వృత్తికి ఎప్పడూ ద్రోహం చేయరు. బహుశా నా మీద ప్రేమే డాడీతో ఈ పని చేయించి ఉంటుంది. డాడీ ప్రాణాలు కూడా లేక్కచేయరు. నన్నేమైనా చేస్తామని బెదిరించి వుంటారు" అంది అపూర్వ.
"అయి వుండొచ్చు...ఒక్కొక్కరి బలహీనత ఒక్కోలా ఉంటుంది అపూర్వ గారూ. కొందరికి డబ్బు బలహీనత, మరికొందరికి సెక్స్ బలహీనత....ఇంకొందరికి సెంటిమెంట్ బలహీనత...విటి మధ్య మనిషి గిరికీలు కొడుతూ ఉంటాడు. మీరేం వర్రీ అవ్వకండి...మీ డాడీని నేను కాపాడతాను" అన్నాడు కృపాల్.